సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం అనేక మలుపులు తిరుగుతోంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
గవర్నర్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అధికారులు అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. వారు తెలిపిన వివరాలపై గవర్నర్ సంతృప్తి చెందితే వెంటనే బిల్లు ఆమోదించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన నేడు సభలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించేలా తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది.
ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదు: గవర్నర్
తాను ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళిసై మరోసారి స్పష్టం చేశారు. ట్రాన్స్‌పోర్టు సెక్రటరీని పిలిచానని.. ఆర్టీసీ బిల్లులోని సందేహాలకు వివరణ అడిగి, సమగ్ర రిపోర్టు తీసుకుంటానని తెలిపారు. దీనిపై సాధ్యమైనంత తర్వగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న రాజ్‌భవన్‌కు పంపించింది.
చదవండి: ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.
గవర్నర్ ఆ బిల్లును పరిశీలించి.. ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది.
మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించగా.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు గవర్నర్. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇక శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment