కొన్ని విజయాలు ఆనందంతో ముడిపడినవి మాత్రమే కాదు. వ్యక్తిగత విజయానికే పరిమితమైనవి కావు. దారి లేని వారికి దారి చూపే విజయాలు. ధైర్యం లేని వారికి అసాధారణ ధైర్యం ఇచ్చే విజయాలు. పారాలింపిక్స్‌లో ఈ ప్యారే’ అథ్లెట్లు సాధించిన విజయాలు అలాంటివే. చరిత్ర సృష్టించిన విజయాలే కాదు నిస్సహాయులం, అశక్తులం అనుకునే వారికి స్ఫూర్తినిచ్చి శక్తిమంతం చేసే విజయాలు...
బతకడమే కష్టం అంటే ... పతకం తెచ్చింది
పరుగు ఏం చేస్తుంది?
‘మనం ఊహించని శక్తి మనలో ఉంది అని గుర్తు తెస్తుంది’ అంటుంది ఒక ప్రసిద్ధ మాట. ఈ మాట ప్రీతి పాల్‌కు అక్షరాలా సరి΄ోతుంది. ‘ఈ అమ్మాయి బతకడం కష్టం. బతికినా మంచానికే పరిమితం అవుతుంది’ అనుకున్న అమ్మాయి ‘పరుగు’ను బలం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై విజేతగా మెరిసింది. తాజాగా...పారిస్ పారాలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో 100 మీటర్‌ల విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆనంద క్షణాలలో...‘ఇది కలా నిజామా!’ అనుకుంది ప్రీతి.
ఆ ఆనందం నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే 200 మీటర్‌ల విభాగంలో కాంస్య పతకంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ప్రీతికి కష్టాలు పాత చుట్టాలు. బలహీనమైన కాళ్లతో పుట్టింది. ఫలితంగా ఆమె వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాళ్లను బలోపేతం చేయడానికి వివిధ సంప్రదాయ చికిత్సలు చేయించారు. అయిదు నుంచి ఎనిమిదేళ్ల వరకు కాలిపర్‌లు ధరించింది ప్రీతి.
‘ఈ అమ్మాయి ఇక మంచానికే పరిమితం అవుతుంది’... ఇలాంటి బలహీనమైన మాటలు ఆమె ఆత్మబలం ముందు వెల వెల బోయాయి. ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి శక్తిమంతురాలిగా రూపుదిద్దుకోవడానికి తనలో ఆశావాదమే కారణం. ‘నా పరిస్థితి ఇలా అయింది ఏమిటి’ అనే బాధ కంటే ఏదో సాధించాలనే ఉత్సాహం తనలో ఉరకలు వేసేది. ‘ఈ బలహీనమై కాళ్లతో నేను ఏం సాధించగలను’ అనే ఆమె సందేహానికి టీవీలో కనిపిస్తున్న పారాలింపిక్స్ దృశ్యాలు సమాధానం చెప్పాయి.
ఇక అప్పటి నుంచి పారాలింపిక్స్‌పై ప్రీతికి ఆసక్తి పెరిగింది. పారాలింపిక్ అథ్లెట్ ఫాతిమ పరిచయం ప్రీతి జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నీలో ప్రతిభ ఉంది’ అని ప్రీతిని ప్రోత్సహించడమే కాదు ఆటలోని మెలకువలు నేర్పింది. ఫాతిమ మార్గదర్శకత్వంలో రాష్ట్ర,జాతీయ స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొంది ప్రీతి. మీరట్‌లో ప్రాథమిక శిక్షణ తరువాత దిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు స్టేడియంలో కోచ్ గజేంద్ర సింగ్ దగ్గర శిక్షణ తీసుకున్న ప్రీతి పాల్‌కు రన్నింగ్ టెక్నిక్‌లు నేర్చుకొని తన ప్రతిభకు సానపెట్టుకునే అవకాశం వచ్చింది.
గత సంవత్సరం చైనాలో జరిగిన ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్‌ల ఈవెంట్‌లలో రెండో స్థానం, నాల్గో స్థానంలో నిలిచినప్పటికి ప్రీతి నిరాశపడలేదు. పారిస్ పారాలింపిక్స్ టీ35 100 మీటర్‌ల ఈవెంట్‌లో 14.21 సెకన్‌లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్యాన్ని సాధించింది. తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించినందుకు తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘పారిస్‌కు రాక ముందు పతకం సాధించాలని గట్టిగా అనుకున్నాను. నా కల నిజమైంది’ అన్న ప్రీతి పాల్ రెండో పతకాన్ని కూడా సాధించి చరిత్ర సృష్టించింది. ‘పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉంది’ అంటుంది ప్రీతి.
శరణార్థి... సీక్రెట్ జిమ్
రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ నుంచి పతకం సాధించిన తొలి పారా తైక్వాండో అథ్లెట్‌గా జకియా ఖుదాదాది చరిత్ర సృష్టించింది. మహిళల 47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ‘ఇక్కడికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ పతకం ఆఫ్గానిస్తాన్‌లోని మహిళలందరికీ, ప్రపంచంలోని శరణార్థులందరికీ దక్కుతుంది. ఏదో ఒకరోజు నా దేశంలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను’ అంటుంది జకియ. ముంజేయి లేకుండా జన్మించిన జకియ పదకొండు ఏళ్ల వయసులో ఆఫ్గానిస్తాన్‌లోని తన స్వస్థలమైన హెరాత్‌లోని రహస్య జిమ్‌లో రహస్యంగా తైక్వాండో ప్రాక్టీస్ చేసేది. టోక్యో ఒలింపిక్స్ తరువాత జకియ ఖుదాదాది ΄్యారిస్‌లో స్థిరపడింది. ఆమె గెలుపు చారిత్రాత్మకం. ఆమె జీవితం ఆసక్తికరం.
కాలు, చెయ్యి లేకున్నా చేపలాగా...
‘సగౌరవంగా కనిపించాలి. గెలుపుపై మెరవాలి’ అంటుంది పందొమ్మిది ఏళ్ల చైనీస్ స్విమ్మర్ ఇయాంగ్ యుయాన్. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 50 మీటర్‌ల ఫ్రీస్టైల్ ఎస్6 ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న ఇయాంగ్ దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకోవడానికి తన వంతుగా స్ఫూర్తి నింపాలని అనుకుంటుంది. టోక్యో పారాలింపిక్స్ ఎస్6 50 మీటర్‌ల బట్టర్‌ఫ్లై ఈవెంట్‌లో కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెలుచుకుంది.
తాజాగా... 32.59 సెకన్‌లతో మరోసారి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నాలుగు సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో కుడి చేయి, కాలును కోల్పోయింది ఇయాంగ్. ‘నువ్వు ఎలాగైనా గెలవాల్సిందే...అంటూ నాపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఈ గేమ్స్‌లో నేను పోటీ పడటాన్ని చాలా మంది దివ్యాంగులు చూస్తారని నాకు తెలుసు. నా గెలుపు వారి గెలుపు కావాలనుకున్నాను’ అంటుంది ఇయాంగ్. ‘మీరు కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయండి’ అని దివ్యాంగులకు పిలుపు ఇస్తుంది.
వీల్ చైర్ రగ్బీలో చక్రం తిప్పి...
టీమ్ యూఎస్ వీల్‌చైర్ రగ్బీ అథ్లెట్ సారా ఆడమ్ అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టులో ఆడిన తొలి మహిళగా, పారాలింపిక్స్‌లో స్కోర్ చేసిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర నృష్టించింది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి కెనడా జట్టుపై అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో సారా ఆడామ్ కీలక పాత్ర ΄ోషించింది. 2016లో సారా ఆడమ్‌కు మల్టీపుల్ స్లె్కరోసిస్‌గా నిర్దారణ అయింది. ‘క్రీడారంగంలో ఉన్న మహిళలకు నిజంగా ఇది ఉత్తేజకరమైన కాలం. అభిమానులు ఆటలో మేము చూపించే నైపుణ్యాలను ప్రశంసించడమే కాదు మా నేపథ్యాలు, మేము పడిన కష్టాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలిట్ అథ్లెట్‌గా ఎదగడానికి బాగా కష్టపడ్డాను’ అని అంటుంది సారా. ఆటల్లోకి అడుగు పెట్టకముందు సారా ఆడమ్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్శిటీలో ఆక్యుపేషనల్ ప్రొఫెసర్.
Comments
Please login to add a commentAdd a comment