Jayalalithaa Death: విచారణ పరిధిలోకి శశికళ? | Jayalalithaa Death: Arumugasamy Commission Recommends Initiating Inquiry Against Sasikala | Sakshi
Sakshi News home page

Jayalalithaa Death: విచారణ పరిధిలోకి శశికళ?

Published Wed, Aug 31 2022 8:15 AM | Last Updated on Wed, Aug 31 2022 8:15 AM

Jayalalithaa Death: Arumugasamy Commission Recommends Initiating Inquiry Against Sasikala - Sakshi

జయలలిత, శశికళ, విజయ భాస్కర్, శివకుమార్, రామ్మోహన్‌రావు(ఫైల్‌)  

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతి కేసుకు సంబంధించి చిన్నమ్మ శశికళ, మాజీ మంత్రి విజయ భాస్కర్, మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావును విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్‌ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది. ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం. 

నేపథ్యం ఇదీ.. 
అమ్మ జయలలిత 2016 డిసెంబర్‌ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను రంగంలోకి దిగింది. ఈ కమిషన్‌ రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వ వర్గాలు సమగ్రంగా పరిశీలించాయి. ఇందులో ఆర్ముగ స్వామి సూచించిన అంశాలు, కొన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు.

మంత్రి వర్గ సూచనలో.. 
ఆర్ముగ స్వామి తన నివేదికలోని కీలక విషయాల గురించి సోమవారం సాయంత్రం పొద్దు పోయే వరకు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జగినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్‌ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి మరణించే వరకు జరిగిన పరిణామాలు, వైద్య సేవలు అంశాలను నివేదికలో ఆర్ముగ స్వామి పొందుపరిచారు. ఈ మేరకు జయలలిత నెచ్చెలి శశికళ, డాక్టర్‌ శివకుమార్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అప్పటి సీఎస్‌ రామమోహ్మన్‌ రావును విచారించాలని సలహా ఇవ్వడం మంత్రి వర్గం దృష్టికి వచ్చింది. దీంతో ప్రత్యేక సిట్‌ ద్వారా విచారణ జరిపేందుకు మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది.

చదవండి: (సీఎం స్టాలిన్‌ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..)

ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ సిట్‌ రంగంలోకి దిగనుంది. న్యాయ నిపుణులతో ఇందుకు తగ్గ చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ విచారణతో పాటూ ఆర్ముగ స్వామి కమిషన్‌ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిట్‌ విచారణ సంకేతాల నేపథ్యంలో అమ్మ మరణం మిస్టరీ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.  

తూత్తుకుడి వ్యవహారం 
మంత్రి వర్గంలో గత ప్రభుత్వ హయాంలో తూత్తుకుడిలో జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా, ఆ నివేదిక ఆధారంగా శాఖ పరమైన చర్యలకు డీఎంకే  పాలకులు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్, రెవెన్యూ అధికారులు 21 మంది చర్యలకు అరుణా జగదీశన్‌ కమిషన్‌ తన నివేదికలో సిఫార్సు చేయడం గమనార్హం. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం, ర్యాలీ, కాల్పులు ఆ తదుపరి పరిణామాల గురించి అరుణా జగదీశన్‌ తన నివేదికలో వివరించారు. ఐపీఎస్‌ అధికారులతో పాటూ 17 మంది పోలీసుల అధికారులు, కలెక్టర్, నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సూచించడం గమనార్హం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement