మదర్‌ ఫెయిర్‌ | Chennai Book Fair begins | Sakshi
Sakshi News home page

మదర్‌ ఫెయిర్‌

Published Tue, Mar 2 2021 6:11 AM | Last Updated on Tue, Mar 2 2021 6:11 AM

Chennai Book Fair begins - Sakshi

చెన్నై బుక్‌ ఫెయిర్‌

‘మనసు ఉంటే మార్గమూ ఉంటుంది’. చెన్నై బుక్‌ ఫెయిర్‌ ఈ నానుడిని నిజం చేస్తోంది. కోవిడ్‌ కారణంగా ఇల్లు కదలని వాళ్లు కూడా బుక్‌ ఫెయిర్‌కు వస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ మొదలైన ఈ బుక్‌ ఫెయిర్‌ మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది. చెన్నైలోని నందనం, వైఎమ్‌సీఏలో ఏడు వందల స్టాళ్లతో మొదలైన ఈ బుక్‌ ఫెయిర్‌లో వేలాది పుస్తకాలున్నాయి. సాధారణంగా బుక్‌ ఫెయిర్‌లో పుస్తకప్రియులతోపాటు రచయిత లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ దఫా కూడా రచయితలు తమ పుస్తకాల పట్ల పాఠకుల రెస్పాన్స్‌ తెలుసుకోవడం కోసం రోజూ బుక్‌ ఫెయిర్‌ కు వస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేకం ఏమిటంటే... పేరెంట్స్‌ తమ పిల్లలను బుక్‌ ఫెయిర్‌కు తీసుకురావడం. పేరెంట్స్‌లో కూడా తల్లులే అధికంగా కనిపిస్తున్నారు.

కోవిడ్‌ కారణంగా ఏడాది నుంచి గడపదాటలేదు. ఆన్‌లైన్‌ క్లాసుల్లో పాఠాలతో పిల్లలు విసిగిపోతున్నారు. వాళ్లకు నచ్చే పుస్తకాలు కొనిద్దామని తీసుకువచ్చామని చెబుతున్నారు బుక్‌ ఫెయిర్‌కి పిల్లలతో వచ్చిన తల్లులు. ‘ఈ కోవిడ్‌ విరామం పిల్లలకు ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మనకు నచ్చినవి కొనుక్కుని వెళ్లి వీటిని చదవండి అంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి కలగదు. వాళ్లనే తీసుకు వచ్చి చూపించినట్లయితే తమకు ఇష్టమైన వాటినే ఎంచుకుంటారు, ఇష్టంగా చదువుతారు కూడా’ అన్నారు తన ఇద్దరు పిల్లలతో బుక్‌ ఫెయిర్‌ కొచ్చిన రాజి. బుక్‌ ఫెయిర్‌లో జనసమ్మర్ధం విపరీతంగా ఉంటుందేమోనని రావడానికి కొంచెం భయపడ్డాం. కానీ ఇక్కడ ఎప్పుడూ ఉండే రష్‌ లేదు. మాస్కు లేకుండా వచ్చిన వాళ్లను వెనక్కి పంపించకుండా ఇక్కడ మాస్కు ఇస్తున్నారు. శానిటైజర్‌ కూడా అందుబాటులో ఉంచారు. నిర్వహకులు కోవిడ్‌ ప్రోటోకాల్‌ కచ్చితంగా పాటిస్తున్నారు. దాంతో ధైర్యంగా ఎక్కువ సమయం ఉండగలుగుతున్నాం. కొత్త పుస్తకాలను కూడా డిస్కౌంట్‌లో ఇస్తున్నారు. దాంతో నాలుగు కొనాలనుకున్న వాళ్లు కూడా మరో రెండు ఎక్కువగా తీసుకుంటున్నాం’ అన్నారామె.

చెన్నై బుక్‌ ఫెయిర్‌లో షాపింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement