
కాందహార్: అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం మొదలైంది. టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ అయ్యాయి. అలాగే, తాలిబన్లు సంగీతంపై కూడా తమ వ్యతిరేకతను చాటుకున్నారు. సంగీత ప్రసారాలను నిలిపివేయాలంటూ టీవీ, రేడియో మాధ్యమాలకు హుకుం జారీ చేశారు. 1996-2001 మధ్య కాలంలో కూడా తాలిబన్లు ఇదే తరహాలో సంగీతంపై ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్‌ను అప్పట్లో వారు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే, అఫ్గాన్ రేడియో స్టేషన్లలో ఇస్లామిక్ సంగీతం మాత్రం నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం.
కాగా, ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని చెప్పిన తాలిబన్లు.. రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. వారి మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో మహిళలు తమ రోజువారీ కార్యకలాపాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లోని మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
చదవండి: Viral Video : సముద్ర తీరంలో అద్భుతం!
Comments
Please login to add a commentAdd a comment