అట్టహాసంగా ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడలు
పారిస్: వైకల్యాన్ని జయించి పతకాల భరతం పట్టిన పారా అథ్లెట్లు ఈ విశ్వక్రీడలను చిరస్మరణీయం చేసుకున్నారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌లా సాగిన పారాలింపిక్స్‌కు ఆదివారం అర్ధరాత్రి తర్వాత తెరపడింది. అట్టహాసంగా నిర్వహించిన ముగింపు వేడుకలు మళ్లీ పారిస్‌ను మిలమిల మెరిపించింది. రంగురంగుల ఎల్‌ఈడీ లైటింగ్ నడిరాతిరిని వర్ణమయం చేస్తే... నిషిధిని చీల్చిన బాణాసంచా వెలుగులు పారిస్ నగరం నెత్తిన కిరీటాన్ని తలపించేలా చేశాయి.
ప్రత్యేకంగా తయారు చేసిన అతిపెద్ద బెలూన్ బాగా ఆకట్టుకుంది. ఇది చూసిన వారికి మండుతున్న కుండలా కనిపించింది. అయితే ఇదేమీ బాణాసంచాతోనూ, అగ్గితోనూ చేసింది కాదు! పూర్తిగా అగ్గిమంటను తలపించే రంగు లైట్లతో అలా కనువిందు చేశారు. ప్రముఖ ఫ్రెంచ్ సింగర్ శాంటా హుషారెక్కించే పాటతో స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. పోటీల ఆఖరి రోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. మొరాకో అథ్లెట్ ఫాతిమా ఎజార ఎల్ ఇడ్రిస్సి మహిళల మారథాన్ పరుగులో, నైజీరియన్ లిఫ్టర్ ఒలువాఫెమియో రికార్డులు నెలకొల్పారు.
42.195 కిలోమీటర్ల దూరాన్ని ఎల్ ఎడ్రిస్సి 2 గంటల 48 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా జపాన్‌కు చెందిన మిసాటో మిచిషిత 2020లో నెలకొల్పిన 2 గంటల 54 నిమిషాల 13 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది. మహిళల పవర్‌లిఫ్టింగ్‌లో డిఫెండింగ్ చాంపియన్, 39 ఏళ్ల ఒలువాఫెమియో తన రికార్డును తానే చెరిపింది. 86 కేజీల ఈవెంట్‌లో ఆమె 167 కిలోల బరువెత్తి జార్జియాలో ఈ ఏడాది జూన్‌లో ఎత్తిన 166 కిలోల రికార్డును తిరగరాసింది.
అమెరికాకు మూడో స్థానం
సాధారణంగా విశ్వక్రీడల్లో అమెరికా అథ్లెట్లు పతకాల పందెంలో ముందుంటారు. ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికాకు గట్టి పోటీనిచి్చన చైనా అథ్లెట్లు చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ పారాలింపిక్స్‌లో చైనా క్రీడాకారులు అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్యాలతో చైనా మొత్తం 220 పతకాలు సాధించింది. అమెరికా 105 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో 36 పసిడి, 42 రజతాలు, 27 కాంస్యాలున్నాయి. రెండోస్థానం బ్రిటన్ (124 పతకాలు)కు దక్కింది. 49 బంగారు పతకాలు, 44 రజతాలు, 31 కాంస్యాలు గెలుచుకుంది.
లాస్ ఏంజెలిస్ అధిగమిస్తుందా?
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్ ఆదరణలోనూ, అథ్లెట్లతోనూ విజయవంతమైంది. ఏకంగా 4000 పైచిలుకు అథ్లెట్లు పోటీపడిన ఈ విశ్వక్రీడలను చూసేందుకు లక్షల మంది ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో 2.4 మిలియన్ టికెట్లు (24 లక్షలు) అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. లండన్–2012 ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయిలో టికెట్ల విక్రయం జరిగిన ఈవెంట్ ఇదేనని వెల్లడించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి లాస్ ఏంజిలిస్–2028 ఒలింపిక్స్‌పై పడింది. ఈ ఆదరణను మించే విధంగా తదుపరి విశ్వక్రీడలు జరగాలని ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రతినిధి క్రెయిగ్ స్పెన్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment