సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు.
గవర్నర్ కావాలనే ఆపుతున్నారు
ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్‌టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన.
ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం
ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment