
Russian and Belarus Athletes Banned From Winter Paralympics: ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్ క్రీడా జగత్తు కన్నెర్ర చేస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA బ్యాన్ విధించగా.. తాజాగా వింటర్ పారాలింపిక్ కమిటీ కత్తి దూసింది. 2022 వింటర్ పారాలింపిక్స్‌లో రష్యాతో పాటు బెలారస్ అథ్లెట్లు పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు.
రాజకీయాలతో క్రీడలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, అనివార్య కారణాల వల్ల రష్యా, బెలారస్ పారా అథ్లెట్లను బహిష్కరించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు, ముఖ్యంగా పుతిన్ అహంకారానికి పారా అథ్లెట్లు బలైపోయారని వాపోయారు. కాగా, రేపటి (మార్చి 4) నుంచి బీజింగ్‌లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది పారా అథ్లెట్లు పాల్గొనాల్సి ఉండింది.
చదవండి: రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు