అంతర్జాతీయ హంగులతో స్టేడియం
Published Thu, Jan 23 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
సాక్షి, చెన్నై:తిరునల్వేలి, ఈరోడ్, శ్రీరంగంలలో అంతర్జాతీ ప్రమాణాలతో అథ్లెటిక్ స్టేడియంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రూ.35 కోట్లను కేటాయించింది. పురాతన, పారంపర్య ఆలయాల అభివృద్ధికి రూ. ఐదు కోట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. సీఎం జయలలిత ఆదేశాలతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక కేటాయింపులు రాష్ట్రంలో జరుగుతున్నారుు. అదే సమయంలో రాష్ట్రంలోని క్రీడా మైదానాల అభివృద్ధి, సరి కొత్తగా స్టేడియంల రూపకల్పన దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇటీవలే చెన్నైలోని నెహ్రు స్టేడియంను అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు వేదికగా నిలిచే విధంగా తీర్చిదిద్దారు.
తాజాగా ఈరోడ్, శ్రీరంగం, తిరునల్వేలిల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందు కోసం రూ.35 కోట్ల 78 లక్షలు కేటాయించారు. అలాగే, మదురై సమీపంలో జాతీయ స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటుకు రూ.ఆరు కోట్లను కేటాయిస్తూ సీఎం జయలలిత ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలు: విల్లుపురం, కన్యాకుమారి జిల్లాల్లోని పురాతన, పారంపర్య ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందు కోసం రూ.ఐదు కోట్లు కేటాయించింది. ఇందులో విల్లుపురం తిరుక్కోవిలూరు సమీపంలోని ప్రసిద్ధి చెందిన కీలయూరు వీరాండేశ్వర ఆలయంతో పాటుగా, కన్యాకుమారిలోని రణియల్ మహల్ కూడా ఉంది. వీటి రూప రేఖలు మారకుండా, ఎలా నిర్మించారో అలాగే పురాతన వైభవం ఉట్టి పడే రీతిలో మరమ్మతులు చేయనున్నారు.
Advertisement
Advertisement