Jacintha
-
మరిచిపోలేని క్షణాలు.. సచిన్ ఎమోషనల్ పోస్ట్! ఎవరీ జసింత?
International Women’s Day: గత కొన్నేళ్లుగా క్రీడా రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెరగడం హర్షణీయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అన్నాడు. వారికి మరింత ప్రోత్సాహం అందిస్తే క్రీడలకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ రాణించగలరని పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తన కెరీర్‌లోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ సచిన్ టెండుల్కర్ ఈ మేరకు ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశాడు. ‘‘గడిచిన కొన్నేళ్లలో భారత్, ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. 2008లో.. 26/11 (ముంబై పేలుళ్ల) ఘటన తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. జాతి మొత్తానికి అదో భావోద్వేగపూరిత సందర్భం. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ మెంబర్స్‌లో ఒకరైన మహిళ నా దగ్గరకు వచ్చి అందరి తరపునా శుభాకాంక్షలు తెలిపి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. నా జీవితంలో అదొక మరుపురాని అనుభూతి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2024లో.. జసింత కళ్యాణ్ ఇండియాలో మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా అవతరించారు. ఆమె ఒక అడుగు ముందుకు వేశారు. భవిష్యత్తులో మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అడ్డంకులు అధిగమించి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఇలాంటి రోల్ మోడల్స్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ప్రశంసించుకుందాం’’ అని సచిన్ టెండుల్కర్ వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. ఎవరీ జసింత కళ్యాణ్? కర్ణాటకకు చెందిన జసింత బెంగళూరులోని హరొబెల్ అనే గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి రైతు. ఇక చిన్నతనం నుంచే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడ్డ జసింత.. ఉపాధి కోసం బెంగళూరులో అడుగుపెట్టారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరి.. అనంతరం అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆట కంటే పిచ్‌పైనే ఎక్కువగా దృష్టి సారించిన జిసింత అభిరుచిని గమనించిన అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్.. స్టేడియంలో పనిచేసే మాలీలపై బాస్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలో పిచ్ క్యూరేటర్ ప్రశాంత్‌రావు జసింత ఆసక్తిని గమనించి పిచ్ తయారీలో మెళకువలు నేర్పాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి అనుభవం గడించిన జసింత.. భారత దేశంలోనే మొదటి మహిళా క్యూరేటర్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు పిచ్‌ల తయారీని ఆమె పర్యవేక్షిస్తున్నారు. Over the years, the rise of women in sport, in India and across the world, has been very encouraging. In 2008, in the aftermath of 26/11, India won the match against England, and it was an emotional moment for the entire nation. One of the first people with whom I was able to… pic.twitter.com/lw0lbRT5hy — Sachin Tendulkar (@sachin_rt) March 8, 2024 -
WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత
క్రికెట్ ఫీల్డ్‌లోని ఒక్కొక్క రంగంలో నెమ్మదిగా మహిళా కేతనం ఎగురుతోంది. గతంలో మొదటి మహిళా క్రికెట్ అంపైర్ వృందా రతి, మొదటి ఐసీసీ మహిళా మ్యాచ్ రిఫరీగా జి.ఎస్.లక్ష్మి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కల్యాణ్ ఘనత సాధించింది. బెంగళూరులో జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్ క్యూరేటర్‌గా జసింత తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఆమె పరిచయం. క్రికెట్ అంటే సచిన్, ద్రవిడ్, గంగూలి అనేవారు ఒకప్పుడు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అంటున్నారు ఇప్పుడు. క్రికెట్ కామెంటేటర్స్ అంటే హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్ అనేవారు మొన్న. ఫిమేల్ క్రికెట్ యాంకర్స్‌గా మందిరా బేడీ, సంజనా గణేశన్ పేరు గడించారు ఇవాళ. మహిళా అంపైర్లు ఇదివరకే రంగంలోకి వచ్చారు. వారి వరుసలో చేరింది జసింత కల్యాణ్. ఈమె భారతదేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్. 1980ల నుంచి మనదేశంలో పిచ్ క్యూరేటర్లు 1980 వరకూ లేరు. స్టేడియంలో గడ్డి పెంచే మాలీలే పిచ్‌ను కూడా తయారు చేసేవారు, తెలిసినంతలో చూసుకునేవారు. కాని వాన పడితే పిచ్‌ను తడవడానికి వదిలేయడం, స్టంప్స్ వదిలేసి పోవడం జరిగేది. దానివల్ల మ్యాచ్ కొనసాగే సమయంలో పిచ్ అనూహ్యంగా మారేది. అలా కాకుండా స్టేడియంలోని మట్టిని బట్టి, రుతువులను బట్టి, ఆట సమయానికి పిచ్‌ను శాస్త్రీయంగా తయారు చేసేందుకు ‘పిచ్ క్యూరేటర్లు’ రంగం మీదకు వచ్చారు. వీరు పిచ్‌ను తీర్చిదిద్దుతారు. రకరకాల వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడి పిచ్‌ను ఎప్పుడూ ఆటకు వీలుగా ఉంచుతారు. అయితే ఈ నలభై ఏళ్ల నుంచి కూడా పురుషులే పిచ్ క్యూరేటర్లుగా ఉన్నారు. ఒక స్టేడియంలోని పిచ్‌లను స్త్రీలకు అప్పజెప్పడం ఎప్పుడూ లేదు. మొదటిసారి అలా బాధ్యత తీసుకున్న మహిళ జసింత కల్యాణ్. బెంగళూరులో జసింత బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న డబ్ల్యూపీఎల్ కోసం పిచ్‌ను తయారు చేసే బాధ్యతను అందుకున్నారు జసింత కల్యాణ్. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరొబెలె అనే ఊరిలో జన్మించిన జసింత తండ్రి వరి రైతు. చిన్నప్పుడు ఆర్థిక కష్టాలు పడిన జసింత బెంగళూరు చేరుకుని ‘కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్’లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా ప్రమోట్ అయ్యింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆమె ఆఫీసు ఉన్నా మ్యాచ్‌లు చూసేది కాదు. సిక్సర్లు, ఫోర్లు వినిపిస్తే తప్ప. అయితే ఆమెకు స్టేడియంలోని పచ్చగడ్డి అంటే ఇష్టం. అది గమనించిన అసోసియేషన్ సెక్రటరీ బ్రిజేష్ 2014లో స్టేడియంలో పని చేసే మాలీలపై అజమాయిషీని అప్పజెప్పాడు. ఆ తర్వాత ఆ స్టేడియంకు చెందిన పిచ్ క్యూరేటర్ ప్రశాంత్ రావు ఆమెకు పిచ్‌లు తయారు చేయడంలో మెళకువలు నేర్పాడు. దాంతో ఆమె పూర్తిగా అనుభవం గడించింది. ఆ అనుభవం నేడు ఆమెను మన దేశ తొలి మహిళా పిచ్ క్యూరేటర్‌గా నిలిపింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పిచ్‌లను ఆమె అజమాయిషీ చేస్తోంది. క్యూరేటర్‌గా జసింత నియామకం గురించి తెలిశాక క్రికెట్ రంగం నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుంటే బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతూ పోస్ట్ చేశారు. తన పనితీరుకు మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
సలామ్... జెస్సీ
దేశంలో ఏకైక మహిళా క్యురేటర్ బెంగళూరు నుంచి సాక్షి క్రీడాప్రతినిధి: ఒక వైపు వర్షం వస్తే ఏం చేయాలో గ్రౌండ్స్‌మెన్‌కు సూచనలు... మరో వైపు హైడ్రాలిక్ రోలర్ల పనితీరును పర్యవేక్షిస్తూ... ఇంకో వైపు స్వయంగా సూపర్ సాపర్లను నడిపిస్తూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక మహిళ బాగా సీరియస్‌గా పని చేస్తోంది. ఆ మహిళ పేరు జసింతా కళ్యాణ్. బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఆమె వయసు 42 ఏళ్లు. మగవారికే పరిమితం అనిపించే క్రికెట్ గ్రౌండ్ క్యురేటర్‌గా పని చేస్తోంది. దేశంలోని ఏకైక మహిళా క్యురేటర్ జసింతా కావడం విశేషం. 22 ఏళ్ళ క్రితం ఇక్కడే రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగం ప్రారంభించిన జసింతా అలియాస్ జెస్సీ వేర్వేరు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏడాదిన్నర క్రితం క్యురేటర్‌గా మారింది. ఆమెలో కష్టపడే స్వభావం, నాయకత్వ లక్షణాలు చూసిన కేఎస్‌సీఏ కార్యదర్శి బ్రిజేష్ పటేల్ ముందుగా గ్రౌండ్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ రంగంలో ఎలాంటి శిక్షణా లేకపోయినా, ఆ తర్వాత ఆమె ఆసక్తితో ఒక్కో విషయం నేర్చుకుంటూ పిచ్‌లు రూపొందించే స్థాయికి ఎదిగింది. గత ఏడాది పలు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు భారత అండర్-19 మ్యాచ్‌లకు జెస్సీ పిచ్‌లు సిద్ధం చేసింది. ప్రస్తుతం చిన్నస్వామి మైదానంలో ముగ్గురు క్యురేటర్లలో ఒకరైన జసింతా, కేఎస్‌సీఏ ఇతర గ్రౌండ్స్‌కు ఇన్చార్జ్గా వ్యవహరిస్తోంది. పేదరికం కారణంగా పదో తరగతితోనే చదువును ముగించినా... మగవారితో సమానంగా పోటీ పడుతూ భిన్నమైన రంగంలో రాణిస్తుం డటం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఇది మగాళ్లకు సంబంధించిన పని మాత్రమే అంటే నేను ఒప్పుకోను. ఏ మ్యాచ్ జరిగినా అందరి దృష్టి పిచ్‌పై ఉంటుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వరకు కూడా పని చేయాల్సి ఉండటంతో ఆరంభంలో నా భర్త ఉద్యోగం వదిలేయమన్నారు. చివరకు వారిని ఒప్పించగలిగాను. ఇప్పుడు అనుభవం తర్వాతే నాకు పిచ్‌ల తయారీపై మంచి పట్టు వచ్చింది. భవిష్యత్తులో అవసరమైన టెక్నికల్ కోర్సులు కూడా చదవాలని ఉంది.- జసింతా