
ఆఫ్ఘనిస్తాన్ మహిళల క్రికెట్‌లో (Afghanistan Women's Cricket Team) నవశకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు తమ దేశంలో రాజ్యమేలుతున్న ఆటవిక తాలిబన్ల (Taliban) పాలనను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగారు. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానంలో (Melbourne Cricket Ground) క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవెన్‌తో ఇవాళ (జనవరి 30) ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడారు. మహిళల యాషెస్ (ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్) టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ వితౌట్ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం కలిసి ఈ మ్యాచ్‌ను నిర్వహించాయి.
2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు, అప్పటి నుంచి అక్కడి మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దీంతో ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం చొరవతో ఒక్కొక్కరుగా విడిపోయిన ఆఫ్ఘన్ క్రికెటర్లు మూడేళ్ల తర్వాత జట్టుగా కూడి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.
చాలాకాలం తర్వాత జట్టుగా బరిలోకి దిగడంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాకందరికీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడాం. ఇప్పుడు అందరం కలిసి ఒక్కటయ్యాం అని ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ భావోద్వేగ ప్రకటన చేసింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అనేక అంక్షలు అమల్లో పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి మహిళలు ఉన్నత చదువులు చదువకోవడానికి వీల్లేదు. స్వేచ్ఛగా బయట తిరగకూడదు. ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదు.