Para Athletics
-
లాస్ ఏంజెలిస్‌లో కలుద్దాం
పారిస్: వైకల్యాన్ని జయించి పతకాల భరతం పట్టిన పారా అథ్లెట్లు ఈ విశ్వక్రీడలను చిరస్మరణీయం చేసుకున్నారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌లా సాగిన పారాలింపిక్స్‌కు ఆదివారం అర్ధరాత్రి తర్వాత తెరపడింది. అట్టహాసంగా నిర్వహించిన ముగింపు వేడుకలు మళ్లీ పారిస్‌ను మిలమిల మెరిపించింది. రంగురంగుల ఎల్ఈడీ లైటింగ్ నడిరాతిరిని వర్ణమయం చేస్తే... నిషిధిని చీల్చిన బాణాసంచా వెలుగులు పారిస్ నగరం నెత్తిన కిరీటాన్ని తలపించేలా చేశాయి. ప్రత్యేకంగా తయారు చేసిన అతిపెద్ద బెలూన్ బాగా ఆకట్టుకుంది. ఇది చూసిన వారికి మండుతున్న కుండలా కనిపించింది. అయితే ఇదేమీ బాణాసంచాతోనూ, అగ్గితోనూ చేసింది కాదు! పూర్తిగా అగ్గిమంటను తలపించే రంగు లైట్లతో అలా కనువిందు చేశారు. ప్రముఖ ఫ్రెంచ్ సింగర్ శాంటా హుషారెక్కించే పాటతో స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. పోటీల ఆఖరి రోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. మొరాకో అథ్లెట్ ఫాతిమా ఎజార ఎల్ ఇడ్రిస్సి మహిళల మారథాన్ పరుగులో, నైజీరియన్ లిఫ్టర్ ఒలువాఫెమియో రికార్డులు నెలకొల్పారు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఎల్ ఎడ్రిస్సి 2 గంటల 48 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా జపాన్‌కు చెందిన మిసాటో మిచిషిత 2020లో నెలకొల్పిన 2 గంటల 54 నిమిషాల 13 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది. మహిళల పవర్‌లిఫ్టింగ్‌లో డిఫెండింగ్ చాంపియన్, 39 ఏళ్ల ఒలువాఫెమియో తన రికార్డును తానే చెరిపింది. 86 కేజీల ఈవెంట్లో ఆమె 167 కిలోల బరువెత్తి జార్జియాలో ఈ ఏడాది జూన్‌లో ఎత్తిన 166 కిలోల రికార్డును తిరగరాసింది. అమెరికాకు మూడో స్థానం సాధారణంగా విశ్వక్రీడల్లో అమెరికా అథ్లెట్లు పతకాల పందెంలో ముందుంటారు. ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికాకు గట్టి పోటీనిచి్చన చైనా అథ్లెట్లు చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ పారాలింపిక్స్‌లో చైనా క్రీడాకారులు అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్యాలతో చైనా మొత్తం 220 పతకాలు సాధించింది. అమెరికా 105 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో 36 పసిడి, 42 రజతాలు, 27 కాంస్యాలున్నాయి. రెండోస్థానం బ్రిటన్ (124 పతకాలు)కు దక్కింది. 49 బంగారు పతకాలు, 44 రజతాలు, 31 కాంస్యాలు గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ అధిగమిస్తుందా? పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్ ఆదరణలోనూ, అథ్లెట్లతోనూ విజయవంతమైంది. ఏకంగా 4000 పైచిలుకు అథ్లెట్లు పోటీపడిన ఈ విశ్వక్రీడలను చూసేందుకు లక్షల మంది ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో 2.4 మిలియన్ టికెట్లు (24 లక్షలు) అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. లండన్–2012 ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయిలో టికెట్ల విక్రయం జరిగిన ఈవెంట్ ఇదేనని వెల్లడించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి లాస్ ఏంజిలిస్–2028 ఒలింపిక్స్‌పై పడింది. ఈ ఆదరణను మించే విధంగా తదుపరి విశ్వక్రీడలు జరగాలని ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రతినిధి క్రెయిగ్ స్పెన్స్ తెలిపారు. -
Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో... ప్యారే అథ్లెట్స్
కొన్ని విజయాలు ఆనందంతో ముడిపడినవి మాత్రమే కాదు. వ్యక్తిగత విజయానికే పరిమితమైనవి కావు. దారి లేని వారికి దారి చూపే విజయాలు. ధైర్యం లేని వారికి అసాధారణ ధైర్యం ఇచ్చే విజయాలు. పారాలింపిక్స్‌లో ఈ ప్యారే’ అథ్లెట్లు సాధించిన విజయాలు అలాంటివే. చరిత్ర సృష్టించిన విజయాలే కాదు నిస్సహాయులం, అశక్తులం అనుకునే వారికి స్ఫూర్తినిచ్చి శక్తిమంతం చేసే విజయాలు...బతకడమే కష్టం అంటే ... పతకం తెచ్చిందిపరుగు ఏం చేస్తుంది?‘మనం ఊహించని శక్తి మనలో ఉంది అని గుర్తు తెస్తుంది’ అంటుంది ఒక ప్రసిద్ధ మాట. ఈ మాట ప్రీతి పాల్‌కు అక్షరాలా సరి΄ోతుంది. ‘ఈ అమ్మాయి బతకడం కష్టం. బతికినా మంచానికే పరిమితం అవుతుంది’ అనుకున్న అమ్మాయి ‘పరుగు’ను బలం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై విజేతగా మెరిసింది. తాజాగా...పారిస్ పారాలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆనంద క్షణాలలో...‘ఇది కలా నిజామా!’ అనుకుంది ప్రీతి.ఆ ఆనందం నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ప్రీతికి కష్టాలు పాత చుట్టాలు. బలహీనమైన కాళ్లతో పుట్టింది. ఫలితంగా ఆమె వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాళ్లను బలోపేతం చేయడానికి వివిధ సంప్రదాయ చికిత్సలు చేయించారు. అయిదు నుంచి ఎనిమిదేళ్ల వరకు కాలిపర్లు ధరించింది ప్రీతి. ‘ఈ అమ్మాయి ఇక మంచానికే పరిమితం అవుతుంది’... ఇలాంటి బలహీనమైన మాటలు ఆమె ఆత్మబలం ముందు వెల వెల బోయాయి. ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి శక్తిమంతురాలిగా రూపుదిద్దుకోవడానికి తనలో ఆశావాదమే కారణం. ‘నా పరిస్థితి ఇలా అయింది ఏమిటి’ అనే బాధ కంటే ఏదో సాధించాలనే ఉత్సాహం తనలో ఉరకలు వేసేది. ‘ఈ బలహీనమై కాళ్లతో నేను ఏం సాధించగలను’ అనే ఆమె సందేహానికి టీవీలో కనిపిస్తున్న పారాలింపిక్స్ దృశ్యాలు సమాధానం చెప్పాయి. ఇక అప్పటి నుంచి పారాలింపిక్స్‌పై ప్రీతికి ఆసక్తి పెరిగింది. పారాలింపిక్ అథ్లెట్ ఫాతిమ పరిచయం ప్రీతి జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నీలో ప్రతిభ ఉంది’ అని ప్రీతిని ప్రోత్సహించడమే కాదు ఆటలోని మెలకువలు నేర్పింది. ఫాతిమ మార్గదర్శకత్వంలో రాష్ట్ర,జాతీయ స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొంది ప్రీతి. మీరట్‌లో ప్రాథమిక శిక్షణ తరువాత దిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు స్టేడియంలో కోచ్ గజేంద్ర సింగ్ దగ్గర శిక్షణ తీసుకున్న ప్రీతి పాల్‌కు రన్నింగ్ టెక్నిక్‌లు నేర్చుకొని తన ప్రతిభకు సానపెట్టుకునే అవకాశం వచ్చింది.గత సంవత్సరం చైనాలో జరిగిన ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల ఈవెంట్లలో రెండో స్థానం, నాల్గో స్థానంలో నిలిచినప్పటికి ప్రీతి నిరాశపడలేదు. పారిస్ పారాలింపిక్స్ టీ35 100 మీటర్ల ఈవెంట్లో 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్యాన్ని సాధించింది. తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించినందుకు తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘పారిస్‌కు రాక ముందు పతకం సాధించాలని గట్టిగా అనుకున్నాను. నా కల నిజమైంది’ అన్న ప్రీతి పాల్ రెండో పతకాన్ని కూడా సాధించి చరిత్ర సృష్టించింది. ‘పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉంది’ అంటుంది ప్రీతి.శరణార్థి... సీక్రెట్ జిమ్రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ నుంచి పతకం సాధించిన తొలి పారా తైక్వాండో అథ్లెట్‌గా జకియా ఖుదాదాది చరిత్ర సృష్టించింది. మహిళల 47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ‘ఇక్కడికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ పతకం ఆఫ్గానిస్తాన్‌లోని మహిళలందరికీ, ప్రపంచంలోని శరణార్థులందరికీ దక్కుతుంది. ఏదో ఒకరోజు నా దేశంలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను’ అంటుంది జకియ. ముంజేయి లేకుండా జన్మించిన జకియ పదకొండు ఏళ్ల వయసులో ఆఫ్గానిస్తాన్‌లోని తన స్వస్థలమైన హెరాత్‌లోని రహస్య జిమ్‌లో రహస్యంగా తైక్వాండో ప్రాక్టీస్ చేసేది. టోక్యో ఒలింపిక్స్ తరువాత జకియ ఖుదాదాది ΄్యారిస్‌లో స్థిరపడింది. ఆమె గెలుపు చారిత్రాత్మకం. ఆమె జీవితం ఆసక్తికరం.కాలు, చెయ్యి లేకున్నా చేపలాగా...‘సగౌరవంగా కనిపించాలి. గెలుపుపై మెరవాలి’ అంటుంది పందొమ్మిది ఏళ్ల చైనీస్ స్విమ్మర్ ఇయాంగ్ యుయాన్. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్6 ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న ఇయాంగ్ దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకోవడానికి తన వంతుగా స్ఫూర్తి నింపాలని అనుకుంటుంది. టోక్యో పారాలింపిక్స్ ఎస్6 50 మీటర్ల బట్టర్ఫ్లై ఈవెంట్లో కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా... 32.59 సెకన్లతో మరోసారి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నాలుగు సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో కుడి చేయి, కాలును కోల్పోయింది ఇయాంగ్. ‘నువ్వు ఎలాగైనా గెలవాల్సిందే...అంటూ నాపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఈ గేమ్స్‌లో నేను పోటీ పడటాన్ని చాలా మంది దివ్యాంగులు చూస్తారని నాకు తెలుసు. నా గెలుపు వారి గెలుపు కావాలనుకున్నాను’ అంటుంది ఇయాంగ్. ‘మీరు కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయండి’ అని దివ్యాంగులకు పిలుపు ఇస్తుంది.వీల్ చైర్ రగ్బీలో చక్రం తిప్పి...టీమ్ యూఎస్ వీల్‌చైర్ రగ్బీ అథ్లెట్ సారా ఆడమ్ అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టులో ఆడిన తొలి మహిళగా, పారాలింపిక్స్‌లో స్కోర్ చేసిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర నృష్టించింది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి కెనడా జట్టుపై అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో సారా ఆడామ్ కీలక పాత్ర ΄ోషించింది. 2016లో సారా ఆడమ్‌కు మల్టీపుల్ స్లె్కరోసిస్గా నిర్దారణ అయింది. ‘క్రీడారంగంలో ఉన్న మహిళలకు నిజంగా ఇది ఉత్తేజకరమైన కాలం. అభిమానులు ఆటలో మేము చూపించే నైపుణ్యాలను ప్రశంసించడమే కాదు మా నేపథ్యాలు, మేము పడిన కష్టాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలిట్ అథ్లెట్‌గా ఎదగడానికి బాగా కష్టపడ్డాను’ అని అంటుంది సారా. ఆటల్లోకి అడుగు పెట్టకముందు సారా ఆడమ్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్శిటీలో ఆక్యుపేషనల్ ప్రొఫెసర్. -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది. -
నాలాంటి వికలాంగులకు ఆ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇండియాకి మెడల్స్ తెస్తాం
-
రష్యాకు మరో షాక్.. పుతిన్ అహంకారానికి అథ్లెట్లు బలి
Russian and Belarus Athletes Banned From Winter Paralympics: ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్ క్రీడా జగత్తు కన్నెర్ర చేస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA బ్యాన్ విధించగా.. తాజాగా వింటర్ పారాలింపిక్ కమిటీ కత్తి దూసింది. 2022 వింటర్ పారాలింపిక్స్‌లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు. రాజకీయాలతో క్రీడలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అనివార్య కారణాల వల్ల రష్యా, బెలారస్ పారా అథ్లెట్లను బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు, ముఖ్యంగా పుతిన్ అహంకారానికి పారా అథ్లెట్లు బలైపోయారని వాపోయారు. కాగా, రేపటి (మార్చి 4) నుంచి బీజింగ్‌లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండింది. చదవండి: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు -
జావెలిన్ త్రోలో సుందర్ సింగ్‌కు స్వర్ణం
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పసిడి బోణీ చేసింది. లండన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల ఎఫ్–46 జావెలిన్ త్రో ఈవెంట్లో సుందర్ సింగ్ గుర్జర్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. సుందర్ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ రింకూ 55.12 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్–57 ఈవెంట్లో వీరేందర్ ధన్కర్ 13.62 మీటర్లతో నాలుగో స్థానాన్ని పొందాడు. -
మూడో రోజు రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి మీట్లో మూడో రోజు భారత క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు. పురుషుల వీల్‌ఛైర్ ఎఫ్– 55/56 విభాగంలో నీరజ్ యాదవ్ 25.01మీ., అమిత్ బల్యాన్ 24.93మీ. దూరం జావెలిన్ విసిరి రజత, కాంస్య పతకాలు సాధించారు. మరోవైపు భారత క్రీడాకారిణి ఏక్తా భయాన్ క్లబ్ 397గ్రా.ల ఎఫ్–32/51 విభాగంలో 16.63మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకుంది. కానీ, ఈ ప్రదర్శనతో ఎఫ్–51లో ఏక్తా ఆసియా రికార్డును తిరగరాసింది. -
నెక్లెస్‌రోడ్‌లో రియోత్సాహం..
ఖైరతాబాద్: రియో ఒలంపిక్స్ పారా అథ్లెటిక్స్‌లో భారత్ క్రీడాకారుల విజయాల్ని స్వాగతిస్తూ ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘ఏపీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఏపీ సచివాలయం వరకు సాగిన ఈ ర్యాలీని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. సంఘం చైర్మన్ కోటేశ్వరరావు, జాతీయ పారా క్రీడాకారులు శ్రీనివాసులు, అంజన్ రెడ్డి పాల్గొన్నారు.