సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుంచి ఆమోదం లభించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.
ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది?
హైదరాబాద్‌లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు.
2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్‌ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్ రేస్‌ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్‌ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్‌ఈవోకు స్పష్టం చేశారు.
ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్‌ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి..
డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్‌ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు.
ఆ మెమోకు అర్వింద్‌కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్‌ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు.
అందులో భాగంగానే అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీరుతోపాటు గత ప్రభుత్వంలో పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం... ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్‌పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతిచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment