తాలిబన్లతో చర్చలే పరిష్కారం
హక్కుల కార్యకర్త మెహబూబా
2021 ఆగస్టు 15. భారత్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ. అఫ్గానిస్తాన్‌లో మాత్రం ప్రజాస్వామ్యం కుప్పకూలింది. దేశం మరోసారి తాలిబన్ల హస్తగతమైంది. వారి మూడేళ్ల అరాచక పాలనలో అత్యంత భారీ మూల్యం చెల్లించుకున్నది, ఇంకా చెల్లించుకుంటున్నదీ మహిళలే. అడుగడుగునా ఆంక్షల నడుమ సర్వ హక్కులూ కోల్పోయారు. ఇదిలాగే కొనసాగితే దేశ ఉనికికే ప్రమాదమంటున్నారు అఫ్గాన్ హక్కుల కార్యకర్త మహబూబా సిరాజ్. పరిస్థితిని మెరుగు పరిచేందుకు అంతర్జాతీయ సమాజం తాలిబన్లతో చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే...
మళ్లీ అవే అణచివేతలు...
1996 నుంచి 2001 దాకా తాలిబన్లు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు అఫ్గాన్‌లో అత్యంత అరాచకం తాండవించింది. మహిళలపై అత్యంత కఠినమైన ఆంక్షలు! విద్య, ఉపాధి అవకాశాల్లేవు. ఒంటరిగా గడప దాటొద్దు. ముఖం పూర్తిగా కప్పుకోకున్నా కొరడా దెబ్బలు, బహిరంగ ఉరి శిక్షలు! తాలిబన్ల పునరాగమనంతో ఆఫ్గాన్ మహిళల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఆంక్షలు ఇంకా పెరిగాయి. ఇస్లాంలో, అల్లా దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. దాన్ని తోసిరాజని మహిళలను ఇలా అణచివేయడం ఏం ధర్మమో అర్థం కాదు!
చర్చలే పరిష్కారం..
ఈ అరాచకం ఇలాగే కొనసాగితే అఫ్గాన్ ఉనికే ప్రమాదంలో పడుతుంది. తాలిబన్లతో చర్చించాలన్నందుకు నన్ను వారి లాబీయిస్టునంటూ విమర్శిస్తున్నారు. ఎవరితో సమస్యో వాళ్లతో కనీసం మాట్లాడకపోతే పరిష్కారం ఎలా సాధ్యం? మా ముందున్నవి రెండే మార్గాలు. పరస్పరం చంపుకోవడం ఒకటైతే, కూర్చుని చర్చించుకోవడం రెండోది. పోరే శరణ్యమంటే అకారణంగా చచ్చిపోతాం. అందుకే చర్చలంటున్నాను. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేను దేశంలో లేను. ఈసారి ఎందుకుంటున్నానని ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి మహిళలకు నా అవసరముంది. మాకిప్పుడు ప్రపంచంలోని ప్రతి మహిళ మద్దతూ అవసరం. అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి మాకు సాయపడాలి.
భవిష్యత్తుపై ఆశ..
శరణార్థులు, వలసదారులు యూరప్‌ను రంగులమయం చేస్తున్నారు. అయినా ముస్లింలంటే పాశ్చాత్య దేశాలకు భయమెందుకో అర్థం కాదు. ఒకనాటి అఫ్గానిస్తాన్ విభిన్న జాతులు, సంప్రదాయాలతో కూడిన అందమైన కళాఖండం. ఆ పాత అఫ్గాన్ తిరిగి రావాలంటే దేశం వీడిన వాళ్లంతా తిరిగి రావాలి.
రాచరిక నేపథ్యం...
75 ఏళ్ల మెహబూబా సిరాజ్ రాజ కుటుంబీకురాలు. 1880 నుంచి 1901 దాకా అఫ్గాన్‌ను పాలించిన అబ్దుర్ రెహా్మన్ ఖాన్ వంశీకురాలు. హజారా తెగ ఊచకోత రెహ్మాన్ హయాంలో జరిగిందే. నియంతృత్వ పాలనతో కర్కోటకునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తనపై తాలిబన్ల కీలుబోమ్మ అన్న ఆరోపణలకు ఆ వారసత్వమే కారణమని వాపోతారామె. ఆమె 26 ఏళ్ల పాటు అమెరికాలో గడిపి 2003లో అఫ్గాన్ తిరిగి వెళ్లారు. దేశంలో మహిళలు, బాలికల హక్కుల కోసం కృషి చేస్తున్నారు. అఫ్గాన్ విమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ వంటివి నిర్వహిస్తున్నారు. గృహ హింసకు గురవుతున్న మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇటీవలే ఫిన్లండ్ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment