సమాచార సాంకేతిక రంగ నిపుణులు ఎంతకాలం నుంచో కోరుతున్న వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం సాకారం అయ్యేందుకు తొలి అడుగు పడింది. కేంద్ర కేబినెట్ బుధవారం ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఏడాదిపాటు ఐటీ రంగ నిపుణులతో, సంస్థలతో సంప్రదింపులు జరిపి, వివిధ దేశాలు అమలు చేస్తున్న చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ బిల్లును రూపొందించింది.
ఆ కమిటీ నిరుడు సమర్పించిన బిల్లుపై అభిప్రాయాలు సేకరించి తగిన మార్పులు, చేర్పులూ చేశాక ప్రస్తుత బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్‌తో అనుసంధానమైంది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు మొదలుకొని అనేకానేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందులో భాగంగా మారాయి. ఈ డిజిటల్ యుగంలో ఈమెయిల్ ఖాతా లేని వారు, వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ప్రారంభించనివారు ఉండరు. అలా ఖాతా ప్రారంభించే ప్రతి ఒక్కరినుంచి వివిధ సంస్థలు విస్తృతంగా డేటా సేకరిస్తున్నాయి. వారి పేరు, వయసు, చిరునామా, ఫోన్ నంబర్, వారి ఇష్టాయిష్టాలు మొదలైనవన్నీ అందులో ఉంటాయి. అయితే ఈ సమాచారాన్నంతా వారు దేనికి వినియోగిస్తారో, ఎందుకు సేకరిస్తారో ఎవరికీ తెలియదు.
గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాలన్నీ డేటా సేకరణ చేస్తున్నాయి. నాలుగేళ్లక్రితం కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) అనే సంస్థకు ఫేస్‌బుక్ తన ఖాతాదార్ల సమాచారాన్ని అమ్ముకుందని వెల్లడైంది. ఇలాంటి డేటాతో వ్యాపార వాణిజ్య సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవడం రివాజైంది. సీఏ సంస్థ మన దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలతో ఒప్పందం కుదుర్చుకుని భిన్న ప్రాంతాల ఓటర్ల కుల, మత వివరాలు, వారి ఇష్టాయిష్టాలు వగైరాలు అందజే సింది. పౌరుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడి చాలామంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.
ఆ మధ్య ఆధార్ డేటా కూడా లీకైంది. ఈ నేపథ్యంలో డేటా పరిరక్షణ చట్టం అవసరం ఎంతో వుంది. సమాచార సాంకేతిక నిపుణులు దీని అవసరం గురించి ఎప్పటినుంచో చెబుతున్నారు. చాలా దేశాలు ఇప్పటికే ఈ తరహా చట్టాలు తీసుకొచ్చాయి. తమ ఖాతాదార్లు వీడియోలు చూసే సగటు సమయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఫేస్‌బుక్‌పై అనేక వాణిజ్య ప్రకటన సంస్థలు న్యాయస్థానాల్లో కేసులు వేస్తే మొన్న అక్టోబర్‌లో ఫేస్‌బుక్ యాజ మాన్యం 4 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.
తమ పౌరులు ఫేస్‌బుక్ ఖాతాల్లో వ్యక్తిగత విని యోగం కోసం పెట్టుకున్న ఫొటోలన్నీ బట్టబయలయ్యాయని, అందుకు 2లక్షల 70 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని టర్కీ శ్రీముఖం పంపింది. అక్కడ మాత్రమే కాదు... రష్యా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశా లన్నిటా ఫేస్‌బుక్‌పై లక్షలాది డాలర్లు పరిహారంగా చెల్లించా లంటూ దావాలు పడ్డాయి. ఈ ఏడాది ఇంతవరకూ దాఖలైన కేసుల్లో ఫేస్‌బుక్ సంస్థ దాదాపు 516 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం దాని వార్షిక ఆదాయంలో దాదాపు ఏడున్నర శాతం.
డేటా సేకరణ, నిక్షిప్తం, వినియోగం వంటి అంశాల్లో ఈ బిల్లు అనేక నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించింది. వ్యక్తుల ముందస్తు అనుమతి లేనిదే వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని బిల్లు నిర్దేశిస్తోంది. అయితే పౌరుల సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేయాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సంస్థలన్నీ ఆ సమాచారాన్ని ఈ దేశంలో నెలకొల్పే సర్వర్లలో మాత్రమే భద్రపరచాలని లోగడ చెప్పగా, ఇప్పుడు దాన్ని సవరించి వ్యక్తుల సున్నితమైన సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడి సర్వర్లలో ఉంచాలని...ఇతరత్రా సమాచా రమైతే ఆయా సంస్థలు ఏ సర్వర్లలో భద్రపరిచినా అభ్యంతరం లేదని తాజా ముసాయిదా బిల్లు చెబుతోంది.
ప్రభుత్వం ఇచ్చే నిర్వచనాన్నిబట్టి ‘కీలక సమాచారం’ ఏమిటన్నది నిర్ణయమవుతుంది. అవసరాన్నిబట్టి ఈ నిర్వచనం పరిధిలోకి కొత్త అంశాలు చేరే అవకాశం ఉంటుంది. సున్నితమైన సమాచారం విషయంలో ఖాతాదారు అనుమతి అవసరమవుతుంది. డేటా నిక్షిప్తానికి ఇక్కడ సర్వర్లు నెలకొల్పాలని మన ప్రభుత్వం పట్టుదలకుపోతే... వేరే దేశాల్లోని మన సంస్థలపై కూడా అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి షరతులే పెట్టే ప్రమాదం ఉందని, అందువల్ల తమపై ఆర్థిక భారం పడుతుందని ఐటీ సంస్థలు మొరపెట్టుకున్నాయి. దీంతో బిల్లులో మార్పులు చేశారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌వంటి సంస్థలు ఖాతాదారులు అందజేసే వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సివుంటుంది. ఈ బిల్లు చట్టమైతే వారు నిజమైన వ్యక్తులేనా లేక వేరేవారి పేర్లతో ఖాతాలు ప్రారంభించారా అన్నది తెలుసుకోకతప్పదు. తప్పుడు పేర్లతో ప్రవేశించినవారే సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా, బాధ్యతారహితంగా వ్యాఖ్యానాలు చేయడం, కించపరచడం లాంటివి చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిబంధన పొందుపరిచారు.
అలాగే అన్ని సంస్థలూ తమ తమ ప్రతినిధులను ఈ దేశంలో నియమించుకోవడం ఇకపై తప్పనిసరి. సంస్థలకు జవాబు దారీతనం ఉండాలన్న సంకల్పంతో ఈ నిబంధన పెట్టారు. ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారణైతే సంస్థలో డేటా పరిరక్షణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తికి మూడేళ్లవరకూ జైలు, రూ. 15 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. తమ వ్యక్తిగత డేటా అవాంఛిత వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. అయితే ఇతర హక్కుల మాదిరి ఈ హక్కుకు భౌగోళిక సరిహద్దులుండవు. కనుక ఇలాంటి చట్టానికి రూపకల్పన చేయడం కత్తి మీది సాము. ఈ క్రమంలో ప్రభుత్వాలకు వ్యక్తుల డేటాపై ఏదోమేరకు ఆధిపత్యం లభించడం కూడా తప్పనిసరి. ఆలస్యంగానైనా ఇలాంటి చట్టం రాబోతుండటం హర్షించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment