Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది | Tanisha Bajia won a silver medal in Sub-Junior Para Athletics Championship | Sakshi
Sakshi News home page

Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది

Published Tue, Aug 13 2024 12:28 AM | Last Updated on Tue, Aug 13 2024 11:15 AM

Tanisha Bajia won a silver medal in Sub-Junior Para Athletics Championship

ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్‌ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. 

కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్‌ జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని  ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.

ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.

గెలుపుతో విముక్తి
‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు.

 స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్‌ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.

తొలిసారి పట్టుదల
‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం  గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.
నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.

జూలైలో పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్‌ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత  సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి.
 

నాన్న నిలబడ్డాడు
పుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్‌ బాజియా ఓ డాక్టర్‌ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్‌. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్‌ సరితా బవేరియా. నేషనల్‌ లెవల్‌ ప్లేయర్‌ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement