Sakshi Editorial Special Story On Digital Data Protection Bill, Details Inside - Sakshi
Sakshi News home page

సరికొత్త ‘డేటా పరిరక్షణ’

Published Tue, Jul 11 2023 12:22 AM | Last Updated on Tue, Jul 11 2023 9:52 AM

Sakshi Editorial On Data Protection Bill

వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పి ఆరేళ్లవుతుండగా మళ్లీ సరికొత్తగా ముస్తాబై డిజిటల్‌ పర్సనల్‌ డేటా పరిరక్షణ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. పట్టు వదలని విక్రమార్కుడి నుంచి పదే పదే తప్పించుకునే బేతాళుడి మాదిరి ఎప్పటికప్పుడు వెనక్కిపోతున్న బిల్లు ఈసారైనా ఈనెల 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూడాలి.

అంతకన్నా ముఖ్యం– ముసాయిదా బిల్లుపై నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో తెలియాల్సివుంది. డేటా పరిరక్షణ ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం. దాన్ని రూపొందించేవారికి డిజిటల్‌ రంగంపైనా, అందులో వస్తున్న, రావడానికి ఆస్కారం ఉన్న మార్పులపై లోతైన అవగాహన ఉండాలి. అప్పుడే నిజమైన పరిరక్షణ సాధ్యమవుతుంది.

మన దేశంలో డిజిటల్‌ యుగం ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. పేరుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–2000 చట్టం వచ్చినా అది పౌరుల గోప్యతకు సంబంధించి కొరగాని చట్టంగా మిగిలిపోయింది. వేలిముద్రలతో సహా పౌరుల సమస్త వివరాలూ సేకరించే ఆధార్‌ను ఆదరాబాదరాగా తీసుకొచ్చిన ఆనాటి యూపీఏ సర్కారు ఆ డేటా పరిరక్షణకు అనువైన చట్టం అవసరమన్న సంగతి మరిచింది.

దానిపై నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాక 2012లో జస్టిస్‌ ఏపీ షా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక సమగ్ర నివేదిక కూడా ఇచ్చింది. ఈలోగా యూపీఏ ఏలుబడి ముగిసిపోయింది. తగిన చట్టాలు లేకుండా ఆధార్‌ కోసం వ్యక్తిగత వివరాలు సేకరించడాన్ని సవాలు చేస్తూ 2017లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పుట్టస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టాక కేంద్రంలో కదలిక మొదలైంది.

వ్యక్తిగత గోప్యత హక్కు పౌరుల జీవించే హక్కులో అంతర్భాగమని, అందుకు అనుగుణంగా చట్టం ఉండితీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసులో తీర్పునిచ్చాక జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ నాయకత్వాన కమిటీ ఏర్పాటయింది. అన్ని వర్గాల ప్రజలతోనూ, నిపుణులతోనూ మాట్లాడి మరుసటేడాది జస్టిస్‌ శ్రీకృష్ణకమిటీ ముసాయిదా బిల్లు సమర్పించింది. మార్పులు, చేర్పులతో ఆ బిల్లు 2019లో పార్లమెంటు ముందుకు వచ్చింది.

ఆ తర్వాత దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటైంది. మరో రెండేళ్లకు జేపీసీ నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా 2021లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దానిపైనా అనేక అభ్యంతరాలు వ్యక్తం కావటంతో నిరుడు ఆగస్టులో ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. తర్వాత రూపొందిన మరో ముసాయిదా బిల్లును నిరుడు నవంబర్‌లో ప్రజల పరిశీలనకు విడుదల చేశారు.

అందులో వ్యక్తమైన అభిప్రాయాలేమిటో, వేటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోతున్నదో చెప్పలేదు. మొత్తానికి ఆరేళ్లుగా సాగుతున్న కసరత్తు పర్యవసానంగా కొత్త బిల్లు రాబోతోంది. ఐరాస సభ్యదేశాల్లో ఇప్పటికే 137 దేశాలు డేటా పరిరక్షణ చట్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే ఆ విషయంలో మనం వెనకబడేవున్నాం.

దేశ పౌరుల డేటా బజారునపడుతున్న వైనం అప్పుడప్పుడు వెల్లడవుతూనే ఉంటోంది. ఎక్కడెక్కడో డేటా సంపాదించి పౌరుల బ్యాంకు ఖాతాలను దుండగులు ఖాళీ చేస్తున్న ఉదంతాలు పెరిగాయి. అయినా డేటా పరిరక్షణ బిల్లు తీసుకురావటంలో అలవిమాలిన జాప్యం జరిగింది. ఏమైతేనేం... బిల్లు రాబోతున్నది.

సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్య వల్ల డేటా లీకైనపక్షంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు డేటా పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ) ఏర్పాటు చేయాలన్న బిల్లులోని ప్రతిపాదన మెచ్చదగిందే.

ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించుకోవటం, నిఘా పెట్టడం ఇక తప్పనిసరవుతుంది. ఉద్దేశిత ప్రయోజనం నెరవేరగానే సేకరించిన డేటాను పూర్తిగా తొలగిస్తామన్న హామీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా చట్టంలో ఉంటుందంటున్నారు.

అది మంచి ప్రతిపాదనే. డేటా లీక్‌ అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అవసరాన్నిబట్టి కేబినెట్‌ ఆమోదంతో ఈ జరిమానాను రూ. 500 కోట్ల వరకూ పెంచడానికి బిల్లులో ఏర్పాటుందని చెబుతున్నారు. ప్రతిపాదన కూడా అవసరమైనదే. 

అయితే పౌరుల డేటా లీక్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను సమంగా చూడాలి. పౌరుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరించే ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తించేలా చర్యలుండాలని, వాటికి కూడా కళ్లెం వేయాలని ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌ వంటి సంస్థల డిమాండ్‌. అమెరికా, యూరోప్‌ దేశాల్లో ప్రైవేటు సంస్థలకైనా, ప్రభుత్వ సంస్థలకైనా సమానంగా వర్తించేలా చట్టాలున్నాయి.

దేశ భద్రత తదితర అంశాల్లో తన ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కేంద్రం మినహాయింపు ఇవ్వొచ్చని తాజా బిల్లులో ఉన్నదంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది అవసరమే కావొచ్చు కూడా. కానీ ఆ క్రమం పారదర్శకంగా ఉండాలి. మినహాయింపులిస్తే సరిపోదు. చట్టవిరుద్ధత చోటుచేసుకున్న పక్షంలో చర్యలేమిటో ప్రతిపాదించాలి. తప్పుడు ఫిర్యాదులని తేలితే రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చన్న పాత ముసాయిదా నిబంధన కూడా మార్చలేదంటున్నారు.

సాధారణ పౌరులు ఫిర్యాదు చేయాలంటేనే సవాలక్ష అడ్డంకులుంటాయి. ఈమాదిరి జరిమానాలు తోడైతే ఇక చెప్పేదేముంది? పౌరులను బెదరగొట్టే ఈ నిబంధనను పరిహరిస్తేనే మంచిది. డీపీఏ ఒక స్వతంత్ర సంస్థగా మనగలిగితేనే దాని పని తీరు ప్రభావవంతంగా ఉంటుందని పాలకులు గుర్తిస్తే అది దేశానికెంతో మేలు చేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement