ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం | Telangana Acb Summons Issued Notice On Officers | Sakshi

ఫార్ములా-ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం

Jan 3 2025 8:56 PM | Updated on Jan 3 2025 9:06 PM

Telangana Acb Summons Issued Notice On Officers

సాక్షి,హైదరాబాద్‌ : రాజకీయంగా చర్చనీయాంశమైన ఫార్ములా-ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఈ-కార్‌ రేసులో అధికారులకు ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్‌ఎన్‌ రెడ్డి)లకు ఏసీబీ అధికారుల నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11,12 తేదీల్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఇదే కేసులో
ఇదే కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బి.లక్ష్మీనరసింహారెడ్డి (బీఎల్‌ఎన్‌ రెడ్డి)లకు కూడా సమన్లు జారీ చేసింది.

వీరిలో బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈ నెల 2న, అర్వింద్‌కుమార్‌ను 3వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ ఆనంద్‌ ఆ సమన్లలో పేర్కొన్నారు.

👉చదవండి : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ఏసీబీ కంటే దూకుడుగా.. 
హైదరాబాద్‌ నగరంలో ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి హెచ్‌ఎండీఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా చేర్చింది.

ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ దర్యాప్తు కన్నా ఈడీ మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. నిందితులను విచారించేందుకు సమన్లు జారీ చేసింది. ఈడీ దర్యాప్తులో గుర్తించే అంశాల ఆధారంగా.. కేసులో ముందుకు వెళ్లనుంది. ఇదే సమయంలో ‘ఫారిన్‌ ఎక్సేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా)’ కింద కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిసింది.

నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్‌.. 
ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ సీజన్‌–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్‌ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్‌ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్‌ పౌండ్లు)ను ఎఫ్‌ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్‌ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు.

కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్‌ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్‌ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్‌ఈవో ఇన్వాయిస్‌లు పంపింది. దీనిపై అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు.

అక్టోబర్‌ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్‌ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్‌ఎండీఏ బోర్డ్‌ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్‌ఎన్‌ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది.

ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్‌ఎండీఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్‌ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. వీరి నుంచి సేకరించే అంశాల ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement