వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణ బిల్లు తాజా ముసాయిదాతో మళ్లీ ముందుకొచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుపై అనేక అభ్యంత రాలు వ్యక్తం అవడంతో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో ఎనభైకి పైగా సవరణలు, పదికిపైగా కీలకమైన సూచనలలో కేంద్రం మరోసారి ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2022’ను సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది.
ఈ శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్ట దలచిన ఈ బిల్లుపై న్యాయ నిపుణులు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్నింటిపై›ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే పౌరుల సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చన్న క్లాజుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ తాజా ముసాయిదాలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. సరళమైన భాషను ఉపయోగించారు. మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, చట్ట నియంత్రణలో ఉండే విధానా లకు రూపకల్పన చేశారు. అయితే, వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు లోప భూయిష్టంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమే. మొత్తంగా చూస్తే ఈ ముసాయిదా బిల్లు దేశ ప్రజల సాంకేతిక భద్రతా చట్టాలను బలపరిచేదిగా నిలిచిపోతుంది.
గత నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసి, అందులోని బాగోగులను చర్చకు పెట్టింది. గత నాలుగేళ్లుగా ఏకాభిప్రాయానికి నోచుకోక, ఇక ఇది ఎప్పటికైనా బిల్లు రూపంలోకి వస్తుందా అనే సందే హాల నడుమ తాజా విడతగా బయటికి వచ్చిన ముసాయిదాను ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. డేటా ప్రొటెక్షన్ చట్టంపై దశాబ్దకాలంగా చక్ర బంధంలో పరుగులు తీస్తున్న చిట్టెలుకలా పని చేస్తున్న నా వంటి వ్యక్తికి తొలిసారిగా ఈ తాజా ముసాయిదా సొరంగం చివర కనిపి స్తున్న కాంతి వంటి భావనను కలిగించింది.
తాజా ముసాయిదా ఎంతో సులభగ్రాహ్యంగా ఉంది. సాధ్య మైనంతగా విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరికీ బిల్లును అర్థం చేయించేం దుకు ప్రయత్నం జరిగినట్లు అర్థమౌతోంది. ఇందులో పేర్కొన్న చట్ట నిబంధనలు ఎలా అన్వయమవుతాయో వివరించే ఉదాహరణలను తగినన్నిగా ఇవ్వడం భలే నచ్చింది. నిజానికి శాసన ముసాయిదాల రూపకల్పనలో ఇలా ఇవ్వడం అనేది ఒక మెళకువ. దురదృష్టవశాత్తూ ఆధునిక బిల్లు తయారీ సాధకులకు ఇది కొరుకుడు పడని విద్య. పౌరులతో ముడివడి ఉండే నియంత్రణలకు అధికారాన్నిచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఉద్దేశించిన చట్టంలోని సరళత కచ్చితంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
అయినప్పటికీ, ముసాయిదాలోని ఈ సరళతను నేను ఇష్టపడటం న్యాయవాదులలోని నా సోదరులు కొందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయవాదులు ఎప్పుడూ కూడా తమ చట్టాలు సరళత్వాన్ని కలిగి ఉండటం కంటే కూడా, సవివరమైనవిగా ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో నేను అనేకసార్లు చెప్పినట్లుగా... సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించే బిల్లు తయారీ జరగడం ఇలాక్కాదు.
చట్టంలో మనం ఎంత ఎక్కువగా వివరాలను కూరుతామో, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిలోని కొత్త పరిణామాల వల్ల అది అంత ఎక్కువగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా, సాంకే తికత నిర్దేశించే నిరంతర లక్ష్యాలకు అత్యంత ప్రభావవంతంగా ప్రతి స్పందించడానికి వీలు కల్పించే చురుకైననియంత్రణ చట్టాలను మాత్రం రూపొందిస్తే సరిపోతుంది.
ఇక ఈ ముసాయిదా చట్టంలోని ఇతర అంశాలలో కొన్నింటిపైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చట్టంలోని అనేక ముఖ్యమైన నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం తనను తాను మిన హాయించుకోవడం వాటిల్లో ఒకటి. అయితే ప్రపంచంలోని ప్రతి డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ ఈ రకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఉదా: ఐరోపాలో అమలులో ఉన్న ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’ (జి.డి.పి.ఆర్.) చట్టం తన మేలిమి ప్రమాణాల రీత్యా తలమానిక మైనదిగా గుర్తింపు పొందుతోంది.
వారి చట్టంలో జాతీయ భద్రత, దేశ రక్షణ, పౌరుల సంక్షేమం రీత్యా క్రిమినల్ నేర విచారణ, రహస్య ఛేదన వంటి హక్కు దావాల నుంచి ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన మినహా యింపులను ఇస్తున్నాయి. సరిగ్గా మన తాజా ముసాయిదాలోని సెక్షన్ 18 (1) ప్రసాదిస్తున్న మినహాయింపులు కూడా అటువంటివే.
అయితే డేటా పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనల వర్తింపు నుండి ప్రభుత్వం మినహాయింపు తీసుకున్నంత మాత్రాన 2017 పుట్టస్వామి తీర్పును అనుసరించి తన రాజ్యాంగ బద్ధతలకు లేదా బాధ్యతలకు ప్రభుత్వం లోబడి ఉండబోదని అర్థం కాదు. బిల్లులోని నిర్దిష్ట మూలాంశం ఏమి చెప్పినప్పటికీ, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యపై ఆ బద్ధతలు, బాధ్యతలు శిరస్సుపై ఖడ్గంలా వేలాడుతూనే ఉంటాయి.
ప్రస్తుత బిల్లుకు జరుగుతూ వస్తున్న సవరణలతో పోల్చి చూసినప్పుడు తాజా ముసాయిదాలో పేర్కొన్న మినహాయింపులు నిరపాయకరమైనవేనని చెప్పాలి. చట్టానికి జరిగిన గత రెండు సవర ణలు చట్టంలోని కొన్ని సెక్షన్‌ల వర్తింపు నుంచి ప్రభుత్వ యంత్రాంగా లకు మొత్తంగా మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి. తాజా ముసాయిదా కొంత తులనాత్మకంగా జరిగింది.
దీనర్థం తాజా ముసాయిదాలో లోపాలు లేవని చెప్పడం కాదు. ఇందులో డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకోవలసిన కొన్ని ప్రధానమైన పరిగణనలు లోపించాయి. నా ఉద్దేశంలో అవి ఏమిటంటే... మొదటిగా, డేటా పోర్టబిలిటీ హక్కు. దేశ జనాభాలోని వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ ఒకచోట నిల్వ ఉంచుతున్న ఈ యుగంలో, అలా నిల్వ ఉంచిన సమాచారం నుంచి వివరాలను సంగ్రహించి, బట్వాడా చేసుకునే హక్కును వ్యక్తులకు ఈ బిల్లులో కల్పించలేదు.
డేటా పోర్టబిలిటీ హక్కు ఉంటే కనుక వ్యక్తులకు తమకు అవసరమైన వివరాలపై ఆధీనతను ఇవ్వడమే కాకుండా, కొద్ది మంది చేతుల్లోనే డేటా పోగుపడే ఏకీకరణను నిరోధించే సమర్థమైన చర్యగా కూడా పోర్టబిలిటీ ఉపయోగపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా నియంత్రకులు పోర్టబిలిటీ హక్కును మరింత ప్రభావవంతంగా, అర్థవంతంగా చేయడానికి శ్రమిస్తున్నారు. భారతదేశమైతే తన శక్తిమంతమైన ‘టెక్నో–లీగల్’ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో, డేటా పోర్టబిలిటీ ఎలా చేయాలో ప్రపంచానికి చూపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ముందైతే అటువంటి హక్కుకు చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉండాలి. నాకు కనుక మరొక సూచనకు అవకాశం ఉంటే దానిని నేను బిల్లులో వాడిన కొన్ని పదాలను అంతర్జాతీయ అనుసరణీయతలకు మరింత చేరువగా ఉండేలా నిబంధలను మార్పు చేయమని అడిగేం దుకు ఉపయోగించుకుంటాను.
జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ డేటా సబ్జెక్టులను (గుర్తింపు వివరాలు కలిగి ఉన్న వ్యక్తులు) డేటా ప్రిన్సిపల్స్‌గా, డేటా కంట్రోలర్స్‌ని (వివరాలను నియంత్రించేవారు) డేటా విశ్వసనీయులుగా పునఃనామకరణ చేసిన ప్పటి నుంచీ... ఆ తర్వాతి వరస ముసాయిదాలు ప్రామాణికం కాని ప్రమాణాలను చట్టంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి. అందుకు ప్రస్తుత ముసాయిదా కూడా మినహాయింపేమీ కాదు.
ప్రపంచంలోని మిగతా దేశాలు ‘డేటా ప్రొటెక్షన్ అథారిటీ’గా పిలిచే శాఖను మన దగ్గర ‘డేటా ప్రొటెక్షన్ బోర్డు’గా వ్యవహరిస్తున్నారు. ఇక గోప్యత చట్టాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే చట్టబద్ధమైన అవసరం, సహేతుకమైన ప్రయోజనం వంటి మాటలు తాజా చట్టంలోనూ ఉన్నాయి. దీనివల్ల వ్యక్తుల సమ్మతి లేకుండానే (డీమ్డ్ కన్సెంట్) వారికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం, ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థలు పొందే వీలుంది.
ఇది వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని మరింతగా దెబ్బతీస్తుందనే ఆందో ళన ఉన్నందువల్ల దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉంది. డీమ్డ్ కన్సెంట్ అనే పేరులో ఏముంది అని మీరడగవచ్చు. ఏమీ లేదు. ఆశించిన ప్రయోజనాలను ఆ నిబంధన నెరవేర్చుతున్నంత కాలం పేరులో ఏమీ లేదనే చెబుతాను. కానీ పైపై మాటలతో కూడిన నిబంధనలు... ఇప్పుడు మనం చూస్తున్న విధంగా నిరసనల నిప్పు తుపానును రాజేస్తాయి. అయితే అది మనం నివారించగలిన తుపానే!
రాహుల్ మత్తన్
వ్యాసకర్త ‘ట్రైలీగల్’ సంస్థ భాగస్వామి
(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment