Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court overturns High Court verdict on Mithun Reddy bail Issue1
ఆధారాలు లేకుండా అరెస్టులా..?

‘‘అరెస్ట్‌ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్‌ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్‌ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్ధీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, రంజిత్‌ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్‌ చేసింది.

Sakshi Guest Column On India Pakistan Water Issues2
నీళ్ల కోసం ఇక పాక్‌ కాళ్లబేరం!

ఇండియా, పాకిస్తాన్‌ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్‌ 22 పహల్‌ గామ్‌ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్‌ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్‌ వాటర్‌ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్‌ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్‌ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్‌ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్‌ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్‌ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌)లు టెక్నికల్‌ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌–ఎల్‌ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్‌ రేంజ్‌ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్‌ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్‌ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్‌ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్‌ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్‌ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్‌ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్‌ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్‌ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్‌ చర్చల్లో పాకిస్తాన్‌ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్‌ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్‌ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్‌ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్‌ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్‌ ఇకముందు కూడా కశ్మీర్‌ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్‌ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్‌ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్‌ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్‌ మీదే...1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్‌ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్‌ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్‌లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్‌లో యూఎన్‌ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్‌గామ్‌ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్‌ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్‌ కోరుకున్నట్లు కశ్మీర్‌ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్‌ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్‌ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్‌–కన్వెన్షనల్‌) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్‌–కన్వెన్షనల్‌ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌ మీదే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్‌ జాకబ్‌ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్‌ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Sakshi Editorial On USA China Trade Deal3
వెనక్కి తగ్గిన అమెరికా – చైనా

వేలంపాట తరహాలో అమెరికా, చైనాలు ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయిన వైనంతో బెంబేలెత్తిన ప్రపంచ మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ నేల చూపులు చూస్తున్న వేళ జెనీవా నుంచి సోమవారం ఒక చల్లని కబురు వినబడింది. ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఇరు దేశాలూ ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాయన్నదే దాని సారాంశం. ఇది బుధవారం నుంచి అమల్లోకొచ్చి తొంభై రోజులపాటు... అంటే మూణ్ణెల్లపాటు అమల్లో వుంటుందనీ, రెండు దేశాల ప్రతినిధులతో ఏర్పడిన సలహా యంత్రాంగం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందనీ ఉమ్మడి ప్రకటన వివరిస్తోంది. ఈ సలహా యంత్రాంగంలో చైనా తరఫున ఆ దేశ ఉపప్రధాని హో లిఫాంగ్‌ , అమెరికా తరఫున ఆర్థికమంత్రి స్కాట్‌ బిసెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్‌ గ్రీయర్‌లుంటారు. మూర్ఖత్వంలో ఎవరికెవరూ తీసిపోని ఈ రెండు పక్షాలూ చివరికేం చేస్తాయన్నది ఇంకా చూడాల్సేవున్నా ఇప్పటికైతే ఒక ముప్పు తాత్కాలికంగానైనా ఉపశమించిందని సంతోషించక తప్పదు. మొన్న జనవరిలో అమెరికాలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రపంచాన్ని హడలెత్తిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వరస నిర్ణయాల్లో ఈ సుంకాల పెంపు వ్యవహారం అతి పెద్దది. గత నెల 2 నుంచి అమల్లోకొచ్చిన ఈ పెంపు చైనా మినహా వేరే దేశాలపై తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ట్రంప్‌ ఆ వెంటనే ప్రకటించారు. కానీ కోడెల పోట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్టు అమెరికా–చైనా సుంకాల యుద్ధంతో ప్రపంచమంతటికీ సమస్యలు తలెత్తాయి. తాజా ఒప్పందం పర్యవసానంగా అమెరికా విధించిన 145 శాతం సుంకాలు కాస్తా 30 శాతానికి తగ్గుతాయి. అలాగే అమెరికా దిగుమతులపై చైనా విధించిన 125 శాతం సుంకాలు 10 శాతానికి దిగొస్తాయి. ఈ వారం ఆఖరులోగా తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని ట్రంప్‌ చెప్పటం కూడా సంతోషించదగ్గది. చైనాతో సుంకాల విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ మధ్య ట్రంప్‌ పదే పదే ప్రకటించగా చైనా ఖండించింది. చివరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చర్చలు సాకారమయ్యాయి. చైనాను దెబ్బతీసే ఉద్దేశం తమకు మొదణ్ణించీ లేదని ట్రంప్‌ ప్రకటించారు. ఇది స్వాగతించ దగ్గదే అయినా బడాయి మాటనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయటం సంగతలా వుంచి అమెరికాలోని తయారీరంగ పరిశ్రమలు ముడిసరుకులు దొరక్క ఇబ్బందులుపడుతూ దివాలా దశకు చేరాయి. ఉద్యోగాలకు కోతబెట్టాయి. వినియోగదారులు సైతం ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో పాటు, లభ్యమైన సరుకు ధర ఆకాశాన్నంటడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి సతమతమవుతుంటే సరుకును రెట్టింపు, అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావటం వారిని కుంగదీసింది. చైనాలోనూ పరిస్థితి ఏమంత సజావుగా లేదు. అనేక కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని సంస్థలు ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాయి. ట్రంప్‌ అధికారంలోకొస్తూనే దేశంలో యువత ప్రాణాలు తీస్తున్న మత్తు పదార్థం ఫెంటానిల్‌ విచ్చలవిడిగా దొరకటంలో చైనా పాత్రవుందని ఆరోపిస్తూ ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం అదనంగా సుంకాలు పెంచారు. గత నెల 2 నుంచి దానికి మరో 34 శాతం జోడించారు. ఇలా తమ నుంచి వెళ్లిన సరుకులపై 54 శాతం సుంకాలు విధించటాన్ని జీర్ణించుకోలేని చైనా దానికి ప్రతీ కారంగా అమెరికా దిగుమతులపై 34 శాతం మేర అదనపు సుంకాలు విధించింది. ఇక అక్కడి నుంచి ఇద్దరిమధ్యా ‘చంపుడు పందెం’ మొదలైంది. నిజానికి ట్రంప్‌కు ముందు ఫెంటానిల్‌తో చైనాకు లంకె పెట్టినవారెవరూ లేరు. అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆయన దాన్ని ఎక్కువచేసి చూపారు. మొత్తానికి అమెరికా 145 శాతం, చైనా 125 శాతం సుంకాల దగ్గర ఆగాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందం పర్యవసానంగా గంపగుత్తగా అన్ని రకాల సరుకులపైనా సుంకాలు తగ్గిపోవు. చైనా సరుకులపై అమెరికా విధించిన 30 శాతం సుంకాలు కొనసాగుతాయి. అలాగే విద్యుత్‌ వాహనాలు, ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఇంతకన్నా ఎక్కువగానే సుంకాలున్నాయి. అవన్నీ గత కొన్ని సంవత్సరాల్లో విధించినవి కనుక ఈ ఒప్పందం వాటి జోలికిపోదు.అవతలిపక్షం నుంచి ఎలాంటి రాయితీలూ పొందకుండా, తమకనుకూలమైన ముగింపు వైపుగా చర్యలేమీ కనబడకుండా ఒప్పందానికి రావటం బలహీనతను సూచిస్తుంది తప్ప బలాన్ని కాదు. ప్రస్తుత ఒప్పందం వ్యూహాత్మకమైనదని చెప్పుకున్నా, మున్ముందు దేశానికేదో ఒరుగుతుందని అంటున్నా... అధిక సుంకాల మోత నుంచి వెనక్కి తగ్గమని ట్రంప్‌పై దేశంలో అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు వచ్చాయన్నది వాస్తవం. నిరుటి గణాంకాలు గమనిస్తే రెండు దేశాలూ వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడినవేనని తెలుస్తుంది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 12.9 శాతం. అలాగే అమెరికా మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 14.8 శాతం. కెనడా, మెక్సికోల తర్వాత స్థానం చైనాదే. అధిక సుంకాల యుద్ధం చివరకు ప్రపంచ ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుందని, ఉత్పత్తుల కొరతను సృష్టించి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని... ఇదంతా చిట్టచివరకు అమెరికాను మాంద్యం ఊబిలోకి నెడుతుందని నిపుణులు మొదణ్ణించీ హెచ్చరిస్తూనే ఉన్నారు. సర్వజ్ఞుణ్ణని భావించేవారికి చెప్పటానికి ప్రయత్నించటం వృథా ప్రయాస. ఏదైనా అనుభవంలోకొస్తే తప్ప తత్వం బోధపడదు. మొత్తానికి ఈ చర్చల వల్ల ఇప్పటికైతే అర్థవంతమైన పరిష్కారం లభించలేదు. మున్ముందు ఏమవుతుందన్నది రెండు దేశాల విజ్ఞతకూ పరీక్ష.

Pak high commission official asked to leave India in 24 hrs4
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్‌

ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉ‍న్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్‌ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది.

Miss World contestants heritage walk in Hyderabad Old City5
వయ్యారి భామ.. నీ హంస నడక!

సాక్షి, హైదరాబాద్‌: నిజాం వారసత్వ వైభవానికి, ఇప్పటికీ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద వివిధ దేశాల సుందరీమణులు సందడి చేశారు. చార్మినార్‌ను ఆసక్తిగా తిలకించారు. ఫొటోలకు పోజులిచ్చారు. మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్‌ వాక్‌ ఉత్సాహంగా సాగింది. చార్మినార్‌ వద్ద, లాడ్‌బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్‌ కార్పెట్‌పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికులను అలరించారు. వీరికి పాతబస్తీలో పాపులర్‌ అయిన అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకగా..కొందరు మార్ఫా వాయిద్యాల సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. అనంతరం లాడ్‌ బజార్‌కు వెళ్లారు. చుడీ బజార్‌ (గాజుల మార్కెట్‌)లో షాపింగ్‌ చేశారు.సెల్‌ ఫోన్లలో చార్మినార్‌..గ్రూప్‌ ఫొటోప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరానికి చేరుకున్న దాదాపు 109 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం ప్రభుత్వం హెరిటేజ్‌ వాక్‌లో భాగంగా వారు చార్మినార్‌ను సందర్శించారు. విశిష్టమైన నగర వారసత్వ వైభవానికి ఈ అందాల ముద్దుగుమ్మలు ఫిదా అయిపోయారు. చార్మినార్‌ను తిలకించడమే కాకుండా దాని ముందు ఏర్పాటు చేసిన వేదికపై గ్రూప్‌ ఫోటో దిగారు. చార్మినార్‌ చరిత్ర, గొప్పదనం గురించి టూరిజం శాఖ గైడ్‌లను అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ ఫోన్‌లలో చార్మినార్‌ అందాలను బంధించారు. గాజులు, ముత్యాల హారాల షాపింగ్‌నగర జీవనశైలి, ఇక్కడి విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చార్మినార్‌ సమీపంలోని లాడ్‌ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో హెరిటేజ్‌ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్యాంగిల్స్, ముజీబ్‌ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతీలాల్‌ కర్వా, గోకుల్‌ దాస్‌ జరీవాల, కేఆర్‌ కాసత్, జాజు పెరల్స్, ఏ హెచ్‌ జరీవాల, అఫ్జల్‌ మియా కర్చోబే వాలే దుకాణాల్లో ఈ మిస్‌ వరల్డ్‌ తారలు అందమైన గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు తీసుకున్నారు. నగర విశిష్టతను చాటాలన్న వ్యాపారులులాడ్‌ బజార్‌ వ్యాపారులు కొందరు సుందరీమణుల వద్ద డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మీమీ దేశాల్లో హైదరాబాద్‌ విశిష్టతను, చార్మినార్‌ లాడ్‌ బజార్‌ ప్రత్యేకతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లాడ్‌ బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిక్షాలు, రంగురంగుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సుందరీమణుల హెరిటేజ్‌ వాక్‌ సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.

Term Insurance For Financial Security6
ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్: అధ్యయనంలో వెల్లడైన విషయాలు

డిజిటల్ ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ, భారతదేశంలోని యువతరం, అంటే జెన్ Z, ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఎంతో ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తోంది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. దీర్ఘకాలిక భద్రత, తక్కువ ధర, సులభమైన విధానాల కారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ వారికి ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా మారుతోంది.'కొత్త తరం అలవాట్లు, సంప్రదాయ విలువలు: ఆర్థిక ప్రణాళికలపై జెన్ Z తీరు' అనే పేరుతో 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల ఉద్యోగం చేస్తున్న జెన్ Z యువతపై ఈ పరిశోధన చేశారు. ఈ తరం టెక్నాలజీతో పాటు భద్రతకు కూడా సమానమైన ప్రాముఖ్యత ఇస్తోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను వారు కేవలం ఒక రక్షణగా మాత్రమే కాకుండా, తమ ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా భావిస్తున్నారు.ముఖ్యమైన విషయాలుటర్మ్ ఇన్సూరెన్స్‌కు అధిక ప్రాధాన్యం: పెరుగుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వల్ల జెన్ Z టర్మ్ ప్లాన్‌లను ఎక్కువగా ఎంచుకుంటోంది. 31 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇతర జీవిత బీమా పాలసీల కంటే ఎక్కువ. ప్రతి నలుగురిలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను పెంచే ప్లాన్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారిలో 57 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.ముందస్తు రిటైర్మెంట్ ఆలోచనలు: జెన్ Z తరం వీలైనంత త్వరగా పదవీ విరమణ చేయాలని కోరుకుంటోంది. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి, త్వరగా రిటైర్ అవ్వాలనే సిద్ధాంతంపై వారి ఆసక్తి పెరుగుతోంది. దీనివల్ల వారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గత తరాల వారిలా కాకుండా, 18 శాతం మంది ఇప్పటికే రిటైర్మెంట్ మరియు పెన్షన్ ప్లాన్‌ల గురించి ఆలోచిస్తున్నారు.ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాముఖ్యత: జెన్ Z ఆరోగ్యం, సంక్షేమం వంటి ప్రయోజనాలు లేని ఆర్థిక సాధనాలపై ఆసక్తి చూపడం లేదు. జీవిత బీమా సంస్థను ఎన్నుకునేటప్పుడు 60 శాతం మంది ఆరోగ్య ప్రయోజనాలు అందించే వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు (65 శాతం) వెల్‌నెస్ ప్రయోజనాలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు.టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ జె. కల్రా మాట్లాడుతూ, జెన్ Z డిజిటల్ తరం వారైనప్పటికీ, దీర్ఘకాలిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ వంటి వాటిని ఎంచుకుంటున్నారని చెప్పారు. ఆర్థిక భద్రత, ఆరోగ్యం మరియు ముందస్తు రిటైర్మెంట్ ప్రణాళికలపై దృష్టి పెడుతూ వారు తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.జెన్ Z ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పటికీ, ఆర్థిక విషయాల్లో మాత్రం విశ్వసనీయమైన వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. 53 శాతం మంది బీమా పాలసీల కోసం ఏజెంట్లు లేదా బ్యాంక్ సలహాదారులపై ఆధారపడుతున్నారు. అయితే, 25 శాతం మంది సోషల్ మీడియా నుండి కూడా ఆర్థిక సలహాలు తీసుకుంటున్నారు. జెన్ Z తరం చిన్న వయస్సులోనే ఆర్థిక విషయాల్లో మెరుగైన అవగాహన కలిగి ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను ముందుగానే తీసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం, సంపదతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారు భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రణాళికలను మారుస్తున్నారు.

Congress MP Shashi Tharoor On PM Modi's Pak Conflict Speech7
‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమని శశిథరూర్ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్.ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్నరు నిజంగా అద్భుతమన్నారు. అది కోవిడ్ లాంటి మహమ్మారి అయినా దేశ ద్రోహులపై చేసే యుద్ధమైనా మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేనిది. ఏది దేశానికి ముఖ్యమో అది మోదీ ఒక ప్రధానిగా చేసి చూపిస్తున్నారని శశిథరూర్ ప్రశంసించారు. ఈ మేరకు జాతీయ మీడియా ఎన్డీటీవో మాట్లాడిన శశిథరూర్.. దేశాన్ని నాలుగు కోణాల్లో చూస్తూ ముందుండి నడిపిస్తున్న నేత మోదీ అని కొనియాడారు. భారత్ సంక్షోభంలో ఉన్న ప్రతీసారి మోదీ ఇకపై కూడా ఇలానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు లోక్ సభ ఎంపీ శశథరూర్.ఇక్కడ చదవండి: ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

England Announced ODI, T20 Squad For West Indies Series8
IPL 2025: గుజరాత్‌, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు షాకిచ్చింది. ప్లే ఆఫ్స్‌ రేసులో ముందు వరుసలో ఉన్న ఈ మూడు జట్లకు చెందిన ప్రధాన ఆటగాళ్లను త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 2025లో కీలకమైన ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు జరుగుతుండగా వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది. భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ వారం రోజుల వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం ప్రకటించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌తో ఈ సిరీస్‌ క్లాష్‌ అయ్యింది.ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో తొలి వన్డే మే 29న, రెండో వన్డే జూన్‌ 1, మూడో వన్డే జూన్‌ 3వ తేదీన జరుగనున్నాయి. సరిగ్గా ఇదే తేదీల్లో ఐపీఎల్‌ క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ రేసుకు సమీపంలో ఉన్న జట్లకు చెందిన ఆటగాళ్లను, అదే తేదీల్లో జరిగే సిరీస్‌కు ఎంపిక చేయడంతో సదరు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు పాలుపోవడం లేదు. ఇంగ్లండ్‌ వన్డే జట్టుకు ఎంపిక చేసిన ఆటగాళ్లలో జోస్‌ బట్లర్‌ గుజరాత్‌కు.. జేకబ్‌ బేతెల్‌ ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నారు. ఈ మూడు ఫ్రాంచైజీలకు ఈ ముగ్గురు ఆటగాళ్లు చాలా కీలకం.ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో బట్లర్‌, బేతెల్‌, జాక్స్‌ లేకపోవడం ఆయా జట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు లీగ్‌ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తాజాగా ఇం​గ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.ఆటగాళ్లు కూడా దేశమా.. ఐపీఎలా అన్న సందిగ్దంలో ఉండిపోయారు. ఐపీఎల్‌ వాయిదా పడటం ఇన్ని సమస్యలు తెచ్చి పెట్టింది. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు తదుపరి జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (జూన్‌ 6, 8, 10) కోసం కూడా ఇంగ్లండ్‌ జట్లను ఇవాళ ప్రకటించారు. రెండు జట్లకు సారధిగా హ్యారీ బ్రూక్‌ ఎంపికయ్యాడు.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌), జేకబ్‌ బేతెల్‌ (ఆర్సీబీ), విల్‌ జాక్స్‌ (ముంబై ఇండియన్స్‌), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్‌ రాయల్స్‌), జేమీ ఓవర్టన్‌ (సీఎస్‌కే), గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జామీ స్మిత్విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జేకబ్‌ బేతెల్‌, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్జోఫ్రా ఆర్చర్‌, జేమీ ఓవర్టన్‌ కూడా వేర్వేరు ఐపీఎల్‌ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ జట్లు ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.మరోవైపు ఇదే సిరీస్‌ (వన్డే) కోసం విండీస్‌ జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. విండీస్‌ ఆటగాళ్లలో ఫెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (గుజరాత్‌), రొమారియో షెపర్డ్‌ (ఆర్సీబీ), షమార్‌ జోసఫ్‌ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నారు. రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లు కూడా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. అయితే ఈ సిరీస్‌తో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు క్లాష్‌ కావడంతో వీరు కూడా ఆయా జట్లకు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.

Ys Jagan Announces Financial Assistance Of Rs 25 Lakh To Murali Naik Family9
వీర జవాన్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Narendra Modi Speak About Indian Air Force in Adampur Air Base10
ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

ఆదంపూర్‌: భారత్‌ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్‌ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ తన సత్తా చూపించిందని అన్నారు. భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని అన్నారు. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నా జీవితం ధన్యమైంది‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు.‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే.. మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi said, "Besides manpower, the coordination of machine in #OperationSindoor was also fantastic. Be it India's traditional air defence system which has witnessed several battles or our Made in India platforms like Akash - all of… pic.twitter.com/Y2dYnanFmN— ANI (@ANI) May 13, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement