Legal experts
-
అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు
‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ను అడ్డంపెట్టుకొని బయటపడాలని చేస్తున్న ప్రయత్నాలు చెల్లవని పట్నా, కర్ణాటక హైకోర్టులు రెండు వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. సెక్షన్ 17ఏ అవినీతిపరులకు రక్షణ కవచం కాదని ఈ నెల 7న పట్నా హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17 ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ నుంచి సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ చేసిన వాదనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. సెక్షన్ 17ఏ అమలులోకి రాకముందే శివకుమార్‌పై కేసు నమోదు చేసినందున అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరంలేదన్న సీబీఐ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం, రిమాండ్‌కు పంపడం న్యాయపరంగా సరైనదేనని ఈ తీర్పుల ద్వారా స్పష్టమవుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇదీ బిహార్ కేసు బిహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్ జిల్లాలోని సుగాలి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కిశోర్ కుమార్ అక్రమంగా మద్య రవాణా చేస్తున్న వారిని విడిచిపెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన్ని చకియాకు బదిలీ చేశారు. ఆయన చకియాకు బదిలీ అయిన తరువాత సుగాలి పోలీసు స్టేషన్లో మూసివేసిన ఓ కేసును మళ్లీ నమోదు చేసి సంబంధిత వ్యక్తుల నుంచి లంచం వసూలు చేశారు. దీంతో ఆ జిల్లా ఎస్పీ ఆయన్ని అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కిశోర్ కుమార్ పట్నా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 17ఏ కింద తనను అరెస్టు చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ అనుమతి ఉండాలని వాదించారు. పట్నా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. అవినీతి నిరూపితమైనందున ఆయన అరెస్టుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 17ఏను అడ్డంపెట్టుకుని అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని కూడా స్పష్టంగా చెప్పింది. ఇదీ శివకుమార్ కేసు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోనందున సీబీఐ తనపై నమోదు చేసిన కేసు చెల్లదని కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సెక్షన్ 17 ఏ అమల్లోకి రావడానికి (2018 జులై 26కి) ముందు 2013 నుంచి 2018 ఏప్రిల్ మధ్య శివకుమార్ అవినీతికి పాల్పడినందున ఆయనకు ఈ సెక్షన్ వర్తించదని తెలిపింది. అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వంగా అవినీతి చేయటం ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావని కూడా చెప్పింది. సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. శివకుమార్ వినతిని తిరస్కరించింది. చంద్రబాబుదీ అవే అడ్డగోలు వాదనలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా ఇదే అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోనందున అరెస్ట్ చెల్లదని, కేసు కొట్టివేయాలని వాదిస్తున్నారు. ఈ వాదనను సీఐడీ న్యాయవాదులు సమర్థంగా తిప్పికొట్టారు. అవినీతి వ్యవహారాల నుంచి గంపగుత్తగా రక్షణ కల్పించడం సెక్షన్ 17ఏ ఉద్దేశం కాదని వాదించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదని చెప్పారు. అందువల్ల చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ఈ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ఏ విధంగా అర్హులు కారో వారు విశ్లేషించి మరీ చెబుతున్నారు. ► కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ కింద రక్షణ పొందలేరన్నది నిర్ధారణ అయ్యింది. ► ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదని పట్నా హైకోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదన్నది సుస్పష్టం. ► సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది. ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు ద్వారా స్పష్టమైంది. స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ► సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఆయన చెప్పడం లేదు. సెక్షన్ 17ఏ ప్రకారం తనపై సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదని మాత్రమే చెబుతున్నారు. అందువల్ల స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
మార్గదర్శి ముసుగులో ఆర్థిక దోపిడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో చెరుకూరి రామోజీరావు అతి పెద్ద ఆర్థిక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆర్థిక, న్యాయ రంగాలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టంతోపాటు ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును అరెస్టు చేసి ఆయన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘చిట్టీల మాటున చీకటి వ్యాపారం’ అనే అంశంపై సాక్షి టీవీ శుక్రవారం నిర్వహించిన చర్చా గోష్టిలో పలువురు నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. చందాదారుల నిధులను అక్రమంగా సొంత వ్యాపార ప్రయోజనాలకు మళ్లించడమే కాకుండా వారిని వేధించి ఆస్తులు సైతం రాయించుకున్న ఘనత మార్గదర్శి చిట్ఫండ్స్దేనన్నారు. న్యాయస్థానాల ద్వారా పరిష్కరించాల్సిన అంశాలను కూడా చిట్ రిజిస్ట్రార్‌కు అప్పగించి చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమాలకు వత్తాసు పలికిందన్నారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రామోజీరావు తన కోడలు శైలజాకిరణ్‌కు అక్రమంగా షేర్లు కట్టబెట్టారని వెల్లడించారు. ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును అరెస్టు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రామోజీకి శిక్ష ఖాయం చట్టం కళ్లు గప్పి 1962 నుంచి చేస్తున్న ఆర్థిక అక్రమాల ఊబిలో రామోజీరావు పూర్తిగా కూరుకుపోయారు. ఆయన దాన్నుంచి బయటకు రాలేరు. ఆయన మా మామగారు కలిసే అన్నదాత పత్రికను పెట్టారు. రామోజీరావు ప్రజల డబ్బుతో చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని, ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారని మా మామ 30 ఏళ్ల క్రితమే చెప్పారు. రామోజీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఘోస్ట్ చందాదారుల పేరిట భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారు. చందాదారులుగా ఉన్నవారిలో చాలా మందికి అసలు ఆ విషయమే తెలియదు. వారి సంతకాలను ఫోర్జరీ చేసి వారి పేరిట అక్రమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీ పాట మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది. రామోజీకి చట్ట ప్రకారం శిక్ష విధించమే మిగిలింది. – నాగార్జునరెడ్డి, ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఫెమా, ఫెరా చట్టాల ఉల్లంఘన చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొన్ని వందల చిట్‌ఫండ్ కంపెనీలను మార్గదర్శి వ్యాపార ప్రయోజనాల కోసం బలవంతంగా మూసివేశారు. చిట్టీ పాడుకున్న వ్యక్తి ఏ కారణంతోనైనా వాయిదాలు చెల్లించకపోతే చిట్ రిజిస్ట్రార్ దగ్గర కేసులు వేసి వేధించారు. అందుకు చంద్రబాబు ప్రభుత్వం సహకరించింది. కోర్టుల ద్వారా సివిల్ సూట్లు వేయాల్సిన సందర్భంలో చిట్ రిజిస్ట్రార్‌కు చంద్రబాబు ప్రభుత్వం హక్కులు కల్పించడం నిబంధనలకు విరుద్ధం. అదే అదనుగా చందాదారుల ఆస్తుల జప్తు, శాలరీ అటాచ్మెంట్లకు పాల్పడి రామోజీరావు తన సొంత ఆస్తులు పెంచుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు మూడు రాష్ట్రాలకు సంబంధించింది. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా చిట్స్ వేశారు. ఇది కచ్చితంగా ఫెరా, ఫెమా చట్టాల ఉలంఘనే. ఈ కేసులో రామోజీరావుకు నోటీసులు ఇవ్వడమే కాదు అరెస్టు చేయాలి. – అరుణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది జీజే రెడ్డి దగ్గర గుమాస్తాగా చేరి మార్గదర్శి చిట్‌ఫండ్స్ రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన గాదిరెడ్డి జగన్నాథరెడ్డి (జీజే రెడ్డి) దగ్గర రామోజీరావు గుమాస్తాగా చేరారు. తర్వాత పరిణామాలతో పలు కేసులతో జీజే రెడ్డి అదృశ్యమయ్యారు. అప్పటికి మార్గదర్శిలో రామోజీరావుకు కొద్ది షేర్లు మాత్రమే ఉండగా జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆయన ఆస్తులు, షేర్లు జప్తు చేయాలని ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కానీ జీజే రెడ్డి షేర్లను అప్పగించకుండా అలానే కొనసాగించి 2016లో శైలజా కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు వరకు ఉండొచ్చు. ఆ షేర్లను శైలజా కిరణ్ పేరిట ఎలా బదిలీ చేశారు? అందుకు షేర్ వ్యాల్యూషన్ సర్టిఫికేషన్ ఎవరు చేశారు? ఎవరి ద్వారా విక్రయించారో రామోజీరావు వెల్లడించాలి. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఈ దిశగా దర్యాప్తు చేయాలి. – వెంకట్రామిరెడ్డి, కార్పొరేట్ న్యాయ నిపుణుడు ముసుగులో నల్లధనం దందా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న రామోజీరావు అధికారుల తనిఖీలకు ఎందుకు సహకరించడం లేదు? అక్రమాలకు పాల్పడ లేదంటే ఫైళ్లను చూపించాలి కదా? ఫిర్యాదు చేయలేదు కాబట్టి దొంగతనం జరిగినా, ఎవరినైనా హత్య చేసినా పోలీసు అధికారి చర్యలు తీసుకోకూడదా? రామోజీరావు అడ్డగోలు వాదన అలానే ఉంది. ఎవరైనా చందాదారులు తమ ఆర్థిక అవసరాల కోసమే చిట్టీ పాట పాడతారు. అప్పుడు కూడా చిట్టీ మొత్తం ఇవ్వకుండా డిపాజిట్‌గా మళ్లిస్తామంటే ఎలా? బ్యాంకులో డిపాజిట్ చేస్తే 7 శాతం వడ్డీ వస్తుంది. మార్గదర్శి అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తూ 4 శాతమే ఇస్తోంది. అది దోపిడీ కాదా? రూ.కోటికంటే ఎక్కువ డిపాజిట్లు చేసినవారు 800 మందికిపైగా ఉన్నారని వెల్లడైంది. అదంతా నల్లధనం దందానే కదా. – కొమ్మినేని శ్రీనివాసరావు, చైర్మన్, ఏపీ మీడియా అకాడమీ చందాదారుల సొమ్ముతో సొంత పెట్టుబడులు కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నిధులను తమ సొంత వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్మును ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్ సంస్థల్లో 87 శాతం వాటా కింద తమ సొంత పెట్టుబడిగా మళ్లించారు. నిధులు ఎలా మళ్లించారన్నదానికి రామోజీరావు సమాధానం చెప్పాలి. 2014 నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ తమ చందాదారుల వివరాలను ఆంధ్రప్రదేశ్ చిట్ రిజిస్ట్రార్‌కు సమర్పించడం లేదు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చిట్ రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వబోమనడం సరికాదు. 37 బ్రాంచీల వివరాలను ఏపీ చిట్ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. – వై.నాగార్జున యాదవ్, చైర్మన్, ఏపీఈడబ్లూఐడీసీ -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరమని, దీనికి పరిధి అంటూ లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) చైర్మన్ ఆదిశ్ సి.అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భేటీలు జరిగినప్పుడే ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒక దేశంలోని న్యాయవ్యవస్థ తీరు ఇతరులకు తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం తెలంగాణ బార్ అసోసియేషన్‌లో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావుతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 50 మంది న్యాయమూర్తులతోపాటు దేశంలోని హైకోర్టుల నుంచి 50 మంది న్యాయమూర్తులు హాజరవుతారన్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాదుల భద్రత చట్టంపై చర్చ జరగనుందన్నారు. ఇప్పటికే కర్ణాటక, రాజస్తాన్‌ల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని.. త్వరలో తెలంగాణలో కూడా ఇది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతోనే సమావేశాలు నడుస్తాయని, సీఎం కేసీఆర్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కృషి : న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ మొత్తంతో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. అంతర్జాతీయ సమావేశ నిర్వహణకు పలు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వేదిక కావడం సంతోషకరమని పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ మాజీ చైర్మన్ పొ న్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్‌రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు. -
శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3,000 పేజీల చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్త సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3 వేల పేజీల భారీ ముసాయిదా చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు తయారు చేశారు. ఇందులో 100 సాక్ష్యాలతో కూడిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలున్నాయి. దీని నుంచి తుది చార్జిషీట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉండే అఫ్తాబ్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గత మేలో గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు ముందుగా వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఛతర్పూర్ అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధవేనని డీఎన్ఏ నివేదికల్లో తేలింది. ఇవే కీలక ఆధారాలు కానున్నాయి. -
డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!
వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణ బిల్లు తాజా ముసాయిదాతో మళ్లీ ముందుకొచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుపై అనేక అభ్యంత రాలు వ్యక్తం అవడంతో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో ఎనభైకి పైగా సవరణలు, పదికిపైగా కీలకమైన సూచనలలో కేంద్రం మరోసారి ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2022’ను సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ఈ శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్ట దలచిన ఈ బిల్లుపై న్యాయ నిపుణులు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్నింటిపై›ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే పౌరుల సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చన్న క్లాజుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ తాజా ముసాయిదాలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. సరళమైన భాషను ఉపయోగించారు. మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, చట్ట నియంత్రణలో ఉండే విధానా లకు రూపకల్పన చేశారు. అయితే, వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు లోప భూయిష్టంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమే. మొత్తంగా చూస్తే ఈ ముసాయిదా బిల్లు దేశ ప్రజల సాంకేతిక భద్రతా చట్టాలను బలపరిచేదిగా నిలిచిపోతుంది. గత నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసి, అందులోని బాగోగులను చర్చకు పెట్టింది. గత నాలుగేళ్లుగా ఏకాభిప్రాయానికి నోచుకోక, ఇక ఇది ఎప్పటికైనా బిల్లు రూపంలోకి వస్తుందా అనే సందే హాల నడుమ తాజా విడతగా బయటికి వచ్చిన ముసాయిదాను ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. డేటా ప్రొటెక్షన్ చట్టంపై దశాబ్దకాలంగా చక్ర బంధంలో పరుగులు తీస్తున్న చిట్టెలుకలా పని చేస్తున్న నా వంటి వ్యక్తికి తొలిసారిగా ఈ తాజా ముసాయిదా సొరంగం చివర కనిపి స్తున్న కాంతి వంటి భావనను కలిగించింది. తాజా ముసాయిదా ఎంతో సులభగ్రాహ్యంగా ఉంది. సాధ్య మైనంతగా విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరికీ బిల్లును అర్థం చేయించేం దుకు ప్రయత్నం జరిగినట్లు అర్థమౌతోంది. ఇందులో పేర్కొన్న చట్ట నిబంధనలు ఎలా అన్వయమవుతాయో వివరించే ఉదాహరణలను తగినన్నిగా ఇవ్వడం భలే నచ్చింది. నిజానికి శాసన ముసాయిదాల రూపకల్పనలో ఇలా ఇవ్వడం అనేది ఒక మెళకువ. దురదృష్టవశాత్తూ ఆధునిక బిల్లు తయారీ సాధకులకు ఇది కొరుకుడు పడని విద్య. పౌరులతో ముడివడి ఉండే నియంత్రణలకు అధికారాన్నిచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఉద్దేశించిన చట్టంలోని సరళత కచ్చితంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయినప్పటికీ, ముసాయిదాలోని ఈ సరళతను నేను ఇష్టపడటం న్యాయవాదులలోని నా సోదరులు కొందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయవాదులు ఎప్పుడూ కూడా తమ చట్టాలు సరళత్వాన్ని కలిగి ఉండటం కంటే కూడా, సవివరమైనవిగా ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో నేను అనేకసార్లు చెప్పినట్లుగా... సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించే బిల్లు తయారీ జరగడం ఇలాక్కాదు. చట్టంలో మనం ఎంత ఎక్కువగా వివరాలను కూరుతామో, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిలోని కొత్త పరిణామాల వల్ల అది అంత ఎక్కువగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా, సాంకే తికత నిర్దేశించే నిరంతర లక్ష్యాలకు అత్యంత ప్రభావవంతంగా ప్రతి స్పందించడానికి వీలు కల్పించే చురుకైననియంత్రణ చట్టాలను మాత్రం రూపొందిస్తే సరిపోతుంది. ఇక ఈ ముసాయిదా చట్టంలోని ఇతర అంశాలలో కొన్నింటిపైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చట్టంలోని అనేక ముఖ్యమైన నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం తనను తాను మిన హాయించుకోవడం వాటిల్లో ఒకటి. అయితే ప్రపంచంలోని ప్రతి డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ ఈ రకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఉదా: ఐరోపాలో అమలులో ఉన్న ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’ (జి.డి.పి.ఆర్.) చట్టం తన మేలిమి ప్రమాణాల రీత్యా తలమానిక మైనదిగా గుర్తింపు పొందుతోంది. వారి చట్టంలో జాతీయ భద్రత, దేశ రక్షణ, పౌరుల సంక్షేమం రీత్యా క్రిమినల్ నేర విచారణ, రహస్య ఛేదన వంటి హక్కు దావాల నుంచి ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన మినహా యింపులను ఇస్తున్నాయి. సరిగ్గా మన తాజా ముసాయిదాలోని సెక్షన్ 18 (1) ప్రసాదిస్తున్న మినహాయింపులు కూడా అటువంటివే. అయితే డేటా పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనల వర్తింపు నుండి ప్రభుత్వం మినహాయింపు తీసుకున్నంత మాత్రాన 2017 పుట్టస్వామి తీర్పును అనుసరించి తన రాజ్యాంగ బద్ధతలకు లేదా బాధ్యతలకు ప్రభుత్వం లోబడి ఉండబోదని అర్థం కాదు. బిల్లులోని నిర్దిష్ట మూలాంశం ఏమి చెప్పినప్పటికీ, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యపై ఆ బద్ధతలు, బాధ్యతలు శిరస్సుపై ఖడ్గంలా వేలాడుతూనే ఉంటాయి. ప్రస్తుత బిల్లుకు జరుగుతూ వస్తున్న సవరణలతో పోల్చి చూసినప్పుడు తాజా ముసాయిదాలో పేర్కొన్న మినహాయింపులు నిరపాయకరమైనవేనని చెప్పాలి. చట్టానికి జరిగిన గత రెండు సవర ణలు చట్టంలోని కొన్ని సెక్షన్ల వర్తింపు నుంచి ప్రభుత్వ యంత్రాంగా లకు మొత్తంగా మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి. తాజా ముసాయిదా కొంత తులనాత్మకంగా జరిగింది. దీనర్థం తాజా ముసాయిదాలో లోపాలు లేవని చెప్పడం కాదు. ఇందులో డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకోవలసిన కొన్ని ప్రధానమైన పరిగణనలు లోపించాయి. నా ఉద్దేశంలో అవి ఏమిటంటే... మొదటిగా, డేటా పోర్టబిలిటీ హక్కు. దేశ జనాభాలోని వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ ఒకచోట నిల్వ ఉంచుతున్న ఈ యుగంలో, అలా నిల్వ ఉంచిన సమాచారం నుంచి వివరాలను సంగ్రహించి, బట్వాడా చేసుకునే హక్కును వ్యక్తులకు ఈ బిల్లులో కల్పించలేదు. డేటా పోర్టబిలిటీ హక్కు ఉంటే కనుక వ్యక్తులకు తమకు అవసరమైన వివరాలపై ఆధీనతను ఇవ్వడమే కాకుండా, కొద్ది మంది చేతుల్లోనే డేటా పోగుపడే ఏకీకరణను నిరోధించే సమర్థమైన చర్యగా కూడా పోర్టబిలిటీ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా నియంత్రకులు పోర్టబిలిటీ హక్కును మరింత ప్రభావవంతంగా, అర్థవంతంగా చేయడానికి శ్రమిస్తున్నారు. భారతదేశమైతే తన శక్తిమంతమైన ‘టెక్నో–లీగల్’ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో, డేటా పోర్టబిలిటీ ఎలా చేయాలో ప్రపంచానికి చూపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముందైతే అటువంటి హక్కుకు చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉండాలి. నాకు కనుక మరొక సూచనకు అవకాశం ఉంటే దానిని నేను బిల్లులో వాడిన కొన్ని పదాలను అంతర్జాతీయ అనుసరణీయతలకు మరింత చేరువగా ఉండేలా నిబంధలను మార్పు చేయమని అడిగేం దుకు ఉపయోగించుకుంటాను. జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ డేటా సబ్జెక్టులను (గుర్తింపు వివరాలు కలిగి ఉన్న వ్యక్తులు) డేటా ప్రిన్సిపల్స్‌గా, డేటా కంట్రోలర్స్ని (వివరాలను నియంత్రించేవారు) డేటా విశ్వసనీయులుగా పునఃనామకరణ చేసిన ప్పటి నుంచీ... ఆ తర్వాతి వరస ముసాయిదాలు ప్రామాణికం కాని ప్రమాణాలను చట్టంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి. అందుకు ప్రస్తుత ముసాయిదా కూడా మినహాయింపేమీ కాదు. ప్రపంచంలోని మిగతా దేశాలు ‘డేటా ప్రొటెక్షన్ అథారిటీ’గా పిలిచే శాఖను మన దగ్గర ‘డేటా ప్రొటెక్షన్ బోర్డు’గా వ్యవహరిస్తున్నారు. ఇక గోప్యత చట్టాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే చట్టబద్ధమైన అవసరం, సహేతుకమైన ప్రయోజనం వంటి మాటలు తాజా చట్టంలోనూ ఉన్నాయి. దీనివల్ల వ్యక్తుల సమ్మతి లేకుండానే (డీమ్డ్ కన్సెంట్) వారికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం, ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థలు పొందే వీలుంది. ఇది వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని మరింతగా దెబ్బతీస్తుందనే ఆందో ళన ఉన్నందువల్ల దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉంది. డీమ్డ్ కన్సెంట్ అనే పేరులో ఏముంది అని మీరడగవచ్చు. ఏమీ లేదు. ఆశించిన ప్రయోజనాలను ఆ నిబంధన నెరవేర్చుతున్నంత కాలం పేరులో ఏమీ లేదనే చెబుతాను. కానీ పైపై మాటలతో కూడిన నిబంధనలు... ఇప్పుడు మనం చూస్తున్న విధంగా నిరసనల నిప్పు తుపానును రాజేస్తాయి. అయితే అది మనం నివారించగలిన తుపానే! రాహుల్ మత్తన్ వ్యాసకర్త ‘ట్రైలీగల్’ సంస్థ భాగస్వామి (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Jayalalithaa Death: విచారణ పరిధిలోకి శశికళ?
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతి కేసుకు సంబంధించి చిన్నమ్మ శశికళ, మాజీ మంత్రి విజయ భాస్కర్, మాజీ సీఎస్ రామ్మోహన్‌రావును విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది. ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం. నేపథ్యం ఇదీ.. అమ్మ జయలలిత 2016 డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను రంగంలోకి దిగింది. ఈ కమిషన్ రెండు రోజుల క్రితం సీఎం స్టాలిన్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ప్రభుత్వ వర్గాలు సమగ్రంగా పరిశీలించాయి. ఇందులో ఆర్ముగ స్వామి సూచించిన అంశాలు, కొన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు. మంత్రి వర్గ సూచనలో.. ఆర్ముగ స్వామి తన నివేదికలోని కీలక విషయాల గురించి సోమవారం సాయంత్రం పొద్దు పోయే వరకు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జగినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి మరణించే వరకు జరిగిన పరిణామాలు, వైద్య సేవలు అంశాలను నివేదికలో ఆర్ముగ స్వామి పొందుపరిచారు. ఈ మేరకు జయలలిత నెచ్చెలి శశికళ, డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అప్పటి సీఎస్ రామమోహ్మన్ రావును విచారించాలని సలహా ఇవ్వడం మంత్రి వర్గం దృష్టికి వచ్చింది. దీంతో ప్రత్యేక సిట్ ద్వారా విచారణ జరిపేందుకు మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. చదవండి: (సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..) ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ సిట్ రంగంలోకి దిగనుంది. న్యాయ నిపుణులతో ఇందుకు తగ్గ చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ విచారణతో పాటూ ఆర్ముగ స్వామి కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ విచారణ సంకేతాల నేపథ్యంలో అమ్మ మరణం మిస్టరీ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. తూత్తుకుడి వ్యవహారం మంత్రి వర్గంలో గత ప్రభుత్వ హయాంలో తూత్తుకుడిలో జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా, ఆ నివేదిక ఆధారంగా శాఖ పరమైన చర్యలకు డీఎంకే పాలకులు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్, రెవెన్యూ అధికారులు 21 మంది చర్యలకు అరుణా జగదీశన్ కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేయడం గమనార్హం. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం, ర్యాలీ, కాల్పులు ఆ తదుపరి పరిణామాల గురించి అరుణా జగదీశన్ తన నివేదికలో వివరించారు. ఐపీఎస్ అధికారులతో పాటూ 17 మంది పోలీసుల అధికారులు, కలెక్టర్, నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సూచించడం గమనార్హం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. -
అది కేసును ప్రభావితం చేసే కుట్రే
సాక్షి, అమరావతి: సీఐడీ అధికారులు తన సెల్‌ఫోన్ తీసుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే కుట్రతోనే ఆయన ఇలా చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. కేసు విచారణలో భాగంగా ఏదైనా వస్తువును జప్తు చేసే చట్టబద్ధమైన అధికారం దర్యాప్తు అధికారులకు ఉందనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు మాట్లాడ కూడదని.. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది విచారణను ప్రభావితం చేయడం కిందకు వస్తుందని చెబుతున్నారు. కేవలం విచారణను తప్పుదారి పట్టించాలనే దురుద్దేశంతోనే రఘురామకృష్ణరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు భారత శిక్షా స్మృతిలోని నిబంధనలను న్యాయ నిపుణులు ప్రధానంగా ఉదహరిస్తున్నారు. జప్తు చేసే విశేష అధికారాలు సెక్షన్ 102 ప్రకారం నేరంతో సంబంధం ఉందని అనిపించిన వస్తువులను జప్తు చేసే అధికారం దర్యాప్తు అధికారికి ఉంది. దర్యాప్తు సమయంలో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అప్పటికప్పుడు తటస్థ సాక్షులతో నిమిత్తం లేకుండా జప్తు చేసే విశేష అధికారాలు కూడా అధికారులకు ఉన్నాయి. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడానికి సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కొన్ని సార్లు కింది స్థాయి అధికారులు దర్యాప్తునకు వెళ్లినప్పుడు జప్తు చేసిన వస్తువుల గురించి విచారణ అధికారికి తెలియజేయాలి. విచారణ కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయస్థానానికి సమర్పిస్తామని లిఖిత పూర్వకంగా తెలియజేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సమర్పించవచ్చు సెక్షన్ 167 ప్రకారం జప్తు చేసిన వస్తువుల గురించి రిమాండ్ రిపోర్ట్‌తో పాటు సమర్పించాలని లేదు. కేసు విచారణలో భాగంగా ఎప్పుడైనాసరే సమర్పించవచ్చు. న్యాయస్థానానికి తరలించడానికి అవకాశం ఉన్న వస్తువుల జప్తు గురించి తర్వాత అయినా సరే ప్రస్తావించవచ్చు. తరలించడానికి అవకాశం లేనివాటి గురించి అప్పటికప్పుడు చెప్పాలి. రఘురామకృష్ణరాజు కేసులో సెల్‌ఫోన్ అన్నది న్యాయస్థానానికి తరలించదగిన వస్తువే కాబట్టి దాని గురించి తర్వాత చెప్పే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది. ఆ వస్తువుల గురించి నిందితుడు మాట్లాడరాదు సెక్షన్ 165 ప్రకారం దర్యాప్తు అధికారులు జప్తు చేసిన వస్తువుల గురించి నిందితుడు మాట్లాడకూడదు. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఈ దృష్ట్యా తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని రఘురామకృష్ణరాజు ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. జప్తు చేసిన వస్తువులు అన్నింటి గురించి కూడా దర్యాప్తు అధికారులు వెంటనే ప్రస్తావించాలని కచ్చితమైన నిబంధన లేదు. కొన్ని సార్లు వివిధ కారణాలతో అన్ని వస్తువుల గురించి ప్రస్తావించలేకపోవచ్చు. తర్వాత చార్జ్‌షీట్ నమోదు చేసినప్పుడుగానీ ప్రత్యేక మెమో వేసిగానీ ఆ వస్తువుల జప్తు గురించి న్యాయస్థానానికి తెలియజేసే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది. రఘురామకృష్ణరాజు వాదన అసంబద్ధం తన సెల్‌ఫోన్‌ను జప్తు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు వెల్లడించలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం అసంబద్ధంగా ఉంది. దాని గురించి విచారణ సమయంలో ఎప్పుడైనా చెప్పొచ్చు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు రఘురామకృష్ణరాజు మాట్లాడటం నిబంధనలకు వ్యతిరేకం. కేవలం దర్యాప్తు అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, కేసును ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు. జప్తు అంశాల్లో లోటుపాట్లను సాకుగా చూపించి కేసు నుంచి తప్పించుకోలేరని పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ బల్బీర్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. – కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది -
నిజాలు నిగ్గు తేల్చాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజులక్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాలపైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేకి రాసిన లేఖ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ లేఖపై సుప్రీంకోర్టు విచారణ జరిపించి, నిజానిజాలను నిగ్గు తేల్చాలని న్యాయకోవిదులు, ప్రముఖ న్యాయవాదులు కోరుతున్నారు. ఆ విచారణ పారదర్శకంగా ఉండాలని, అన్ని వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తములను, ప్రతిభావంతులను న్యాయమూర్తులుగా ఎంపిక చేయడంలో కొలీజియం వ్యవస్థ విఫలమైందంటున్నారు. పర్యవసానంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నది వారి అభిప్రాయం. బ్రిటన్, అమెరికాల తరహాలో జవాబుదారీతనాన్ని నిర్దే శించే పకడ్బందీ నిర్మాణ స్వరూపం ఉన్నప్పుడే మెరుగైన న్యాయవ్యవస్థ సాధ్యమవుతుందని వారి భావన. నియామకాలు ప్రశ్నార్థకం... బదిలీలు ఏకపక్షం కొలీజియం వ్యవస్థ ద్వారా సాగుతున్న న్యాయమూర్తుల నియామకాలు, పదో న్నతులు, బదిలీలు వ్యక్తి ఆరాధనా సంస్కృతిని తీసుకొచ్చాయని, న్యాయ నియా మకాల కమిషన్ వంటి ఆదర్శనీయమైన విధానం అమల్లోకొస్తే తప్ప ఈ సంస్కృతి అంతరించే అవకాశం లేదని ప్రముఖ న్యాయకోవిదుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ వంచన తప్ప మరేమీ కాదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌కు రాసిన లేఖ, తదనంతర పరిణామాలపై ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయా ల్లోని ముఖ్యాంశాలు. కొలీజియం వ్యవస్థ ఒక క్లబ్‌గా, గూడు పుఠాణిగా సాగుతోంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనది. ప్రశ్నార్థకమైన నియామకాలు, ఏకపక్ష బదిలీలు మన న్యాయ వ్యవస్థలో ఎన్నో. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. ముర ళీధర్, బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి (ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ ఏకే కురేషీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎస్పీ భట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌లను వివాదాస్పదమైన రీతిలో, అనూహ్యంగా బదిలీ చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయాలకు ఖచ్చి తంగా కొలీజియం విధానమే కారణం. ఆరోపణలు చేయవద్దనడం అర్ధరహితం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చిన న్యాయమూర్తిని, ఆయన ఇంత క్రితం పనిచేసివచ్చిన హైకోర్టుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కొలీజియం సంప్రదిస్తోంది. ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల భవిష్యత్తు అవకాశాలన్నీ ఆ సీనియర్ న్యాయమూర్తి ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటాయి. ఇలా సుప్రీం కోర్టులోని ప్రతి న్యాయమూర్తికీ చాలా పలుకుబడి వుంటుంది. అయితే వారిలో కొందరు తెలివైనవారు దాన్ని ఉపయోగించరు. రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగానికి నాయకత్వంవహిస్తున్నవారు, మరో రాజ్యాంగ వ్యవస్థకు చెందినవారిపై ఆరోపణలు చేయడం సరైందేనా అనేది ఇప్పుడు అర్థరహితమైన చర్చ. జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణన్నీ ఇప్పుడు జనసామాన్యంలో ఉన్నాయి. కనుక వాటిపై తీసుకునే నిర్ణయం కూడా అందరికీ తెలిసేవిధంగానే వుండాలి. ఒక అంతర్గత కమిటీ ద్వారా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తారా లేక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా దీన్ని విచారిస్తారా అన్నది తేల్చుకోవాలి. భూ లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జగన్మోహన్రెడ్డి లేఖలో ప్రస్తావనకు రాని న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. ఆ విచారణ పారదర్శకంగా వుండాలి. అది వెంటనే మొదలు కావాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబో తున్న వారిపై ఇలాంటి ఆరోపణలు రావడం బహుశా ఇదే మొదటిసారి. ఆ రకంగా చూస్తే అది అసాధారణమైనది. పైగా ఒక ముఖ్యమంత్రే ఆ ఆరోపణలను బహిరంగపర్చే ధైర్యం చేయడం మరింత అసాధారణమైనది. ఇందులోని నిజానిజాలు తేల్చనంతకాలం ప్రజానీకం మనసుల్లో అవి సజీవంగా వుంటాయి. ఈ లేఖ న్యాయవ్యవస్థపై ప్రజల కుండే విశ్వాసాన్ని ఒక కుదుపు కుదిపింది. కనుక న్యాయవ్యవస్థ దీనిపై మౌనంగా వుండిపోకుండా తగినవిధంగా వ్యవహరించాలి. ఇది విస్తృత సమస్య జస్టిస్ ఎన్వి రమణ కుమార్తెలపై దాఖలైన ఎఫ్ఐఆర్పై ఎలాంటి వార్తలు రాకూడ దంటూ హైకోర్టు విధించిన గ్యాగ్ ఆర్డర్ గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయానికి విరుద్ధమైనది. న్యాయవ్యవస్థ ఇసుకలోన తలదూర్చిన ఉష్ట్రపక్షి బాప తుగా వున్నదని... అది వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కొనడానికి, సమస్యలతో నేరుగా వ్యవహరించడానికి సిద్ధంగాలేదని అందరూ అనుకునేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి లేఖను ఒక రాజకీయ నాయకుడికి, ఒక న్యాయమూర్తికి సంబంధించిన అంశంగా చూడకూడదు. ఇది అంతకన్నా విస్తృత మైనది. వ్యవస్థీకృత సమస్య. గత కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థకు ఒక దాని తర్వాత ఒకటిగా సంక్షోభాలు వస్తున్నాయి. ఇది న్యాయమూర్తుల మీడియా సమావేశంతో మొదలైంది. జవాబు దారీతనం కోసం మనకు అభిశంసన వుంది. కానీ అది సంక్లిష్టమైనది. ఆచరించడానికి కష్టమైనది. మరొకటి అంతర్గత కమిటీ. అది చాలా బల హీనమైనది. తప్పు చేశారని గుర్తించిన న్యాయమూర్తికి విధించదగ్గ పెనాల్టీ ఏమిటో స్పష్టత లేదు. ఆరోపణలు పెరుగుతూ... వ్యవస్థ ప్రతిష్ట మసక బారు తున్నప్పుడు ఒక పటిష్టమైన, స్పష్టమైన జవాబుదారీ వ్యవస్థ ఏర్పడాలి. దుర దృష్టవశాత్తూ అందుకు అవసరమైన చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ విధానం లేదు. కొన్నేళ్లక్రితం జవాబుదారీతనాన్ని నిర్ణయించే బిల్లు రూపొందింది. కానీ అది కాస్తా మురిగిపోయింది. అందులో ఎన్ని లోపాలున్నా న్యాయ సంస్కరణలు ప్రారంభించడానికి అదొక ప్రాతిపదికగా వుండేది. బ్రిటన్, అమెరికా తరహాలో జవాబుదారీతనాన్ని నిర్దేశించే లిఖితపూర్వకమైన కోడ్, పకడ్బందీ నిర్మాణ స్వరూపం మనకు అత్యవసరం. జస్టిస్ ఏపీ షా (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) న్యాయస్థానంలో తుపాను.. ప్రజాస్వామ్యం చిట్టచివరి కాపలాదారు అయిన న్యాయవ్యవస్థ తనపై అనుమానాలకు అతీతంగా తన్నుతాను కాపాడుకోవాలి. 2021 ఏప్రిల్ 24న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీస్వీకారం చేయవలసిన రెండో స్థానంలో ఉన్న సీనియర్ జడ్జికి వ్యతిరేకంగా వచ్చిన తీవ్రమైన ఆరోపణలను పరిష్కరించవలసిన అవాంఛిత భారాన్ని ప్రస్తుతం న్యాయవ్యవస్థ మోస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణలను సుప్రీంకోర్టు సులభంగా తోసిపారేయలేదు. ఆయన తన ఆరోపణల నివేదికను అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డేకి సమర్పించారు, అక్టోబర్ 10న ముఖ్యమంత్రి ప్రధాన సలహా దారు అజయ్ కల్లాం విజయవాడలో ఆ నివేదికను మీడియాకు విడుదల చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యనిర్వాహకవర్గం, న్యాయస్థానంపై స్వారీ చేయకూడదని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే జడ్జీలపై ఫిర్యాదు చేసినవారిలో ఏపీ ముఖ్యమంత్రే మొదటివారు కారు. 1960లలో ఏపీ ముఖ్యమంత్రి డి. సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రారెడ్డి న్యాయస్థానంలో కులతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ నాటి హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును సానుకూలంగా పరిష్కరించారు. ప్రస్తుత కేసులో ఏపీ సీఎం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దాన్ని బహిర్గతం చేయడమనేది స్పష్టంగానే న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ప్రయత్నమనీ, ఇది కచ్చితంగా కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుందనీ సుప్రీంకోర్టు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇలాంటి ఎత్తుగడలను భారతీయ బార్ కౌన్సిల్ కూడా ఖండిం చింది. అయితే విమర్శల నోరు మూయించడానికి కోర్టు ధిక్కారం అనేది ఎల్లప్పూడూ తొలి ఆయుధంగా ఉపయోగించరాదు. సుప్రీంకోర్టు పనితీరు సరిగా లేదని, ముఖ్యమైన కేసులను ఎంపిక చేసుకున్న బెంచ్‌లకే కేటాయిస్తున్నారని ప్రకటిస్తూ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 2018 జనవరి 12వ తేదీన ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ ఆరోపించినప్పుడే న్యాయవ్యవస్థ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే చట్రాన్ని పాటిస్తోందని ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. జవాబుదారీతనం లేకుండా న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం ఉనికిలో ఉండదు. జస్టిస్ రమణ, ఏపీ హైకోర్టులోని నలుగురు న్యాయమూర్తులపై ఏపీ సీఎం చేసిన ఆరోపణలను సులభంగానే నిర్ధారించవచ్చు. ఈ ఆరోపణలు నిజం కాదని విచారణలో తేలితే ఏపీ ముఖ్యమంత్రిపై కోర్టు ధిక్కార నేరం మోపవచ్చు. కానీ ఏపీ సీఎం ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లయితే, దానిపై తీర్మానం చేయడం సమస్యలను కొనితెస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) చెబుతున్నది ఏమిటంటే, ‘‘పార్లమెంటులోని రెండు సభల్లో ఉన్న సభ్యుల్లోని మెజారిటీ ఆమోదించిన తర్పాత రాష్ట్రపతి ఆదేశం ప్రకారం తప్ప మరేవిధంగానూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తన పదవి నుంచి తొలగించలేరు. పైగా దుష్ప్రవర్తన లేక అసమర్థత ప్రాతిపదికన పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యుల మెజారిటీ మద్దతుతో మాత్రమే న్యాయమూర్తిని తొలగించగలరు’’. అందుకే న్యాయమూర్తిని తొలగించాలనుకుంటే అది మాటల్లో చెప్పినంత సులభం కాదు. (ది స్టేట్స్‌మన్ సంపాదకీయం) నిగూఢతవల్లే సమస్య.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన లేఖ.. న్యాయమూర్తుల ప్రవర్తనపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పర్చాల్సిన అవకాశాన్ని న్యాయవ్యవస్థకు అందించింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాస్పద భూముల కొనుగోలులో జస్టిస్ ఎన్వి రమణ కుమార్తెలకు పాత్ర ఉందని ఆరోపిస్తున్న ఏపీ సీఎం లేఖలోని వాస్తవాలు, తదితర వివరాలకు నేను పూచీపడలేను కానీ రాజ్యాం గబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మరొక రాజ్యాంగ ప్రతినిధి అయిన న్యాయమూర్తిపై లాంఛనప్రాయంగా ఫిర్యాదు చేసినప్పుడు, ఆ ఫిర్యాదులో తీవ్రమైన అరోపణలు ఉన్నప్పుడు ఆ లేఖను తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. ఆ లేఖలో ఆరోపించిన విషయాలను చీఫ్ జస్టిస్ నియమించిన స్వతంత్ర వ్యక్తి నిర్ధారించాల్సిన అవసరముంది. పైగా ఆ లేఖ లోని విషయాలు తప్పు అని జాతికి నిరూపించాల్సిన బాధ్యత కూడా న్యాయవ్యవస్థపైనే ఉంది. పైగా ఆ నిర్ధారణ చాలా పారదర్శకంగా కనిపించాలి కూడా. భారత రాజ్యాంగాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత అంతిమంగా న్యాయవ్యవస్థపైనే ఉంది. దానికోసం న్యాయవ్యవస్థ చాలా బలంగానూ, స్వతంత్రంగానూ పనిచేయాల్సి ఉంటుంది. న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. ఏపీ సీఎం లేఖ వెనుక ఉన్న ఉద్దేశాల గురించి నేను ఊహించి చెప్పలేను. కానీ అలాంటి లేఖ రాయడమన్నదే అత్యంత అసాధారణమైన విషయం. దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. కార్యదీక్షాపరుడైన రాజకీయనాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఏపీ సీఎం ఇలా అడుగేయడానికి స్పష్టంగానే తగిన కారణాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సుదీర్ఘకాలం ఆలోచించిన తర్వాతే ఆయన అలాంటి చర్యకు తప్పనిసరై పూనుకుని ఉండవచ్చు. ఏపీ సీఎంపై కేసులు వాయిదాలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లేఖ రాశారని కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో మళ్లీ అధికారం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కూడా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక బాధ్యతాయుతమైన, ప్రతిష్ట కలిగిన న్యాయవ్యవస్థ ప్రతినిధి. ఈ విషయంలో ఆయన ఒక తెలివైన, సరైన చర్య తీసుకోగలుగుతారని నా నమ్మకం. జాతి విస్తృత ప్రయోజనాలు, సుప్రీంకోర్టు వంటి ఒక గొప్ప వ్యవస్థ సమగ్రత, స్వాతంత్య్రం పరిరక్షణపై ఆయనకు మంచి సలహాలు అందుతాయని చెప్పడం తప్పితే ఈ అంశంలో ఆయన ఏవైపు అడుగు వేస్తారనే దానిపై నేను ఊహించి చెప్పలేను. ఈ సమస్యను అలా పక్కన పెట్టేయడం కాకుండా సరైన రీతిలో చర్య చేపడతారని నా భావన. సీనియర్ న్యాయమూర్తి కొందరు జడ్జిల పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారంటూ ప్రస్తుతం వివాదం చెలరేగిన నేపథ్యంలో జడ్జీల నియామకంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీలను కొలీజియం వ్యవస్థ నియమించే పద్ధతిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. 1992–2003లో ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు దఖలుపర్చుకున్నప్పటి నుంచి న్యాయవ్యవస్థ పనితీరు మున్నెన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చిందని భావిస్తున్నాను. అందుబాటులో ఉన్న వారిలో ఉత్తమమైన న్యాయమూర్తులను ఎంపిక చేయడంలో కొలీజీయం విఫలమైంది. ఇలాంటి నియమకాలు చేసేటప్పుడు పూర్తి స్వతంత్రత కలి గిన వ్యవస్థ చాలా అవసరం. దేశంలోని అన్ని అధికారిక సంస్థలు పారదర్శకంగానూ, జవాబుదారీతనంతోనూ ఉండాలని న్యాయవ్యవస్థ నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ తన విషయానికి వచ్చేసరికి న్యాయవ్యవస్థ అత్యంత బాధ్యతారహితమైన, అపారదర్శకమైన వ్యవస్థగా ఉంటోంది. పాలనావిషయానికివస్తే న్యాయవ్యవస్థ అంతర్గత పని విధానం గురించి ఎవరికీ తెలీదు. న్యాయవ్యవస్థ నిగూఢత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు కానీ, వాటిని సుప్రీం కోర్టు తోసిపుచ్చడమే కాకుండా అలా ఆరోపించిన మహిళను ఉద్యోగం నుంచి తొలిగించి, కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన తర్వాతే ఆమెకు తిరిగి ఉద్యోగం కల్పించిన వార్త కానీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అలాగే అరుణాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలికో పాల్ ఆత్మహత్య చేసుకుంటూ ఇద్దరు మాజీ చీఫ్ జస్టిస్‌లు జేఎస్ కెహర్, దీపక్ మిశ్రాలపై ఆరోపించడం, ఆయన భార్య ఈ విషయమై చేసిన ఫిర్యాదును విచారణ లేకుండానే మరుగునపడేయడం కూడా తెలిసిన విషయమే. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనలో మాత్రం కోర్టు వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఉన్నత న్యాయస్థానాల్లోని జడ్జీల వ్యక్తిగత ప్రవర్తనను ప్రశ్నించే ఆస్కారమే మన వ్యవస్థలో లేదు. ఇక వారిపై విచారణ గురించి చెప్పపనిలేదు. సుదీర్ఘకాలంలో ఈ పరిస్థితి మార్పు చెందుతుందనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏపీ సీఎం జగన్ లేఖ అలాంటి యంత్రాం గాన్ని ఏర్పర్చే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు అందిస్తోంది. పైగా న్యాయమూర్తులు కూడా చట్టపరిధిలోనే ఉంటారని విశ్వాసం కలిగిస్తూ పౌరుల్లోని భయాలను ఇది తొలగిస్తుంది కూడా. సుప్రీంకోర్టుకు తాను రాసిన లేఖను ఏపీ సీఎం గుట్టుగా ఉంచాలని నేను తప్పక భావిస్తాను. కానీ ఆయన అలా గుట్టుగా పెట్టినా మన మీడియా ప్రతి దాన్నీ బట్టబయలు చేస్తోంది. కాబట్టి ఎంత రహస్యంగా ఉంచినా ఇలాంటివి జనాలకు అనివార్యంగా తెలిసిపోతుంటాయి. దుష్యంత్ దవే వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు (ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో) షాక్ ట్రీట్మెంట్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనౌచిత్యంపై అవినీతిపై, ఏపీ హైకోర్టు జడ్జీలపట్ల పాక్షికత ప్రదర్శించడంపై ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ద్వారా మొత్తం న్యాయవ్యవస్థపైనే బాంబు విసిరారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక, అమరావతి నూతన రాజధాని సరిహద్దులను ప్రకటించిన మధ్యకాలంలో వ్యవసాయ భూముల కొనుగోలు గురించి ఆ లేఖ ప్రస్తావించింది. రాజధాని సరిహద్దులు గుర్తించిన తర్వాత అక్కడి భూములను సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తెలు కొనుగోలు చేసిన వైనాన్ని పేర్కొంటూనే, రాజధాని సరిహద్దులు గీయక ముందు ఉన్న తక్కువ ధరలతో ఆ భూమిని వారు కొన్నారని, ఆవిధంగా వారికి భారీ ప్రయోజనం సిద్ధించిందని ఏపీ సీఎం లేఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన కార్యదర్శి కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ అమరావతి భూముల కొనుగోలుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. గత ప్రభుత్వంలో అధికార స్థానాల్లో ఉన్నవారు తమ హోదాను దుర్వినియోగపర్చి రాజధాని సరిహద్దులను తమకు అనుగుణంగా మార్చి తమ బంధువులు, వాణిజ్యవర్గాలు, కుటుంబ సభ్యులు, రాజ కీయ పార్టీ సభ్యులు వాటిని అక్రమంగా కొనుగోలు చేసేలా ప్రేరేపించారని ఆరోపించారు. ప్రత్యేకించి రాజకీయంగా సున్నితమైన కేసులను ఏపీ హైకోర్టులో తనకు అనుకూలురైన జడ్జీలకు కేటాయిస్తూ న్యాయవిచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు జడ్జిపై వైఎస్ జగన్ ఆరోపించారు. అమరావతి భూముల కుంభకోణంపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నివేదికపై అన్ని విచారణలను నిలిపివేయాలని హైకోర్టు అర్థరాత్రి వేళ ఆదేశాలు జారీ చేయడం వెనుక గత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూల వైఖరి ప్రదర్శించడమే కాకుండా సుప్రీంకోర్టు జడ్జి కుమార్తెలు, మాజీ అడ్వొకేట్ జనరల్‌పై ఆరోపణలపై కూడా స్టే విధింపచేశారని ఏపీ సీఎం తన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. యావత్ దేశాన్ని నివ్వెరపర్చిన ఈ పరిణామాల నేపథ్యంలో రెండు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 1. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతిని ఉద్దేశించి రాసిన ఆ లేఖను బహిరంగపర్చవచ్చా? 2. ఈ లేఖ పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందన ఏమిటి? న్యాయమూర్తిపై అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ముగ్గురు న్యాయమూర్తులతో ఇన్ హౌస్ విచారణ జరపాలని 1997లో ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని బహిర్గతం చేయరాదని అప్పట్లో కోర్టు పేర్కొంది కానీ ఈ ఆదేశం మాటున జడ్జీలపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలను ప్రజలకు తెలుపకుండా దాచి ఉంచే మార్గాన్ని న్యాయవ్యవస్థ కనుగొంది. ఇప్పుడు వైఎస్ జగన్ రాసిన లేఖను మీడియాకు బహిరంగపర్చడంపై చర్య తీసుకోవాలని కొందరు పిటిషన్లు వేశారు. కానీ ఒక రాష్ట్ర సీఎంపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడం వ్యతిరేకఫలితాలను తేవడమే కాకుండా న్యాయవ్యవస్థ ప్రతిష్టకు మరింత నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంది. వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. జడ్డీల ప్రవర్తనా నియమావళికి భంగం కలిగినప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే విచారణ చేయాలి. కానీ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావలసిన వ్యక్తిపై ఆరోపణలను ఆయనకు కింది స్థానంలోని జూనియర్ జడ్డీలు నమ్మదగిన రీతిలో విచారించడం కష్టసాధ్యం అవుతుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయిపై ఒక మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఇన్ హౌస్ విచారణ చేసిన బెంచ్ ఆ మహిళ లాయర్ని అనుమతించలేదు. న్యాయవిచారణ ప్రక్రియను రికార్డు చేయడానికి కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం సుప్రీం కోర్టు జడ్డిపై చేసిన ఆరోపణలను అత్యంత విశ్వసనీయత కలిగిన రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి. ఇది మాత్రమే న్యాయవ్యవస్థ ప్రతిష్టను పెంచగలదు. ప్రశాంత్ భూషణ్ వ్యాసకర్త సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది (ది హిందూ సౌజన్యంతో) ఆ లేఖ విస్మరించలేనిది.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖను న్యాయవ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని కొట్టిపారేయలేం. ఏపీ హైకోర్టు అనేక సందర్భాల్లో న్యాయదీపంలా కనిపించేది కానీ నేడు రాజ్యవ్యవస్థ మూడు విభాగాల్లో ఒకటైన కార్యనిర్వాహకవర్గం న్యాయవ్యవస్థ పైన, హైకోర్టుపైనే విశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తోంది. తొలి చీఫ్ జస్టిస్‌గా, తర్వాత 1966లో 9వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావును మర్చిపోగలమా? ఇతర హైకోర్టులకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచిన మన జస్టిస్ ఓ చిన్నపరెడ్డిని మరవగలమా? ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాసి సీజేఐకి పంపడం కలవరం కలిగించింది. ఏపీ సీఎంకి న్యాయవ్యవస్థతో తగవు ఉంది కాబట్టి అలాంటి లేఖ రాశారని కొందరు వాదిస్తున్నారు కానీ ఏపీ హైకోర్టు పనితీరును ఎవరూ కప్పిపుచ్చలేరు. ఏపీ హైకోర్టు సుప్రీం న్యాయమూర్తి విశ్వాసపాత్రుల నియంత్రణలో ఉందని, పైగా తన రాజకీయ ప్రత్యర్థికి అనుకూలంగా తన విధానాలకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తోందని ప్రస్తుత సీఎం ఆరోపణ. ఇక హైకోర్టు వాదన ఏమిటంటే తనకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో జరుగుతున్న ప్రచారానికి కారకులపై రాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నదే. అదేసమయంలో అమరావతి భూ కుంభకోణంలో పాత్ర ఉన్న మాజీ అడ్వకేట్ జనరల్, ఇతర పాత్రధారుల అరెస్టును కోరుతూ దాఖలైన ఎఫ్ఐఅర్ని సైతం మీడియాలో ప్రచురించరాదని అర్థరాత్రి ఆదేశాలు చేసిన హైకోర్టు వ్యవహారం చాలామందిని కలపరపర్చింది. మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల పేర్లు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పైనే నిషేధం విధించడం న్యాయవ్యవస్థ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. అంతకుమించి అనేక కేసుల్లో హైకోర్టు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సంతోషంగా లేదు. పైగా హైకోర్టు ఆదేశాల పట్ల వ్యాఖ్యానాలు చేసిన ఎంపీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ పట్ల కూడా కోర్టు ధిక్కార చర్య కింద విచారణకు ఆమోదం తెలుపడంతో న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య మరింత ఆజ్యం పోసినట్లయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా హైకోర్టు వ్యవహరిస్తోందని ఏపీ సీఎం ఆరోపించడం, హైకోర్టు పట్ల ప్రభుత్వం శత్రుపూరిత వైఖరిని అవలంబిస్తోందని హైకోర్టులో రిట్ పిటిషన్ దఖలు కావడం రెండు రాజ్యాంగ సంస్థల మధ్య సఖ్యత లేదని స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టుపై దాఖలైన రిట్ పిటిషన్ వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హస్తముందని హైకోర్టు భావించడంతో రెండు రాజ్యాంగ సంస్థల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయి. మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సస్పెండైన న్యాయమూర్తితో మాట్లాడిన సంభాషణలన్నీ ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా సాగించిన కుట్రలో భాగమేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భావించింది. రాజ్యాంగంలోని 226వ అధికరణ కింద తనకున్న అధికారాలను వినియోగించుకుని విచారించి, ఈ విషయంలో విచారణ చేయమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్‌ను కోరింది. ఆయన ఈ కేసులోని నిజానిజాలను, సంభాషణలను నిగ్గుతేల్చాలని కోరింది. మూడో పక్షం ప్రయోజనాలను కూడా నిగ్గుతేల్చాలని ఆయనకు సూచించింది. మొత్తంమీద చూస్తే ఏపీ హైకోర్టు వ్యవహారాలు సజావుగా సాగటం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం రాసిన లేఖను ఒక విడి చర్యగా భావించలేం. పైగా దీన్ని న్యాయవ్యవస్థ స్వతంత్రతలో జోక్యం చేసుకుంటున్న వ్యవహారంగా తోసిపుచ్చలేం కూడా. కృష్ణప్రసన్న వైట్ల, న్యాయశాస్త్ర విద్యార్థి (ది హిందూ సౌజన్యంతో) -
అమెరికా సుప్రీంకు భారత సంతతి జడ్జి!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన న్యాయ నిపుణుడు అమూల్ థాపర్(49) అమెరికా సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 31న జడ్జి జస్టిస్ ఆంథోని కెన్నెడీ పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో నియమించేందుకు రూపొందించిన 25 మందితో కూడిన జాబితాలో థాపర్ పేరు ఉంది. ఈ జాబితా నుంచే ఒకరిని కెన్నెడీ స్థానంలో నియమిస్తానని ట్రంప్ ఇది వరకే స్పష్టం చేశారు. కెన్నెడీ స్థానాన్ని భర్తీచేసేందుకు ట్రంప్ మనసులో ఉన్న తుది ఏడుగురిలో థాపర్ ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. గతేడాదే ఆయన కెంటకీ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. 1991లో బోస్టన్ కాలేజీ నుంచి బీఎస్ పూర్తిచేసిన థాపర్..కాలిఫోర్నియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. -
‘తక్కువ సమయం’ సహేతుకమే
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పును న్యాయ నిపుణులు స్వాగతించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు సహేతుకం, సమర్థనీయమైనవి, దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై అనుమానాలు నివృత్తి అవుతాయని సీనియర్ లాయర్లు రాకేశ్ ద్వివేది, అజిత్ సిన్హా, వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. బలపరీక్షకు కోర్టు కాల పరిమితి విధించడంలో తప్పు లేదని అజిత్ అన్నారు. ప్రమాణ స్వీకారాన్ని కోర్టు వాయిదా వేసి ఉండాల్సిందన్న వికాస్..బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సబబేనన్నారు. ‘బలపరీక్షకు తక్కువ సమయం ఇవ్వడం సమంజసమే. గోవా, ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగింది. ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు ఫిరాయించే ముప్పుంది. ఇప్పటికే రెండ్రోజులు లేటైంది’ అని ద్వివేది అన్నారు. ద్వివేదితో అజిత్ ఏకీభవించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల పందేరానికి తెరతీసినట్లవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై స్పందిస్తూ..ఆ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దే అని ద్వివేది అన్నారు. -
మహిళా రక్షణ చట్టాల కోసం..
ప్రస్తుత సమాజం కన్నా ఆదిమ సమాజం ఎంతో మెరుగ్గా ఉంది. ఎందుకంటే అప్పటికి మనుస్మృతి ఇంకా వెలువడలేదు. అందుకే ఆ సమాజంలో అసమానతలు లేవు. జాతి,మత, కుల వైషమ్యాలు లేవు. ఆడ, మగ అనే తేడాలు అసలే లేవు. కాలం గడుస్తున్న కొద్ది సమాజం విస్తరిస్తూ పోయింది. రాజ్యాలు, రాజులు కాలం ప్రారంభమయ్యింది. విజ్ఞానం పెరిగిన కొద్ది విచక్షణ నశిస్తుందేమో అనేట్టుగా సమాజం మారింది. ఆడవారిని వంటింటికే పరిమితం చేయడం ప్రారంభమయ్యింది. చివరికి మగ వారి అండ లేకుండా వారి మనుగడ కష్టం అనే స్థాయికి పరిస్థితులు మారాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో ఎన్నో దురాచారాలు రాజ్యమేలాయి. వీటి నిర్మూలనకు కృషి చేసిన మహనీయులేందరో. ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. నేటి సమాజంలో ఉన్న ఆధునిక రుగ్మతలను రూపుమాపడానికి, సమానత్వం కోసం న్యాయవాద వృత్తిని ఎంచుకుని పోరాటం సాగిస్తున్నమహిళలెందరో.... కర్నేలియా సోరాబ్జి 1866లో జన్మించిన కర్నేలియా సోరాబ్జి దేశంలోనే తొలి మహిళ న్యాయవాది. బ్రిటన్‌లో, భారతదేశంలో అలహబాద్ హై కోర్టులో ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ. బాంబే యూనివర్సీటి నుంచి తొలి మహిళ పట్టభద్రురాలు. అంతేకాదు ఆక్స్ఫర్డ్ యూనివర్సీటిలో న్యాయశాస్రం చదివిన తొలి మహిళ భారతీయ మహిళ కూడా కర్నేలియా సోరాబ్జినే. ఇందిరా జైసింగ్ కట్నం కోసం వేధింపులు, అత్తాఆడుచుల ఆరళ్లు, ఆడపిల్లను కంటే కాటికే, కట్టుకున్నవాడే కసాయిగా మారి బంధాన్ని, బతుకును నరకప్రాయం చేస్తుంటే ఆదుకునే వారు లేక మూగగా రోదించారు. సహనం నశించి ప్రాణాలు తీసుకున్న వారెందరో. ఈ హింసనుంచి ఆడవారిని బయటపడెయ్యటానికి ప్రభుత్వం 2005లో గృహ హింస చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రూపుదిద్దికోవడానికి వెనక ఓ మహిళ న్యాయవాది అసమాన కృషి ఉంది. ఆమె ఇందిరా జైసింగ్. ప్రముఖ న్యాయవాది. అంతేకాదు స్త్రీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. మన దేశంలో అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళ ఇందిరా జైసింగ్. మీనాక్షి అరోర నేటికి ఆడవారు స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితులు లేవు. ప్రధాన కారణం లైంగిక వేధింపులు. దీనికి ఏ రంగం మినహాయింపు కాదు. ఈ వేధింపులను నిరోధించాడనికి 2013లో ప్రభుత్వం పనిప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రూపోందించడంలో మీనాక్షి అరోర పాత్ర కీలకమైనది. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది. స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారు. వ్రింద గ్రోవర్ దేశంలో సోని సోరి అత్యాచార కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ కేసులో బాధితుల తరుపున నిలబడ్డారు వ్రిదా గ్రోవర్. ఆమె గృహ హింస బాధితుల కోసం, లైంగిక వేధింపులకు గురయిన పిల్లల గురించి పోరాడుతున్నారు. ఆమె కృషి ఫలితంగా 2010లో హింసా నిరోధక చట్టం, 2012లో పోస్కో చట్టం, 2013లో క్రిమినల్ లా సవరణ ముసాయిదాలు రూపోందించారు. మానవ హక్కులు, స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న వ్రిందా గ్రోవర్‌ను 2013లో టైమ్స్ మాగ్జైన్ 100మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించారు. లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, ఒక రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ లీలా సేథ్. కుమార్తెలకు కూడా ఉమ్మడి కుటుంబం ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయని 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం రావడానికి ఆమె చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ హక్కుల గురించి సానుకూల ప్రకటనలు చేశారు. మేనక గురుస్వామి రాజ్యంగం అంటే ప్రాణం, రాజ్యంగం కల్పించిన హక్కులు అందరికి సమానం అని నమ్మే వ్యక్తి మేనక గురుస్వామి. తనను తాను‘‘తమ బాధలు చెప్పుకోలేని, తమ స్వేచ్ఛకు భంగం కలుగుతున్నా మౌనంగా భరించే పేదల పక్షపాతిగా’’ చెప్పుకోవడానికి ఇష్టపడతారు మేనక. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మేనకా గురుస్వామి విద్యాహక్కు చట్టంగా రూపొందడంలో విశేష కృషి చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 ను సవాలు చేసినప్పుడు నాజ్ ఫౌండేషన్ తరుపున వాదించిన న్యాయవాదుల్లో ఆమె ఒకరు. కరుణ నంది సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కరుణ నంది లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనలోని బాధితుల తరుపున న్యాయం కోసం పోరాడుతున్నారు కరుణ నంది. వాక్ స్వాతంత్రాన్ని నిరోధించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని 66ఏ సెక్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంలో కరుణ నంది పాత్ర కీలకం. ఫ్లావియా ఆగ్నెస్ మహిళలకు చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని అందించే 'మజ్లిస్' సహ వ్యవస్థాపకురాలైన ఫ్లావియా ఒక ప్రముఖ రచయిత, న్యాయవాది, మహిళా హక్కుల కార్యకర్త. ఆమె చేసిన స్త్రీవాద రచనలు చాలా ప్రాముఖ్యత కలిగివున్నాయి. ఆమె సేవలను అప్రతిష్ట చేయడానికి ఆమె ప్రసిద్ధి చెందింది. చట్టపరమైన విషయాలలో మహిళలకు ఆమె చేసిన సేవలు అసమానం. 1979లో ఆమె ఫోరం ఎగైనెస్ట్ ఒప్ప్రెషన్ ఆఫ్ విమెన్ (ఎఫ్ఏఓడబ్ల్యూ)ను ఏర్పాటు చేసి భార్యను కొట్టడం, వరకట్నం, లైంగిక వేధింపులు వంటి సమస్యల గురించి ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పింకీ ఆనంద్ పింకీ ఆనంద్ సుప్రీం కోర్టులో ఒక సీనియర్ న్యాయవాది. ఆమె రాజ్యాంగ లా, కుటుంబ లా, పర్యావరణం లా వంటి రంగాలలో నిపుణురాలు. ఆమె భారతదేశపు అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన రెండో మహిళ. తృప్తి దేశాయ్ లింగ సమానత్వం కోసం పోరాడుతున్న కార్యకర్త. ముఖ్యంగా మహిళలను నిషేధించిన ఆలయాల్లో వారి ప్రవేశం కోసం ముంబైలో భుమాత బ్రిగేడ్ సంస్థను స్థాపించరు. ఆ సంస్థ కార్యకర్తలతో కలిసి మహారాష్ట్రలోని శని శింగాపూర్ ఆలయం, మహాలక్ష్మీ దేవాలయం, త్రైయంబకేశ్వరాలయం వంటి ఆడవారి ప్రవేశాన్నినిషేధించిన ఆలయాల్లో వారిక ప్రవేశం కల్పించాలని ప్రచారం చేశారు. కేవలం హిందూ దేవలయాలనే కాకుండా హాజీ ఆలీ దర్గాలో స్త్రీలు ప్రవేశించే హక్కును పోరాడి సాధించారు. ఇటీవల కాలంలో ఆమె శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూన్నారు. - పిల్లి ధరణి -
‘సుప్రీం’ సంక్షోభంపై న్యాయ నిపుణుల స్పందనలు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశాన్ని అసాధారణ అంశంగా న్యాయ నిపుణులు పేర్కొన్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణాలు ఉండవచ్చని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై సందేహలు తలెత్తాయని కొందరు న్యాయ కోవిదులు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాదులు కేటీఎస్ తులసీ, న్యాయ శాఖ మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అశ్వనీ కుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎస్ సోధీ, జస్టిస్ ముకుల్ ముద్గల్లు ఆందోళన వెలిబుచ్చగా.. సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ ఈ పరిణామాల్ని ఆహ్వానించడంతో పాటు, మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్ని అభినందించారు. ‘ఈ పరిణామం జరిగి ఉండాల్సింది కాదు. ఇప్పుడు న్యాయమూర్తులు రాజనీతి విజ్ఞతను ప్రదర్శించి, విభేదాలు తొలగి పోయేలా చూడాలి. న్యాయమూర్తుల మధ్య పరస్పర అవగా హన కొనసాగేలా చేయాలి. న్యాయవాదులుగా మేమిదే కోరుకుంటున్నాం’. – సీజేఐతో భేటీ అనంతరం అటార్నీ జనరల్ వేణుగోపాల్ సీనియర్ న్యాయవాదులుగా డబ్బు సంపాదించగల అవకాశమున్నా వృత్తి జీవితాన్ని వారు త్యాగం చేశారు. వారిని మనం గౌరవించాలి. ప్రెస్ కాన్ఫరెన్స్‌తో ఆ న్యాయమూర్తులు ముందుకు వచ్చినప్పుడు.. తప్పుపట్టకుండా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి. సంప్రదింపులతో ఈ విషయం పరిష్కారమయ్యేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులతో ప్రధాని మాట్లాడాలి. – సుబ్రహ్మణ్య స్వామి, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ ఆ నలుగురు న్యాయమూర్తులు చాలా బాధ్యత కలిగినవారు. వారు ఈ విధంగా చేయడమంటే.. తప్పకుండా పరిస్థితి అదుపు తప్పి ఉండాలి. కేసుల కేటాయింపు విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన అధికార పరిధిని దుర్వినియోగం చేస్తున్నారని వారు చెప్పారు. – ప్రశాంత్ భూషణ్, సీనియర్ న్యాయవాది న్యాయవ్యవస్థలో ఇది చీకటి రోజు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశం చెడు సంప్రదాయానికి దారితీయవచ్చు. ఇక నుంచి న్యాయవ్యవస్థలోని అన్ని తీర్పుల్ని సామాన్య పౌరుడు అనుమానాస్పద దృష్టితో చూడవచ్చు. ప్రతి తీర్పును ప్రశ్నించవచ్చు.– ఉజ్జ్వల్ నికమ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మీడియా సమావేశం నిర్వహించడం మినహా ఏ ఇతర ప్రత్యామ్నాయం లేనంత తీవ్రమైన విషయం ఆ నలుగురు న్యాయమూర్తుల వద్ద ఉండొచ్చు. వారు ప్రచారం కోసం పాకులాడే న్యాయమూర్తులు కాదు. అనవసర ప్రచారం కోసం అర్రులు చాచరు. లోయాకు ఈ అంశంతో సంబంధం ఏంటి? నాకైతే ఏమీ తెలియదు. – ముకుల్ ముద్గల్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఈ అంశంలో నేను చాలా కలత చెందా. ఇది జరిగి ఉండకూడదు. అయితే జరిగింది.. వారి వద్ద ఏదో బలమైన కారణం ఉండవచ్చు. ఈ పరిణామం ప్రజల మనసుల్లో ఆందోళన కలిగించే అవకాశముంది. – ఏకే గంగూలీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఈ పరిణామంతో నేను చాలా నిరాశ చెందా.. నలుగురు సుప్రీం జడ్జీలు ఇలా చేయకూడదు. ఇది న్యాయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.– సోలీ సొరాబ్జీ, మాజీ అటార్నీ జనరల్ ఇది చరిత్రాత్మకం.. ఆ నలుగురు న్యాయమూర్తుల్ని నేను అభినందిస్తున్నా. వారితో నేను ఏకీభవిస్తున్నా. ఈ పరిణామం మెచ్చుకోదగింది. సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం ఉండాలి. – ఇందిరా జైసింగ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది న్యాయవ్యవస్థలోని అంతర్గత సమస్యను ఇలా బహిరంగంగా చర్చించ డం సరికాదు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను నలుగురు న్యాయమూర్తులు అనవసరంగా మీడియా ముందుకు తీసుకు వచ్చారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలా వారు ప్రవర్తించారు. –సంతోష్ హెగ్డే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చదవండి: 'సుప్రీం' సంక్షోభం ‘సుప్రీం’లో సంక్షోభానికి కారణాలివి! -
నయీమ్ ఆస్తుల జప్తు కష్టమే!
-
నయీమ్ ఆస్తుల జప్తు కష్టమే!
బలమైన ఆధారాలు ఉండాలన్న న్యాయ నిపుణులు - ఆస్తులపై పక్కాగా రిజిస్ట్రేషన్లు, సంబంధిత పత్రాలు - 15 ఏళ్ల కిందటి బెదిరింపులకు ఆధారాలు దొరకని వైనం - బాధితుల వాంగ్మూలాలు మాత్రమే సేకరించిన సిట్ - 24 ఇళ్లను సైతం జప్తు చేసుకోలేని పరిస్థితి - 1,130 ఎకరాల్లో 300 ఎకరాల స్వాధీనానికే అవకాశం - ఇళ్ల విషయాల్లో ట్యాక్స్ కడితే అభ్యంతరం లేదన్న ఐటీ శాఖ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవడం సులభం కాదని న్యాయ నిపుణులు తేల్చిచెప్పారు. నయీమ్ కబ్జాకు పాల్పడి నట్టు బలమైన ఆధారాలేవీ దొరకలేదని సిట్వర్గాలు గతంలోనే వెల్లడించాయి. నయీమ్ ఇళ్లతో పాటు డెన్లలో లభించిన డాక్యుమెంట్లను బట్టి 1,130 ఎకరాల భూమి నయీమ్ సంబంధీకులు, బినామీల పేర్ల మీద ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఇక తెలంగాణతో పాటు గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్ తన సంబంధీకుల పేర్ల మీద పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించాడు. వాటికి సంబంధించి అన్ని పత్రాలు చట్టపరంగా సక్రమంగా ఉన్నాయని, వాటిని జప్తు చేసుకోవడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు పోలీస్ శాఖకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో కేసులో ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. 15 ఏళ్ల కిందటి వ్యవహారాలు.. భువనగిరి, యాదాద్రి, మిర్యాలగూడ, షాద్‌నగర్, కల్వకుర్తి, శంషాబాద్, నార్సింగి, నల్లగొండ.. ఇలా పలు ప్రాంతాల్లోని తమ భూములను నయీమ్ తక్కువ ధరలకే లాక్కున్నాడంటూ 204 మంది సిట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే 10–15 ఏళ్ల కింద జరిగిన భూకబ్జాల్లో ఆధారాలు ఏ విధంగా సేకరించాలనేది సవాలుగా మారింది. పైగా బాధితులు స్వయంగా సంతకాలు పెట్టారు, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, పహా ణీల్లో పక్కాగా నమోద య్యాయి. బాధితుల వాంగ్మూలం తప్ప అద నపు ఆధారాలేవీ లభించ లేదు. ఈ వ్యవహారాల్లో చార్జిషీట్ దాఖలు చేశాక కోర్టులో జరిగే వాదోప వాదాలపై ఆధారపడి జప్తు ఆదేశాలు వెలువడ తాయి. కానీ చార్జిషీట్ వేసేందుకు నయీమ్ ఇంట్లో దొరికిన అకౌంట్ బుక్, బాధితుల వాంగ్మూలం సరిపోతాయా? కోర్టులో ఇవి నిలబడతాయా? అన్నది సందేహంగా మారింది. ఇక నయీమ్ ఈ 1,130 ఎకరాల భూములను తన అనుచరులు, బంధు వులు, అధికారులు, రాజకీయ నాయకుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. వారంతా ఆయా భూముల కొనుగోలుకు సరిపడా ఆదాయ మార్గాలు చూపిస్తే.. వాటి జప్తు సులభం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు గట్టి ఆధారాలున్న 300 ఎకరా లను మాత్రమే జప్తుకు గానీ, బాధితులకు అందించేందుకు గానీ వీలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్ల విషయంలోనూ..! తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్ నగదు చెల్లించి కొనుగోలు చేసినట్టు సంబంధిత ఇళ్ల పాత యజమానులు పోలీసు విచారణలో వెల్లడించారు. ఆ ఇళ్ల కేసుల్లోనూ జప్తు సులభం కాదని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇళ్లు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి. కానీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషనై ఉందో ఆ వ్యక్తి కోర్టు నుంచి సీజర్ రిలీఫ్ పిటిషన్ ద్వారా ఆ ఇళ్లను పొందేందుకు మార్గం ఉందని వెల్లడించినట్లు సమాచారం. అయితే ఎలాంటి చట్టపరమైన ఆదాయ మార్గాలు లేని నయీమ్ కోట్ల విలువచేసే 24 ఇళ్లను కొనుగోలు చేయడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. యజమానులుగా చలా మణీలో ఉన్న వ్యక్తులు ఐటీ శాఖకు కట్టాల్సిన జరి మానా కట్టేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని.. ఆదాయ మార్గాలు, వనరులు చూపి, పన్ను చెల్లిస్తే సరిపోతుం దని న్యాయ నిపుణులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఐటీ శాఖ వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. ఒక చోట అలా.. మరో చోట ఇలా.. నయీమ్ చేసిన భూకబ్జాలకు సంబంధించి తన డైరీలు, ఖాతా బుక్కుల్లో స్పష్టంగా రాసుకున్నాడు. ఈ డైరీలు, అకౌంట్ పుస్తకాల్లో ఉన్న ఆధారాలను చార్జిషీట్లో పేర్కొంటున్న సిట్ వర్గాలు... పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులతో ఆయనకున్న సంబంధాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్న అంశాలపై వివాదం చెలరేగుతోంది. నాయకులు, పోలీసులతో నయీమ్ సాగించిన సెటిల్ మెంట్ల కేసులను ఎందుకు ఆధారాలుగా వాడుకోవడం లేదన్నది విమర్శలకు తావిస్తోంది. బలంగా ఉంటేనే ఎన్ఫోర్స్మెంట్కు.. నయీమ్ అక్రమాస్తుల కేసులో పోలీసులు వేసే చార్జిషీట్లో బలమైన ఆధారాలుంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చార్జిషీట్లలో మనీ ల్యాండ రింగ్, అసంబద్ధ పెట్టుబడులను స్పష్టమైన ఆధారాలతో చూపించగలిగి తేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసులను పరిశీలిస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. -
పన్నీర్ సెల్వం రాజీనామా వెనక్కి తీసుకోవచ్చా?
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం గతవారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠ పోరాటం నుంచి శశికళ ఔట్ అయ్యారు. ఇక ఆ పోస్టుకు పన్నీర్ సెల్వం ఒక్కరే మిగిలారు. కానీ పన్నీర్‌పై పట్టువదలని శశికళ తాను జైలుకు వెళ్తూ కూడా తన వర్గం నుంచి కొత్తవ్యక్తి పళనిస్వామిని రంగంలోకి దింపారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని సంకేతాలు ఇస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం లీగల్‌గా తన రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని పరిస్థితుల్లో రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. మొత్తం మూడు రకాల పరిస్థితుల్లో గవర్నర్, ముఖ్యమంత్రి రాజీనామా విత్‌డ్రాను ఆమోదించవచ్చని కొందరు మాజీ జడ్జిలు పేర్కొంటున్నారు. మోసం, బలవంతం లేదా అనుచిత ప్రభావంతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదురుతుందని తెలుస్తోంది. అయితే సంబంధిత వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో నిరూపించుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు తెలుపుతున్నారు. పన్నీర్ సెల్వం కూడా తనను బలవంతం మీద ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని నిరూపించుకోవాలని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి ఒకరు చెప్పారు. అయితే శశికళ వర్గంలోని ఓ వ్యక్తిని అధికార పార్టీకి కొత్త నేతగా ఎన్నుకుంటే, ఆ సమయంలో మెజార్టిని ఇరు వర్గాలు నిరూపించుకునేందుకు గవర్నర్ పిలుపునిచ్చే అవకాశముంటుందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే పరిస్థితి నెలకొంది. శశికళ వర్గం పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయంపై గవర్నర్ ఏం చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదే పరిస్థితి 1984 ఎన్ టీ రామారావును ముఖ్యమంత్రిగా తొలిగిస్తూ నాదెళ్ల భాస్కర్ రావును సీఎంగా నియమించిన సందర్భంలో ఎదురైంది. సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన రోజు తనని బలవంతంగా రాజీనామా చేపించినట్టు పేర్కొన్నారు. -
ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు
ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన అధికారులతో సీఎం సంప్రదింపులు.. న్యాయశాఖ సలహాకు ఫైలు సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్ష జరిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలను పరిశీలించడంతో పాటు బిల్లులకు సంబంధించిన అంశాల పరిశీలనకు న్యాయ శాఖతోనూ సంప్రదిం పులు జరుపుతున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈలోగా బిల్లుల రూపకల్పనతో పాటు సర్క్యూలేషన్ పద్ధతిలో మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2007లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 14 ముస్లిం వర్గాలను బీసీ–ఇ కేటగిరీలో చేర్చింది. వీరికి 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీ లు, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా నియమించిన విచారణ కమిషన్ న్యాయపరమైన సలహాలతో పాటు చట్టసభల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నివేదికలో ప్రస్తావించింది. న్యాయ నిపుణుల సలహాతో తమిళనాడులో అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా ముస్లిం రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని సూచించింది. మరోవైపు సుధీర్ కమిషన్ నివేదికలోని అంశాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీఎస్ రాములు బీసీ కమిషన్ పరిశీలనకు అప్పగించారు. ముస్లింలతో పాటు ప్రస్తుతం ఎస్టీలకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను 12 శాతంకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎస్టీల స్థితిగతులపై ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేస్తోంది. -
అర్చకులకు ఒకటినే కచ్చితంగా వేతనాలు
-
అర్చకులకు ఒకటినే వేతనాలు
ప్రభుత్వోద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానం: కేసీఆర్ - అవసరమైతే చట్ట సవరణ.. ఈ సమావేశాల్లోనే బిల్లు - న్యాయ నిపుణులతో చర్చించి ముసాయిదా రూపకల్పన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాల యాల్లో అర్చకులకు ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం దేవాదాయ చట్ట సవరణ చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలిపారు. సమాజంలో గౌరవంగా బతికే రీతిలో వేతనాల చెల్లింపు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయాల ఉద్యోగులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ల సాధన కోసం దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సలహాదారు రమణాచారి, కమిషనర్ శివశంకర్‌లతో సుదీర్ఘంగా సమీక్షించారు. అర్చక సంఘాల ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ, దేవాలయ ఉద్యోగుల ప్రతినిధులు రంగారెడ్డి, మోహన్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు. ప్రత్యేక నిధి నుంచి... దేవాదాయ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న 642 ఆలయాలకు సంబంధించి దాదాపు 5,800 మంది అర్చకులు, ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘అర్చకత్వం గౌరవమైన వృత్తి. కానీ వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పోటీ సమాజంలో ఇది పెద్ద సమస్యగా మారింది. అర్చకత్వం చేసే యువకులకు పిల్లనివ్వడానికి ముందుకు రాని దుస్థితి రావడం బాధాకరం. ఈ పరిస్థితి మారాలి. వారికీ గౌరవప్రదమైన వేతనాలు అందాలి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఒకటో తారీఖునే చేతిలో పడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆలయాల నుంచి దేవాదాయశాఖ వసూలు చేసే 12 శాతం మొత్తాన్ని ఒకచోట నిధిగా చేసి.. దాని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఠంచన్‌గా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆ నిధి చాలని పక్షంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి వేతనాలను కూడా క్రమబద్ధీకరించాలని.. అందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సంక్రాంతి నాటికే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు కొత్త వేతన విధానం అమల్లోకి రావాలన్నారు. భూముల లెక్కలు తేల్చండి గత ప్రభుత్వాల మితిమీరిన రాజకీయ జోక్యం వద్ద ఆలయాల్లో ఆధ్యాత్మిక భావన భగ్నమైందని, కౌలు పేరుతో దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆలయ భూముల వివరాలను పక్కాగా సేకరించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పాలక వర్గాల్లో ధార్మిక, భక్తి భావాలున్నవారే సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈమేరకు నియమావళి రూపొందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో 11 వేల వరకు ఆలయాలుంటే కేవలం 642 మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన గందరగోళం ఏమిటని సీఎం ప్రశ్నించారు. వేతన క్రమబద్ధీకరణ ఈ 642 ఆలయాలకే వర్తిస్తే మిగతా వారు నష్టపోతారని, అందరికీ లబ్ధి కలిగేలా చూడాలని పేర్కొన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ.. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదికను తనకు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ అంశంపై శాసనసభలో బిల్లు పెడతామన్నారు. బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ ఎస్పీ సింగ్, దేవాదాయ కమిషనర్ శివశంకర్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, లాసెక్రటరీ సంతోష్‌రెడ్డి, అర్చక–ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భానుమూర్తి, ఉపేంద్రశర్మ, రంగారెడ్డి, మోహన్‌లు అందులో సభ్యులుగా ఉన్నారు. దేవాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రోస్టర్ సమస్యలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కమిటీని సీఎం ఆదేశించారు. -
ఏఈవో పోస్టుల భర్తీ ప్రక్రియ షురూ
మొత్తం 1,000 కొత్త పోస్టులు, 506 ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యానశాఖల్లో కొత్తగా 1000 పోస్టులు, ఖాళీగా ఉన్న 506 మండల స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. వీటి భర్తీకి గత నెల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 వారాల తర్వాత భర్తీ ప్రక్రియ మొదలు పెట్టవచ్చన్న కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నెల 14 తర్వాత జిల్లాల వారీగా నియమకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జిల్లాల వారీగా పోస్టింగులను కూడా టీఎస్పీఎస్సీనే జారీ చేస్తుంది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిశాక అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోవైపు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు పిటిషన్లు దాఖలైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అరుుతే తాము కేవియట్ దాఖలు చేసినందున సమస్య ఉండకపోవచ్చని, కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలని అంటున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు.. కొత్తగా మంజూరైన వెరుు్య ఏఈవో పోస్టులను పాత 10 జిల్లాల ప్రాతిపదికగా కేటారుుంచారు. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు 214, వరంగల్ జిల్లాకు 149, ఆదిలాబాద్ జిల్లాకు 145 పోస్టులను కేటారుుంచారు. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా నియమిస్తారు. మొత్తంగా ఖాళీ పోస్టులతో కలుపుకొని 1311 ఏఈవో, 120 ఏవో పోస్టులను వ్యవసాయశాఖ పరిధిలో భర్తీ చేస్తారు. ఉద్యానశాఖలో 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేస్తారు. 6,500 ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశముంది. వారు పొలాలను, పంటలను పరిశీలించి.. ఎటువంటి పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వేయాలో రైతులకు ప్రిస్కిప్షన్ రాసిస్తారు. న్యాయ నిపుణుల సలహా కూడా.. పాత జిల్లాల వారీగా పోస్టులను కేటారుుంచ డం, వాటికి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించడం తెలిసిందే. ఇవన్నీ కూడా జిల్లా పోస్టులే. అరుుతే ఆ తర్వాత 21 కొత్త జిల్లాలు ఏర్పడడంతో.. పాత జిల్లాల ప్రకారం కేటారుుంచిన జిల్లా పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం ఎలా కేటారుుస్తారన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టుల కేటారుుంపులు ఉంటాయని చెబుతున్నా.. కొత్త జిల్లాలకు వాటిని ఎలా సర్దాలన్న అంశంపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.