![Success story about Avani Veeramaneni Formula E racing](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/ahura-racing-car.jpg.webp?itok=3rWvBEYt)
ఈ తరం భారతీయ సమాజానికి అమ్మాయి చేతిలో స్టీరింగ్ విచిత్రం ఏమీ కాదు. స్టీరింగ్ మగవాళ్లదనే అభిప్రాయాన్ని యాభైఏళ్ల కిందటే తుడిచేశారు మహిళలు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లోనూ స్టీరింగ్ తిప్పుతున్నారు. కానీ ఈ సంఖ్య చాలా తక్కువ. దేశం మొత్తంమీద చూసినా వేళ్లమీద లెక్కపెట్టేటంత మంది మాత్రమే ఉన్నారు. వీరిలో అత్యంత చిన్నవయసు అమ్మాయి అవని వీరమనేని. మన తెలుగు రాష్ట్రాల్లో తొలి అమ్మాయి కూడా. హైదరాబాద్‌కు చెందిన పదిహేడేళ్ల అవని ఫార్ములా ఈ రేసింగ్‌లో దూసుకుపోతోంది.
→ మగవాళ్లతో పోటీ
స్టీరింగ్ మీద ఇష్టమే అవనిని ఫార్ములా ఈ రేసింగ్ వైపుకు మళ్లించింది. అన్నయ్య కారు నడుపుతుంటే తనకూ నేర్పించమని మొండిపట్టు పట్టింది. రెండురోజుల్లో స్టీరింగ్ మీద రోడ్ మీద కంట్రోల్ వచ్చేసింది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వయసు మాత్రం రాలేదు. కారిచ్చి రోడ్డు మీదకు పంపించరు. స్టీరింగ్ మీద ప్యాషన్ తీరేదెలా? రేసింగ్ గురించి ఇండియాలో ఉన్న అవకాశాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ గురించి తెలియగానే అమ్మానాన్నలను అడిగింది. నిండా పదిహేనేళ్లు లేవు.
ఇందులో స్త్రీపురుషులకు పోటీలు విడిగా లేవు. డ్రైవింగ్‌లో పది–ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న నలభైఏళ్ల మగవాళ్లు కూడా అదే ట్రాక్ మీద పోటీలో ఉంటారు. కారువేగం గంటకు 160 నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్ద వాళ్ల మధ్య కుందేలు పిల్లలాగ ఉంటుందేమో అనుకున్నారు. కానీ అంతటి క్లిష్టమైన టాస్క్‌ని తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కు లాగడం ఎందుకు అనుకున్నారు.
అవని కోరుకున్నట్లే ఫార్ములా ఈ రేసింగ్ లో శిక్షణ ఇప్పించారు. అవని ఇప్పుడు అహురా రేసింగ్ గ్రూప్‌తో పోటీల్లో పాల్గొంటోంది. తొలిసారి రేసింగ్ ట్రాక్ మీదకు వెళ్లిన నాటికి ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. గడచిన మూడేళ్లుగా కోయంబత్తూర్‌లో, చెన్నైలో జరిగిన జేకే టైర్స్, ఎమ్‌ఆర్‌ఎఫ్ కంపెనీలు నిర్వహించిన పోటీల్లో పాల్గొంటున్నది. టాప్ టెన్ ర్యాంకింగ్‌లో కొనసాగుతోంది.
→ ఈ తరం టీన్స్
అవనితోపాటు ఫార్ములా ఈ రేసింగ్‌లో స్టీరింగ్ పట్టుకున్న అమ్మాయిల గురించి చెబుతూ ‘‘దేశం మొత్తం మీద చూసినా పెద్ద నంబర్ ఏమీ లేదు. తెలుగువాళ్లెవరూ కనిపించలేదు. తమిళనాడు, మహారాష్ట్రల నుంచి చూశాను. 2023లో నాతోపాటు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. 2024లో కూడా మరో ఇద్దరిని చూశానంతే. వాళ్లు కూడా నాకంటే కొద్దిగా పెద్దవాళ్లే తప్ప ఇరవై దాటిన వాళ్లెవరూ లేరు. ఓన్లీ మెన్ ఉన్న ఈ స్పోర్ట్‌లో ఉమెన్ ఎంట్రీ ఈ జనరేషన్ టీన్స్‌తో మొదలైందని చెప్పవచ్చు’’ అంటోంది అవని.
ఈ పోటీల్లో పాల్గొనడానికి మంచి శక్తినిచ్చే ప్రత్యేకమైన ఆహారం గురించి మాట్లాడుతూ ‘‘అమ్మ డాక్టర్. నేను ఏమి తినాలో, ఎంత తినాలో అమ్మ చూసుకుంటుంది. నాకు తెలిసిందల్లా అమ్మ పెట్టింది తినడమే. నాతోపాటు ట్రైనింగ్‌కి, పోటీలకు తోడుగా అమ్మ లేదా నాన్న వస్తారు. నాన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తనకు కూడా సెలవులు కష్టమే. ఇద్దరికీ వీలుకానప్పుడు అమ్మమ్మ వస్తుంది. నన్ను భద్రంగా చూసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు. కాబట్టి ఇక నా ఫోకస్ అంతా ట్రాక్ మీదనే’’ అని సంతోషంగా
నవ్వేసింది అవని.
టెన్త్ క్లాస్ పరీక్ష పెట్టింది!
లెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. నైన్త్‌క్లాస్‌లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ మొదలు పెట్టినప్పుడు చదువుకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. టెన్త్‌లో ట్రైనింగ్ సెషన్స్, బోర్డు ఎగ్జామ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. పగలంతా ట్రైనింగ్, రాత్రి హోటల్ రూమ్‌కి వచ్చి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావడం... నిజంగా క్లిష్టసమయం అనే చెప్పాలి. అలాగే బోర్డ్ ఎగ్జామ్ రాశాను. ఫార్ములా ఈ రేసింగ్ చాలా ఖర్చుతో కూడిన ఆట. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ ఒప్పుకోవడం నా అదృష్టం.
– అవని వీరమనేని, ఫార్ములా ఈ రేసర్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment