Sakshi Editorial Special Story And Analysis On Data Protection Bill, All You Need To Know - Sakshi
Sakshi News home page

What Is Data Protection Bill: భద్రత ఉన్నట్టేనా?

Published Wed, Aug 9 2023 12:27 AM | Last Updated on Wed, Aug 9 2023 9:11 AM

Sakshi Editorial On Data protection Bill

చిరకాలంగా చెబుతున్న, వింటున్న మాట ఇప్పుడు కార్యరూపంలోకి వస్తోంది. ఐరాసలోని 194 దేశాల్లో దాదాపు 137 దేశాల తర్వాత ఎట్టకేలకు భారత్‌ సైతం వ్యక్తిగత డిజిటల్‌ డేటా భద్రత (డీపీడీపీ) చట్టాన్ని తీసుకొచ్చే ఘట్టంలో చివరి మజిలీకి చేరుకుంది. అయిదేళ్ళలో అనేక ముసాయిదాలు, మార్పులు చేర్పుల తర్వాత తాజా డీపీడీపీ బిల్లు – 2023ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ఇంతకాలంగా డేటా భద్రత విషయంలో సరైన చట్టం, వ్యవస్థ లేని భారత్‌ ఆ లోటును ఇక పూరిస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వానికి మినహాయింపులపై గత నవంబర్‌ నాటి ప్రతిపాదిత బిల్లులోనే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసినా, అవే అంశాలు కొత్త బిల్లులోనూ చోటుచేసుకోవడం విడ్డూరం. ప్రైవేట్‌ సంస్థలు వ్యక్తుల డేటా నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై కఠినమైన అంశాలు పొందుపరచిన ఈ బిల్లులో అసలంటూ కొంత మంచి ఉన్నా, కేంద్రానికి తిరుగులేని సెన్సార్‌ అధికారాలు దఖలు చేయడం లాంటి చెడూ చోటుచేసుకోవడమే విషాదం. 

పౌరులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉందంటూ తొమ్మిది మంది సుప్రీమ్‌ కోర్ట్‌ న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2017లోనే నొక్కిచెప్పింది. అది అంతర్జాతీయ ప్రమాణంగా నిలిచి, డిజిటల్‌ యుగంలో గోప్యత హక్కుకు తలెత్తిన సవాళ్ళను ముందుకు తెచ్చింది. ఈ హక్కుపై జరిగిన విస్తృత చర్చ ప్రతిఫలమే తాజా డీపీడీపీ బిల్లు. 2017లోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ నిపుణుల సంఘాన్ని నియమించింది. తర్వాత 2021 డిసెంబర్‌లో ‘డేటా భద్రత బిల్లు’ (డీపీబీ) విడుదలైంది.

అనేక అభ్యంతరాలు రావడంతో 2022 ఆగస్ట్‌లో కేంద్ర ఐటీ మంత్రి పార్లమెంట్‌లో ఆ బిల్లును ఉపసంహరించుకొని, నవంబర్‌లో ‘డీపీడీపీ’ ముసాయిదాను పౌరసమాజ సంప్రతింపులకు ఉంచారు. గమ్మత్తేమిటంటే, జనాభిప్రాయాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు సరికదా సమాచార హక్కు చట్టం కింద కోరినా తోసిపుచ్చింది. తీరా ఏడాది తర్వాత ఏ ప్రాతిపదికన కొత్తగా మార్పుచేర్పులు చేశామన్నది చెప్పకుండానే పాలకులు 2023 డీపీడీపీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మెజారిటీ ఉంది గనక సులభంగా ఆమోదమూ పొందారు.

వ్యక్తిగత డేటాను ఇతరులు యథేచ్ఛగా వాడే వీలులేకుండా చూడడం ఈ బిల్లు ప్రధానోద్దేశం. తీరా బిల్లు చూస్తే, అసలు ఆ భద్రత విషయంలోనే రాజీ పడ్డారనిపిస్తుంది. కార్పొరేట్లు గనక సున్నితమైన డేటాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇప్పటి దాకా ఐటీ చట్టం కింద వారు బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉండేది. తీరా ఇప్పుడీ బిల్లులోని ఓ క్లాజు వల్ల ఆ ఊరట కూడా బాధితు డికి లేకుండా పోతోంది. ఇంకా విచిత్రమేమంటే, డేటా భద్రతకు భంగం కలిగిందని వీధికెక్కినవారి పైనే జరిమానా వేయచ్చు. పస లేని ఆరోపణ చేస్తే రూ. 10 వేల దాకా జుల్మానా వేయవచ్చు.

ఫిర్యాదు చేయదలచిన వారికి ఇదో అడ్డంకి. నిజానికి, డేటా ఉల్లంఘనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో కోవిన్‌ పోర్టల్‌ నుంచి టీకాలేసుకున్న వారి వ్యక్తిగత వివరాలు టెలిగ్రామ్‌ యాప్‌లో దర్శనమిచ్చాయి. అలాగే, జూలైలో 12 వేల మంది బ్యాంక్‌ ఉద్యోగుల గోప్యమైన రికార్డులూ టెలిగ్రామ్‌లో తిరిగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికీ, అధికారులకూ ఈ డేటా వినియోగం, ఉల్లంఘనల్లో అయిదు అంశాల ప్రాతిపదికన ఈ బిల్లులో మినహాయింపులు దక్కాయి. మునుపటి బిల్లులోనూ మినహాయింపులున్నా తాజా బిల్లులో వాటిని విస్తరించడం గమనార్హం.

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు... దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టానికి ఈ కొత్త బిల్లులోని అంశాలు తూట్లు పొడిచే ప్రమాదం ఉందనేది ఒక విశ్లేషణ. పౌరుల గోప్యత హక్కును కాపాడడం మాట దేవుడెరుగు, సమాచార హక్కును ఇది నీరు గారుస్తోందని విమర్శకుల మాట. ఈ డీపీడీపీ బిల్లు దెబ్బతో ప్రభుత్వం నుంచి సమాచార సేకరణలో పారదర్శకత తగ్గిపోయి, ప్రభుత్వ – ప్రైవేట్‌ సంస్థల ప్రయోజనాలకు ప్రజల డేటా మరింత పారదర్శకమవుతుందనేది వారి అభిప్రాయం.

అలాగే, వ్యక్తిగత డేటాకూ, సున్నిత మైన వ్యక్తిగత డేటాకూ మధ్య తేడాను సైతం ఈ బిల్లు గుర్తించకపోవడంతో సున్నితమైన డేటాకు అదనపు భద్రత లేకుండా పోతోంది. ఇక, సమాచారాన్ని సృష్టించే జనరేటివ్‌ కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సంబంధించిన నియంత్రణల ఊసు ఈ బిల్లులో లేదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి చట్టం తేవడానికే సుదీర్ఘకాలం తీసుకున్న మన ప్రభుత్వాలు ఏఐ విషయంలోనూ అదే పద్ధతి అవలంబిస్తే కష్టమే. కాబట్టి, ఏఐ నియమ నిబంధనల రూపకల్పనకు తక్షణం నడుం బిగించాల్సి ఉంది. 

డేటా భద్రత బిల్లు కింద ఏర్పాటుచేసే ‘డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌’ సైతం వట్టి పర్యవేక్షక సంస్థ. అదీ పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ కిందే నడుస్తుంది. ఛైర్మన్‌ సహా సభ్యులందరినీ కేంద్రమే నియమి స్తుంది. వెరసి, పాలకుల చేతిలో కీలుబొమ్మగా బోర్డు స్వతంత్రత, అధికారాలు అన్నీ పరిమితమే. తద్విరుద్ధంగా యూరప్‌ వగైరాల్లో డేటా భద్రత చట్టాలు, దాని కావలి సంస్థలు బలంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అంగీకార విధానాల్ని ఉల్లంఘించినందుకు గూగూల్‌పై అక్కడి కావలి సంస్థ 5 కోట్ల యూరోల జరిమానా వేయగలగడమే నిదర్శనం.

డేటా భద్రతకు మించిన అసలు సమస్య... విచ్చల విడిగా సాగుతున్న డేటా సేకరణను అరికట్టడం! అంతర్జాతీయ నిపుణుల మాట సైతం అదే. మన దేశంలోని ఈ ప్రబల సమస్యపై ఇప్పటికీ చర్చే జరగకపోవడం విషాదం. అలాగే, అవగాహన, డిజి టల్‌ అక్షరాస్యత అంతంత మాత్రమైన దేశంలో, ఊపిరి సలపని పనిభారమున్న న్యాయవ్యవస్థ మధ్య నిజంగా గోప్యతకు హాని కలిగినా ఈ బిల్లుతో పౌరులు న్యాయం పొందగలరా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement