సలామ్... జెస్సీ | The only woman in the country, curator | Sakshi
Sakshi News home page

సలామ్... జెస్సీ

Published Wed, Mar 23 2016 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

సలామ్... జెస్సీ

సలామ్... జెస్సీ

దేశంలో ఏకైక మహిళా క్యురేటర్

బెంగళూరు నుంచి సాక్షి క్రీడాప్రతినిధి: ఒక వైపు వర్షం వస్తే ఏం చేయాలో గ్రౌండ్స్‌మెన్‌కు సూచనలు... మరో వైపు హైడ్రాలిక్ రోలర్ల పనితీరును పర్యవేక్షిస్తూ... ఇంకో వైపు స్వయంగా సూపర్ సాపర్లను నడిపిస్తూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక మహిళ బాగా సీరియస్‌గా పని చేస్తోంది. ఆ మహిళ పేరు జసింతా కళ్యాణ్. బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఆమె వయసు 42 ఏళ్లు. మగవారికే పరిమితం అనిపించే క్రికెట్ గ్రౌండ్ క్యురేటర్‌గా పని చేస్తోంది. దేశంలోని ఏకైక మహిళా క్యురేటర్ జసింతా కావడం విశేషం. 22 ఏళ్ళ క్రితం ఇక్కడే రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగం ప్రారంభించిన జసింతా అలియాస్ జెస్సీ వేర్వేరు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏడాదిన్నర క్రితం క్యురేటర్‌గా మారింది.

ఆమెలో కష్టపడే స్వభావం, నాయకత్వ లక్షణాలు చూసిన కేఎస్‌సీఏ కార్యదర్శి బ్రిజేష్ పటేల్ ముందుగా గ్రౌండ్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ రంగంలో ఎలాంటి శిక్షణా లేకపోయినా, ఆ తర్వాత ఆమె ఆసక్తితో ఒక్కో విషయం నేర్చుకుంటూ పిచ్‌లు రూపొందించే స్థాయికి ఎదిగింది. గత ఏడాది పలు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు భారత అండర్-19 మ్యాచ్‌లకు జెస్సీ పిచ్‌లు సిద్ధం చేసింది. ప్రస్తుతం చిన్నస్వామి మైదానంలో ముగ్గురు క్యురేటర్లలో ఒకరైన జసింతా, కేఎస్‌సీఏ ఇతర గ్రౌండ్స్‌కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తోంది. పేదరికం కారణంగా పదో తరగతితోనే చదువును ముగించినా... మగవారితో సమానంగా పోటీ పడుతూ భిన్నమైన రంగంలో రాణిస్తుం డటం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం.
 
ఇది మగాళ్లకు సంబంధించిన పని మాత్రమే అంటే నేను ఒప్పుకోను. ఏ మ్యాచ్ జరిగినా అందరి దృష్టి పిచ్‌పై ఉంటుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వరకు కూడా పని చేయాల్సి ఉండటంతో ఆరంభంలో నా భర్త ఉద్యోగం వదిలేయమన్నారు. చివరకు వారిని ఒప్పించగలిగాను. ఇప్పుడు అనుభవం తర్వాతే నాకు పిచ్‌ల తయారీపై మంచి పట్టు వచ్చింది. భవిష్యత్తులో అవసరమైన టెక్నికల్ కోర్సులు కూడా చదవాలని ఉంది.- జసింతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement