personal data
-
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 3.1 కోట్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన పాలైనట్టు యూకే కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ ఆరోపించారు. కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి 3.1 కోట్ల కస్టమర్లకు సంబంధించి మొబైల్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను విక్రయించినట్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడో పక్షం నుంచి మోసపూరిత చర్యలకు (ఉల్లంఘైన డేటా ఆధారంగా) అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు స్టార్ హెల్త్ సంస్థ ఈ మెయిల్ ద్వారా హెచ్చరించడం ఉల్లంఘన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. యూకేకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ షెంజెన్ అనే హ్యాకర్ స్టార్ హెల్త్ నుంచి పొందిన డేటాను వెబ్సైట్లో పెట్టినట్టు ప్రకటించారు. ‘‘స్టార్ హెల్త్ ఇండియా కస్టమర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి సున్నితమైన డేటాను లీక్ చేస్తున్నాను. ఈ డేటాను నాకు నేరుగా విక్రయించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీదే ఇందుకు బాధ్యత’’అంటూ షెంజెన్ పోస్ట్‌ను పార్కర్ ప్రస్తావించారు. టెలీగ్రామ్ బోట్లను సృష్టించడం ద్వారా 2024 జూలై నాటికి 3,12,16,953 మంది కస్టమర్ల డేటాను, 57,58,425 క్లెయిమ్‌ల డేటాను హ్యాకర్ పొందినట్టు చెప్పారు. డేటా లీకేజీకి గాను 1,50,000 డాలర్ల డీల్ కుదిరినట్టు కూడా పార్కర్ తెలిపారు. అప్రమత్తత.. స్టార్ హెల్త్ ఉద్యోగులమని చెబుతూ ప్రస్తుత పాలసీని నిలిపివేయండనే చర్యలకు థర్డ్ పారీ్టలు పాల్పడొచ్చంటూ స్టార్ హెల్త్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ తరహా మోసపూరిత చర్యలు వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించడంతోపాటు, దీర్ఘకాలంలో పాలసీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. క్లెయిమ్‌ల డేటాను అనధికారికంగా పొందినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు మెయిల్స్ కూడా వచి్చనట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు కంపెనీ సమాచారం ఇచి్చంది. ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా తగిన సైబర్ భద్రతా వ్యవస్థలు, నియంత్రణలను అమలు చేస్తున్నామని, దీనిపై మళ్లీ తాజా సమాచారం విడుదల చేస్తామని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది. -
PM Narendra Modi: ఫిన్‌టెక్ ప్రోత్సాహానికి పాలసీల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీల్లో తగు మార్పులు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం, దేశీయంగా పరిశోధనలు.. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్లు కేటాయించడం, వ్యక్తిగత డేటా భద్రత చట్టం రూపకల్పన వంటి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. అంకుర సంస్థలను దెబ్బతీసే సైబర్ మోసాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలకు సూచించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. ఆర్థిక సేవలను అందరికీ అందుబాటలోకి తేవడంలో ఫిన్‌టెక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గడిచిన పదేళ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని ఆయన ప్రశంసించారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరిగిందని, దీనికి నగదు బదిలీ పథకంలాంటివి నిదర్శనమని వివరించారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ త్రయంతో నగదు లావాదేవీలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో దాదాపు సగభాగం భారత్‌లోనే ఉంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, పండుగల వేళ దేశ ఎకానమీ, క్యాపిటల్ మార్కెట్లలో వేడుకల వాతావరణం నెలకొందని చెప్పారు. అధునాతన టెక్నాలజీలు, నిబంధనలతో ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పారదర్శకమైన, సమర్ధమంతమైన భారీ యంత్రాంగాలను రూపొందిస్తోందని ప్రధాని చెప్పారు. గూగుల్ పేలో యూపీఐ సర్కిల్.. జీఎఫ్ఎఫ్ సందర్భంగా గూగుల్ పే యూపీఐ సర్కిల్‌ను ఆవిష్కరించింది. బ్యాంకు ఖాతాలను లింక్ చేయకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేందుకు యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అటు ఈ–రూపీ (యూపీఐ వోచర్లు), రూపే కార్డులకు సంబంధించి మొబైల్ ఫోన్ ద్వారా ట్యాప్ అండ్ పే ఫీచర్‌ను, యూపీఐ లైట్లో ఆటోపే ఆప్షన్‌ను కూడా గూగుల్ పే ఆవిష్కరించింది. -
నారాయణ విద్యాసంస్థల్లో బయటపడ్డ భారీ కుట్ర
-
వ్యక్తిగత డేటా చౌర్యం సంగతే తెలియడం లేదు
న్యూఢిల్లీ: సైబర్ దాడుల బారిన పడినవారిలో చాలా మందికి తమ వ్యక్తిగత డేటా చోరీకి గురైన సంగతే తెలియడం లేదు. ప్రతి ముగ్గురిలో ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్ తరఫున వేక్ఫీల్డ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కనీసం 500 మందికి పైబడి సిబ్బంది ఉన్న 1,600 పైగా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. గత 30 ఏళ్లుగా సైబర్ దాడులను నివారించడంపైనే పరిశ్రమ ఎక్కువగా దృష్టి పెడుతోందని రుబ్రిక్ సీఈవో బిపుల్ సిన్హా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు తప్పకుండా జరిగే అవకాశాలే ఉన్నాయని భావించి, వాటిని దీటుగా ఎదుర్కొనే సన్నద్ధతను సాధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా సైబర్ పరిశ్రమ ఏడాదికి 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే, రుబ్రిక్ జీరో ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరి డేటా చౌర్యానికి గురవ్వడమే కాకుండా ఆ విషయం వారికి కనీసం తెలియకపోవడమనేది ఆందోళనకర విషయం‘ అని సిన్హా పేర్కొన్నారు. నివేదికకు సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► ఈ ఏడాది జూన్ 30–జులై 11 మధ్య కాలంలో 10 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ► నివేదిక ప్రకారం సగం పైగా సంస్థల్లో (53 శాతం) గతేడాది కీలకమైన సమాచారం చోరీకి గురైంది. ప్రతి ఆరు కంపెనీల్లో ఒక సంస్థ (16 శాతం) పలు దఫాలుగా సైబర్ దాడులతో నష్టపోయింది. ► దేశీయంగా ఐటీ లీడర్లలో 49 శాతం మంది .. తమ సంస్థ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్లు అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో తమ సంస్థల్లో కీలక డేటా చోరీకి గురయ్యే రిస్కులు అత్యధికంగా ఉన్నాయని 30 శాతం మంది తెలిపారు. ► సాధారణంగా కంపెనీల్లో డేటా గత 18 నెలల్లో మొత్తం మీద 42 శాతం పెరిగింది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్ (సాస్) రూపంలో డేటా 145 శాతం, క్లౌడ్‌లో (73 శాతం), సంస్థ భౌతిక కార్యాలయాల్లో 20 శాతం మేర పెరిగింది. ► ఒక సాధారణ సంస్థ భద్రపర్చుకోవాల్సిన డేటా వచ్చే ఏడాదిలో 100 బీఈటీబీ (బ్యాక్–ఎండ్ టెరాబైట్)కి పెరుగుతుందని, వచ్చే అయిదేళ్లలో 7 రెట్లు వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది. ► డేటా వృద్ధితో సమానంగా రిస్కులను ఎదుర్కొనేలా డేటా భద్రతను పెంచుకోలేకపోతున్నట్లు 34 శాతం మంది దేశీ ఐటీ లీడర్లు తెలిపారు. కీలకమైన డేటాను కాపాడుకోవడంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం సానుకూల ప్రభావం చూపగలదని 54 శాతం దేశీ కంపెనీలు భావిస్తుండగా, ఏఐ ఎటువంటి ప్రభావం చూపదని 24 శాతం సంస్థలు భావిస్తున్నాయి. -
పిల్లల వ్యక్తిగత డేటాను తస్కరించిన ‘మెటా’
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని మెటా సేకరించిందని, ఎక్కువ సమయం తమ సామాజిక మాధ్యమాల వేదికల్లోనే వారు గడిపేలా ఒక బిజినెస్ మోడల్‌ను రూపొందించిందని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల డేటాను తస్కరించేలా ఉద్దేశపూర్వకంగానే తమ సోషల్ మీడియా వేదికల్లో మెటా మార్పులు చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెటా సంస్థ నిర్వాకంపై గత నెలలో 33 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో దావా వేశారు. ఈ సంగతి తాజాగా బయటకు వచి్చంది. యుక్త వయసులో ఉన్నవారిని సోషల్ మీడియా సైట్లవైపు ఆకర్శించడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి మెటా ప్రయతి్నస్తోందని వారు ఆరోపించారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే ఇన్స్టాగ్రామ్ సేకరించిందని, ఇలా చేయడం చట్టవిరుద్ధమేనని తమ దావాలో పేర్కొన్నారు. చిన్నారుల గోప్యతను కాపాడడానికి ఉద్దేశించిన చట్టాలను మెటా పాటించలేదని ఆరోపించాయి. తమపై వచి్చన ఆరోపణలపై మెటా యాజమాన్యం స్పందించింది. 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలు తెరవడానికి అనుమతి లేదని వెల్లడించింది. ఒకవేళ అలాంటి ఖాతాలు ఉంటే తొలగిస్తామని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికలు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయని ఏళ్లుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా వార్తలతో వాటికి మరింత బలం సమకూరిందని అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీ నిర్వాకం.. లండన్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా
సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారంతో చంద్రబాబు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. టీడీపీ శ్రేణులను ప్రజల ఇళ్లలోకి పంపించి.. వారి వివరాల్ని సేకరిస్తున్నారు. మభ్యపెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాకుండా.. దాన్ని లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా ప్రజల భద్రతకు పెనుముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినా.. చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో.. ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఇంటింటికీ వెళుతున్న టీడీపీ కార్యకర్తలు ఓటరు పేరు, ఓటరు కార్డు నంబర్, కులం, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆ కుటుంబంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పిల్లల సంఖ్య, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య, కుటుంబంలోని నిరుద్యోగ సభ్యులు, కుటుంబంలోని మహిళల సంఖ్య, మొబైల్ నంబర్, ఆ తర్వాత ఓటీపీ కూడా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అవన్నీ వెంటనే వారి వెబ్ అప్లికేషన్ టీడీపీ మేనేఫెస్టో.కామ్‌లో నిక్షిప్తమవుతున్నాయి. ఆ వెబ్సైట్ సర్వర్ లొకేషన్ యునైటెడ్ కింగ్డమ్లో ఉండటం విశేషం. అంటే ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశానికి టీడీపీ తరలిస్తున్నట్టు స్పష్టమైంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారం అంతా నెట్టింట్లో పెట్టడం ద్వారా వారి వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగించేలా టీడీపీ వ్యవహరిస్తోంది. ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలన్నింటినీ తమ వెబ్‌సైట్‌కి అనుసంధానం చేసుకుని రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ముప్పు కలిగించేందుకు సైతం సిద్ధపడింది. చట్టవిరుద్ధంగా ఓటీపీల సేకరణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే క్రమంలో చట్టవిరుద్ధంగా వారి ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీని సైతం టీడీపీ కార్యకర్తలు సేకరిస్తున్నారు. యాప్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేశాక, వారి ఫోన్ నంబర్లు తీసుకుని యాప్ నుంచి జనరేట్ అయ్యే ఓటీపీని అడుగుతున్నారు. ఓటీపీ ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే.. వారిని బలవంతం చేస్తూ ఇబ్బంది పెడుతున్న ఘటనలు కూడా పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఓ మహిళా టీడీపీ కార్యకర్త ఒక ఇంట్లోకి వెళ్లి వారి వ్యక్తిగత వివరాలు సేకరించి మొబైల్ ఓటీపీ తీసుకోవడంతో గొడవ జరిగింది. ఓటీపీ తీసుకోవడం పట్ల స్థానికులు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ విషయంలో టీడీపీ నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి సైతం వెనుకాడటం లేదు. అబద్ధాలతో వివరాల సేకరణ ఈ వివరాలన్నీ ఎందుకు సేకరిస్తున్నారో ప్రజలకు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఓటర్ల వెరిఫికేషన్ ముసుగులో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నా వాస్తవానికి అవన్నీ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమం కింద చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు ప్రకటించిన పథకాలకు ఎంపికయ్యారంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ.. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో దిట్ట కావడంతో ప్రజలు వారి మాటలను నమ్మడం లేదు. దీంతో వారు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఆ వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇలా వివరాలు నమోదు చేసిన ప్రతి పౌరుడి పేరుతో టీడీపీ మేనేఫెస్టో.కామ్‌లో ఒక డ్యాష్‌బోర్డ్ పేజీని రూపొందిస్తున్నారు. ఇలా ప్రజల ఫోన్ నంబర్లను యాప్‌కు లింకు చేసి ప్రజల వ్యక్తిగత సమాచారం అంతటినీ లండన్‌లోని సర్వర్‌లో భద్రపరుస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇతర దేశాల్లోని సర్వర్లలో దాన్ని ఉంచడం ముప్పని తెలిసినా.. టీడీపీ అదే పనిని నిర్విఘ్నంగా చేస్తోంది. వన్‌టైమ్ పాస్వర్డ్ సేకరించడం ద్వారా ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ ఆన్లైన్ లావాదేవీల ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
సరికొత్త ‘డేటా పరిరక్షణ’
వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పి ఆరేళ్లవుతుండగా మళ్లీ సరికొత్తగా ముస్తాబై డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. పట్టు వదలని విక్రమార్కుడి నుంచి పదే పదే తప్పించుకునే బేతాళుడి మాదిరి ఎప్పటికప్పుడు వెనక్కిపోతున్న బిల్లు ఈసారైనా ఈనెల 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూడాలి. అంతకన్నా ముఖ్యం– ముసాయిదా బిల్లుపై నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో తెలియాల్సివుంది. డేటా పరిరక్షణ ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం. దాన్ని రూపొందించేవారికి డిజిటల్ రంగంపైనా, అందులో వస్తున్న, రావడానికి ఆస్కారం ఉన్న మార్పులపై లోతైన అవగాహన ఉండాలి. అప్పుడే నిజమైన పరిరక్షణ సాధ్యమవుతుంది. మన దేశంలో డిజిటల్ యుగం ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. పేరుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–2000 చట్టం వచ్చినా అది పౌరుల గోప్యతకు సంబంధించి కొరగాని చట్టంగా మిగిలిపోయింది. వేలిముద్రలతో సహా పౌరుల సమస్త వివరాలూ సేకరించే ఆధార్‌ను ఆదరాబాదరాగా తీసుకొచ్చిన ఆనాటి యూపీఏ సర్కారు ఆ డేటా పరిరక్షణకు అనువైన చట్టం అవసరమన్న సంగతి మరిచింది. దానిపై నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాక 2012లో జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక సమగ్ర నివేదిక కూడా ఇచ్చింది. ఈలోగా యూపీఏ ఏలుబడి ముగిసిపోయింది. తగిన చట్టాలు లేకుండా ఆధార్ కోసం వ్యక్తిగత వివరాలు సేకరించడాన్ని సవాలు చేస్తూ 2017లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పుట్టస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టాక కేంద్రంలో కదలిక మొదలైంది. వ్యక్తిగత గోప్యత హక్కు పౌరుల జీవించే హక్కులో అంతర్భాగమని, అందుకు అనుగుణంగా చట్టం ఉండితీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసులో తీర్పునిచ్చాక జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నాయకత్వాన కమిటీ ఏర్పాటయింది. అన్ని వర్గాల ప్రజలతోనూ, నిపుణులతోనూ మాట్లాడి మరుసటేడాది జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ముసాయిదా బిల్లు సమర్పించింది. మార్పులు, చేర్పులతో ఆ బిల్లు 2019లో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తర్వాత దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటైంది. మరో రెండేళ్లకు జేపీసీ నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా 2021లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దానిపైనా అనేక అభ్యంతరాలు వ్యక్తం కావటంతో నిరుడు ఆగస్టులో ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. తర్వాత రూపొందిన మరో ముసాయిదా బిల్లును నిరుడు నవంబర్‌లో ప్రజల పరిశీలనకు విడుదల చేశారు. అందులో వ్యక్తమైన అభిప్రాయాలేమిటో, వేటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోతున్నదో చెప్పలేదు. మొత్తానికి ఆరేళ్లుగా సాగుతున్న కసరత్తు పర్యవసానంగా కొత్త బిల్లు రాబోతోంది. ఐరాస సభ్యదేశాల్లో ఇప్పటికే 137 దేశాలు డేటా పరిరక్షణ చట్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే ఆ విషయంలో మనం వెనకబడేవున్నాం. దేశ పౌరుల డేటా బజారునపడుతున్న వైనం అప్పుడప్పుడు వెల్లడవుతూనే ఉంటోంది. ఎక్కడెక్కడో డేటా సంపాదించి పౌరుల బ్యాంకు ఖాతాలను దుండగులు ఖాళీ చేస్తున్న ఉదంతాలు పెరిగాయి. అయినా డేటా పరిరక్షణ బిల్లు తీసుకురావటంలో అలవిమాలిన జాప్యం జరిగింది. ఏమైతేనేం... బిల్లు రాబోతున్నది. సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్య వల్ల డేటా లీకైనపక్షంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు డేటా పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ) ఏర్పాటు చేయాలన్న బిల్లులోని ప్రతిపాదన మెచ్చదగిందే. ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించుకోవటం, నిఘా పెట్టడం ఇక తప్పనిసరవుతుంది. ఉద్దేశిత ప్రయోజనం నెరవేరగానే సేకరించిన డేటాను పూర్తిగా తొలగిస్తామన్న హామీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా చట్టంలో ఉంటుందంటున్నారు. అది మంచి ప్రతిపాదనే. డేటా లీక్ అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అవసరాన్నిబట్టి కేబినెట్ ఆమోదంతో ఈ జరిమానాను రూ. 500 కోట్ల వరకూ పెంచడానికి బిల్లులో ఏర్పాటుందని చెబుతున్నారు. ప్రతిపాదన కూడా అవసరమైనదే. అయితే పౌరుల డేటా లీక్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను సమంగా చూడాలి. పౌరుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరించే ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తించేలా చర్యలుండాలని, వాటికి కూడా కళ్లెం వేయాలని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ వంటి సంస్థల డిమాండ్. అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రైవేటు సంస్థలకైనా, ప్రభుత్వ సంస్థలకైనా సమానంగా వర్తించేలా చట్టాలున్నాయి. దేశ భద్రత తదితర అంశాల్లో తన ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కేంద్రం మినహాయింపు ఇవ్వొచ్చని తాజా బిల్లులో ఉన్నదంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది అవసరమే కావొచ్చు కూడా. కానీ ఆ క్రమం పారదర్శకంగా ఉండాలి. మినహాయింపులిస్తే సరిపోదు. చట్టవిరుద్ధత చోటుచేసుకున్న పక్షంలో చర్యలేమిటో ప్రతిపాదించాలి. తప్పుడు ఫిర్యాదులని తేలితే రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చన్న పాత ముసాయిదా నిబంధన కూడా మార్చలేదంటున్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేయాలంటేనే సవాలక్ష అడ్డంకులుంటాయి. ఈమాదిరి జరిమానాలు తోడైతే ఇక చెప్పేదేముంది? పౌరులను బెదరగొట్టే ఈ నిబంధనను పరిహరిస్తేనే మంచిది. డీపీఏ ఒక స్వతంత్ర సంస్థగా మనగలిగితేనే దాని పని తీరు ప్రభావవంతంగా ఉంటుందని పాలకులు గుర్తిస్తే అది దేశానికెంతో మేలు చేస్తుంది. -
టీకా వేయించుకున్నారా? డాటా లీక్
కొవిన్ యాప్‌లో పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వం అతి పెద్ద గోప్యతా ఉల్లంఘన అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టీకా పొందినవారి వ్యక్తిగత వివరాలు ఇక టెలిగ్రామ్‌లో లభ్యమయ్యేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Cowin Portal से डाटा हुआ लीक? करोड़ों लोगों की पर्सनल डिटेल टेलीग्राम पर आई!अब तक मोदी सरकार देश की संपत्ति ही बेच रही थी, पर अब तो.... pic.twitter.com/NnCPnuT9YT— Rashtriya Janata Dal (@RJDforIndia) June 12, 2023 బాధ్యులెవరు? 'కొవిడ్ టీకా తీసుకున్నప్పుడు ఆధార్, ఫోన్ నెంబర్లు,పాస్‌పోర్టు వివరాలు,ఓటర్ ఐడీతో సహా కుటుంబ వివరాలు అన్ని నమోదు చేశారు. దేశంలో ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా అందులో ఉన్నాయి. కొవిన్ డేటా వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు ఇందులో పాలుపంచుకున్నారు? ప్రజల ముందు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?' అని సాకేత్ గోఖలే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రియా సూలే.. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎట్టిపరిస్థితుల్లో క్షమార్హం కాని నేరం' అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేం లేదు.. కొవిన్ యాప్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునే సమయంలో కేవలం వ్యాక్సిన్ తీసుకునే తేదీని మాత్రమే సేకరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. Co-WIN portal of Health Ministry is completely safe with safeguards for data privacy. All reports of data breach are without any basis and mischievous in nature. Health Ministry has requested CERT-In to look into this issue & submit a report: Government of India pic.twitter.com/hXbTpl3FNU— ANI (@ANI) June 12, 2023 ఇదీ చదవండి:వీడియోలెందుకు తీస్తున్నావ్.. భారత్‌లో విదేశీయుడికి చేదు అనుభవం -
డేటా ఎక్కడి నుంచి లీకైంది?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వ్యక్తిగత డేటా లీక్’మూలాలను తేల్చేందుకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎక్కడెక్కడి నుంచి డేటా తస్కరణకు గురైంది? నిందితులు దీనిని ఎక్కడెక్కడ దాచి ఉంచారు? దానిని ఎవరెవరు కొనుగోలు చేశారు? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రక్షణ శాఖ, టెలికం వంటి 138 ప్రభుత్వ విభాగాలుసహా 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, పలు ఇతర ప్రాంతాల్లోని పలు కంపెనీల నుంచి డేటా చోరీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించి ఆయా సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కేసుతో వారికి ఉన్న సంబంధాలపై విచారించిన అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకా శం ఉన్నట్టు సమాచారం. ఈ డేటా ఎవరెవరు కొనుగోలు చేశారో కనిపెట్టేందుకు నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. క్లౌడ్, హార్డ్ డిస్క్‌లలో డేటా.. ప్రజల వ్యక్తిగత వివరాలను తస్కరించిన నిందితులు డేటాను హార్డ్ డిస్క్‌లతోపాటు క్లౌడ్ సర్వీస్‌లో భద్రపరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ క్లౌడ్ సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరుతూ గూగుల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను తస్కరించినట్టు గుర్తించామని, క్లౌడ్‌లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తే.. దొంగిలించిన డేటా మొత్తం ఎంత అనేది స్పష్టమవుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు అలర్ట్ నీట్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ అధికారులు, బ్యాంకు ఖాతాదారులు, పాన్‌కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు వంటి 138 కేటగిరీల వారి డేటాను నిందితులు దొంగిలించారు. అయితే వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలూ చోరీకి గురైన నేపథ్యంలో.. ఆయా ప్రభుత్వ శాఖలను సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఈమేరకు రిజర్వు బ్యాంకు, టెలికం విభాగం, కేంద్ర హోం, రక్షణ శాఖలకు లేఖలు రాశారు. ఏజెన్సీల నుంచే డిఫెన్స్ సమాచారం లీక్? రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది ఉద్యోగుల డేటాను సైతం నిందితులు దొంగిలించారు. వీటిలో డిఫెన్స్ అధికారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, దళం పేరు, ర్యాంకు, పనిచేస్తున్న చోటు, చిరు నామా వంటి కీలక వివరాలున్నాయి. రక్షణశాఖకు చెందిన ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని.. ఆ ఏజెన్సీల నుంచే డేటా చోరీకి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలున్న బ్యాంకు నుంచి లేదా పేస్లిప్‌లను సిద్ధం చేసే ఏజెన్సీల నుంచి డేటా లీకై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్ల హైటెక్ దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు ♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు. ♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. ♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు. ♦ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటిని తరచూ గమనించాలి ♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్గా గుర్తించాలి. ♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి. ♦ తరచూ భద్రతా నోటిఫికేషన్లు, పాస్వర్డ్లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం. ♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్సైట్ యూఆర్ఎల్లో https:// అని ఉంటుంది. యూఆర్ఎల్లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్సైట్ అని భావించాలి. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్సైట్లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!
వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణ బిల్లు తాజా ముసాయిదాతో మళ్లీ ముందుకొచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లుపై అనేక అభ్యంత రాలు వ్యక్తం అవడంతో అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ క్రమంలో ఎనభైకి పైగా సవరణలు, పదికిపైగా కీలకమైన సూచనలలో కేంద్రం మరోసారి ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2022’ను సిద్ధం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ఈ శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్ట దలచిన ఈ బిల్లుపై న్యాయ నిపుణులు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్నింటిపై›ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారం, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైతే పౌరుల సమ్మతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవచ్చన్న క్లాజుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’ తాజా ముసాయిదాలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. సరళమైన భాషను ఉపయోగించారు. మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని, చట్ట నియంత్రణలో ఉండే విధానా లకు రూపకల్పన చేశారు. అయితే, వ్యక్తిగత సమాచార పరిరక్షణ కోసం ఈ తాజా ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు లోప భూయిష్టంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమే. మొత్తంగా చూస్తే ఈ ముసాయిదా బిల్లు దేశ ప్రజల సాంకేతిక భద్రతా చట్టాలను బలపరిచేదిగా నిలిచిపోతుంది. గత నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు ముసాయిదాను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసి, అందులోని బాగోగులను చర్చకు పెట్టింది. గత నాలుగేళ్లుగా ఏకాభిప్రాయానికి నోచుకోక, ఇక ఇది ఎప్పటికైనా బిల్లు రూపంలోకి వస్తుందా అనే సందే హాల నడుమ తాజా విడతగా బయటికి వచ్చిన ముసాయిదాను ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. డేటా ప్రొటెక్షన్ చట్టంపై దశాబ్దకాలంగా చక్ర బంధంలో పరుగులు తీస్తున్న చిట్టెలుకలా పని చేస్తున్న నా వంటి వ్యక్తికి తొలిసారిగా ఈ తాజా ముసాయిదా సొరంగం చివర కనిపి స్తున్న కాంతి వంటి భావనను కలిగించింది. తాజా ముసాయిదా ఎంతో సులభగ్రాహ్యంగా ఉంది. సాధ్య మైనంతగా విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరికీ బిల్లును అర్థం చేయించేం దుకు ప్రయత్నం జరిగినట్లు అర్థమౌతోంది. ఇందులో పేర్కొన్న చట్ట నిబంధనలు ఎలా అన్వయమవుతాయో వివరించే ఉదాహరణలను తగినన్నిగా ఇవ్వడం భలే నచ్చింది. నిజానికి శాసన ముసాయిదాల రూపకల్పనలో ఇలా ఇవ్వడం అనేది ఒక మెళకువ. దురదృష్టవశాత్తూ ఆధునిక బిల్లు తయారీ సాధకులకు ఇది కొరుకుడు పడని విద్య. పౌరులతో ముడివడి ఉండే నియంత్రణలకు అధికారాన్నిచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఉద్దేశించిన చట్టంలోని సరళత కచ్చితంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయినప్పటికీ, ముసాయిదాలోని ఈ సరళతను నేను ఇష్టపడటం న్యాయవాదులలోని నా సోదరులు కొందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయవాదులు ఎప్పుడూ కూడా తమ చట్టాలు సరళత్వాన్ని కలిగి ఉండటం కంటే కూడా, సవివరమైనవిగా ఉండటాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో నేను అనేకసార్లు చెప్పినట్లుగా... సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించే బిల్లు తయారీ జరగడం ఇలాక్కాదు. చట్టంలో మనం ఎంత ఎక్కువగా వివరాలను కూరుతామో, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిలోని కొత్త పరిణామాల వల్ల అది అంత ఎక్కువగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా, సాంకే తికత నిర్దేశించే నిరంతర లక్ష్యాలకు అత్యంత ప్రభావవంతంగా ప్రతి స్పందించడానికి వీలు కల్పించే చురుకైననియంత్రణ చట్టాలను మాత్రం రూపొందిస్తే సరిపోతుంది. ఇక ఈ ముసాయిదా చట్టంలోని ఇతర అంశాలలో కొన్నింటిపైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చట్టంలోని అనేక ముఖ్యమైన నిబంధనల వర్తింపు నుంచి ప్రభుత్వం తనను తాను మిన హాయించుకోవడం వాటిల్లో ఒకటి. అయితే ప్రపంచంలోని ప్రతి డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ ఈ రకమైన మినహాయింపు కనిపిస్తుంది. ఉదా: ఐరోపాలో అమలులో ఉన్న ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’ (జి.డి.పి.ఆర్.) చట్టం తన మేలిమి ప్రమాణాల రీత్యా తలమానిక మైనదిగా గుర్తింపు పొందుతోంది. వారి చట్టంలో జాతీయ భద్రత, దేశ రక్షణ, పౌరుల సంక్షేమం రీత్యా క్రిమినల్ నేర విచారణ, రహస్య ఛేదన వంటి హక్కు దావాల నుంచి ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన మినహా యింపులను ఇస్తున్నాయి. సరిగ్గా మన తాజా ముసాయిదాలోని సెక్షన్ 18 (1) ప్రసాదిస్తున్న మినహాయింపులు కూడా అటువంటివే. అయితే డేటా పరిరక్షణ చట్టంలోని కొన్ని నిబంధనల వర్తింపు నుండి ప్రభుత్వం మినహాయింపు తీసుకున్నంత మాత్రాన 2017 పుట్టస్వామి తీర్పును అనుసరించి తన రాజ్యాంగ బద్ధతలకు లేదా బాధ్యతలకు ప్రభుత్వం లోబడి ఉండబోదని అర్థం కాదు. బిల్లులోని నిర్దిష్ట మూలాంశం ఏమి చెప్పినప్పటికీ, ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యపై ఆ బద్ధతలు, బాధ్యతలు శిరస్సుపై ఖడ్గంలా వేలాడుతూనే ఉంటాయి. ప్రస్తుత బిల్లుకు జరుగుతూ వస్తున్న సవరణలతో పోల్చి చూసినప్పుడు తాజా ముసాయిదాలో పేర్కొన్న మినహాయింపులు నిరపాయకరమైనవేనని చెప్పాలి. చట్టానికి జరిగిన గత రెండు సవర ణలు చట్టంలోని కొన్ని సెక్షన్ల వర్తింపు నుంచి ప్రభుత్వ యంత్రాంగా లకు మొత్తంగా మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి. తాజా ముసాయిదా కొంత తులనాత్మకంగా జరిగింది. దీనర్థం తాజా ముసాయిదాలో లోపాలు లేవని చెప్పడం కాదు. ఇందులో డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకోవలసిన కొన్ని ప్రధానమైన పరిగణనలు లోపించాయి. నా ఉద్దేశంలో అవి ఏమిటంటే... మొదటిగా, డేటా పోర్టబిలిటీ హక్కు. దేశ జనాభాలోని వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ ఒకచోట నిల్వ ఉంచుతున్న ఈ యుగంలో, అలా నిల్వ ఉంచిన సమాచారం నుంచి వివరాలను సంగ్రహించి, బట్వాడా చేసుకునే హక్కును వ్యక్తులకు ఈ బిల్లులో కల్పించలేదు. డేటా పోర్టబిలిటీ హక్కు ఉంటే కనుక వ్యక్తులకు తమకు అవసరమైన వివరాలపై ఆధీనతను ఇవ్వడమే కాకుండా, కొద్ది మంది చేతుల్లోనే డేటా పోగుపడే ఏకీకరణను నిరోధించే సమర్థమైన చర్యగా కూడా పోర్టబిలిటీ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా నియంత్రకులు పోర్టబిలిటీ హక్కును మరింత ప్రభావవంతంగా, అర్థవంతంగా చేయడానికి శ్రమిస్తున్నారు. భారతదేశమైతే తన శక్తిమంతమైన ‘టెక్నో–లీగల్’ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో, డేటా పోర్టబిలిటీ ఎలా చేయాలో ప్రపంచానికి చూపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ముందైతే అటువంటి హక్కుకు చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉండాలి. నాకు కనుక మరొక సూచనకు అవకాశం ఉంటే దానిని నేను బిల్లులో వాడిన కొన్ని పదాలను అంతర్జాతీయ అనుసరణీయతలకు మరింత చేరువగా ఉండేలా నిబంధలను మార్పు చేయమని అడిగేం దుకు ఉపయోగించుకుంటాను. జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ డేటా సబ్జెక్టులను (గుర్తింపు వివరాలు కలిగి ఉన్న వ్యక్తులు) డేటా ప్రిన్సిపల్స్‌గా, డేటా కంట్రోలర్స్ని (వివరాలను నియంత్రించేవారు) డేటా విశ్వసనీయులుగా పునఃనామకరణ చేసిన ప్పటి నుంచీ... ఆ తర్వాతి వరస ముసాయిదాలు ప్రామాణికం కాని ప్రమాణాలను చట్టంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి. అందుకు ప్రస్తుత ముసాయిదా కూడా మినహాయింపేమీ కాదు. ప్రపంచంలోని మిగతా దేశాలు ‘డేటా ప్రొటెక్షన్ అథారిటీ’గా పిలిచే శాఖను మన దగ్గర ‘డేటా ప్రొటెక్షన్ బోర్డు’గా వ్యవహరిస్తున్నారు. ఇక గోప్యత చట్టాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే చట్టబద్ధమైన అవసరం, సహేతుకమైన ప్రయోజనం వంటి మాటలు తాజా చట్టంలోనూ ఉన్నాయి. దీనివల్ల వ్యక్తుల సమ్మతి లేకుండానే (డీమ్డ్ కన్సెంట్) వారికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం, ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థలు పొందే వీలుంది. ఇది వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని మరింతగా దెబ్బతీస్తుందనే ఆందో ళన ఉన్నందువల్ల దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉంది. డీమ్డ్ కన్సెంట్ అనే పేరులో ఏముంది అని మీరడగవచ్చు. ఏమీ లేదు. ఆశించిన ప్రయోజనాలను ఆ నిబంధన నెరవేర్చుతున్నంత కాలం పేరులో ఏమీ లేదనే చెబుతాను. కానీ పైపై మాటలతో కూడిన నిబంధనలు... ఇప్పుడు మనం చూస్తున్న విధంగా నిరసనల నిప్పు తుపానును రాజేస్తాయి. అయితే అది మనం నివారించగలిన తుపానే! రాహుల్ మత్తన్ వ్యాసకర్త ‘ట్రైలీగల్’ సంస్థ భాగస్వామి (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘ఎయిమ్స్’ తరహాలో మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా!
చెన్నై: దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిమ్స్‌పై సైబర్ దాడితో గత 10 రోజులుగా సర్వర్లు పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ విషయం తేలకముందే మరో ఆసుపత్రిపై పంజా విసిరారు హ్యాకర్లు. సుమారు 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ సర్వర్లను హ్యాక్ చేసి రోగుల డేటాను పాపులర్ సైబర్ క్రైమ్ ఫోరమ్స్, టెలిగ్రామ్ ఛానళ్లలో అమ్మకానికి పెట్టినట్లు సైబర్ ముప్పుపై విశ్లేషించే సంస్థ ‘క్లౌడ్‌సెక్’ వెల్లడించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. క్లౌడ్‌సెక్ వివరాల ప్రకారం.. ‘థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్’ అనే థర్డ్ పార్టీ వెండర్ ద్వారా 2007 నుంచి 2011 మధ్య నమోదైన రోగుల వివరాలను దొంగిలించినట్లు తేలింది. అయితే, శ్రీ శరణ్ మెడికల్ సెంటర్‌కు థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ విధులు నిర్వర్తించటంపై సమాచారం లేదని పేర్కొంది. కొనుగోలుదారులు నమ్మేందుకు నమూనా జాబితాను ఆన్లైన్ ఉంచారు. లీక్ అయిన డేటాలో రోగుల పేర్లు, జన్మదినం, అడ్రస్, సంరక్షకుల పేర్లు, డాక్టర్ల వివరాలు ఉన్నాయి. డాక్టర్ల వివరాలతో ఏ ఆసుపత్రి డేటా హ్యాకింక్‌గు గురైందనే విషయాన్ని క్లౌడ్‌సెక్ గుర్తించింది. ఆన్లైన్ అమ్మకానికి ఉంచిన డేటాలోని డాక్లర్లు తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్లో పని చేశారని తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన మరుసటి రోజునే తమిళనాడు శ్రీ శరణ్ ఆసుపత్రి డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: 8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు -
కొత్త డేటా ప్రైవసీ చట్టం.. ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవే!
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు బదిలీ చేసేందుకు, అక్కడ నిల్వ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త డేటా ప్రైవసీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత్‌కు వెలుపల ఏయే దేశాలు, ప్రాంతాలను ఎంచుకోవచ్చనేది నోటిఫై చేయనుంది. అలాగే సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించనుంది. శుక్రవారం ఈ మేరకు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) బిల్లు 2022 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిపై డిసెంబర్ 17లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. భారత్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే నిల్వ చేయాలంటూ గత బిల్లులో చేసిన ప్రతిపాదనలు పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజా మార్పులతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సంస్థలకు ఊరట లభించనుంది. పార్లమెంటు ఆమో దం పొందాక ముసాయిదా బిల్లు .. చట్టంగా మారుతుంది. వ్యక్తిగత డేటా విషయంలో ఒకవైపు వ్యక్తుల హక్కులు, బాధ్యతలను మరోవైపు డేటా సేకరించే సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు ముసాయిదాలో పేర్కొన్నారు. చట్టబద్ధత, పారదర్శకత తదితర ఏడు సూత్రాల ప్రాతిపదికన బిల్లును తయారు చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వివరించింది. ‘పౌరుల డేటా రక్షణ, పరిశ్రమకు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, దేశ భద్రత.. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా బిల్లు రూపొందింది‘ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వివాదాస్పద అంశాలు తొలగించి డేటా బిల్లును సరళతరం చేశారని న్యాయ సేవల సంస్థ జేఎస్ఏ పార్ట్నర్ రూపీందర్ మాలిక్ పేర్కొన్నారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. ► వ్యక్తిగత డేటాను సేకరించే ముందు వ్యక్తుల సమ్మతి తీసుకోవాలి. సదరు డేటాను షేర్ చేయడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో డేటాను సేకరించిన వ్యక్తులు, కంపెనీలపై రూ. 500 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు. 2019లో జారీ చేసిన గత ముసాయిదాలో ఈ పెనాల్టీని రూ. 15 కోట్లు లేదా కంపెనీ గ్లోబల్ టర్నోవరులో 4% (ఏది ఎక్కువైతే అది)గా ప్రతిపాదించారు. ► అలాగే ఏదైనా పత్రం, సర్వీసు, గుర్తింపు ధ్రువీకరణ లేదా చిరునామా ధ్రువీకరణ కోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు. ► దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు బిల్లులోని నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ► కంపెనీలు తాము సేకరించిన డేటాను నిర్దిష్ట వ్యవధి వరకే నిల్వ చేసుకోవచ్చు. ► డేటా సేకరించే సేకరించే సంస్థలు.. నిబంధనల పాటింపు కోసం డేటా రక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ బోర్డు వినాలి. ► యూజర్లు తమ సమ్మతిని తెలియజేసేందుకు, సమీక్షించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకు ఆయా కంపెనీలు పారదర్శకమైన ప్లాట్‌ఫాంను అందుబాటులో ఉంచాలి. ► వ్యక్తిగత డేటాను సరిచేసుకునేందుకు, తొలగించేందుకు యూజర్లకు హక్కులు ఉంటాయి. ► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించకూడదు. ప్రాసెస్ చేయకూడదు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు ఇవ్వకూడదు. ► భారీ కంపెనీలు తాము ప్రాసెస్ చేసే డేటా పరిమాణాన్ని బట్టి .. నిబంధనల పాటింపును మదింపు చేసేందుకు స్వతంత్ర డేటా ఆడిటర్‌ను నియమించుకోవాలి. ► డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. ఇది నిబంధనల ఉల్లంఘన కేసులను విచారణ చేసి, తగు నిర్ణయాలు తీసుకుంటుంది. ► వ్యక్తిగత డేటాను స్వయంగా లేదా డేటా ప్రాసెసర్లతో ప్రాసెస్ చేసే డేటా ఫిడ్యుషియరీ సంస్థలకు వివిధ రకాల జరిమానాలుంటాయి. చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ -
సరికొత్త ‘డేటా’ పరిరక్షణ
ఇటు పౌరసమాజ కార్యకర్తలనూ, అటు దిగ్గజ సైబర్ సంస్థలనూ సమానంగా వణికించిన పాత డేటా పరిరక్షణ ముసాయిదా బిల్లు స్థానంలో సరికొత్త ముసాయిదా బిల్లు శుక్రవారం వెలువడింది. పాత బిల్లు ఉపసంహరించుకున్న మూణ్ణెల్లలోపులో దీన్ని తీసుకురావడాన్నిబట్టి డేటా పరిరక్షణ బిల్లు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉన్నదో వెల్లడవుతోంది. 2019లో రూపొంది పార్లమెంటులో ప్రవేశించిన ముసాయిదా బిల్లుపై అన్నివైపులా తీవ్ర విమర్శలు చెలరేగటంతో దాన్ని ఉపసంహరించక తప్పలేదు. సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచివుంటున్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతున్నది. లక్షల కోట్లకు పడగెత్తిన మెటా (ఫేస్బుక్), ట్విటర్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థల వరకూ పౌరుల డేటాతో ఆటలాడుకుంటున్నాయి. వారి వ్యక్తిగత గోప్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేసేలా ఇప్పటికే చాలా దేశాలు పకడ్బందీ చట్టాలు చేశాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధిస్తున్నాయి. కానీ మన దేశం మాత్రం పుష్కరకాలంగా తాత్సారం చేస్తోంది. చట్టం తెస్తామనటమే తప్ప దాని ఆచూకీ లేదు. అందుకోసం జస్టిస్ బీఎస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2018లోనే ఒక ముసాయిదా బిల్లును కేంద్రానికి సమర్పించింది. చివరకు మరో ఏడాది కాలం తర్వాత దాని ఆధారంగా కేంద్రం ఒక ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే తమ బిల్లుకూ, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకూ పొంతనలేదని జస్టిస్ శ్రీకృష్ణ పెదవి విరిచారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఆ ముసాయిదాపై విస్తృతంగా చర్చ జరిగిన సందర్భంగా అందులో సమగ్రత గల్లంతయిందని అనేకులు విమర్శించారు. డేటా పరిరక్షణ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకోవాలో అందులో ప్రతిపాదించారు. కానీ దీన్నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవటం అన్ని వర్గాలనూ దిగ్భ్రాంతిపరిచింది. అలాగే ఇక్కడ సేకరించే డేటా సరిహద్దులు దాటిపోరాదన్న నిబంధన అందులో ఉంది. ఈ నిబంధన సరికాదని మెటా, ట్విటర్వంటివి విమర్శించాయి. చివరకు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంది. ఏమైతేనేం...ఆ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఆ సంఘం బిల్లుకు మొత్తం 81 సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఉపసంహరణే ఉత్తమమని ప్రభుత్వం భావించింది. చాలా సైబర్ సంస్థలు, ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు సంస్థలు వినియోగదారుల డేటాను ఇష్టానుసారం సేకరిస్తున్నాయి. వీటిల్లో చేరాలంటే చాలా వివరాలు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఖాతా తెరవాలన్న తొందరలో అత్యధికులు వెనకాముందూ చూడకుండా అడిగిన వివరాలన్నీ అందజేస్తున్నారు. ఈ వ్యక్తిగత డేటాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ వివ రాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోయి పౌరుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కావటం, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లో పడటం రివాజైంది. ఇలాంటివి చోటుచేసు కున్నప్పుడు ఆ మాధ్యమాలు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాయి. పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేనప్పుడు డేటా సేకరణ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ సంగతలా ఉంచి పౌరుల డేటాను ప్రభుత్వం అడిగినప్పుడు ఏం చేయాలన్న ప్రశ్న ఉండనే ఉంది. పాత ముసాయి దాలో భద్రతా సంస్థలకు పూర్తిస్థాయి మినహాయింపునీయటం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుత ముసాయిదాలో సైతం అదే కొనసాగింది. జాతీయ భద్రత కీలకం గనుక అవాంఛనీయ శక్తుల కదలికపై నిఘా వేయటం, వారి కార్యకలాపాలను కనిపెట్టి ఉండటం అవసరం కావొచ్చు. కానీ ఆ మాటున నికార్సయిన అసమ్మతిని అణచాలని చూడటం, ఆ కృషిలో నిమగ్నమయ్యే వ్యక్తులనూ, సంస్థలనూ వేధించటం సరైంది కాదు. ప్రభుత్వాల విధానాలూ, చర్యలూ సరిగాలేవని భావించిన వారు శాంతియుత పద్ధతుల్లో నిరసించటం ప్రజాస్వామిక హక్కు. దీనికి భంగంవాటిల్లని రీతిలో భద్రతా సంస్థలు మెలిగితే ఎవరూ అభ్యంతరపెట్టరు. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఏ అధికారైనా హద్దుమీరిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెప్పాలి. తాజా ముసాయిదాలో డేటా పరిరక్షణ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన భేషైనది. పౌరుల వ్యక్తిగత డేటాను పరిరక్షించటంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించే అధి కారం ఈ బోర్డుకుంది. అలాగే డేటా లీకయిందని తెలిసిన వెంటనే ఖాతాదార్లకు ఆ సంగతి చెప్పక పోతే రూ. 200 కోట్లవరకూ జరిమానా విధించొచ్చు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరాక సేకరించిన డేటాను సంస్థలు పూర్తిగా తొలగించాలన్న నిబంధన, వినియోగదారులు తమ డేటా తొలగించాలని కోరినా, సవరించాలని కోరినా సంస్థలు అంగీకరించాలన్న నిబంధన మంచిదే. తమ డేటా సేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూసేందుకు సంస్థలు ఆడిటర్‌ను నియ మించుకోవాలన్న నిబంధన కూడా మంచిదే. అయితే భారత్‌లో సేకరించిన డేటాను ఇక్కడి సర్వర్ల లోనే భద్రపరచాలన్న అంశంలో ప్రభుత్వం రాజీపడింది. అందుకు బదులు ఏయే దేశాల్లో డేటా ఉంచవచ్చునో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. తనకు అవసరమైనపక్షంలో డేటా తీసుకోవటం సాధ్య పడే దేశాల్లో సర్వర్లు ఉండొచ్చన్నది సర్కారు భావన. మొత్తానికి తాజా ముసాయిదాపై కూడా లోతైన చర్చ జరగాలి. అందుకు పౌరుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే గీటురాయి కావాలి. ఇదీ చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన -
శాంసంగ్ యూజర్లకు షాకింగ్ న్యూస్, భారీగా డేటా లీక్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన యూజర్లకు భారీ షాకిచ్చింది. శాంసంగ్ ఫోన్లనుంచి భారీఎత్తున డేటా లీక్ అయిందని తాజాగా తెలిపింది. ఇందులో ప్రధానంగా యూజర్ల పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా లాంటి వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు తెలిపింది. ఈ మేరకు కొంతమంది యూజర్లను ఈమెయిల్ ద్వారా అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక బ్లాగ్‌పోస్ట్ సమాచారంలో తెలిపింది. అనధికారిక థర్డ్ పార్టీ ద్వారా అమెరికా సిస్టమ్‌ల నుంచి వినియోగదారుల ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ లాంటి డేటాను లీక్ చేసినట్టు సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ పేర్కొంది. జులై 2022 చివరలో ఇది చోటు చేసుకుంది. ఆగస్ట్ 4, 2022న నిర్దిష్ట కస్టమర్ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు 30 రోజుల తర్వాత ఈ పరిమిత సమాచారాన్ని పూర్తిగా విడుదల చేసింది. వెల్లడించింది. అయితే ఇది ఇతర సోషల్ సెక్యూరిటీ నంబర్లు క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయ లేదని శాంసంగ్ నిర్ధారించింది. డేటా లీకైన సిస్టమ్‌లను సేఫ్‌గా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయం గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. అయినా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్ పేజీలకు డైవర్ట్ చేసే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండమని వినియోగ దారులను కోరింది. అనుమానాస్పద లింక్‌లు లేదా అనుమానాస్పద ఇమెయిల్‌ల నుండి అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులను కోరింది. -
PDP Bill: ‘గోప్యత’ బిల్లు మళ్లెప్పుడో!
దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పీడీపీ) బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. 2019 డిసెంబర్ 11న లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపారు. ఏళ్ల తరబడి సాగిన తర్జనభర్జనల అనంతరం జేపీసీ 81 సవరణలు ప్రతిపాదించింది. దీంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును మళ్లీ ప్రవేశపెడతామనీ, ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నామనీ ప్రకటించింది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ తర్వాత రెండేళ్లకు ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు లభించడమే. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోప్యత కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. కానీ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలు – జాతీయ భద్రత, శాంతి భద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే జేపీసీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు సూచించడంతో... ప్రభుత్వం తాత్కాలికంగా బిల్లును వెనక్కి తీసుకుంది. – డా. ఎం. సురేష్ బాబు, ప్రజా సైన్సు వేదిక అధ్యక్షులు -
ఫోన్ రిపేర్‌కు ఇచ్చింది.. పర్సనల్ ఫొటోలన్నీ లీక్
రోజువారీ అలవాటుగా ఉదయం నిద్రలేస్తూనే ఫోన్ చూడటం మొదలుపెట్టింది కావ్య (పేరుమార్చడమైనది). సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయగానే తన ఫొటోతో కనిపించిన ఓ నోటిఫికేషన్ చూసి, ఆశ్చర్యపోతూ యాక్సెప్ట్ చేసింది. అందులో తన వ్యక్తిగత ఫొటోలు కనిపించడంతో ఒక్క సారిగా నిద్రమత్తు వదిలిపోయింది. ఆ ఫొటోలు తను అప్లోడ్ చేయలేదు. కేవలం తను ఉన్న ఫొటోలతో మరో అకౌంట్ ఉండటం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ ఫొటోలు ఎవరి చేతిలోకి ఎలా వెళ్లాయో తెలియదు. తనెంతో ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు. రెండేళ్ల క్రితం ఫొటోలు అవి. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో హుందాగా ఉండే కావ్యకు ఈ పరిస్థితి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఫొటోలను, వీడియోలను చూసిన తన స్నేహితులు, బంధువులు ఫోన్లు చేసి, ‘ఏంటీ పిచ్చి పని?’ అంటూ అడగడం మొదలుపెట్టారు. తనకేమీ తెలియదని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ‘నలుగురిలో పెట్టవలసిన ఫొటోలేనా ఇవి’ అంటూ కొందరు కావ్య పేరెంట్స్ కి ఫోన్ చేసి మరీ అడగడంతో ఇంటిల్లిపాదికి ఈ సమస్య పెద్ద భూతమైపోయింది. ఎప్పుడూ ఆ ఫోన్లోనే ఉంటావ్, ఏ ఫోటో పోస్ట్ చేయాలో, ఏ ఫొటో దాచుకోవాలో ఆ మాత్రం తెలియదా! ఇలా అందరిలో పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా’ అంటూ కూతురినే తప్పు పట్టారు తల్లీదండ్రి. తనకేమీ తెలియదని కావ్య ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. విషయాన్ని ఢిల్లీలో ఉంటున్న తన కజిన్‌తో పంచుకుంది కావ్య. ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గం తెలియడం లేదని, బయటకు వెళ్లడానికే భయంగా ఉందంటూ కళ్లనీళ్లతో చెప్పింది. ‘నీ ఫోన్, ట్యాబ్.. వంటి పరికరాలు ఏవైనా ఎవరికైనా ఇచ్చావా’ అని అడిగింది కావ్య కజిన్. ‘లేదు’ ఏడుస్తూనే చెప్పింది కావ్య. ‘బాగా గుర్తు తెచ్చుకొని, మళ్లీ ఫోన్ చెయ్’ అంది కావ్య కజిన్. తీవ్రంగా ఆలోచించిన కావ్యకు ఏడాది క్రితం తన పాత ఫోన్ పాడైతే రిపేర్‌కు ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ ఫోన్ నుంచి తీసుకున్న ఫొటోలే ఇప్పుడు తన ఈ సమస్యకు అతి పెద్ద కారణం అన్నమాట... అనుకుంది. ఆర్నెల్ల క్రితం కొత్త ఫోన్ కొనుక్కొని, ఆ ఫొటోలన్నీ సిస్టమ్ స్టోరేజీలో కాపీ చేసుకుంది. ఫోన్ మాత్రం ఎవరికీ అమ్మలేదు. ఎప్పుడైనా అవసరం వస్తే వాడచ్చులే అని ఇంట్లోనే ఉంచింది. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది కావ్యకు. ఆ షాప్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో తన సమస్యకు పరిష్కారం దొరికింది. ఎవరు ఆమె ఫొన్లోని డేటాను తస్కరించింది, సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్ సృష్టించి, ఫొటోలు ఎలా అప్లోడ్ చేసిందీ తెలిసింది. ► పాడైన డిజిటల్ పరికరాల డేటా మొత్తం కాపీ చేసుకొని, ఫార్మాట్ చేసి, అప్పుడు రిపేర్‌కు ఇవ్వడం శ్రేయస్కరం. ► తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోవడం కంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయడం లేదా 155260 కి కాల్ చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది. ► సోషల్ మీడియా ఖాతాను ఉపయోగిస్తున్నప్పుడు ప్రత్యేక అక్షరాలున్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, కాలానుగుణంగా మార్చడం వల్ల హ్యాక్ అవడం, డేటా తస్కరించడం వంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గోప్యత కోసం జిపిఎస్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయాలి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ► తెలియని పరిచయాల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవడం వల్ల వ్యక్తిగత డేటాకు సంబంధించిన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కకుండా చేయగలం. అలాగే, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసినవారమవుతాం. ► మీరు ఇతరులకు షేర్ చేసే ఫొటో వెరిఫికేషన్ కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ ద్వారా చెక్ చేయచ్చు. లేదా www.tineye ని ఉపయోగించవచ్చు, అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఇక అంతా వ్యక్తిగతమేనా?
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకుండా జీవితం నడవని పరిస్థితుల్లో... వ్యక్తిగత సమాచార గోప్యత ఓ దేవతా వస్త్రం. సాంకేతికత సాయంతో ఎవరి డేటా అయినా ఇట్టే చేజిక్కించుకోవచ్చన్నది పదే పదే బయటపడ్డ పచ్చి నిజం. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) సోమవారం ఆమోదించిన ‘వ్యక్తిగత సమాచార భద్రత (పీడీపీ) బిల్లు’ నివేదికకూ, సిఫార్సులకూ ఇప్పుడింత ప్రాధాన్యం అందుకే! ప్రైవేట్ సంస్థలను నియంత్రిస్తూనే, కేంద్రానికీ, సీబీఐ – రా– ఈడీ లాంటి సంస్థలకూ మినహాయింపులిస్తూ, విస్తృతాధికారాలు కట్టబెడుతున్నదీ బిల్లు. రెండేళ్ళ చర్చోపచర్చల తర్వాతా కొన్ని అంశాల పట్ల జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు కొందరు అసమ్మతి తెలిపిందీ అందుకే! అయితేనేం, మెజారిటీ జేపీసీ సభ్యుల అంగీకారం పొందిన ఈ తుది నివేదిక, చేసిన సిఫార్సులు ఈ నెలాఖరున ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. అసలీ బిల్లు రావడం వెనుక పెద్ద కథే ఉంది. వ్యక్తిగత గోప్యతా హక్కు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందంటూ 2017 ఆగస్టులో ‘జస్టిస్ కె.ఎస్. పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీమ్ కోర్టు తేల్చి చెప్పడంతో ఈ బిల్లుకు బీజం పడింది. దేశంలో డేటా భద్రతకు సంబంధించి సమగ్ర విధివిధానాలు రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ ఇచ్చిన ఆదేశం దీనికి మూలమైంది. సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పలువురు నిపుణులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పీడీపీకి చట్టం చేయాలని సిఫార్సు చేస్తూ, ముసాయిదాను తయారుచేసింది. మూడేళ్ళ క్రితం 2018లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ – సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) శాఖకు నిపుణుల కమిటీకి ఆ ముసాయిదాను సమర్పించింది. 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పేర్కొన్న మినహాయింపులపై అభ్యంతరాలు రావడంతో, జేపీసీకి నివేదించారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన జేపీసీ ఈ బిల్లును లోతుగా పరిశీలించి, విస్తృత చర్చలు సాగించి, రెండేళ్ళ తర్వాత ఇప్పుడు తుది ముసాయిదా నివేదికను అందిస్తోంది. జేపీసీలోని కనీసం ఏడుగురు ప్రతిపక్ష సభ్యులు కొన్ని అంశాలలో విభేదించిన ఈ తుది నివేదిక ఎప్పుడో రావాల్సింది. కోవిడ్ సహా అనేక పరిణామాలతో అయిదుసార్లు జేపీసీ గడువును పొడిగించారు. దాంతో రెండేళ్ళ సుదీర్ఘకాలం పట్టింది. ఇప్పటికి నివేదిక, సిఫార్సులు వచ్చాయి. వాటిలోని వివరాలన్నీ పూర్తిగా బయటకు రాలేదు. అలాగే ఆ అంశాలన్నీ రేపు పార్లమెంటు చేసే తుది చట్టంలో ఉంటాయా అన్నదీ ఇప్పుడే చెప్పలేం. అయితే, ప్రాథమికంగా దేశంలోని వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కోసం ఓ నియంత్రణ వ్యవస్థను ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది. వ్యక్తిగతం, సున్నితం, కీలకం – అంటూ వ్యక్తిగత డేటాను 3 వర్గాలుగా వర్గీకరించి, ప్రతి వర్గానికీ ప్రత్యేకమైన విధివిధానాలు నిర్ణయిస్తారు. భారత పౌరుల డేటాతో వ్యవహారాలు నడిపే దేశ, విదేశీ సంస్థలన్నీ ఈ ప్రతిపాదిత చట్టానికి లోబడాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు పాల్పడితే చెల్లించాల్సిన పెనాల్టీలనూ పేర్కొన్నారు. అయితే, అనుమతి లేకుండానే డేటాను వాడుకొనే బిల్లులోని క్లాజు 35 సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికీ అసమ్మతి తెలుపుతున్నాయి. చరిత్రాత్మక సుప్రీమ్ తీర్పు ప్రాతిపదికన శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న ప్రమాణాలకు తగ్గట్టు ఈ బిల్లు లేదని ఓ వాదన. డేటా దుర్వినియోగాన్ని అరికట్టే ‘డేటా రక్షణ ప్రాధికార సంస్థ’ సభ్యుల ఎంపిక విధివిధానాలూ పలచబడ్డాయనేది మరో అభ్యంతరం. దేశభద్రతతో పాటు కొత్తగా ‘ప్రజాజీవన భద్రత’ మిషతోనూ ప్రభుత్వ సంస్థలు ఈ చట్టం పరిధిలోకి రాకుండా, వ్యక్తిగత డేటాను వాడుకొనే వీలుండడం ఇంకో వివాదాస్పద అంశం. ఇది ఈ చట్టం ఉద్దేశాన్నే నీరుగారుస్తోందన్నది ప్రతిపక్షాల అసమ్మతి స్వరం. ప్రభుత్వాలు తల్చుకొంటే, ‘పెగసస్’తో తెలియని నిఘా సాధ్యమైన దేశంలో... ప్రభుత్వసంస్థలకిచ్చే ఈ అతి వెసులుబాటు సైతం దుర్వినియోగం కాదని నమ్మకం లేదు. ప్రతిపక్షాలు, పౌర సమాజం భావన, భయమూ అదే! ప్రైవేట్ సంస్థల నుంచి మన వ్యక్తిగత డేటా లీకు కావడం, వాటిని మూడో వ్యక్తికి అమ్మేయడం లాంటివి దేశంలో అనేకం చూశాం. ఆధార్ మొదలు బ్యాంకు ఖాతాల వివరాల దాకా అనేకం అంగట్లో అమ్మకం కావడమూ చూశాం. చట్టం కానున్న ఈ బిల్లు దాన్ని ఏ మేరకు సమర్థంగా అరికడుతుందన్నది ఇప్పుడు కీలకం. అలాగే, వ్యక్తిగత డేటాను ఎక్కడ, ఎలా సురక్షితంగా భద్రపరుస్తారు, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారన్నదీ కూలంకషంగా చూడాల్సి ఉంది. ఇది వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించే బిల్లు. మరి, గూగుల్ మ్యాప్స్ లాంటి వ్యక్తిగతేతర డేటా భద్రత మాటేమిటి అంటున్న సైబర్ చట్టాల నిపుణుల ప్రశ్నలూ పట్టించుకోవాల్సి ఉంది. నేటి డిజిటల్ ప్రపంచంలో కీలకమైన ఇలాంటి చట్టం తేవడానికి ఈ మాత్రం చర్చ జరగడం ఆనందదాయకం. ప్రజాస్వామ్యానికి ఆరోగ్యదాయకం. ప్రతిపక్ష అభ్యంతరాలతో ఈ బిల్లు ఇదే రూపంలో, ఈ సమావేశాల్లోనే చట్టం రూపం దాల్చకపోవచ్చు. చట్టం రావడానికి ఇంకొద్ది రోజులు పట్టినా పట్టవచ్చు. అయితేనేం, మంచో చెడో అసలంటూ పీడీపీ మీద చర్చ ఇంతదాకా రావడం మంచిదే. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు వాటంగా మారే మధ్యవర్తిత్వ హోదాను తొలగించి, సోషల్ మీడియా వేదికలుగానే ఈ బిల్లులో పరిగణించాలన్న సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసూ కీలకమే. ఆ మేరకు ఈ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును స్వాగతించాల్సిందే. లోటుపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించే లోగా, ఓ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికిది ఓ ముందడుగు. -
పర్సనల్ డేటా ప్రొటెక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు తమ అసమ్మతి తెలుపుతూ జేపీసీ చైర్మన్ చౌదరికి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, వివేక్ టాంకా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్ జేపీసీ నిర్ణయంతో విభేదించారు. వేర్వేరుగా తమ అసమ్మతి నోట్లను ప్యానెల్ ఛైర్మన్‌కు పంపారు. ఏదైనా నేరం జరిగే ఆస్కారం ఉందని భావించినా దాన్ని నిరోధించడానికి, ఆ విషయంలో తదుపరి దర్యాప్తు చేయడానికి, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి వ్యక్తిగత డాటాను విశ్లేషించే అధికారాన్ని ఈ చట్టంలో దర్యాప్తు సంస్థలకు వీలు కల్పించారు. ఈడీ, సీబీఐలతో సహా తమ దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత గోప్యత రక్షణ హక్కు చట్టం నుంచి మినహాయించే అపరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని విపక్షాలు తీవ్రం ఆక్షేపించాయి. ఇలా మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని, అప్పుడే సిసలైన జవాబుదారీతనం ఉంటుందని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. చట్టం స్ఫూర్తికే దెబ్బ.. కమిటీ సిఫార్సుల్లో రెండు మినహా మిగతా అంశాలపై అభ్యంతరం లేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, శాంతిభద్రతలకు సంబంధించి కేంద్రం, ప్రభుత్వ ఏజెన్సీలు తమని తాము మినహాయించుకోవడానికి అనుమతించే బిల్లులోని క్లాజ్ 35ను పలువురు విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలకు(పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మినహాయింపు లభించనుంది. ట్విట్టర్, ఫేసుబుక్ వంటి వాటిని సామాజిక ప్రసార మాధ్యమ వేదికలుగానే పరిగణించాలని తేల్చిచెప్పింది. వాటికి మధ్యవర్తిత్వ హోదా (ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్ మీడియా సంస్థ బాధ్యత ఉండదు) తొలగించి వాటిని సైతం ఈ చట్టం కిందికి తీసుకురావాలని సూచించింది. బిల్లులోని క్లాజ్ 35 ప్రకారం.. పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటాను ప్రభుత్వం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. ఐటీ శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా మినహాయింపు ఇవ్వాలని జేపీసీ పేర్కొంది. -
పీఎన్బీ ఖాతాదారులకు షాక్... 18 కోట్ల మంది డేటా లీక్ ?
Punjab National Bank server exposed customer data : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వర్‌లోని (పీఎన్బీ) ఒక లోపం కారణంగా సుమారు 18 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. సుమారు ఏడు నెలల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిందని వివరించింది. అడ్మినిస్ట్రేషన్ అధికారాలతో పీఎన్బీకి చెందిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను బైటి వ్యక్తులు అందుబాటులోకి తెచ్చుకునేందుకు దోహదపడేలా ఈ లోపం ఉందని పేర్కొంది. దీన్ని తాము గుర్తించి సైబర్ సెక్యూరిటీ ప్రాధికార సంస్థలు సీఈఆర్టీ–ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా హెచ్చరించిన తర్వాత, పీఎన్బీ లోపాన్ని సరిదిద్దిందని సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు హిమాంశు పాఠక్ తెలిపారు. మరోవైపు, లోపం ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారించినప్పటికీ దీని వల్ల కీలకమైన డేటా ఏదీ బైటికి పోలేదని బ్యాంక్ తెలిపింది. - న్యూఢిల్లీ -
‘ఇన్‌కాగ్నిటో మోడ్’లో బ్రౌజింగ్ సేఫ్ కాదు!
Google Incognito Browsing Mode Alleges Tracking Users: టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ.. టెక్ దిగ్గజాల లోటుపాట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్‌కి సంబంధించి సంచలన ఆరోపణలపై కోర్టు విచారణ కొనసాగుతుండగా.. తాజా వాదనల సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేరు ప్రస్తావనకు రావడం విశేషం. సెర్చింజన్ గూగుల్ క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ తెలుసు కదా!. సెర్చ్ హిస్టరీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. వ్యక్తిగతంగా సెర్చ్ చేసుకునేందుకు గూగుల్ యూజర్లకు కల్పించిన వెసులుబాటు ఇది. అయితే ఇందులోని సమాచారాన్ని సైతం గూగుల్ రహస్యంగా సేకరిస్తోందని, యూజర్ భద్రతకు గ్యారంటీ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కిందటి ఏడాది కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా.. గురువారం ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాలను పిటిషనర్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ అనేది సురక్షితం కాదని, గూగుల్‌కు అన్నీ తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెడుతోందన్నది తాజా ఆరోపణ. సుందర్ పిచాయ్ పేరు.. 2019లో గూగుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లొర్రాయిన్ ట్వోహిల్ నేతృత్వంలో ఓ ప్రాజెక్టు జరిగింది. ఆ ప్రాజెక్టు సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇన్‌కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ మీద అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో మోడ్ అనే ‘ప్రైవేట్’ బ్రౌజింగ్ వ్యవస్థలో బోలెడన్ని సమస్యలున్నాయని, తనకు ఆ ఫీచర్ అవసరం లేదని అనిపిస్తోందని సుందర్ ఆ ప్రాజెక్టు సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం. యూజర్‌ను ట్రాక్ చేసే ఈ వ్యవస్థ వల్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశమూ లేకపోలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతపెద్ద సమస్య తెలిసి కూడా ఆయన సీక్రెట్ బ్రౌజింగ్ మోడ్‌ను ప్రమోట్ చేశారనేది ఆరోపణ. ఈ మేరకు గూగుల్ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఈ పిటిషన్‌పై గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా స్పందించారు. సెకండ్, థర్డ్‌హ్యాండ్ అకౌంట్లకు సంబంధించిన తప్పుడు ఈమెయిల్స్ ద్వారా సేకరించిన సమాచారంతో గూగుల్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో నిఘా ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతోందని గూగుల్ మీద ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తుండగా.. గూగుల్ మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా యూజర్లకు వచ్చే ముప్పేమీ లేదని స్పష్టం చేస్తోంది. క్లిక్ చేయండి: గూగుల్ క్రోమ్‌లో వెతుకుతున్నారా? అయితే ఈ పని చేయండి! చదవండి: ఈ పిల్ల వయసు ఎప్పటికీ 22!! -
కత్తికి రెండవ వైపు కూడా పదును
రోజా (పేరు మార్చడమైనది) ఆఫీసుకు వస్తూనే కొలీగ్ సురేష్ (పేరు మార్చడమైనది) సీట్ వద్దకు విసురుగా వెళ్లింది. సురేష్ ఆమెను చూస్తూనే సీటులో నుంచి లేచి నుంచున్నాడు. ‘అసలు నీకు బుద్ధుందా! నువ్వు మనిషివేనా!?’ అని సురేష్‌పై విరుచుకుపడింది. ఏం జరిగిందో అక్కడ ఎవ్వరికీ అర్ధం కాలేదు. నువ్వీ ఆఫీసులో ఎలా ఉంటావో చూస్తా! నన్నే కామెంట్ చేసేంత సీనుందా!? నీకు’ ఫ్రెండ్ వీణ వచ్చి నచ్చజెప్పి, తీసుకెళ్లేంతవరకు సురేష్‌ని తిడుతూనే ఉంది రోజా. ‘‘నిన్న ఆఫీసుకు నువ్వు శారీలో వచ్చావు. డ్రెస్‌లో కన్నా చీరలో సూపర్‌గా ఉన్నావ్!’ అంటూ సోషల్‌మీడియా వేదికగా రోజా ఫొటోకు రకరకాల కామెంట్స్ పెట్టాడు సురేష్. దీంతో ఆఫీసులో పెద్ద రాద్ధాంతమే జరిగింది.‘సురేష్ తననే టార్గెట్ చేశాడని, అందుకే తనను నలుగురిలో చులకన చేయడానికే రకరకాల కారణాలు వెతుకుతున్నాడంటూ రుజువులు చూపించింది రోజా. ఈ సంఘటన తర్వాత సురేష్ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆఫీసులో అంతా ప్రశాంతం అనుకున్న రోజాకు నాలుగో రోజు నుంచి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌లు కనపడటంతో తలకొట్టేసినట్టుగా ఉంది. ఆఫీసు టీమ్‌లో ఉన్నప్పుడు సురేష్‌తో సాధారణంగా షేర్ చేసుకున్న విషయాలు, కలివిడిగా దిగిన ఫొటోలు, తన అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు.సురేష్ చేసిన ఈ పని మూలంగా రోజాకు వచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది. సురేష్ చర్యలకు తీవ్ర మానసిక వేదనకు గురైన రోజా, డిప్రెషన్‌కు లోనై ఆఫీసు పనిలో చురుగ్గా పాల్గొనలేకపోయింది. రోజాలో వచ్చిన ఈ మార్పేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. భావ వ్యక్తీకరణకు కళ్లెం తప్పదు సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు, ప్రత్యేకించి గొంతుక లేని వ్యక్తులకు చాలా శక్తివంతమైన సాధనం. సమాజంలోని వ్యక్తులతో కలిసిపోవడానికి తమ వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యతలను స్వచ్ఛందంగా వెల్లడిస్తారు. మనలో చాలామంది సాధారణంగా స్టేటస్‌లను అప్డేట్ చేస్తారు. ఆన్లైన్లో తమ వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. అయితే, మీ ఆన్లైన్ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత, వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ వేధింపు అయినా అది నేరమే. ► వ్యక్తులు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పెరుగుతున్నాయనేది వాస్తవం. భద్రత దృష్ట్యా సామాజిక మాధ్యమాలను సెన్సార్ చేసే ఆలోచనలకు పునాది పడిందనే విషయాన్ని విస్మరించకూడదు. ► యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్వేచ్ఛగా ఇచ్చేస్తుంటారు. దీంతో తమ సైట్లలో ఉపయోగించే అన్ని చర్యలను ఇతరులు ట్రాక్ చేస్తారు. తర్వాత ఉపయోగించుకోవడానికి వీలుగా వాటిని దాచిపెట్టుకుంటారు. అంటే మన ప్రతి ప్రవర్తనా అంశం ఇతరులు తమ ఉపయోగాల కోసం సేకరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా మర్యాదలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఆఫ్‌లైన్ – ఆన్‌లైన్‌ని ఒకే విధంగా పరిగణించాలి. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది యూనివర్సల్ – ఎక్స్ప్రెషన్ కాదు. మీకు హాస్యం కలిగించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు, కాబట్టి సోషల్ మీడియాలో వ్యక్తీకరణలు జాగ్రత్తగా చేయాలి. ► ఉపయోగంలో లేని మీ అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను లాగ్ ఆఫ్ చేయాలి, మీ స్మార్ట్‌ఫోన్ లో ఇతర నోటిఫికేషన్ ఫీడ్లు వ్యసనాలకు దారి తీయడమే కాకుండా ఇతరత్రా ఆటంకాలకు కారణాలవుతాయి. ► చెడు భావాలను పెంచే, పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీరు సోషల్ మీడియాలో ప్రతికూల అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ► ఇప్పటికే మన నిజ జీవితంలో ఎంతో పోటీని ఎదుర్కొంటున్నాం. ఆన్లైన్ ప్రపంచంలో మనకు అంతకన్నా ఎక్కువ పోటీ అవసరం లేదని గుర్తించాలి. ► ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో, మీ సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ► సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇష్టపడని వారు మీ జాబితాలో ఉండవచ్చు. మీరు అలాంటి వారితో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారనే విషయాన్ని నిర్ధారించుకోండి. ► ఆన్లైన్ ప్రపంచంలో విహరిస్తూ మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు.. మీ పుట్టినరోజున 100 లైక్‌లు పొందవచ్చు. కానీ, మీ ఇంట్లో ఒక స్నేహితుడు మాత్రమే మిమ్మల్ని కలిసి అభినందనలు చెప్పచ్చు. ► స్మార్ట్‌ఫోన్ లకు బదులుగా సోషల్ మీడియా ఖాతాలకు లాగిన్ అవ్వడానికి ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం మేలు. ఎందుకంటే ఇది వ్యసనంగా మారే అవకాశాన్ని తగ్గిస్తుంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
గూగుల్‌కు భారీ షాకిచ్చిన రష్యా
మాస్కో: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా ప్రభుత్వం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ గూగుల్‌కు 3 మిలియన్ రూబిళ్లు ( సుమారు 31 లక్షల రూపాయల) జరిమానా విధించింది. ఈ విషయంలో గూగుల్‌కు ఇది మొదటి జరిమానా అని మాస్కో టాగన్స్కీ జిల్లా కోర్టు గురువారం తెలిపింది. ఈ జరిమానాను ధృవీకరించిన గూగుల్ దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రష్యాకు టెగ్ దిగ్గజాలకు ప్రధానంగా గూగుల్‌కు మధ్య ఇటీవల నెలకొన్న వైరుధ్యాల మధ్య ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యాలో వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేయనందుకు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ గూగుల్‌కు 6 మిలియన్ రూబిళ్లు వరకు జరిమానా విధించవచ్చని స్టేట్ కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ రోస్కోమ్నాడ్జోర్ గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధిత విషయాలను తొలగించడంలో వైఫల్యం, రష్యాలో విదేశీ టెక్ సంస్థల కార్యాలయాలను తెరవని కారణంగా సోషల్ మీడియా దిగ్గజాలకు రష్యా ప్రభుత్వం జరిమానా విధిస్తోంది. నిషేధిత కంటెంట్‌ను తొలగించనందుకు గతంలో గూగుల్‌కు జరిమానా విధించింది. అలాగే అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ పైనా రష్యా చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. మరోవైపు ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా గూగుల్‌కు వ్యతిరేకంగా మూడు కేసులు నమోదు చేసింది. -
మీ ఐఫోన్ చోరీకి గురైందా..! ఇక అంతే సంగతులు..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లకు ఆదరణ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు సాటి లేదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. ఒకవేళ ఐఫోన్‌ను పొగొట్టుకున్నా, దొంగిలించిన తిరిగి మొబైల్‌ను ‘ ఫైండ్ మై లాస్ల్ డివైజ్’తో పొందవచ్చును. అంతేకాకుండా మీ ఫోన్లోని డేటాను పూర్తిగా తొలగించవచ్చు. మొబైల్ పోయినా..మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారా..! ఐతే మీరు పొరపడినట్లే..! దొంగిలించిన ఐఫోన్లను నేరస్థులు బ్లాక్ మార్కెట్లో విక్రయించడంతో పాటు, నేరస్థులు ఒక అడుగు ముందుకేసి దొంగిలించిన ఐఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్నే కాకుండా, బ్యాంకు అకౌంట్ వివరాలను తెలుసుకుంటున్నారని బ్రెజిల్ పోలీసులు గుర్తించారు. ఫోన్ల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేస్తూ, సదరు వ్యక్తుల ఐఫోన్ల నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. బ్రెజిల్ పోలీసుల ప్రకారం నేరస్తులు దొంగిలించిన ఫోన్లలోని సిమ్‌లను వేరే మొబైల్ వేసి సదరు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను, సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేస్తోన్నట్లు నిర్థారించారు. చివరగా సదరు వ్యక్తుల ఫోన్ నంబర్లను తెలుసుకొని ఐఫోన్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను రిసేట్ చేస్తున్నట్లు గుర్తించారు. పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌లో సేవ్ చేయకపోవడం మంచింది..! దొంగిలించిన ఐఫోన్ల నుంచి సదరు వ్యక్తుల ఐక్లౌడ్‌లో ఉన్న పాస్‌వర్డ్‌లతో వారి బ్యాంకు ఖాతాలను, సోషల్‌మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్‌లను నేరస్తులు సులువుగా తెలుసుకుంటున్నారని గుర్తించారు. కాగా మొబైల్ ఫోన్లలో బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌లో సేవ్ చేసుకోకపోవడం మంచిదనీ టెక్ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేవలం ఐఫోన్లలోనే ఇలాంటి ఘటనలు జరిగాయంటే పొరపడినట్లే..! అన్ని స్మార్ట్ఫోన్ల నుంచి సదరు వ్యక్తుల సమాచారాన్ని నేరస్తులు పొందుతున్నారని బ్రెజిల్ పోలీసులు పేర్కొన్నారు. -
మొబీక్విక్ వినియోగదారులకు షాక్: భారీగా డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ యూజర్లకు షాకింగ్ న్యూస్. లక్షలమంది మొబీక్విక్ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకాని పెట్టారన్న వార్తలు మొబీక్విక్ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది. 37 మిలియన్ల ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు,సీసీ డేటా ఉన్నాయనే అంచనాలు యూజర్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా ఇతర తదితరాలు హ్యాకింగ్ గురయ్యాయని, డార్క్ వెబ్ లింక్‌లో ఈ లీక్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్ వార్తలతో మొబీక్విక్ ఇబ్బందుల్లో పడింది. ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ లీక్‌ను మొదటిసారి నివేదించారు. ఫిబ్రవరి 26 న లీక్ వివరాలను ట్వీట్ చేశారు: “11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు, కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు. మొబీక్విక్‌కు సంబంధించి నో-యు-కస్టమర్ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి స్క్రీన్షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను విక్రయానికి పెట్టినట్టు సమాచారం. “బహుశా చరిత్రలో అతిపెద్ద కేవైసీ డేటా లీక్.అభినందనలు మొబీక్విక్...’ అంటూ మరోహ్యాకర్ ఇలియట్ హ్యాండర్సన్ కూడా ట్వీట్ చేశారు. లీక్ అయిన డేటాలో ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ, కేవైసీ వివరాలున్నాయి కాబట్టి స్కామర్లకు ఈజీగా యాక్సెస్ లభిస్తుందని స్వతంత్ర భద్రతా పరిశోధకుడు ఇంద్రజీత్ భూయాన్ వ్యాఖ్యానించారు. Indian payment systems giant "Mobikwik" allegedly suffered what may be considered the largest KYC data leak in history. Over 37m files, KYC of 3.5m individuals, and a whopping 100m phone numbers, emails, passwords, geodata, bank accounts & CC data.@MobiKwik pic.twitter.com/dCFqTHEv1F — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) March 28, 2021 Probably the largest KYC data leak in history. Congrats Mobikwik... pic.twitter.com/qQFgIKloA8 — Elliot Alderson (@fs0c131y) March 29, 2021 యూజర్ల డేటా సేఫ్‌గా ఉంది : మొబీక్విక్ అయితే ఈ వార్తలను మొబీక్విక్ ఖండించింది. తమ సెక్యూరిటీ సిస్టంలోఎలాంటి లోపాలులేవని స్పష్టం చేసింది.దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, తమ వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని మోబిక్విక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భద్రతా పరిశోధకులు అని పిలవబడే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపాడేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 200-250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.