మహిళలు బహిరంగంగా మాట్లాడొద్దు!
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల కొత్త నిబంధనలు
ముఖం ఏమాత్రం కని్పంచడానికి వీల్లేదు
అమ్మాయిలు ఇప్పటికే చదువుకు దూరం
"నానాటికీ మా మహిళలపై నిర్బంధాలు మితిమీరుతున్నాయి. దీనికంటే గృహనిర్బంధమే ఎన్నో రెట్లు మేలు’’ – మర్జాన్, 23 ఏళ్ల మహిళా జర్నలిస్టు
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్
అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్‌లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్‌ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.
‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు!
కొత్త ఆంక్షలు ఇలా...
– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు.
– బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు.
– మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు.
– రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు.
– బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.
– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది.
– కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు.
– మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు.
– వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు.
– పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి.
– అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి.
– మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.
శిక్షలు ఇలా...
– నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు...
– తొలుత హెచ్చరికల జారీ.
– అనంతరం ఆస్తుల జప్తు.
– మూడు రోజులదాకా నిర్బంధం.
– అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు.
– నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు...
– బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి.
– మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.
– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు.
Comments
Please login to add a commentAdd a comment