ఆడుకుందాం రండి | Velammal Nexus felicitates Manu Bhaker | Sakshi
Sakshi News home page

ఆడుకుందాం రండి

Published Thu, Aug 29 2024 6:28 AM | Last Updated on Thu, Aug 29 2024 8:43 AM

Velammal Nexus felicitates Manu Bhaker

మను క్రీడా యాత్ర

‘ఎప్పుడూ ఆటలేనా... చదువుకోవచ్చు కదా’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఎప్పుడూ చదువేనా... ఆటలు కూడా ఆడవచ్చు కదా’ అనే తల్లిదండ్రులు అతి తక్కువ. చదువు విషయంలోనే కాదు ఆటల్లో కూడా  పిల్లలను ్రపోత్సహిస్తే చారిత్రక అద్భుతాలు  జరుగుతాయని చెప్పడానికి బలమైన ఉదాహరణ... స్టార్‌ షూటర్‌ మను బాకర్‌. 

‘మీకు డాక్టర్‌ లేదా ఇంజినీర్‌ కావాలని లేదా... అయితే ఆటల ప్రపంచంలోకి రండి. అదొక అద్భుత ప్రపంచం’ అంటుంది ఒలింపిక్స్‌లో డబుల్‌–మెడల్‌ గెల్చుకున్న మను బాకర్‌. విద్యార్థుల దృష్టిని ఆటలపై మళ్లించడానికి నేషనల్‌ టూర్‌ చేస్తోంది...

తన పర్యటనలో భాగంగా చెన్నైలోని వేలమ్మళ్‌ నెక్సెస్‌ స్కూల్‌కు వెళ్లిన మను బాకర్‌ ఆటలకు ఉండే శక్తి ఏమిటో ఆసక్తికరంగా చెప్పింది. ‘ఆటలు అనే దారి వైపు వచ్చి చూడండి. ఆ దారిలో ముందుకు వెళుతున్న కొద్దీ మీలో ఉత్సాహం, శక్తి అంతకంతకూ పెరుగుతూ పోతాయి’ అంటుంది మను.
‘టోక్యో ఒలింపిక్స్‌లో నా గురి తప్పింది. ఓటమి పలకరించింది. అలా అని నిరాశలోనే ఉండిపోలేదు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి అంతే సహజం. గెలుపు ఓటములు ఆటలో శాశ్వతం కాదు. ఆటలో ఉన్న అందం, అద్భుతం ఇదే’ అంటుంది మను.

‘డ్రీమ్‌ బిగ్‌’ అని మను అన్నప్పుడు పిల్లలు చప్పట్లు కొట్టారు. ‘మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటూ తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకుంది.

‘ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆటలు సరిపోతాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు కష్టం’ అనే అపోహను తోసిపుచ్చింది మను. ‘ఆత్మస్థైర్యం నుంచి ఆర్థికసహాయం వరకు క్రీడా ప్రపంచంలో ఏది కష్టం కాదు. మీరు పెద్ద కల కంటే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పేదరికం మీకు ఎప్పుడూ అడ్డు కాదు. ఈ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది’ అంటుంది మను బాకర్‌. ‘మీ ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?’ అనే ప్రశ్నకు– ‘ఇంకెవరు... మా అమ్మే’ అని చెప్పింది మను. ‘ఎప్పుడూ ఆటలేనా!’ అని ఎప్పుడూ అనేది కాదు ఆమె. ఆటల్లో కూతురు చూపుతున్న ప్రతిభకు సంతోషించేది.

‘క్రీడల్లో పిల్లలు రాణించడం, పెద్దస్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది’ అంటుంది మను బాకర్‌.
ఆటలు ఇంకా ఏం చేస్తాయి? మను మాటల్లో చె΄్పాలంటే ప్రపంచాన్ని చూపిస్తాయి. ‘షూటింగ్‌ కెరీర్‌ వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. దీనివల్ల రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, చరిత్ర, పోరాటాలు... ఒక్కటా రెండా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను ఆటల్లోకి రాకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు’ అంటుంది మను.
‘మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం’ అంటారు పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన విజేతలు. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతుంటుంది మను.

‘మేము పేదవాళ్లం, నాకు ఇంగ్లీష్‌ రాదు, నేను బలహీనంగా ఉంటాను, ఇతరులతో పోటీ పడగలనా... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఎన్ని పరిమితులు ఉన్నా కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే మన ప్రయాణానికి అవేమీ అడ్డు కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. నా విషయానికి వస్తే... మొదట్లో నాకూ ఇంగ్లీష్‌ పెద్దగా రాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ తెలియదు... అనుకుంటే అక్కడే ఉండిపోతాం. తెలుసుకుంటాను’... అనే పట్టుదల ఉంటే తెలుసుకోగలం. నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అంటుంది మను.

‘మీకు ఎన్నో కెరీర్‌ ఆప్షన్‌లు ఉన్నాయి. అవేమీ మీకు ఆసక్తిగా లేకపోతే ఆటల ప్రపంచంలోకి రండి’ అని విద్యార్థులను ఆహ్వానిస్తోంది మను బాకర్‌. ఆమె మాటల స్ఫూర్తి ఎంతోమందికి విజయ మంత్రం కావాలని ఆశిద్దాం.    
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement