
సాక్షి, హైదరాబాద్: జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు స్వర్ణ పతకం లభించింది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి, అంతర్జాతీయ పారాథ్లెట్ జివాంజి దీప్తి 400 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. దీప్తి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 57.82 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
హర్యానాకు చెందిన పూజా 1:08.21 సెకెన్లలో గమ్యాన్ని చేరుకుని రజతం సొంతం చేసుకోగా.. హర్యానాకే చెందిన భువి అగర్వాల్ కాంస్యం దక్కించుకుంది. ఇటీవల ‘అర్జున అవార్డు’ పొందిన దీప్తి గచ్చిబౌలి స్టేడియంలో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.
మూడు పతకాలు
తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన కొర్ర అఖిల, నేనావత్ విజయలక్ష్మి... హైదరాబాద్ అథ్లెట్ ఇస్లావత్ నితిన్ నాయక్ మెరిశారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో బుధవారం జరిగిన ఈ మీట్‌లో నితిన్ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.
అఖిల జావెలిన్ త్రోలో పసిడి పతకం, డిస్కస్ త్రోలో రజత పతకం... విజయలక్ష్మి 400 మీటర్ల విభాగంలో స్వర్ణం, జావెలిన్ త్రోలో రజత పతకం గెలిచారు. ఈ ముగ్గురు హయత్‌నగర్‌లోని అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్‌లో కోచ్ నేనావత్ వినోద్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు ఐదో విజయం
జైపూర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. 10 మ్యాచ్‌ల తర్వాత రాజస్తాన్ జట్టుకిది తొలి ఓటమి కావడం గమనార్హం.
శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలియన్ (43వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మైకోల్ కబ్రెరా (75వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఈనెల 25న జరిగే తదుపరి మ్యాచ్‌లో డెంపో స్పోర్ట్స్ క్లబ్‌తో శ్రీనిధి జట్టు తలపడుతుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో 15 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment