WPL 2024: తొలి మహిళా క్యూరేటర్‌ జసింత | WPL 2024: Jacintha Kalyan Makes History as India First Female Pitch curator | Sakshi
Sakshi News home page

WPL 2024: తొలి మహిళా క్యూరేటర్‌ జసింత

Published Thu, Feb 29 2024 12:54 AM | Last Updated on Thu, Feb 29 2024 5:28 AM

WPL 2024: Jacintha Kalyan Makes History as India First Female Pitch curator - Sakshi

న్యూస్‌మేకర్‌

క్రికెట్‌ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్‌ అంపైర్‌ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్‌ రిఫరీగా జి.ఎస్‌.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్‌ క్యూరేటర్‌గా జసింత కల్యాణ్‌ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పిచ్‌ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఆమె పరిచయం.

క్రికెట్‌ అంటే సచిన్, ద్రవిడ్, గంగూలి అనేవారు ఒకప్పుడు. మిథాలీ రాజ్, హర్మన్‌ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన అంటున్నారు ఇప్పుడు. క్రికెట్‌ కామెంటేటర్స్‌ అంటే హర్ష భోగ్లే, సునీల్‌ గవాస్కర్‌ అనేవారు మొన్న. ఫిమేల్‌ క్రికెట్‌ యాంకర్స్‌గా మందిరా బేడీ, సంజనా గణేశన్‌ పేరు గడించారు ఇవాళ. మహిళా అంపైర్లు ఇదివరకే రంగంలోకి వచ్చారు. వారి వరుసలో చేరింది జసింత కల్యాణ్‌. ఈమె భారతదేశంలో తొలి మహిళా పిచ్‌ క్యూరేటర్‌.

1980ల నుంచి
మనదేశంలో పిచ్‌ క్యూరేటర్లు 1980 వరకూ లేరు. స్టేడియంలో గడ్డి పెంచే మాలీలే పిచ్‌ను కూడా తయారు చేసేవారు, తెలిసినంతలో చూసుకునేవారు. కాని వాన పడితే పిచ్‌ను తడవడానికి వదిలేయడం, స్టంప్స్‌ వదిలేసి పోవడం జరిగేది. దానివల్ల మ్యాచ్‌ కొనసాగే సమయంలో పిచ్‌ అనూహ్యంగా మారేది. అలా కాకుండా స్టేడియంలోని మట్టిని బట్టి, రుతువులను బట్టి, ఆట సమయానికి పిచ్‌ను శాస్త్రీయంగా తయారు చేసేందుకు ‘పిచ్‌ క్యూరేటర్లు’ రంగం మీదకు వచ్చారు. వీరు పిచ్‌ను తీర్చిదిద్దుతారు. రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడి పిచ్‌ను ఎప్పుడూ ఆటకు వీలుగా ఉంచుతారు. అయితే ఈ నలభై ఏళ్ల నుంచి కూడా పురుషులే పిచ్‌ క్యూరేటర్లుగా ఉన్నారు. ఒక స్టేడియంలోని పిచ్‌లను స్త్రీలకు అప్పజెప్పడం ఎప్పుడూ లేదు. మొదటిసారి అలా బాధ్యత తీసుకున్న మహిళ జసింత కల్యాణ్‌.

బెంగళూరులో జసింత
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్‌ కోసం పిచ్‌ను తయారు చేసే  బాధ్యతను అందుకున్నారు జసింత కల్యాణ్‌. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జన్మించిన జసింత తండ్రి వరి రైతు. చిన్నప్పుడు ఆర్థిక కష్టాలు పడిన జసింత బెంగళూరు చేరుకుని ‘కర్నాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌’లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోట్‌ అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆఫీసు ఉన్నా మ్యాచ్‌లు చూసేది కాదు. సిక్సర్లు, ఫోర్లు వినిపిస్తే తప్ప. అయితే ఆమెకు స్టేడియంలోని పచ్చగడ్డి అంటే ఇష్టం.

అది గమనించిన అసోసియేషన్‌ సెక్రటరీ బ్రిజేష్‌ 2014లో స్టేడియంలో పని చేసే మాలీలపై అజమాయిషీని అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆ స్టేడియంకు చెందిన పిచ్‌ క్యూరేటర్‌ ప్రశాంత్‌ రావు ఆమెకు పిచ్‌లు తయారు చేయడంలో మెళకువలు నేర్పాడు. దాంతో ఆమె పూర్తిగా అనుభవం గడించింది. ఆ అనుభవం నేడు ఆమెను మన దేశ తొలి మహిళా పిచ్‌ క్యూరేటర్‌గా నిలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పిచ్‌లను ఆమె అజమాయిషీ చేస్తోంది. క్యూరేటర్‌గా జసింత నియామకం గురించి తెలిశాక క్రికెట్‌ రంగం నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్‌ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్‌ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement