కాబూల్: ఆఫ్గనిస్తాన్ మళ్లీ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లడంతో దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మెజారిటీ జనాభా దేశం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, దేశంలోని మహిళల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. మహిళా క్రీడాకారిణులు తమ క్రీడా భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకున్నారు. అఫ్గాన్ కరాటే ఛాంపియన్ అయిన మీనా అసది సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆవేదన చెందుతుంది. తాలిబన్ల రాజ్యంలో మహిళా అథ్లెట్ల ఆశలు నీరుగారిపోయినట్టేనని, ఇక వారు ఇళ్లకు పరిమితమైతే కనీసం ప్రాణాలైనా దక్కించుకోగలరని పేర్కొంది.
అఫ్గాన్‌లో మహిళల పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా మారబోతుందని, ఇది తలచుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కాగా, ప్రస్తుతం మీనా అసది జకార్తాలోని సిసారువా పట్టణంలో శరణార్ధిగా తలదాచుకుంటుంది. అక్కడే తోటి శరణార్థులకు ఆమె కరాటేలో శిక్షణ ఇస్తోంది. 12 ఏళ్ల వయసులోనే అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టిన మీనా పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ కరాటేలో శిక్షణ పొంది, అనంతరం 2010 దక్షిణాసియా క్రీడల్లో అఫ్గనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించింది.
చదవండి: పాకిస్తాన్‌తో సిరీస్ అంటే వణికిపోతున్న కివీస్ ఆటగాళ్లు!
ఆ తర్వాతి ఏడాదే కాబూల్ తిరిగి వచ్చి ఫైట్ క్లబ్‌ను ఏర్పాటు చేసిన ఆమె.. దేశంలో హింస చెలరేగడంతో రెండోసారి దేశాన్ని వీడింది. భర్త, ఏడాది వయసున్న కుమార్తెతో ఇండోనేషియాకు వెళ్లిపోయింది. దేశాన్ని తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతో అఫ్గాన్లు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధికి అర్థం లేకుండా పోయిందని 28 ఏళ్ల మీనా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, 2012లో దక్షిణాసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మీనా రెండు రజత పతకాలు గెలుచుకుంది. ఆ క్రీడల్లో ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కింది.
ఇదిలా ఉంటే, పారాలింపిక్స్‌లో(టోక్యో 2021) పాల్గొన్న తొలి అఫ్గాన్ మహిళగా రికార్డుల్లోకెక్కాల్సిన తైక్వాండో అథ్లెట్ జకియా ఖుదాదాడి ఆశలను కూడా తాలిబన్లు చిదిమేశారు. ఇప్పుడామె దేశం విడిచి వెళ్లలేక ఇంటికే పరిమితమైంది. ఆమె ఒక్కరే కాదు.. ఇలా ఎంతోమంది అఫ్గాన్ మహిళా అథ్లెట్ల బంగారు భవిష్యత్తుకు తాలిబన్లు చరమగీతం పాడనున్నారని అఫ్గాన్ మీడియా గోడు వెల్లబుచ్చుకుంటుంది.
చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
Comments
Please login to add a commentAdd a comment