Archery Tournament
-
బిడ్డకు జన్మనిచ్చాక 20 రోజులకే విల్లు పట్టనున్న దీపిక
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి గత నెల పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. కేవలం 20 రోజుల బాలింత అయిన ఆమె విల్లుపట్టేందుకు సిద్ధమైంది. కోల్‌కతాలో రేపటి నుంచి జరిగే జాతీయ సీనియర్ ఓపెన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వచ్చింది. ‘ట్రిపుల్ ఒలింపియన్’ అయిన ఈ సీనియర్ ఇందులో పాల్గొనకపోతే మొత్తం ఏడాదంతా జట్టుకు దూరమవుతుంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో తనకీ ట్రయల్స్ కీలకమని ‘అమ్మ’ దీపిక చెప్పింది. -
భారత ఆర్చర్ల పసిడి పంట
షార్జా: ఆసియా కప్ స్టేజ్–3 ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఇందులో ఐదుస్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. కాంపౌండ్ విభాగంలో భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయిలు క్లీన్‌స్వీప్ చేశారు. ప్రగతి స్వర్ణం నెగ్గగా... అదితి స్వామి రజతం, పర్ణీత్ కౌర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్ స్వర్ణం, ఓజస్ రజతం నెగ్గారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. ఆకాశ్, మృణాల్ చౌహాన్, పార్థ్ సాలుంకేలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో త్రిషా పూనియా, పార్థ్ సాలుంకేలతో కూడిన టీమిండియా రజతం నెగ్గింది. -
సత్తా చాటిన భారత ఆర్చర్లు.. ఆసియాకప్‌లో మూడు స్వర్ణాలు
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ ఆర్చరీలో భారత గురి అదిరింది. మంగళవారం జరిగిన పోటీల్లో మన ఆర్చర్లు 3 స్వర్ణాలు, ఒక కాంస్య పతకం గెలుపొందారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో పర్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీలతో కూడిన భారత జట్టు 204–201తో కజకిస్తాన్ జట్టును ఓడించి బంగారు పతకం గెలిచింది. పురుషుల ఫైనల్లో ప్రథమేశ్, రిషభ్ యాదవ్, సమాధాన్ బృందం 224–218తో బంగ్లాదేశ్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ఇక మూడో స్వర్ణం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రథమేశ్–పర్నీత్ కౌర్ సాధించారు. ఫైనల్లో ఈ జోడీ 158–151తో అదిలజెక్సెంబినొవా–క్రిస్టిచ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సమాధాన్ 147–145తో సెర్గెయ్ క్రిస్టిచ్ (కజకిస్తాన్)పై గెలిచి రెండో పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు భారత ఆర్చర్లు పది పతకాల కోసం పోటీపడనున్నారు. -
విజేత జ్యోతి సురేఖ
సాక్షి, హైదరాబాద్: లాన్‌కాస్టర్ క్లాసిక్ అంతర్జాతీయ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్ ప్రొ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్ పియర్స్ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్ రౌండ్లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. -
కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ
మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ విశేషంగా రాణించింది. ఆమె రెండు కాంస్య పతకాల కోసం పోటీపడనుంది. జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్‌లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు సెమీఫైనల్లో 226–227తో అమెరికా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో బై పొందిన భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 236–226తో ఫ్రాన్స్‌పై... క్వార్టర్ ఫైనల్లో 219–213తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో టర్కీతో భారత్ ఆడుతుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ కాంస్యం కోసం బరిలో ఉంది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 140–143తో పియర్స్ పైజి (అమెరికా) చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో యాసిమ్ బోస్టాన్ (టర్కీ)తో సురేఖ ఆడుతుంది. సురేఖ క్వార్టర్ ఫైనల్లో 147–141తో సారా ప్రీల్స్ (బెల్జియం)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో తాంజా జెన్సన్ (డెన్మార్క్)పై, మూడో రౌండ్లో 146–143తో బోమిన్ చోయ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. -
దీపిక ఖాతాలో కాంస్య పతకం
సామ్సన్ (టర్కీ): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ తమ పోరాటాన్ని కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి కాంస్య పతకాన్ని సాధించింది. లీసా ఉన్రూ (జర్మనీ)తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దీపిక ‘షూట్ ఆఫ్’లో విజయం సొంతం చేసుకుంది. నిర్ణీత ఐదు సెట్ల తర్వాత ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇద్దరూ బాణాన్ని 9 పాయింట్ల వృత్తంలోనే కొట్టారు. అయితే లీసా సంధించిన బాణంకంటే దీపిక బాణం 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌కు పతకం ఖాయమైంది. ఒక్కో సెట్లో ఇద్దరికీ మూడు షాట్ల చొప్పున అవకాశం ఇస్తారు. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ లభిస్తుంది. తొలి సెట్‌ను దీపిక 28–25తో సొంతం చేసుకోగా... రెండో సెట్‌ను లీసా 25–22తో గెల్చుకుంది. మూడో సెట్‌ను దీపిక 30–28తో కైవసం చేసుకోగా... నాలుగో సెట్ 28–28తో సమంగా ముగిసింది. ఐదో సెట్‌ను లీసా 29– 28తో నెగ్గడంతో ఇద్దరి స్కోర్లు 5–5తో సమమయ్యాయి. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో లీ చియెన్ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొంది... సెమీస్‌లో 3–7తో యాస్మీన్ అనాగోజ్ (టర్కీ) చేతిలో ఓడిపోయింది. స్వర్ణ పతక మ్యాచ్‌లో లీ యున్ గ్యాయోంగ్ (దక్షిణ కొరియా) 6–4తో యాస్మీన్‌పై గెలిచింది. ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలో దీపిక నెగ్గిన పతకాలు. 2011, 2012, 2013, 2015లలో ఆమె రజత పతకాలు గెలిచింది. -
క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ ఓటమి
బ్యాంకాక్: ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ 139–141తో చెన్ యి–స్యూన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.