women athletes
-
యువతుల‘పడవ’ళ్లు!
దాల్ సరస్సులోని నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండి, శ్రీనగర్ పట్టణ ప్రాంత సోయగాలను, ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక ఆ సరస్సులో సోమవారం జరిగిన బోట్ రేస్ ఏకంగా మహిళా సాధికారతనే పరవళ్లు తొక్కించింది! 150 మందికి పైగా అందరూ మహిళలే పాల్గొన్న అలాంటి ఒక రేస్ దాల్ సరస్సులో జరగటం ఇదే మొదటిసారి. మహిళా అథ్లెట్లను ప్రోత్సహించటం, జమ్మూ లోయలోని మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం, సంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొట్టించి మహిళల్ని ఇంటి బయటికి రప్పించటం ఈ పడవ పోటీల లక్ష్యం. కశ్మీర్ మహిళలకు వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రఖ్యాత అథ్లెట్,పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు మొదటి మహిళా జ్యూరీ.. బిల్కిస్ మీర్ ఈ పోటీలను నిర్వహించారు.‘‘మహిళల కోసం దాల్ సరస్సులో ఏర్పాటు చేసిన ఈ మొట్టమొదటి ట్రాక్ రేస్ చరిత్రాత్మక మైనది. పురుషులకు ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. మహిళలకు అన్ని ఉండవు. ఇటువంటి మరిన్ని రేసులను నిర్వహించి, 35మంది యువతుల్ని వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని అంతర్జాతీయ పోటీలకు శిక్షణ ఇస్తాం’’ అని బిల్కిస్ మీర్ తెలి΄ారు. పోటీలోపాల్గొన్న మాదిహా ఫరూక్ అనే యువతి, తను ఈ రేసులో భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఆడపిల్లలకు ఆటలేంటి అనే భావజాలం సమాజం నుండి రూపుమాసిపోవాలి’’ అని అన్నారు.అందమైన జలమార్గాలకు పేర్గాంచిన కశ్మీర్లో, మహిళల్ని వాటర్ స్పోర్ట్స్‌లో ప్రోత్సహించటం ద్వారా సాధికారత వైపు పడవల్ని పరుగులెత్తించటం బాగుంది. -
Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో... ప్యారే అథ్లెట్స్
కొన్ని విజయాలు ఆనందంతో ముడిపడినవి మాత్రమే కాదు. వ్యక్తిగత విజయానికే పరిమితమైనవి కావు. దారి లేని వారికి దారి చూపే విజయాలు. ధైర్యం లేని వారికి అసాధారణ ధైర్యం ఇచ్చే విజయాలు. పారాలింపిక్స్‌లో ఈ ప్యారే’ అథ్లెట్లు సాధించిన విజయాలు అలాంటివే. చరిత్ర సృష్టించిన విజయాలే కాదు నిస్సహాయులం, అశక్తులం అనుకునే వారికి స్ఫూర్తినిచ్చి శక్తిమంతం చేసే విజయాలు...బతకడమే కష్టం అంటే ... పతకం తెచ్చిందిపరుగు ఏం చేస్తుంది?‘మనం ఊహించని శక్తి మనలో ఉంది అని గుర్తు తెస్తుంది’ అంటుంది ఒక ప్రసిద్ధ మాట. ఈ మాట ప్రీతి పాల్‌కు అక్షరాలా సరి΄ోతుంది. ‘ఈ అమ్మాయి బతకడం కష్టం. బతికినా మంచానికే పరిమితం అవుతుంది’ అనుకున్న అమ్మాయి ‘పరుగు’ను బలం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై విజేతగా మెరిసింది. తాజాగా...పారిస్ పారాలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆనంద క్షణాలలో...‘ఇది కలా నిజామా!’ అనుకుంది ప్రీతి.ఆ ఆనందం నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ప్రీతికి కష్టాలు పాత చుట్టాలు. బలహీనమైన కాళ్లతో పుట్టింది. ఫలితంగా ఆమె వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాళ్లను బలోపేతం చేయడానికి వివిధ సంప్రదాయ చికిత్సలు చేయించారు. అయిదు నుంచి ఎనిమిదేళ్ల వరకు కాలిపర్లు ధరించింది ప్రీతి. ‘ఈ అమ్మాయి ఇక మంచానికే పరిమితం అవుతుంది’... ఇలాంటి బలహీనమైన మాటలు ఆమె ఆత్మబలం ముందు వెల వెల బోయాయి. ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి శక్తిమంతురాలిగా రూపుదిద్దుకోవడానికి తనలో ఆశావాదమే కారణం. ‘నా పరిస్థితి ఇలా అయింది ఏమిటి’ అనే బాధ కంటే ఏదో సాధించాలనే ఉత్సాహం తనలో ఉరకలు వేసేది. ‘ఈ బలహీనమై కాళ్లతో నేను ఏం సాధించగలను’ అనే ఆమె సందేహానికి టీవీలో కనిపిస్తున్న పారాలింపిక్స్ దృశ్యాలు సమాధానం చెప్పాయి. ఇక అప్పటి నుంచి పారాలింపిక్స్‌పై ప్రీతికి ఆసక్తి పెరిగింది. పారాలింపిక్ అథ్లెట్ ఫాతిమ పరిచయం ప్రీతి జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నీలో ప్రతిభ ఉంది’ అని ప్రీతిని ప్రోత్సహించడమే కాదు ఆటలోని మెలకువలు నేర్పింది. ఫాతిమ మార్గదర్శకత్వంలో రాష్ట్ర,జాతీయ స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొంది ప్రీతి. మీరట్‌లో ప్రాథమిక శిక్షణ తరువాత దిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు స్టేడియంలో కోచ్ గజేంద్ర సింగ్ దగ్గర శిక్షణ తీసుకున్న ప్రీతి పాల్‌కు రన్నింగ్ టెక్నిక్‌లు నేర్చుకొని తన ప్రతిభకు సానపెట్టుకునే అవకాశం వచ్చింది.గత సంవత్సరం చైనాలో జరిగిన ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల ఈవెంట్లలో రెండో స్థానం, నాల్గో స్థానంలో నిలిచినప్పటికి ప్రీతి నిరాశపడలేదు. పారిస్ పారాలింపిక్స్ టీ35 100 మీటర్ల ఈవెంట్లో 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్యాన్ని సాధించింది. తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించినందుకు తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘పారిస్‌కు రాక ముందు పతకం సాధించాలని గట్టిగా అనుకున్నాను. నా కల నిజమైంది’ అన్న ప్రీతి పాల్ రెండో పతకాన్ని కూడా సాధించి చరిత్ర సృష్టించింది. ‘పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉంది’ అంటుంది ప్రీతి.శరణార్థి... సీక్రెట్ జిమ్రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ నుంచి పతకం సాధించిన తొలి పారా తైక్వాండో అథ్లెట్‌గా జకియా ఖుదాదాది చరిత్ర సృష్టించింది. మహిళల 47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ‘ఇక్కడికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ పతకం ఆఫ్గానిస్తాన్‌లోని మహిళలందరికీ, ప్రపంచంలోని శరణార్థులందరికీ దక్కుతుంది. ఏదో ఒకరోజు నా దేశంలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను’ అంటుంది జకియ. ముంజేయి లేకుండా జన్మించిన జకియ పదకొండు ఏళ్ల వయసులో ఆఫ్గానిస్తాన్‌లోని తన స్వస్థలమైన హెరాత్‌లోని రహస్య జిమ్‌లో రహస్యంగా తైక్వాండో ప్రాక్టీస్ చేసేది. టోక్యో ఒలింపిక్స్ తరువాత జకియ ఖుదాదాది ΄్యారిస్‌లో స్థిరపడింది. ఆమె గెలుపు చారిత్రాత్మకం. ఆమె జీవితం ఆసక్తికరం.కాలు, చెయ్యి లేకున్నా చేపలాగా...‘సగౌరవంగా కనిపించాలి. గెలుపుపై మెరవాలి’ అంటుంది పందొమ్మిది ఏళ్ల చైనీస్ స్విమ్మర్ ఇయాంగ్ యుయాన్. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్6 ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న ఇయాంగ్ దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకోవడానికి తన వంతుగా స్ఫూర్తి నింపాలని అనుకుంటుంది. టోక్యో పారాలింపిక్స్ ఎస్6 50 మీటర్ల బట్టర్ఫ్లై ఈవెంట్లో కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా... 32.59 సెకన్లతో మరోసారి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నాలుగు సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో కుడి చేయి, కాలును కోల్పోయింది ఇయాంగ్. ‘నువ్వు ఎలాగైనా గెలవాల్సిందే...అంటూ నాపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఈ గేమ్స్‌లో నేను పోటీ పడటాన్ని చాలా మంది దివ్యాంగులు చూస్తారని నాకు తెలుసు. నా గెలుపు వారి గెలుపు కావాలనుకున్నాను’ అంటుంది ఇయాంగ్. ‘మీరు కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయండి’ అని దివ్యాంగులకు పిలుపు ఇస్తుంది.వీల్ చైర్ రగ్బీలో చక్రం తిప్పి...టీమ్ యూఎస్ వీల్‌చైర్ రగ్బీ అథ్లెట్ సారా ఆడమ్ అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టులో ఆడిన తొలి మహిళగా, పారాలింపిక్స్‌లో స్కోర్ చేసిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర నృష్టించింది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి కెనడా జట్టుపై అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో సారా ఆడామ్ కీలక పాత్ర ΄ోషించింది. 2016లో సారా ఆడమ్‌కు మల్టీపుల్ స్లె్కరోసిస్గా నిర్దారణ అయింది. ‘క్రీడారంగంలో ఉన్న మహిళలకు నిజంగా ఇది ఉత్తేజకరమైన కాలం. అభిమానులు ఆటలో మేము చూపించే నైపుణ్యాలను ప్రశంసించడమే కాదు మా నేపథ్యాలు, మేము పడిన కష్టాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలిట్ అథ్లెట్‌గా ఎదగడానికి బాగా కష్టపడ్డాను’ అని అంటుంది సారా. ఆటల్లోకి అడుగు పెట్టకముందు సారా ఆడమ్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్శిటీలో ఆక్యుపేషనల్ ప్రొఫెసర్. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం!
కొత్త సీజన్లో భారత మహిళా అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరోసారి మెరిసింది. జర్మనీలో జరిగిన కుర్ప్‌ఫాల్జ్ గాలా మీట్లో జ్యోతి ఒక స్వర్ణం, ఒక రజత పతకం నెగ్గింది.100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.06 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని గెలిచింది. 200 మీటర్ల ఫైనల్లో జ్యోతి 23.83 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. రెండు వారాల క్రితం నెదర్లాండ్స్‌లో జరిగిన హ్యారీ షులి్టంగ్ గేమ్స్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణంతో కొత్త సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఇవి చదవండి: IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు! -
పసిడి పారుల్ అన్ను బంగారం
చైనా గడ్డపై భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి అద్భుతం చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత్‌కు 5000 మీటర్ల విభాగంలో పారుల్... జావెలిన్ త్రోలో అన్ను రాణి పసిడి పతకాలు అందించారు. ఈ ఇద్దరితోపాటు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్యం... పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ కాంస్యం... పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజతం... పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ రజతం గెల్చుకున్నారు. అథ్లెటిక్స్ కాకుండా బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు... కనోయింగ్‌లో ఒక కాంస్యం లభించాయి. ఓవరాల్‌గా ఆసియా క్రీడల పదో రోజు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు చేరాయి. మరో ఐదు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ప్రస్తుతం భారత్ 69 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆర్చరీలో మూడు పతకాలు... బాక్సింగ్‌లో మరో పతకం... క్రికెట్లో ఒక పతకం కూడా ఖరారయ్యాయి. ఫలితంగా ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడం లాంఛనం కానుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. హాంగ్జౌ: బరిలోకి దిగితే పతకం సాధించాలనే లక్ష్యంతో తమ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో మెరిపిస్తున్నారు. నిలకడగా రాణిస్తూ... తమపై పెట్టుకున్న అంచనాలకు మించి ప్రతిభ కనబరుస్తూ... 1951 తర్వాత ఈ క్రీడల చరిత్రలో పతకాలపరంగా తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. పోటీల పదోరోజు భారత్‌కు తొమ్మిది పతకాలు రాగా... అందులో ఆరు అథ్లెటిక్స్ ఈవెంట్ల నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటికే 22 పతకాలు (4 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచారు. తద్వారా 2018లో 20 పతకాల ప్రదర్శనను సవరించారు. 1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యధికంగా 34 పతకాలు గెలిచారు. మంగళవారం భారత మహిళా అథ్లెట్లు పారుల్ చౌధరీ, అన్ను రాణి పసిడి కాంతులు విరజిమ్మారు. 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ విజేతగా అవతరించింది. ఆమె అందరికంటే వేగంగా 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో 5000 మీటర్లలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పారుల్ గుర్తింపు పొందింది. తాజా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. ఆమె 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం గెలిచింది. గతంలో మహిళల 5000 మీటర్ల విభాగంలో భారత్ తరఫున సునీతా రాణి (1998–రజతం; 2002–కాంస్యం), ఓపీ జైషా (2006–కాంస్యం), ప్రీజా శ్రీధరన్ (2010–రజతం), కవితా రౌత్ (2010–కాంస్యం) పతకాలు నెగ్గారు. తాజా స్వర్ణ పతకంతో ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో తనను డీఎస్పీగా నియమిస్తారని పారుల్ ఆశిస్తోంది. యూపీ ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన వారికి డీఎస్పీ ఉద్యోగం ఇస్తారు. మూడో ప్రయత్నంలో... వరుసగా మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ను రాణి కాంస్యం సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో ఆరో స్థానంతో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో 31 ఏళ్ల అన్ను రాణి ఏకంగా బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. 11 మంది పోటీపడ్డ ఫైనల్లో అన్ను రాణి జావెలిన్‌ను తన నాలుగో ప్రయత్నంలో గరిష్టంగా 62.92 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖరారు చేసుకుంది. నదీషా దిల్హాన్ (శ్రీలంక; 61.57 మీటర్లు) రజతం, హుయ్‌హుయ్ లియు (చైనా; 61.29 మీటర్లు) కాంస్యం గెలిచారు. ‘ఏడాది మొత్తం ఎంతో ప్రయత్నించినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయా. ప్రభుత్వం నాపై ఎంతో డబ్బు వెచి్చంచి విదేశాల్లో శిక్షణకు పంపించింది. ఫలితాలు రాకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యా. అయితే ఆసియా క్రీడల్లో ఈ సీజన్లోనే ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించడంతో చాలా ఆనందంగా ఉంది’ అని అన్ను రాణి వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రోలో గతంలో బార్బరా వెబ్‌స్టర్ (1951; కాంస్యం), ఎలిజబెత్ డావెన్‌పోర్ట్ (1958; రజతం... 1962; కాంస్యం), గుర్మిత్ కౌర్ (1998; కాంస్యం) పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకాన్ని సాధించింది. హీట్స్‌లో 55.42 సెకన్ల సమయం నమోదు చేసి పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసిన విత్యా ఫైనల్లో దానిని పునరావృతం చేయలేకపోయింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల విత్యా 55.68 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజత పతకం గెలిచాడు. తొలిసారి ఆసియా క్రీడల్లో పోటీపడ్డ ఈ కేరళ అథ్లెట్ ఒక నిమిషం 48.43 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ప్రవీణ్ 16.68 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. 49 ఏళ్ల తర్వాత... పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో 49 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించింది. ఢిల్లీకి చెందిన తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు. 2011 నుంచి భారతీందర్ సింగ్ (7658 పాయింట్లు) పేరిట ఉన్న డెకాథ్లాన్ జాతీయ రికార్డును తేజస్విన్ సవరించాడు. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో విజయ్ సింగ్ చౌహాన్ స్వర్ణం, సురేశ్ బాబు కాంస్యం గెలిచాక ఈ క్రీడల్లో మళ్లీ భారత్‌కు పతకం అందించిన డెకాథ్లెట్‌గా తేజస్విన్ గుర్తింపు పొందాడు. -
Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి
‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ హాస్టల్లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్ గేమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది. అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన. ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా స్పోర్ట్స్ స్కూల్ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్ స్కూల్లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు. ఆసియా గేమ్స్ ఆశాకిరణాలు మన దేశం నుంచి ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్ గేమ్స్‌లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్ రన్లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆసియా గేమ్స్ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య. పి.టి. ఉషతో సమానంగా విత్య రామరాజ్ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్‌లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్‌గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్‌లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్‌లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య. ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి. -
ప్రపంచ రికార్డు: 50 ఏళ్ల వయసు, 500 రోజులు ఒక్కత్తే.. గుహలో...
స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రస్ ఒక ఆరోగ్య ప్రయోగంలో భాగంగా 500 రోజులు గుహలో ఒక్కత్తే గడిపి మొన్న (శుక్రవారం) బయటకు వచ్చింది. బయట నుంచి మాత్రమే నిపుణుల పర్యవేక్షణ ఉన్నా 260 అడుగుల లోతు గుహలో అదరక బెదరక జీవించింది. ఎక్కువ రోజులు గుహలో ఒంటరిగా జీవించిన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న బీట్రస్ కథా కమామీషు... ‘లోపలకు వెళ్లాక రెండు నెలల వరకూ లెక్క బెట్టాను. ఆ తర్వాత రోజుల్ని లెక్క బెట్టుకోవడం మానేశాను. సహాయక బృందం లోపలికి వచ్చి నన్ను బయటకు తెచ్చే వరకు ఏ 160 రోజులో ఉన్నాననుకున్నాను. కాని 500 రోజులు ఉన్నాను. కాలం ఇట్టే గడిచిపోయింది’ అంది బీట్రస్ ఫ్లెమినీ. తన 48వ ఏట నవంబర్ 21, 2021 తేదీన స్పెయిన్‌లోని గ్రనాడా పట్టణం సమీపంలో ఉన్న ఒక గుహలోకి బీట్రస్ అడుగుపెట్టింది. మళ్లీ 50వ ఏట ఏప్రిల్ 14, 2023న బయటకు వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం గుహలో ఒక్కత్తే గడిపింది. ‘ఈ కాలంలో బయట ఏం జరిగిందో నాకు తెలియదు’ అందామె. గ్రనడా యూనివర్సిటీ, అల్మేరియా యూనివర్సిటీలోని శాస్త్ర నిపుణులు గుహలలో, పర్వతారోహణలో ఒక్కరిగా చిక్కుకుపోయినప్పుడు మనిషి ‘సర్కేడియన్ రిథమ్’ (వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీర, మానసిక స్థితుల్లో 24 గంటల్లో వచ్చే మార్పు) అధ్యయనం చేయడానికి బీట్రస్ను గుహలోకి పంపారు. క్యాలెండర్, గడియారం ఏమీ ఇవ్వలేదు. 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీరు, స్టవ్, ఆమె కదలికలను బయటి నుంచి గమనించడానికి సెన్సర్స్‌ను తీసుకొని ఆమె లోపలికి వెళ్లింది. ‘నేను నాతో మాట్లాడుకుంటూ గడిపాను, వ్యాయామం, టోపీలు అల్లడం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం... వీటితో టైమ్ సరిపోయింది. ఒక్కోసారి భ్రాంతి కలిగేది’ అని తెలిపింది. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్‌ను శాస్త్రజ్ఞులు ఇప్పుడు క్రోడీకరించే పనిలో పడ్డారు. Athlete Beatriz Flamini spent almost two years alone in an underground cave. And she makes it sound pretty relaxing... Follow us on Gab: https://t.co/IuhLFQBQPc pic.twitter.com/e7nlKR9Kyc — RT (@RT_com) April 15, 2023 -
‘కేసు వాపస్ తీసుకుంటే నెలకి రూ.1 కోటి ’.. మహిళా కోచ్ సంచలన ఆరోపణ
చండీగఢ్: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్ సింగ్‌కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. ‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్ సింగ్) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్ తెలిపినట్లు ఏఎన్ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా!
హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జూనియర్ మహిళా అథ్లెటిక్స్ కోచ్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో సందీప్‌సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తన ఇమేజ్ను చెడగొట్టేందుకే కొందరు చేస్తోన్న ప్రయత్నమని రాజీనామా చేసిన అనంతరం సందీప్‌సింగ్ అన్నారు. సందీప్‌సింగ్ మాట్లాడుతూ.. "నా ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందని నాకు సృష్టంగా తెలుసు. నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. విచారణ నివేదిక వచ్చే వరకు ముఖ్యమంత్రికి క్రీడా శాఖ బాధ్యతలు అప్పగిస్తాను" అని అతను పేర్కొన్నాడు. ఏం జరిగిందంటే? గురువారం(డిసెంబర్ 29) ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడామంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా కోచ్ ఆరోపణలు చేసింది. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్ 30) చండీగఢ్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సెక్షన్లు 354, 354A, 354B, 342, 506 కింద క్రీడా మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మంత్రి ఖండించారు. అయినప్పటికీ ప్రతిపక్షాల తీవ్ర ఒత్తడి చేయడంతో మంత్రి తన పదవికి విడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. కాగా సందీప్‌సింగ్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే? -
మహిళా అథ్లెట్ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు
హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ జూనియర్ మహిళా అథ్లెటిక్స్ కోచ్ ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మంత్రి సందీప్ సింగ్ తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే క్రీడాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్ఎల్డి డిమాండ్ చేసింది. విషయంలోకి వెళితే.. తనను క్రీడామంత్రి సందీప్ సింగ్ లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించారు. తాను స్పందించకపోవడంతో తనకు రావాల్సిన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ ను పెండింగ్ లో ఉంచాడని... దీంతో ఆయనను తాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశానని చెప్పారు. ఆ సందర్భంగా తనతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. మరోవైపు దీనిపై మంత్రి సందీప్ సింగ్ స్పందిస్తూ... ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని ఖండించారు. చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
నిరాశపర్చిన అన్నూ రాణి.. ఆశలన్నీ గోల్డెన్ బాయ్‌పైనే..!
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ బోణీ కొట్టేందుకు ఇంకా నిరీక్షించాల్సి ఉంది. ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన మహిళా జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి తాజాగా జరిగిన ఫైనల్స్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు ప్రయత్నాల్లో భాగంగా అన్నూ ఒకేసారి 60 మీటర్లకు పైగా (61.12) బళ్లాన్ని (జావెలిన్) విసరగలిగింది. తొలి ప్రయత్నంలో 56.18 మీటర్ల దూరాన్ని విసిరిన అన్నూ.. ఆతర్వాత నాలుగు ప్రయత్నాల్లో 61.12, 58.14, 59.98, 58.70 మీటర్ల దూరం మాత్రమే బళ్లాన్ని విసిరి నిరాశపర్చింది. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని మెగా ఈవెంట్ నుంచి రిక్త హస్తాలతో నిష్క్రమించింది. ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కెల్సీ లీ బార్బర్ (ఆస్ట్రేలియా) మరోసారి సత్తా చాటి (66.91 మీ) స్వర్ణం కైవసం చేసుకోగా.. అమెరికాకు చెందిన కారా వింగర్ (64.05) రజతం, జపాన్ త్రోయర్ హరుకా కిటగుచి (63.27) కాంస్య పతకాలు సాధించారు. ఇదిలా ఉంటే, ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో అన్నూ రాణి పోరాటం ముగియడంతో భారత్ ఆశలన్నీ టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 88.39 మీటర్ల దూరం విసిరి తుది పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నీరజ్‌తో పాటు మరో భారత క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా 11వ స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్స్ జరుగుతాయి. చదవండి: World Athletics Championship: పతకంపై ఆశలు! -
పెద్దల సభకు పరుగుల రాణి
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc— Narendra Modi (@narendramodi) July 6, 2022 కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉష పేరును ఎగువసభకు ప్రతిపాదించారు. ఉష ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని మోదీ స్వయంగా ట్వీటర్ వేదికగా శుభాకంక్షలు తెలిపారు. ఉష (కేరళ) సహా తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. -
మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మహిళా అథ్లెట్
భువనేశ్వర్‌లోని (ఒడిశా) స్పోర్ట్స్ హాస్టల్లో సీనియర్ల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని రుచిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత స్టార్ మహిళా స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్, స్పోర్ట్స్ హాస్టల్ మాజీ విద్యార్ధిని ద్యుతీ చంద్ స్పందించింది. స్పోర్ట్స్ హాస్టల్లో తాను ర్యాగింగ్ బాధితురాలినే సంచలన విషయాలను వెల్లడించింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, బాడీ మసాజ్ చేయమని బెదిరించేవారని ఆరోపించింది. వారు చెప్పిన విధంగా చేయకపోతే టార్చర్ పెట్టేవారని వాపోయింది. రుచిక లాగే తాను కూడా హాస్టల్లో దుర్భర అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. స్పోర్ట్స్ హాస్టల్లో గడిపిన రెండేళ్లు నిద్రలేని రాత్రులు గడిపానని, తన బాధను హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయేదని, సీనియర్లపై కంప్లైంట్ చేసినందుకు అధికారులు తననే రివర్స్‌లో తిట్టేవాళ్లని గత అనుభవాలను గుర్తు చేసుకుంది. హాస్టల్ అధికారులు తన పేదరికాన్ని చూసి హేళన చేసే వారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అవమానించేవారని సోషల్‌మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. క్రీడాకారులు ఇలాంటి ఘటనల వల్ల చాలా డిస్టర్బ్ అవుతారని, తాను కూడా హాస్టల్లో గడిపిన రోజుల్లో మానసికంగా కృంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. చదవండి: గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్ -
రజతం నెగ్గిన జ్యోతి యర్రాజీ
ఆంధ్రప్రదేశ్ మహిళా అథ్లెట్ జ్యోతి యర్రాజీ బెల్జియంలో జరిగిన ఐఫామ్ ఈఏ పర్మిట్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో రజత పతకం సాధించింది. వైజాగ్‌కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.19 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. జో సెడ్నీ (నెదర్లాండ్స్; 13.18 సెకన్లు) స్వర్ణం, జెన్నా బ్లన్‌డెల్ (బ్రిటన్; 13.30 సెకన్లు) కాంస్యం సాధించారు. హీట్స్‌లో జ్యోతి 13.26 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. -
కాంస్య పతకం సాధించిన జ్యోతిక శ్రీ
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండి జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. కాలికట్లో జరుగుతున్న ఈ మీట్లో జ్యోతిక శ్రీ 53.90 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. కోచ్ నాగపురి రమేశ్ వద్ద జ్యోతిక శ్రీ శిక్షణ తీసుకుంటోంది. -
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
చెన్నై: శిక్షణ ఇవ్వాల్సిన ఓ కోచ్ కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ పి. నాగరాజన్‌పై ఓ జాతీయ స్థాయి మహిళా అథ్లెట్(19) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ ఏడాది మే నెలలో ఫిర్యాదు చేసింది. మసాజ్ పేరుతో కోచ్ తనను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా కోచ్‌కు ఎదురు చెప్పలేకపోయానని, చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని పేర్కొంది. ఈ కేసులో నాగరాజన్‌ను విచారించిన పోలీసులు అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఛార్జిషీట్ ఓపెన్ చేశారు. కాగా, ఈ ఉదంతం వెలుగు చూసాక మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఫిర్యాదు చేసిన వారిలో కొందరు గతంలో నాగరాజన్ వద్ద శిక్షణ తీసుకున్న వారు కాగా, మరికొందరు ప్రస్తుతం జూనియర్లుగా శిక్షణ పొందుతున్నవారున్నారు. వీరందరూ కామ కోచ్ ఆకృత్యాలను ఒక్కొకటిగా బయటపెట్టడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. ఎంతో మంది అథ్లెట్లను జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన నాగరాజన్.. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాగరాజన్ వెదవ వేశాలపై మరికొందరు ట్విటర్ ద్వారా తమను సంప్రదించారని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం -
Tokyo Paralympics 2021: భారత్‌కు తొలి పతకం ఖరారు
గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్‌లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్‌గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్‌తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్‌లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది. టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్‌వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది. నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. పోలియో బారిన పడి... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. సకీనాకు ఐదో స్థానం పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్‌లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. షాట్‌పుట్‌లో నిరాశ పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్‌పుట్ ఈవెంట్లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్‌కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. శుభారంభం.... ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్: భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్: శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్‌మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్: రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి) పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్‌లో అథ్లెట్ దీపా మలిక్ షాట్‌పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది. -
Afghanistan: ఆశలు ఆవిరి.. వారి 'ఖేల్' ఖతం..
కాబూల్: ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మెజారిటీ జనాభా దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, దేశంలోని మహిళల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మహిళా క్రీడాకారిణులు తమ క్రీడా భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకున్నారు. అఫ్గాన్ కరాటే ఛాంపియన్ అయిన మీనా అసది సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతుంది. తాలిబన్ల రాజ్యంలో మహిళా అథ్లెట్ల ఆశలు నీరుగారిపోయినట్టేనని, ఇక వారు ఇళ్లకు పరిమితమైతే కనీసం ప్రాణాలైనా దక్కించుకోగలరని పేర్కొంది. అఫ్గాన్‌లో మహిళల పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా మారబోతుందని, ఇది తలచుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కాగా, ప్రస్తుతం మీనా అసది జకార్తాలోని సిసారువా పట్టణంలో శరణార్ధిగా తలదాచుకుంటుంది. అక్కడే తోటి శరణార్థులకు ఆమె కరాటేలో శిక్షణ ఇస్తోంది. 12 ఏళ్ల వయసులోనే అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టిన మీనా పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ కరాటేలో శిక్షణ పొంది, అనంతరం 2010 దక్షిణాసియా క్రీడల్లో అఫ్గనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. చదవండి: పాకిస్తాన్‌తో సిరీస్ అంటే వణికిపోతున్న కివీస్ ఆటగాళ్లు! ఆ తర్వాతి ఏడాదే కాబూల్ తిరిగి వచ్చి ఫైట్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన ఆమె.. దేశంలో హింస చెలరేగడంతో రెండోసారి దేశాన్ని వీడింది. భర్త, ఏడాది వయసున్న కుమార్తెతో ఇండోనేషియాకు వెళ్లిపోయింది. దేశాన్ని తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్లు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధికి అర్థం లేకుండా పోయిందని 28 ఏళ్ల మీనా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, 2012లో దక్షిణాసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మీనా రెండు రజత పతకాలు గెలుచుకుంది. ఆ క్రీడల్లో ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కింది. ఇదిలా ఉంటే, పారాలింపిక్స్‌లో(టోక్యో 2021) పాల్గొన్న తొలి అఫ్గాన్ మహిళగా రికార్డుల్లోకెక్కాల్సిన తైక్వాండో అథ్లెట్ జకియా ఖుదాదాడి ఆశలను కూడా తాలిబన్లు చిదిమేశారు. ఇప్పుడామె దేశం విడిచి వెళ్లలేక ఇంటికే పరిమితమైంది. ఆమె ఒక్కరే కాదు.. ఇలా ఎంతోమంది అఫ్గాన్ మహిళా అథ్లెట్ల బంగారు భవిష్యత్తుకు తాలిబన్లు చరమగీతం పాడనున్నారని అఫ్గాన్ మీడియా గోడు వెల్లబుచ్చుకుంటుంది. చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. -
పుల్లెల గోపిచంద్ అకాడమీతో పనిచేయనున్న కోటక్ బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందం సిద్ధమవుతుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎమ్‌బిఎల్), పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (గోపిచంద్ అకాడమీ) సంయుక్తంగా ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఒలంపిక్స్‌లో పాల్గొనే మహిళా అథ్లెట్లలో స్పూర్తిని నింపడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యం. భారత అత్యుత్తమ మహిళా అథ్లెట్లకు, వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని కలలు కనే యువతులందరికీ ‘గర్ల్ పవర్ గోల్డ్ పవర్’ క్యాంపెయిన్ ప్రత్యేక సందేశాన్ని అందిస్తోంది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్-2010లో గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప, సౌత్ ఏసియన్ గేమ్స్-2016లో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సిక్కిరెడ్డి ప్రచార వీడియోలో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఒక నిమిషంపాటు ఉన్న ఈ వీడియోలో.. తమ కలలను అనుసరించే యువతులను గౌరవించడంతోపాటు, వారి కలలను నిజం చేయడానికి కృషి చేసిన వ్యక్తులను గౌరవిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ జాయింట్ ప్రెసిడెంట్ & గ్రూప్ చీఫ్ సిఎస్ఆర్ ఆఫీసర్ రోహిత్ రావు మాట్లాడుతూ... కోటక్ మహీంద్రా బ్యాంక్ సామాజిక బాధ్యతగా భావించి కోటక్ కర్మను ప్రకటించాము. కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద కోటక్ మహీంద్రా బ్యాంక్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది. ఆధునాతన మౌలిక సదుపాయాలను, ఆత్యాధునిక బాడ్మింటన్ శిక్షణా సదుపాయాలను కోటక్ కర్మ అభివృద్ది చేసింది. క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలను కల్పిండంతో భారత్‌ను క్రీడా రంగంతో గర్వించదగిన దేశంగా చూడవచ్చునని పేర్కొన్నారు. -
మెరుపు రత్నాలు
స్వర్ణం సాధించడం గొప్ప. రజతమూ తక్కువేం కాదు. కాంస్యం కూడా విలువైనదే. గెలుపు పతకాలు ఇవన్నీ. ఖేల్ రత్న.. అర్జున.. ఈ గెలుపు పతకాలకు తళుకులు. ఆ తళుకులకే మెరుపులు.. మహిళా క్రీడామణులు!! మహిళకు చిన్న గుర్తింపు రావడమే పెద్ద అవార్డు! ఇక పెద్ద అవార్డు వచ్చిందంటే అది దేశానికే గుర్తింపు. మహిళల నైపుణ్యాల సహాయం తీసుకున్న దేశం ముందుకు వెళుతుంది. మహిళల ప్రావీణ్యాలకు స్థానం కల్పించిన దేశం నాగరికం అవుతుంది. మహిళల ప్రతిభకు పట్టం కట్టిన దేశం ప్రపంచానికే దీటైన పోటీ, వెలుగు దివిటీ అవుతుంది. క్రీడారంగం అనే కాదు, ఏ రంగమైనా దేశానికి మహిళలు ఇచ్చే గుర్తింపు ఇది. అవును. దేశం మహిళలకు ఇవ్వడం కాదు, మహిళలు దేశానికి ఇవ్వడం. ఈ ఏడాది భారతీయ క్రీడారంగంలో వినేష్ ఫొగాట్, రాణీ రాంఫాల్, మణికా బాత్రా, మరో పదకొండు మంది మహిళలు దేశానికి గుర్తింపు ఇచ్చేవారి జాబితాలో ఉన్నారు. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాలైన ‘ఖేల్ రత్న’, ‘అర్జున’ అవార్డుల జాబితా అది. వినేశ్ ఫొగాట్, రాణి రాంఫాల్, మణికా బాత్రా ‘ఖేల్ రత్న’ పరిశీలనలో ఉన్నారు. దీపికా ఠాకూర్, సాక్షి మాలిక్, మీరాబాయ్, ద్యుతీచంద్, దివ్య కర్కాన్, లవ్లీనా, మనూ బకర్, దీప్తి శర్మ, మధురిక, అదితి అశోక్, సారిక ‘అర్జున’ బరిలో ఉన్నారు. మరో క్రీడా అవార్డు ‘ధ్యాన్‌చంద్’కు.. విశాఖపట్నం బాక్సర్ నగిశెట్టి ఉషకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అవార్డు విజేతల పేర్లను వర్చువల్‌గా (ఆన్లైన్ కార్యక్రమం) ప్రకటిస్తారు. ఖేల్ రత్న వడపోతలో మిగిలిన ముగ్గురు మహిళలూ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవారే. వినేష్ ఫొగాట్ రెజ్లర్. 2018 కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ ఈవెంట్లలో స్వర్ణపతకాలు సాధించారు. 2019 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం సంపాదించారు. హర్యానాలోని కుస్తీ యోధుల కుటుంబం నుంచి వచ్చారు వినేశ్. ఈ ఆగస్టు 25కి ఆమెకు ఇరవై ఆరేళ్లు నిండుతాయి. బహుశా ఖేల్ రత్న ఈసారి వినేశ్ పుట్టినరోజు కానుక అవుతుంది. ‘ఫ్రీ స్టెయిల్’లో ఒడుపు ఆమె ప్రత్యేకత. రాణీ రాంఫాల్ మహిళా హాకీ టీమ్ కెప్టెన్. ఖేల్ రత్న అవార్డు పరిశీలనకు ఎంపికైన మూడో హాకీ ప్లేయర్, తొలి మహిళా హాకీ ప్లేయర్ రాంఫాల్. ఆమె నేతృత్వంలోనే 2017 ‘ఉమెన్స్ ఏషియా కప్’లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. 2018 ఏషియన్ గేమ్స్‌లో రాంఫాల్ టీమ్ రజత పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా అర్హత సాధించడానికి అవసరమైన 2019 క్వాలిఫయర్స్ గేమ్‌లో టీమ్ కొట్టిన గేమ్–ఛేంజింగ్ గోల్ ఆమెను ఖేల్ రత్న కమిటీ దృష్టిలో పడేలా చేసి ఉండొచ్చు. రాణీ రాంఫాల్ కూడా హర్యానా అమ్మాయే. వినేశ్ ఫొగాట్ కన్నా నాలుగు నెలలు చిన్న. పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి లాగుడు బండితో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. రాణి ఆరేళ్ల వయసులోనే హాకీ అకాడమీలో చేరారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్దేవ్ సింగ్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. ఖేల్ రత్నకు కమిటీ పరిశీలనలో ఉన్న మరో మహిళ మణికా బాత్రా టేబుల్ టెన్నిస్ ప్లేయర్. 2018 కామన్వెల్త్, ఏషియన్ గేమ్‌లలో సింగిల్స్‌లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. 2019 జనవరి నాటికి మణిక టాప్ ర్యాంక్ మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రపంచంలో 47 ర్యాంకర్. (జనవరి 1–డిసెంబర్ 31 మధ్య క్రీడాకారులు సాధించిన విజయాలను అవార్డులకు పరిగణనలోకి తీసుకుంటారు). మణిక న్యూఢిల్లీ అమ్మాయి. వినేశ్, రాంపాల్‌ల కన్నా వయసులో ఏడాది చిన్న. ‘షేక్‌హ్యాండ్ గ్రిప్’ ప్లేయింగ్ స్టయిల్లో నిష్ణాతురాలు. అది యూరోపియన్ స్టెయిల్. రాకెట్ హ్యాండిల్‌ని బిగించి పట్టుకుని ఉన్నప్పుడు ఆ పొజిషన్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోతున్నట్లుగా ఉంటుంది. పవర్‌ని, స్పిన్ని ఈ రకం గ్రిప్‌తో కావలసిన విధంగా నియంత్రించవచ్చు. పెన్హోల్డ్ గ్రిప్, వి–గ్రిప్, సీమిల్లర్ గ్రిప్ అనేవి కూడా ఉంటాయి. ఆ గ్రిప్‌లు కొట్టే బంతుల్ని షేక్‌హ్యాండ్ గ్రిప్‌తో ఎదుర్కోడానికి ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మణిక అందులో చెయ్యి తిరిగిన ప్లేయర్. ఇక ‘అర్జున’ అవార్డు పరిశీలనకు ఎంపికైన పదకొండుమంది మహిళలు కూడా మణికలా తమ ఆటల్లో ఏదో ఒక ప్రత్యేకమైన ‘గ్రిప్’ ఉన్నవారే. రాష్టపతి భవన్లో ప్రదానం చేసే అవార్డును ఆ ఉద్వేగంలో, ఆనందంలో.. పొదవి పట్టుకోడానికి ఎలాగూ ఆ గ్రిప్ ఉపయోగపడుతుంది. అయితే కరోనా వల్ల ఈసారి విజేతలు ఎక్కడి వాళ్లు అక్కడి నుంచే ఆన్లైన్లో అవార్డుల ప్రకటనను వినవలసి ఉంటుంది. చిన్న నిరాశే అయినా.. చరిత్రలో ఆ నిరాశ పక్కనే సాధించిన ఘనతా ఉండిపోతుంది. నగిశెట్టి ఉష (బాక్సర్) ‘ధ్యాన్‌చంద్’ క్రీడా అవార్డు బరిలో ఉన్న ఉష సీనియర్ బాక్సర్. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో రెండు రజత పతకాలు, ఒక స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉంది. ఆట నుంచి రిటైర్ అయ్యాక అనేక మహిళా బాక్సర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఉష ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వేలో (విశాఖ) పని చేస్తున్నారు. -
మహిళా అథ్లెట్లకు, హాకీ జట్టుకు మోడీ అభినందన
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, మహిళా అథ్లెట్లకు ప్రధాని నరేంద్రమోడీ అభినందన తెలిపారు. దేశ ప్రతిష్టను భారత క్రీడాకారులు మరింత పెంచారని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత దేశానికి స్పూర్తి నిచ్చిన రోజు అని వ్యాఖ్యానించారు. 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత మహిళా అథ్లెట్లు బంగారు పతకం సాధించడంపై మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. 16 ఏళ్ల తర్వాత భారత జట్టు బంగారు పతకం సాధించి.. 2016 లో రియోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత హాకీ జట్టు అర్హత సాధించింది.