గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్‌లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్‌గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్‌తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్‌లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది.
టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్‌కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్‌వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది.
నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది.
పోలియో బారిన పడి...
గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది.
ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది.
సకీనాకు ఐదో స్థానం
పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్‌లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు.
షాట్‌పుట్‌లో నిరాశ
పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్
ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్‌కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.
శుభారంభం....
ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు.
పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు.
పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్:
భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి.
ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్:
శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్‌మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి
అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్:
రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి)
పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్‌లో అథ్లెట్ దీపా మలిక్ షాట్‌పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment