ఈత – ఘనత
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు.
దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.
150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా..
డిసెంబరు 28న విశాఖలోని ఆర్‌కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్‌ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు.
2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్‌తోప్రారంభించానన్నారు.
ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు.
హేళన చేసిన వారే పొగుడుతున్నారు
సముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది.
– గోలి శ్యామల – స్విమ్మర్.
– లక్కింశెట్టి శ్రీనివాసరావు
సాక్షి ప్రతినిధి.. కాకినాడ.
ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు.
కాకినాడ రూరల్
Comments
Please login to add a commentAdd a comment