carroms championship
-
క్యారమ్స్ కాశీమా
పైన లైట్ బల్బు వెలుగుతుండగా... ఆ కాంతిలో...క్యారమ్ బోర్డ్‌పై ‘టప్’ ‘టప్’ అంటూ శబ్దాలు వినిపించేవి. లక్ష్యాన్ని ఛేదించడం నుంచి ఛేదించక పోవడం వరకు ఆ శబ్దాలలో ఎన్నో అర్థాలు ఉండేవి. ఆ అర్థాలను ఔపాసన పట్టింది చెన్నైకి చెందిన కాశీమా. ‘క్యారమ్స్’ కుటుంబ ఆట అంటారు. ఆ ఆటలోని రెడ్, వైట్, బ్లాక్ కాయిన్స్, స్ట్రైకర్... కాశీమాకు కుటుంబ సభ్యులు అయ్యాయి. వాటితో అనుబంధం ఆమెను క్యారమ్స్ ప్లేయర్‌గా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.ఆరు సంవత్సరాల వయసు నుంచి కాశీమా క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టింది. కుమార్తె క్యారమ్స్‌లో చూపుతున్న ప్రతిభకు సంబరపడిపోయేవాడు తండ్రి మెహబూబ్ బాషా.ఉత్తరచెన్నై పరిధిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కాశీమాను ఆడించే వాడు బాషా. కప్పులు గెలుచుకోవడం సంగతి ఎలా ఉన్నా ఇరుగు, ΄÷రుగు, బంధువులు ‘అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్లవచ్చా? ఇది పద్ధతేనా!’ అనేవారు. అయితే మెహబూబ్ వారి మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ‘వారి మాటలు పట్టించుకోవద్దు. క్యారమ్స్‌లో నువ్వు పెద్దపేరు తెచ్చుకోవాలి’ అంటూ కూతుర్నిప్రోత్సహించేవాడు బాషా.గల్లీనుంచి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్న కాశీమా జాతీయ స్థాయిలో పదికి పైగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించింది. కాశీమా ప్రతిభ అర్జున అవార్డు గ్రహీత మరియా ఇరుదయం దృష్టిలో పడింది. ఆయన శిక్షణలో తనలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కాశీమాకు వచ్చింది.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో జరిగిన 6వ క్యారమ్ ప్రపంచ కప్ పోటీలలో 18 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి పాల్గొన్న కాశీమా సింగిల్స్, డబుల్స్, గ్రూప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించి క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అమెరికాకు వెళ్లడానికి ముందు వీసా రెండుసార్లు తిరస్కరణకు గురి కావడంతో కాశీమా పడిన బాధ ఇంతా అంతా కాదు. ‘నేను కచ్చితంగా అమెరికాకు వెళ్లాలి. వెళ్లడమే కాదు పతకాలు సాధించాలి’ అని గట్టిగా అనుకుంది. పట్టువదలకుండా ప్రయత్నించి అమెరికాలో అడుగుపెట్టిన కాశీమా ఏకంగా మూడు స్వర్ణాలతో క్యారమ్స్ విశ్వవిజేతగా చెన్నైలో అడుగు పెట్టింది. ఆటకు అడ్డుపడే విధంగా విమర్శలు చేసిన వారే కాశీమాకు చెన్నైలో బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆమె విజయానికి మరింతప్రోత్సాహాన్నిస్తూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే ఆమెకు కోటి రూపాయల చెక్ అందజేశారు. ‘క్యారమ్స్’ అనేది జీవితంలాంటిది. కాయిన్స్ లక్ష్యాలు అనుకుంటే ‘స్టైకర్’ అనేది ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలాంటిది. స్ట్రైకర్ మీద పట్టు ఉన్న కాశీమా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.నాన్న కల సాకారం చేస్తానుక్యారమ్స్ ఆడుతుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు కొత్తశక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ శక్తే నన్ను చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట మురికివాడ నుంచి అమెరికా వరకు తీసుకువెళ్లింది. ‘క్యారమ్స్ ఆకాడమీ’ ఏర్పాటు చేసి మురికివాడలోని పేద పిల్లలకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలనేది నాన్న కల. ఆయన కల నెరవేర్చాలని ఉంది.– కాశీమా – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
న్యుజెర్సీలో గ్రాండ్‌గా మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ 2024
అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాటా క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ‘మాటా’ అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారం బోర్డు.. ఈ పోటీలను నిర్వహించటం విశేషం.పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్ పోటీల్లో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయస్థాయి క్రీడాకారులూ పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రతి జట్టు కేవలం డబుల్స్‌లోనే పాల్గొనగా, ప్రథమ బహుమతిగా 1,116 డాలర్లు, రెండో బహుమతిగా 516 డాలర్లు, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి.. సత్కరించారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈవో, ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డా. ఉపేంద్ర చివుకులా, చీఫ్ కంప్లేన్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి, తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సురేష్ బాబు కజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మాటా వ్యవస్థాపకులు, అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారులకు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరుపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. -
శ్రీజ, ఐనీ రెడ్డిలకు పతకాలు
జాతీయ సబ్ జూనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి. వారణాసిలో జరిగిన ఈ పోటీల్లో అండర్–14 బాలికల సింగిల్స్‌లో వి. ఐనీ రెడ్డి రజత పతకం... అండర్–12 బాలికల సింగిల్స్‌లో టి.శ్రీజ కాంస్య పతకం గెల్చుకున్నారు. పతక విజేతలకు తెలంగాణ క్యారమ్ సంఘం జనరల్ సెక్రటరీ ఎస్.మదన్‌రాజ్ అభినందించారు. -
సింగిల్స్ చాంప్ అహ్మద్
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఎండీ అహ్మద్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అహ్మద్ 25-12, 11-25, 22-12తో వసీమ్‌పై నెగ్గాడు. నాలుగో బోర్డ్ చివరలో వసీమ్ 12-11తో ఆధిక్యంలో నిలవగా... అహ్మద్ చక్కటి ఆట తీరుతో ప్రత్యర్థిని నిలువరించాడు. తర్వాతి గేమ్‌లో అహ్మద్ 11-25తో ఓటమి చవిచూసినప్పకీ, మూడో గేమ్‌లో తిరిగి పుంజుకుని 22-12తో గెలుపు దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అహ్మద్ 18-10, 23-6తో సాయిబాబాను, వసీమ్ 25-5, 19-12తో రమేష్‌ను ఓడించారు. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో రమేష్ 25-5, 25-17తో సాయిబాబాపై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సవితాదేవి 25-0, 25-5తో శ్వేతపై గెలిచి టైటిల్‌ను సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సవితాదేవి 25-0, 25-0తో శ్రీవాణిపై, శ్వేత 10-24, 25-0, 25-6తో మౌనికపై గెలిచారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో శ్రీవాణి 25-15, 25-10తో మౌనికపై విజయం సాధించింది.