చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మాట్లాడుతున్న వక్తలు
‘కౌమార వయసులో ఉండే పిల్లలు చదవడానికి పుస్తకాలు లేవు. వారి కోసం ప్రపంచ దేశాలు పుస్తకాలు అచ్చు వేసే పనిలో పడ్డాయి’ అన్నారు ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్’కు హాజరైన ప్రసిద్ధ పబ్లిషర్లు. ప్రతి సంవత్సరం ఇటలీలో, షాంఘైలో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్‌ఫెయిర్’లు భారీగా జరుగుతాయి. కాని మన దేశంలో కోట్ల మంది బాలలున్నా బాల సాహిత్యం ఊసే ఉండదు. బాల సాహిత్యమే కేంద్రంగా సాగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి.
‘కాలేజీ చదువుల తర్వాత కూడా అందరూ అవే క్లాసు పుస్తకాలు చదవక తప్పని పరిస్థితి ఉంటే బతుకు ఎంత నరకంగా ఉంటుందో... స్కూలు పుస్తకాలు మాత్రమే చదవమంటే పిల్లలకూ అంతే నరకంగా ఉంటుంది. విద్య అనేది అందరికీ దొరికే అవకాశం. కాని వినోదం, ఆహ్లాదం, విజ్ఞానం కలిగించే బాలల సాహిత్యం చదవడమే పిల్లలకు జీవితం అంటే ఏమిటో తెలియచేస్తాయి. మనం మాత్రం కాల్పనిక సాహిత్యం చదువుతూ పిల్లలను స్కూలు పుస్తకాలకు వదిలిపెట్టడంలో ఔచిత్యం ఏమిటో మీరే ఆలోచించండి’ అన్నారు సైమన్ జాకస్.
కెనడాలో పిల్లల పుస్తకాల పబ్లిషర్‌గా ప్రసిద్ధి పొందిన జాకస్ ప్రస్తుతం ఆ దేశంలో బాలల వికాసం కోసం పుస్తకాలు అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నాలను చెప్పారు– ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’ (సి.ఐ.బి.ఎఫ్)లో. ఈ ఉత్సవం జనవరి 16–18 తేదీల్లో జరిగింది. తమిళ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి, ఇతర భాషల సాహిత్యాన్ని తమిళంలోకి తీసుకురావడానికి పబ్లిషర్ల మధ్య ఒడంబడికలు చేసే ప్రత్యేక పుస్తక ఉత్సవం ఇది.
‘కెనడాలో ఇప్పుడు ప్రతి క్లాస్‌లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. స్కూలు పుస్తకాలు కాకుండా పిల్లలు ఈ సాహిత్య పుస్తకాలను ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవచ్చు. బాల సాహిత్యం కోసం వారికి తెలియాల్సిన అన్ని విషయాలను కథలుగా రాయించి అందుబాటులోకి తెస్తున్నాం. ఉదాహరణకు ఊహ తెలిశాక దత్తతకు వచ్చిన పిల్లవాడు తన అంతర్మథనాన్ని అర్థం చేసుకునే పుస్తకం కూడా సాహిత్యరూపంలో పెడుతున్నాం’ అన్నారాయన.
అంతర్జాతీయ ఉత్సవాలు
‘భారతదేశంలో కోట్లమంది బాలలు ఉన్నారు. కాని బాల సాహిత్యం తగినంత అందుబాటులో లేదు. పిల్లలను సినిమాకు తీసుకెళతారుగాని వారికి పుస్తకాలు కొనివ్వరు తల్లిదండ్రులు. కాని ప్రపంచ దేశాలు ఇప్పుడు కేవలం పిల్లలకు సాహిత్యం అందించే ప్రయత్నంలో ఉన్నాయ’ని అన్నారు సి.ఐ.బి.ఎఫ్‌లోపాల్గొన్న పబ్లిషర్లు. ఇటలీలోని బొలొనియా నగరంలో రాబోయే మార్చిలో ‘బొలొనియా అంతర్జాతీయ పిల్లల పుస్తక ప్రదర్శన’ జరుగుతుంది. దీని నిర్వాహకురాలు జాక్స్ థామస్ కూడా ఈ వేదిక మీదపాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ‘బొలొనియా చిల్డ్రన్స్ బుక్‌ఫెయిర్‌లో ప్రపంచ దేశాల బాలల రచయితలు, పబ్లిషర్లు, చిత్రకారులుపాల్గొంటారు. ఒక దేశ రచయితలు మరో దేశ పబ్లిషర్లతో ఒడంబడికలు చేసుకుంటారు.
ఇటలీ రచయిత, జపాన్ పబ్లిషర్, రష్యన్ చిత్రకారుడు కలిసి ఒక పుస్తకం తయారు చేసే ఆలోచన చేయడం ఇక్కడ కనిపిస్తుంది. అదొక పిల్లల ప్రపంచం. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ తమ పుస్తకాలు ప్రదర్శనకు పెడుతోంది. ఇలా ప్రతి భారతీయ భాష నుంచి జరగాలి’ అని అన్నారు. బొలొనియా బాలల బుక్ ఫెయిర్ జరిగినంత ఘనంగా షాంఘైలో ప్రతి నవంబర్‌లో పిల్లల బుక్‌ఫెయిర్ జరుగుతుంది. ఎక్కడ చూసినా బాల సాహిత్యమే కనపడుతుంది అక్కడ. కాని మన దేశంలో ‘అడవిలో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది’ అనే వాక్యం చదివి దానికి తగ్గ బొమ్మను చూస్తే పిల్లల్లో కలిగే ఊహను మనవాళ్లు ఏమాత్రం అనుమతించడం లేదు. మార్కులు కావాలి మన తల్లిదండ్రులకు.
లైంగిక చైతన్యం
‘నేనొక కథ రాశాను. ఆ కథను చాలా స్కూళ్లలో లైంగిక చైతన్యంలో భాగంగా చదివి వినిపిస్తున్నారు. స్కూల్లో ఆపాఠం విన్న ఒక పిల్లవాడు నాకు ఫోన్ చేశాడు. అంకుల్... నన్ను ఒకతను అబ్యూజ్ చేశాడు. ఆ రోజు నుంచి ఆ తప్పు చేసింది నేనే అనే భావనతో నలిగిపోతున్నాను. కాని మీ కథ చదివాక తప్పు చేసింది ఆ వ్యక్తి అని, నేను బాధితుణ్ణి అని తెలుసుకున్నాను. నా బాధపోయింది. నన్ను బాధ పెట్టినవాడి గురించి ఇప్పుడు మా ఇంట్లో చెప్పగలను– అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. బాల సాహిత్యం ఏం చేస్తుందంటే ఇదంతా చేస్తుంది’ అన్నారు మరో రచయిత బాల భారతి.
టీనేజ్ పిల్లలకు పుస్తకాలు లేవు
చెన్నై బుక్ ఫెయిర్‌లో ప్రసిద్ధ బాలసాహిత్య ప్రచురణ సంస్థ ‘తులిక బుక్స్’ ఎడిటర్ ప్రియ కృష్ణన్‌పాల్గొన్నారు. ‘పది పన్నెండేళ్ల వయసున్న పిల్లలు చదవదగ్గ పుస్తకాలు ఇప్పుడు లేవు. ఈ విషయంలో చాలా కొరత ఉంది. పిల్లలు పుస్తకాలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని మనకు బాలల రచయితలు, ప్రచురణ కర్తలు, బాల సాహిత్యానికి బొమ్మలు వేసే చిత్రకారులు చాలా తక్కువగా ఉన్నారు. అందరం పూనుకొని శ్రద్ధపెట్టకపోతే పిల్లలు సెల్‌ఫోన్‌లలో కనిపించే డిజిటల్ ప్రపంచంలో తప్పిపోతారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలకు మనోవికాసం, సమాజాన్ని ఎదుర్కొనే దిలాసా కలగాలంటే సాహిత్యం వల్ల కలుగుతుంది. చిన్న విషయాలకే పిల్లలు ఎందుకు కలత పడుతున్నారో అర్థం చేసుకుంటే ప్రతి తల్లిదండ్రులు వారి చేతుల్లో ఇవాళే పుస్తకాలు పెట్టగలరు. – సాక్షి ప్రతినిధి
తల్లిదండ్రులతో వెళ్లొద్దు
‘మన దేశంలో కొన్ని నగరాల్లో బుక్‌ఫెయిర్‌లు జరుగుతుంటాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఆ బుక్‌ఫెయిర్‌లకు తీసుకువెళతారు. కాని పిల్లలు ఇలాంటి వాటికి తల్లిదండ్రులతో వెళ్లకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు నేరుగా వారిని తీసుకెళ్లి కలెక్టర్ కావడం ఎలా వంటి పుస్తకాలు కొనిపెడతారు. దయచేసి వాళ్లకు డబ్బు ఇచ్చి వదిలిపెట్టండి. ఏం కావాలో అది కొనుక్కోనివ్వండి. అదొక్కటే కాదు... పిల్లల పుస్తకాలు అత్యంత తక్కువ ధరకు దొరికే ఏర్పాటు చేయాలి. ఆ పుస్తకాన్ని ఆశించిన ఏ ఒక్క పిల్లవాడు కూడా అది దక్కలేదని నిరాశపడకూడదు’ అన్నారు రచయిత నటరాజన్. ఆయన బాలల కోసం 120కి పైగా పుస్తకాలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment