సమ్‌థింగ్ స్పెషల్
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.
‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వాటిలో కొన్ని...
‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’
‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’
‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’
అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.
పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.
భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్‌డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.
‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక.
Comments
Please login to add a commentAdd a comment