
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హనుమతండాకి చెందిన జాటోత్ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్ రామ్ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.
‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్‌లో విహాన్ శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ మనాలీలో 15రోజుల పాటు బేసిక్ మౌంట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోగల మౌంట్ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.
టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.
చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు సాధించాడు విహాన్. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్ రామ్. విజయోస్తు...విహాన్!
– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment