నయీమ్‌ ఆస్తుల జప్తు కష్టమే! | Nayam's assets are difficult to foreclose | Sakshi
Sakshi News home page

నయీమ్‌ ఆస్తుల జప్తు కష్టమే!

Published Thu, Apr 20 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

నయీమ్‌ ఆస్తుల జప్తు కష్టమే!

నయీమ్‌ ఆస్తుల జప్తు కష్టమే!

బలమైన ఆధారాలు ఉండాలన్న న్యాయ నిపుణులు
- ఆస్తులపై పక్కాగా రిజిస్ట్రేషన్లు, సంబంధిత పత్రాలు
- 15 ఏళ్ల కిందటి బెదిరింపులకు ఆధారాలు దొరకని వైనం
- బాధితుల వాంగ్మూలాలు మాత్రమే సేకరించిన సిట్‌
- 24 ఇళ్లను సైతం జప్తు చేసుకోలేని పరిస్థితి
- 1,130 ఎకరాల్లో 300 ఎకరాల స్వాధీనానికే అవకాశం
- ఇళ్ల విషయాల్లో ట్యాక్స్‌ కడితే అభ్యంతరం లేదన్న ఐటీ శాఖ


సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవడం సులభం కాదని న్యాయ నిపుణులు తేల్చిచెప్పారు. నయీమ్‌ కబ్జాకు పాల్పడి నట్టు బలమైన ఆధారాలేవీ దొరకలేదని సిట్‌వర్గాలు గతంలోనే వెల్లడించాయి. నయీమ్‌ ఇళ్లతో పాటు డెన్లలో లభించిన డాక్యుమెంట్లను బట్టి 1,130 ఎకరాల భూమి నయీమ్‌ సంబంధీకులు, బినామీల పేర్ల మీద ఉన్నట్టు సిట్‌ గుర్తించింది. ఇక తెలంగాణతో పాటు గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్‌ తన సంబంధీకుల పేర్ల మీద పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేయించాడు. వాటికి సంబంధించి అన్ని పత్రాలు చట్టపరంగా సక్రమంగా ఉన్నాయని, వాటిని జప్తు చేసుకోవడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు పోలీస్‌ శాఖకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో కేసులో ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.

15 ఏళ్ల కిందటి వ్యవహారాలు..
భువనగిరి, యాదాద్రి, మిర్యాలగూడ, షాద్‌నగర్, కల్వకుర్తి, శంషాబాద్, నార్సింగి, నల్లగొండ.. ఇలా పలు ప్రాంతాల్లోని తమ భూములను నయీమ్‌ తక్కువ ధరలకే లాక్కున్నాడంటూ 204 మంది సిట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే 10–15 ఏళ్ల కింద జరిగిన భూకబ్జాల్లో ఆధారాలు ఏ విధంగా సేకరించాలనేది సవాలుగా మారింది. పైగా బాధితులు స్వయంగా సంతకాలు పెట్టారు, రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, పహా ణీల్లో పక్కాగా నమోద య్యాయి. బాధితుల వాంగ్మూలం తప్ప అద నపు ఆధారాలేవీ లభించ లేదు. ఈ వ్యవహారాల్లో చార్జిషీట్‌ దాఖలు చేశాక కోర్టులో జరిగే వాదోప వాదాలపై ఆధారపడి జప్తు ఆదేశాలు వెలువడ తాయి. కానీ చార్జిషీట్‌ వేసేందుకు నయీమ్‌ ఇంట్లో దొరికిన అకౌంట్‌ బుక్, బాధితుల వాంగ్మూలం సరిపోతాయా? కోర్టులో ఇవి నిలబడతాయా? అన్నది సందేహంగా మారింది.

ఇక నయీమ్‌ ఈ 1,130 ఎకరాల భూములను తన అనుచరులు, బంధు వులు, అధికారులు, రాజకీయ నాయకుల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించాడు. వారంతా ఆయా భూముల కొనుగోలుకు సరిపడా ఆదాయ మార్గాలు చూపిస్తే.. వాటి జప్తు సులభం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు గట్టి ఆధారాలున్న 300 ఎకరా లను మాత్రమే జప్తుకు గానీ, బాధితులకు అందించేందుకు గానీ వీలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇళ్ల విషయంలోనూ..!
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్‌ నగదు చెల్లించి కొనుగోలు చేసినట్టు సంబంధిత ఇళ్ల పాత యజమానులు పోలీసు విచారణలో వెల్లడించారు. ఆ ఇళ్ల కేసుల్లోనూ జప్తు సులభం కాదని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇళ్లు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి. కానీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషనై ఉందో ఆ వ్యక్తి కోర్టు నుంచి సీజర్‌ రిలీఫ్‌ పిటిషన్‌ ద్వారా ఆ ఇళ్లను పొందేందుకు మార్గం ఉందని వెల్లడించినట్లు సమాచారం. అయితే ఎలాంటి చట్టపరమైన ఆదాయ మార్గాలు లేని నయీమ్‌ కోట్ల విలువచేసే 24 ఇళ్లను కొనుగోలు చేయడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. యజమానులుగా చలా మణీలో ఉన్న వ్యక్తులు ఐటీ శాఖకు కట్టాల్సిన జరి మానా కట్టేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని.. ఆదాయ మార్గాలు, వనరులు చూపి, పన్ను చెల్లిస్తే సరిపోతుం దని న్యాయ నిపుణులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఐటీ శాఖ వెనక్కి తగ్గిందని చెబుతున్నారు.

ఒక చోట అలా.. మరో చోట ఇలా..
నయీమ్‌ చేసిన భూకబ్జాలకు సంబంధించి తన డైరీలు, ఖాతా బుక్కుల్లో స్పష్టంగా రాసుకున్నాడు. ఈ డైరీలు, అకౌంట్‌ పుస్తకాల్లో ఉన్న ఆధారాలను చార్జిషీట్‌లో పేర్కొంటున్న సిట్‌ వర్గాలు... పోలీస్‌ అధికారులు, రాజకీయ నాయకులతో ఆయనకున్న సంబంధాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్న అంశాలపై వివాదం చెలరేగుతోంది. నాయకులు, పోలీసులతో నయీమ్‌ సాగించిన సెటిల్‌ మెంట్ల కేసులను ఎందుకు ఆధారాలుగా వాడుకోవడం లేదన్నది విమర్శలకు తావిస్తోంది.

బలంగా ఉంటేనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు..
నయీమ్‌ అక్రమాస్తుల కేసులో పోలీసులు వేసే చార్జిషీట్‌లో బలమైన ఆధారాలుంటేనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట రేట్‌ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చార్జిషీట్లలో మనీ ల్యాండ రింగ్, అసంబద్ధ పెట్టుబడులను స్పష్టమైన ఆధారాలతో చూపించగలిగి తేనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆ కేసులను పరిశీలిస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement