Cambridge Analytica
-
ఫేస్బుక్ డేటా చోరీపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: దాదాపు 18 నెలల ప్రాథమిక విచారణ అనంతరం సుమారు 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా వాడుకోవడంపై కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ), గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్ఆర్) సంస్థలపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద బ్రిటన్‌కు చెందిన ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు అక్రమంగా వినియోగించాయన్న వార్తలపై 2018 జులైలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపి, సీబీఐ కేసు నమోదు చేసింది. పరిశోధన అవసరాల కోసం కొన్ని వర్గాల వినియోగదారుల సమాచారం ఇవ్వాలని కోరుతూ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ తరఫున అలెక్జాండర్ కోగన్ ఫేస్‌బుక్‌ను అభ్యర్థించారు. ఆ ఆనుమతితో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించి, ఫేస్బుక్ అనుమతించిన 335 మంది వినియోగదారులతో పాటు అక్రమంగా, వారి స్నేహితుల జాబితాలోని వ్యక్తుల సమాచారం కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని ‘కేంబ్రిడ్స్ అనలిటికా’కు అమ్మేశారు. భారత్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రొఫైలింగ్ చేసిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. అమెరికాలోని వినియోగదారుల సమాచారం మాత్రమే జీఎస్ఆర్ నుంచి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా తెలిపింది. -
డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా బ్రీచ్ కేసులో సీబీఐ కేంబ్రిడ్జ్ అనలిటికాపై శుక్రవారం కేసు నమోదు చేసింది. 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాపై కేసు నమోదు చేసింది. ఇదే ఆరోపణలతో ఆ దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్ఎల్) ను కూడా కేసులో చేర్చింది. దీనిపై ఫేస్బుక్ కూడా స్పందించింది. సుమారు 5.62 లక్షల భారతీయ యూజర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబల్ సైన్స్ కంపెనీ అక్ర ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకుందని తెలిపింది. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. కాగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే లక్క్ష్యంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫేస్బుక్-కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయనుందని కేంద్ర సమాచా,ప్రసార, సాంకేతిక శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. -
డేటా భద్రతకు చట్టం
సమాచార సాంకేతిక రంగ నిపుణులు ఎంతకాలం నుంచో కోరుతున్న వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం సాకారం అయ్యేందుకు తొలి అడుగు పడింది. కేంద్ర కేబినెట్ బుధవారం ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఏడాదిపాటు ఐటీ రంగ నిపుణులతో, సంస్థలతో సంప్రదింపులు జరిపి, వివిధ దేశాలు అమలు చేస్తున్న చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ బిల్లును రూపొందించింది. ఆ కమిటీ నిరుడు సమర్పించిన బిల్లుపై అభిప్రాయాలు సేకరించి తగిన మార్పులు, చేర్పులూ చేశాక ప్రస్తుత బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్తో అనుసంధానమైంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు మొదలుకొని అనేకానేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందులో భాగంగా మారాయి. ఈ డిజిటల్ యుగంలో ఈమెయిల్ ఖాతా లేని వారు, వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ప్రారంభించనివారు ఉండరు. అలా ఖాతా ప్రారంభించే ప్రతి ఒక్కరినుంచి వివిధ సంస్థలు విస్తృతంగా డేటా సేకరిస్తున్నాయి. వారి పేరు, వయసు, చిరునామా, ఫోన్ నంబర్, వారి ఇష్టాయిష్టాలు మొదలైనవన్నీ అందులో ఉంటాయి. అయితే ఈ సమాచారాన్నంతా వారు దేనికి వినియోగిస్తారో, ఎందుకు సేకరిస్తారో ఎవరికీ తెలియదు. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాలన్నీ డేటా సేకరణ చేస్తున్నాయి. నాలుగేళ్లక్రితం కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) అనే సంస్థకు ఫేస్బుక్ తన ఖాతాదార్ల సమాచారాన్ని అమ్ముకుందని వెల్లడైంది. ఇలాంటి డేటాతో వ్యాపార వాణిజ్య సంస్థలు తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవడం రివాజైంది. సీఏ సంస్థ మన దేశంలోని కొన్ని రాజకీయ పక్షాలతో ఒప్పందం కుదుర్చుకుని భిన్న ప్రాంతాల ఓటర్ల కుల, మత వివరాలు, వారి ఇష్టాయిష్టాలు వగైరాలు అందజే సింది. పౌరుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడి చాలామంది బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆ మధ్య ఆధార్ డేటా కూడా లీకైంది. ఈ నేపథ్యంలో డేటా పరిరక్షణ చట్టం అవసరం ఎంతో వుంది. సమాచార సాంకేతిక నిపుణులు దీని అవసరం గురించి ఎప్పటినుంచో చెబుతున్నారు. చాలా దేశాలు ఇప్పటికే ఈ తరహా చట్టాలు తీసుకొచ్చాయి. తమ ఖాతాదార్లు వీడియోలు చూసే సగటు సమయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఫేస్‌బుక్‌పై అనేక వాణిజ్య ప్రకటన సంస్థలు న్యాయస్థానాల్లో కేసులు వేస్తే మొన్న అక్టోబర్‌లో ఫేస్బుక్ యాజ మాన్యం 4 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. తమ పౌరులు ఫేస్బుక్ ఖాతాల్లో వ్యక్తిగత విని యోగం కోసం పెట్టుకున్న ఫొటోలన్నీ బట్టబయలయ్యాయని, అందుకు 2లక్షల 70 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని టర్కీ శ్రీముఖం పంపింది. అక్కడ మాత్రమే కాదు... రష్యా, ఇటలీ, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశా లన్నిటా ఫేస్‌బుక్‌పై లక్షలాది డాలర్లు పరిహారంగా చెల్లించా లంటూ దావాలు పడ్డాయి. ఈ ఏడాది ఇంతవరకూ దాఖలైన కేసుల్లో ఫేస్బుక్ సంస్థ దాదాపు 516 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం దాని వార్షిక ఆదాయంలో దాదాపు ఏడున్నర శాతం. డేటా సేకరణ, నిక్షిప్తం, వినియోగం వంటి అంశాల్లో ఈ బిల్లు అనేక నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించింది. వ్యక్తుల ముందస్తు అనుమతి లేనిదే వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ అందజేయరాదని బిల్లు నిర్దేశిస్తోంది. అయితే పౌరుల సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేయాలన్న విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సంస్థలన్నీ ఆ సమాచారాన్ని ఈ దేశంలో నెలకొల్పే సర్వర్లలో మాత్రమే భద్రపరచాలని లోగడ చెప్పగా, ఇప్పుడు దాన్ని సవరించి వ్యక్తుల సున్నితమైన సమాచారాన్ని, కీలక సమాచారాన్ని ఇక్కడి సర్వర్లలో ఉంచాలని...ఇతరత్రా సమాచా రమైతే ఆయా సంస్థలు ఏ సర్వర్లలో భద్రపరిచినా అభ్యంతరం లేదని తాజా ముసాయిదా బిల్లు చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వచనాన్నిబట్టి ‘కీలక సమాచారం’ ఏమిటన్నది నిర్ణయమవుతుంది. అవసరాన్నిబట్టి ఈ నిర్వచనం పరిధిలోకి కొత్త అంశాలు చేరే అవకాశం ఉంటుంది. సున్నితమైన సమాచారం విషయంలో ఖాతాదారు అనుమతి అవసరమవుతుంది. డేటా నిక్షిప్తానికి ఇక్కడ సర్వర్లు నెలకొల్పాలని మన ప్రభుత్వం పట్టుదలకుపోతే... వేరే దేశాల్లోని మన సంస్థలపై కూడా అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి షరతులే పెట్టే ప్రమాదం ఉందని, అందువల్ల తమపై ఆర్థిక భారం పడుతుందని ఐటీ సంస్థలు మొరపెట్టుకున్నాయి. దీంతో బిల్లులో మార్పులు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్వంటి సంస్థలు ఖాతాదారులు అందజేసే వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సివుంటుంది. ఈ బిల్లు చట్టమైతే వారు నిజమైన వ్యక్తులేనా లేక వేరేవారి పేర్లతో ఖాతాలు ప్రారంభించారా అన్నది తెలుసుకోకతప్పదు. తప్పుడు పేర్లతో ప్రవేశించినవారే సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా, బాధ్యతారహితంగా వ్యాఖ్యానాలు చేయడం, కించపరచడం లాంటివి చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిబంధన పొందుపరిచారు. అలాగే అన్ని సంస్థలూ తమ తమ ప్రతినిధులను ఈ దేశంలో నియమించుకోవడం ఇకపై తప్పనిసరి. సంస్థలకు జవాబు దారీతనం ఉండాలన్న సంకల్పంతో ఈ నిబంధన పెట్టారు. ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారణైతే సంస్థలో డేటా పరిరక్షణ బాధ్యతలు చూస్తున్న వ్యక్తికి మూడేళ్లవరకూ జైలు, రూ. 15 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. తమ వ్యక్తిగత డేటా అవాంఛిత వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు. అయితే ఇతర హక్కుల మాదిరి ఈ హక్కుకు భౌగోళిక సరిహద్దులుండవు. కనుక ఇలాంటి చట్టానికి రూపకల్పన చేయడం కత్తి మీది సాము. ఈ క్రమంలో ప్రభుత్వాలకు వ్యక్తుల డేటాపై ఏదోమేరకు ఆధిపత్యం లభించడం కూడా తప్పనిసరి. ఆలస్యంగానైనా ఇలాంటి చట్టం రాబోతుండటం హర్షించదగ్గ విషయం. -
ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల గోప్యతను పరిరక్షించడంలో పదే పదే విఫలమవుతున్న ఫేస్బుక్ కంపెనీకి 500 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికాలోని ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ విధించింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ ఐటీ కంపెనీకి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. 3–2 మెజారిటీతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానాకు ముగ్గురు రిపబ్లికన్ కమిషనర్లు మొగ్గుచూపగా, ఇద్దరు డెమోక్రటిక్ కమిషనర్లు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంతో జరిమానా విధిస్తూ చేసిన తీర్మానాన్ని ఎఫ్‌టీసీ సమీక్షకు పంపించింది. పౌర డివిజన్‌కు చెందిన న్యాయవిభాగం ఈ తీర్మానాన్ని సమీక్షించి తుది తీర్పును వెలువరిస్తుంది. అయితే ఈ విచారణకు ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సంబంధిత వర్గాలు. 500 కోట్ల డాలర్ల జరిమానా అన్నది భారీ మొత్తం అయినప్పటికీ గతేడాది 3,600 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధించిన కంపెనీకి అంత పెద్దదేమీ కాదని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంత భారీ జరిమానా విధించినప్పటికీ దాని ప్రభావం షేర్లపై ఏమాత్రం కనిపించలేదు. 1.8 శాతం షేర్లు ఊపందుకున్నాయి. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం ‘కేంబ్రిడ్జి అనలిటికా’ సంస్థ వద్ద వెలుగు చూడడంతో ఎఫ్‌టీసీ ఏడాది క్రితమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం కోసం ఈ అనలిటికా అనే సంస్థ పనిచేసింది. -
క్విజ్ యాప్‌లపై ఫేస్బుక్ నిషేధం
శాన్ఫ్రాన్సిస్కో: యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే దిశగా సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్ఫామ్లో యూజర్ల వ్యక్తిత్వంపై క్విజ్‌లను నిర్వహించే యాప్‌లను నిషేధిస్తున్నామని తెలిపింది. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా సేకరించేలా ఉన్న యాప్‌లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వీటితోపాటు పలు అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ల(ఏపీఐ)ను తొలగిస్తున్నామనీ, కంపెనీ విధానాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని ఫేస్బుక్ పేర్కొంది. కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి 8.7 కోట్ల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సమాచారాన్ని వాడుకున్నట్లు తేలడంతో ఫేస్బుక్ పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది. -
ఎవరు టాపర్లో తెలుసుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ పౌరల సామాజిక మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ‘సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్’ను సుప్రీం కోర్టు అభ్యంతరాల కారణంగా ఆగస్టు మూడవ తేదీన విరమించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎంతో మంది భారతీయుల సామాజిక ఖాతాలు ప్రభుత్వం నిఘా నేత్రంలో ఉన్నాయనే విషయం ఎందరికి తెలుసు? ఆ నిఘా నేత్రం పేరు ‘అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫర్ సోషల్ మీడియా అనలిటిక్స్ (ఏఏఎస్‌ఎంఏ)’. ఈ టూల్‌ను కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ నిధులతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ 2013–2014లో రూపొందించింది. ఈ ఆస్మా టూల్‌ను ఎలాంటి ప్రచారం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం 2017, ఏప్రిల్ నెల నుంచి దేశంలోని 40 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలోగా మరో 75 ప్రభుత్వ సంస్థల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుగా, వ్యూహాత్మక పురోగతిని పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేశామని కేంద్రం పేర్కొన్నట్లు ‘ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ తన 2016–2017 వార్షిక నివేదకలో పేర్కొంది. ఆస్మాపై కేంద్రంలోని మంత్రి, కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయని, ఈ టూల్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీన్ని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగిస్తున్న కొన్ని ఏజెన్సీలు లిఖిత పూర్వకంగా కూడా కేంద్రానికి తెలిపాయని ఆ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఆస్మాను ఏ ప్రభుత్వ సంస్థలు వాడుతున్నాయో, ఎందుకోసం వాడుతున్నాయో, ఏ ఏజెన్సీలు లిఖితపూర్వకంగా సంతృప్తి వ్యక్తం చేశాయో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ ఆస్మాను ఇంటెలిజెన్సీ, భద్రతా విభాగాలకే పరిమితం చేశాయా, లేదా ? అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆస్మా గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దీన్ని ఇన్స్టాల్ చేసినట్లయితే 24 గంటలపాటు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఫ్లికర్, గూగుల్ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించే ఖాతాదారులు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే సమాచారాన్ని విశ్లేషించవచ్చు. సోషల్ మీడియా ప్రొఫైళ్లను, వారి పోస్టులను వీక్షించవచ్చు. వారి పోస్టింగులను సానుకూలం లేదా ప్రతికూలం అంటూ వర్గీకరణ కూడా చేయవచ్చు. అంటే ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో విశ్లేషించవచ్చు. ఏ సోషల్ మీడియాలో ఎవరు టాపర్లో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని పోలీసు విభాగంలో నేరస్థులపై నిఘాను కొనసాగించేందుకు ఓ సోషల్ మీడియా హబ్‌ను ఏర్పాటు చేయాలంటూ ‘నేషనల్ పోలీసు మిషన్’ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆస్మాను పోలీసు విభాగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు అనధికారికంగా తెల్సింది. ఎందుకంటే నేరస్థులెవరో, నేరస్థులు ఎవరుకాదో తెలుసుకోవడానికే కాకుండా ఎవరు నేర స్వభావులు ఎవరో ముందుగానే తెలుసుకొని వారిపై నిఘా కొనసాగించడం ద్వారా నేరం చేయకుండా వారిని నియంత్రించవచ్చన వాదన కూడా కొంత మంది పోలీసు అధికారుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ టూల్‌ను సైనిక బలగాలు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. నేరస్థుల కదలికలను తెలుసుకునేందుకు వారి ఫోన్లపై నిఘా పెట్టడమన్నది పోలీసు విభాగంలో ఎప్పటి నుంచో కొనసాగుతోందని, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరిపై నిఘా పెట్టడం మంచిది కాదని ఉత్తరప్రదేశ్‌లో పోలీసు డైరెక్టర్ జనరల్‌గా, సరిహద్దు భద్రతా దళానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ప్రకాష్ సింగ్ అభిప్రాయపడ్డారు. నియంతృత్వ పాలనలో నిఘా అవసరమంటే ఆలోచించవచ్చని, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిఘా అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలు పౌరుల సోషల్ మీడియా డేటాను పెద్ద ఎత్తున సేకరిస్తూ విశ్లేషిస్తుందంటే అది కచ్చితంగా పౌరులపై నిఘా కొనసాగించడమేనని ‘గ్లోబల్ డిజిటల్ రైట్స్’లో పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామన్ జిత్ సింగ్ చిమా వ్యాఖ్యానించారు. అందరికి అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషిస్తే పర్వాలేదుగానీ, వ్యక్తిగతమైన డేటాను విశ్లేషించడమంటే నేరమే అవుతుందని ఆయన అన్నారు. ఆస్మా టూల్ గురించి అన్నింటికన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పారదర్శకత లేకపోవడమని ‘సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థకు చెందిన అంబర్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ టూల్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియదు. ప్రతి వ్యక్తి సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా కొనసాగించడమంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లోని రాజకీయ కన్సల్టెంట్ సంస్థ ‘కేంబ్రిడ్జి అనలిటికా’ ఫేస్బుక్ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్మా లాంటి నిఘా టూల్స్‌పై ఆందోళన పెరిగింది. అన్నింటా ప్రచారానికి ముందుండే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ టూల్‌ను గుట్టుగా అమలు చేస్తుందంటే రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా సమాచారాన్ని దుర్వినియోగం చేయడానికేనని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఫేస్బుక్లో భారతీయుల వివరాలు తస్కరించిందన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం ప్రాథమిక విచారణను ప్రారంభించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్బుక్ యూజర్ల వివరాలను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. సీఏ అనుబంధ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీస్ భారత్‌లోనూ పనిచేసింది. -
అమెరికా ఎన్నికల్లో మళ్లీ రష్యా జోక్యం ?
అమెరికాలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్లను తప్పుదారి పట్టించడానికి ఫేస్బుక్ వేదికగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆ సంస్థ గుర్తించింది. రాజకీయ ప్రచారాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 32 పేజీల అకౌంట్లను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించింది. కేంబ్రిడ్జి ఎన్లైటికా వ్యవహారంతో తలబొప్పి కట్టిన ఫేస్బుక్ అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యం నివారించడానికి ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఆర్మ్స్ రేస్ పేరుతో రాజకీయపరమైన ట్రాల్స్ను ఇప్పటికే ఫేస్బుక్ జల్లెడ పడుతోంది. ఫేస్బుక్ తొలగించిన ఆ 32 పేజీలలో ప్రధానంగా వామపక్ష భావజాలపరమైన అంశాలు, జాతి వివక్ష, లింగ వివక్షల్ని రెచ్చగొట్టే అంశాలు, వలసదారుల సమస్యలు, మానవ హక్కులు వంటి అంశాలపై ప్రచారాలు కొనసాగుతున్నాయి. అజ్ట్లాన్ వారియర్స్, రెసిస్టర్స్, బ్లాక్ ఎలివేషన్ వంటి పేజీలు ఫేస్బుక్ తొలగించిన వాటిలో ఉన్నాయి. ప్రధానంగా వాషింగ్టన్లో వచ్చేవారం జరగనున్న హక్కుల ఐక్య ర్యాలీకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఫేస్బుక్లో పేజీలు క్రియేట్ అయ్యాయి. అమెరికా వలస విధానాల్ని లక్ష్యంగా చేసుకొని ఐసీఈ రద్దు హ్యాష్‌ట్యాగ్‌తో కూడా ప్రచారం సాగుతోంది. 2 లక్షల 90 వేల మందికి పైగా వినియోగదారులు ఈ ఫేస్బుక్ పేజీలను ఫాలో అవుతూ ఉంటే, ఆ పేజీల్లో ప్రకటనల కోసం 11 వేల డాలర్లు ఖర్చు చేశారు. ఈ ప్రచారాల వెనుక విదేశీ హస్తం ఉందన్న అనుమానంతో ఫేస్బుక్ వాటిని తొలగించింది. ఇటీవల జరిగిన ట్రంప్, పుతిన్ భేటీ అనంతరం అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదన్న పుతిన్ ప్రకటన నమ్మశక్యంగా ఉందని ట్రంప్ అంగీకరించిన నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత లభించింది. ఇదంతా రష్యా పనే : అమెరికా సెనేటర్ అమెరికా ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రచారాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రయత్నించిందో ఫేస్బుక్ వెల్లడించలేకపోయినప్పటికీ, నవంబర్‌లో జరిగే ఎన్నికల్ని కూడా ప్రభావితం చేయడానికి రష్యాయే ప్రయత్నిస్తోందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అమెరికా ప్రజల్లో చీలిక తెచ్చేలా తప్పుడు ప్రచారాలన్నీ సాగుతున్నాయి. ఇదంతా రష్యా చేస్తున్న పనే. ఫేస్బుక్ కొంతవరకైనా అడ్డుకోవడం అభినందనీయం‘ అని సెనేటర్ మార్క్ వార్నర్ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం ఫేస్బుక్ ప్రచారం వెనుక రష్యా హస్తం ఉందని చెప్పడానికి తగినన్ని ఆధారాలు ఇంకా లభించలేదని అంటున్నారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా చేసిన ప్రచారం మాదిరిగానే, అదే లక్ష్యంతో, అదే రకమైన భాషతో మళ్లీ సరికొత్త ప్రచారం ఫేస్బుక్లో మొదలైందని వారు అంగీకరిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక రష్యాకు చెందిన ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ హస్తం ఉందన్న అనుమానాలైతే ఉన్నాయి. గత రెండేళ్లలో ఫేస్బుక్లో రష్యా మద్దతు పలికే రాజకీయ పరమైన అంశాలను 12.6 కోట్ల మంది అమెరికన్లు ఫాలో అయ్యారని ఒక అంచనా.. 1.6 కోట్ల మంది అమెరికన్ల సమాచారం ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్ ద్వారా రష్యాకు చేరి ఉంటుందని అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఫేస్బుక్ వినియోగదారుల ఆలోచనల్ని ప్రభావితం చేసే ఎలాంటి ప్రచారాన్నయినా అడ్డుకుంటామని ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెర్లీ శాండ్ బర్గ్ స్పష్టం చేశారు. వినియోగదారుల డేటా భద్రత కోసం ఫేస్బుక్ 20 వేల మంది ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించింది. -
ఫేస్‌బుక్‌కు షాక్ : యూకే భారీ జరిమానా
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌తో సతమతమవుతోంది. ఇప్పటికే ఈ స్కాండల్ విషయంలో అమెరికా చట్టసభ్యుల ముందు తలవంచిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.. ఈసారి యూకేలో భారీ జరిమానాను ఎదుర్కోబోతున్నారు. తాజాగా బ్రిటన్ డేటా రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై చర్యలు ప్రారంభించింది. యూజర్ల అనుమతి లేకుండా కేంబ్రిడ్జ్ అనలిటికాకు డేటా షేర్ చేసి.. తమ చట్టాలను బ్రేక్ చేసినందుకు గాను 6,62,900 డాలర్ల జరిమానా అంటే సుమారు నాలుగున్నర కోట్ల జరిమానాను విధించింది. యూకే డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌ను రెండు విధాలుగా బ్రేక్ చేసినందుకు తాము విధించిన ఈ గరిష్ట జరిమానాను చెల్లించాలని ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీసు(ఐసీఓ) ఆదేశించింది. ప్రజల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో ఫేస్బుక్ విఫలమైందని ఐఓసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత డేటాను పొలిటికల్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమంగా పొందిందని మార్చిలో బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ డేటా స్కాండల్‌తో, ఫేస్బుక్ డేటా సెక్యురిటీ విధానాలపై యూకే ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీసు కూడా విచారణ చేపట్టింది. ఫేస్బుక్లో యూజర్ల డేటాకు భద్రత ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టింది. అదేవిధంగా సమాచారాన్ని దుర్వినియోగ పరుస్తూ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఎవైనా ప్రచారాలు జరిగాయా? అనే విషయంపై కూడా విచారణ జరిపింది. అందులో ఫేస్బుక్ విఫలమవడంతో సంస్థపై జరిమానాను విధించేందుకు సిద్ధమైంది. డేటా ప్రొటెక్షన్ చట్టం కింద గరిష్ఠ జరిమానా విధించాలని తాము భావించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. అంతేకాక వందల కొద్దీ టెర్రాబైట్స్ డేటా కలిగి ఉన్న సర్వర్లను, ఇతర పరికరాలను సీజ్ చేశారు. దీనిపై రిపోర్టును కూడా ఐఓసీ విడుదల చేయనున్నట్టు తెలిసింది. తమ ప్రజాస్వామ్య విధానంలోని చిత్తశుద్ధిపై నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయని, ఎందుకంటే సగటు ఓటర్లు, వెనుకాల ఏం జరుగుతుందనే విషయంపై తక్కువ అవగాహన కలిగి ఉంటారని ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ చెప్పారు. చెడు ఉద్దేశ్యం కోసం ఈ విధంగా వ్యవహరించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, కానీ తమ ప్రజాస్వామ్య విధానంపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించడంతో పాటు 11 రాజకీయ పార్టీలకు హెచ్చరికల లేఖలు, ఆడిట్ నోటీసులను ఐఓసీ పంపింది. కాగ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరఫున పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఫేస్బుక్ చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారంపై కంపెనీ స్పందించి.. పొరబాటు తమదేనని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే ఈ కుంభకోణం విషయంలో ఇప్పటికే పలుమార్లు ఫేస్బుక్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీస్ కూడా ఫేస్బుక్ కార్యకలాపాలపై దృష్టిపెట్టింది. యూరోపియన్ యూనియన్‌లో యూకే సభ్యత్వంపై 2016లో జరిగిన రెఫరెండం సమయంలో రాజకీయ ప్రచారాల్లో ఏమైనా వ్యక్తిగత డేటా దుర్వినియోగమైందా? అనే విషయంపై విచారణ జరిపింది. -
బ్లాక్ లిస్ట్‌లో ఉన్నవారిని అన్‌బ్లాక్ చేసేసింది
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇటీవల తీవ్రంగా డేటా స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. డేటా స్కాండల్‌తో పాటు, కొన్ని సాఫ్ట్వేర్ బగ్స్ కూడా ఫేస్‌బుక్‌కు కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. తాజాగా మరో సాఫ్ట్వేర్ బగ్ వెలుగులోకి వచ్చింది. 8 లక్షల మందికి పైగా యూజర్లు ఈ బగ్ బారిన పడ్డారని, ఈ బగ్ యూజర్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్న వారిని, అన్‌బ్లాక్ చేస్తుందని తెలిసింది. దీని బారిన పడిన వారిలో ఫేస్బుక్ యాప్ యూజర్లు, మెసేంజర్ యాప్ యూజర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. మే 29 నుంచి జూన్ 5 వరకు ఈ బగ్ యాక్టివ్‌లో ఉందని ఫేస్బుక్ ధృవీకరించింది. ఎవరినైనా బ్లాక్‌లో పెట్టే సామర్థ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఇగాన్ చెప్పారు. బ్లాక్ చేసిన వారి ప్రొఫైల్ చూడకుండా ఉండే సౌకర్యాన్ని ఫేస్బుక్ కల్పిస్తోంది. ఒక ఫ్రెండ్‌గా కనెక్ట్ అయిన తర్వాత, వారి ప్రవర్తన నచ్చకపోతే వారిని ఆటోమేటిక్‌గా ‘అన్‌ఫ్రెండ్స్’ లో పెట్టేయొచ్చు. ఒక యూజర్‌ను మరో ఫేస్బుక్ యూజర్ బ్లాక్‌లో పెట్టడానికి చాలా కారణాలుంటాయని ఇగాన్ తెలిపారు. వారి మధ్య సంబంధాలు తెగిపోవడం లేదా నచ్చని కంటెంట్‌ను వారు పోస్టు చేస్తూ ఉండటం ఇలాంటి పలు కారణాలతో ఫేస్బుక్ యూజర్లను బ్లాక్ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. వేధింపుల కారణంతో కూడా కొంతమంది యూజర్లను బ్లాక్ చేస్తుంటారని తెలిపింది. 8 లక్షల మందికి పైగా యూజర్లు దీని బారిన పడ్డారని, ఈ బగ్ ప్రభావితమైన యూజర్లకు నోటిఫికేషన్లు వస్తాయని కంపెనీ తెలిపింది. నోటిఫికేషన్ వచ్చిన అనంతరం బ్లాక్డ్ జాబితాను యూజర్లు ఒక సారి చెక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా అనే తన సంస్థకు, డేటా షేర్ చేసిన స్కాండల్‌లో ఫేస్బుక్ భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. -
ఫేస్బుక్ యూజర్లకు మరోసారి షాక్
-
మరో ప్రమాదంలో ఫేస్బుక్ యూజర్లు
వాషింగ్టన్ : డేటా స్కాండల్ విషయంలో ఫేస్బుక్ యూజర్లు ఇప్పటికే తమ అకౌంట్ సురక్షితమా? కాదా? అని సతమతమవుతుంటే, తాజాగా మరో ప్రమాదం పొంచుకొచ్చింది. తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను గుర్తించామని, అది యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చేసిందని సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఈ బగ్‌కు మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. దీంతో మరోసారి ఫేస్బుక్ ప్రైవసీపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. ఫేస్బుక్ తన సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన బగ్ వల్ల.. కేవలం స్నేహితులకు లేదా మీకు మాత్రమే షేర్ చేసుకున్న అంతకముందు పోస్టులు.. పబ్లిక్‌గా వెళ్లిపోయాయి. ఒకవేళ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ మారుతున్నట్టు గుర్తించలేకపోతే, వారు ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ప్రమాద పరిస్థితుల్లో వారి పోస్టులు పబ్లిక్‌గా వెళ్లిపోతాయి. అయితే ఈ బగ్ అంతకముందు పోస్టులపై ప్రభావితం చూపలేదని ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఈగన్ చెప్పారు. బగ్ యాక్టివ్‌లో ఉన్న సమయంలో షేర్ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని తెలిపారు. ఒక్కసారి యూజర్లు తమ పోస్టులను సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు ఫేస్బుక్ మరింత డేటా స్కాండల్ వివాదంలో కూరుకుపోతోంది. ఆపిల్, శాంసంగ్ వంటి 60కి పైగా కంపెనీలతో ఫేస్బుక్ తన యూజర్ల డేటా షేర్ చేసిందని న్యూయార్క్ టైమ్స్ బహిర్గతం చేసింది. కేవలం ఆ కంపెనీలు మాత్రమే కాక, నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా యూజర్ల డేటాను షేర్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ విషయంలో ఈ కంపెనీ తీవ్ర ఇరకాటంలో పడగా.. తాజా డేటా షేరింగ్ స్కాండల్స్ కూడా ఫేస్‌బుక్‌ను దెబ్బకొడుతున్నాయి. తాజాగా కంపెనీ గుర్తించిన బగ్ మే 18 నుంచి మే 27 వరకు యాక్టివ్‌లో ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఆ సమయంలో ప్రభావితమైన పోస్టులను ఒరిజినల్ ప్రైవసీ పారామీటర్స్‌కు మళ్లీ మార్చలేమని తెలిపింది. యూజర్లు ‘ఫీచర్ ఐటమ్స్’ను తమ ప్రొఫైల్స్‌లోకి షేర్ చేసేందుకు కొత్త ఫీచర్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తప్పిదం జరిగిందని, దీంతో ఆటోమేటిక్‌గా పోస్టులు, ఫోటో ఆల్బమ్స్ పబ్లిక్కు వెళ్లిపోయాయని పేర్కొంది. -
ఫేస్బుక్ సీఈవో అవ్వాలనుంది
వాషింగ్టన్ : రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవాలని హిల్లరీ క్లింటన్ భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌మీడియా నెట్వర్కింగ్ కంపెనీ ఫేస్‌బుక్‌కు సీఈవో అవ్వాలనుకుంటున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. శుక్రవారం హార్వాడ్ విశ్వవిద్యాలయానికి రాడ్‌క్లిఫ్ మెడల్‌ను అందుకునేందుకు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మసాచుసెట్స్‌కు చెందిన ఓ డెమొక్రాట్ మీరు ఏ కంపెనీకి సీఈవో కావాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఫేస్బుక్ లేదా సీనెట్లకు అని ఆమె తడుముకోకుండా చెప్పినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ నుంచి ప్రపంచంలో చాలామంది వార్తలు తెలుసుకుంటారని, అవి నిజమైనవా? లేక నకిలీవా? అన్న విషయాన్ని సైతం పట్టించుకోరని హిల్లరీ పేర్కొన్నారు. కాగా, నకిలీ వార్తలు, కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణాలతో ఫేస్బుక్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీ వీటి నుంచి బయటపడుతోంది. -
‘ఫేస్బుక్ డేటా’ దెబ్బతో దివాలా!
న్యూయార్క్: ఫేస్బుక్ యూజర్ల వివరాలను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా.. అమెరికాలో దివాలా పిటీషన్ వేసింది. దీనికి సంబంధించి దాఖలు చేసిన పత్రాల ప్రకారం కంపెనీ ఆస్తులు సుమారు 1– 5 లక్షల డాలర్ల మధ్య ఉంటాయి. రుణాలు 10 లక్షలు– కోటి డాలర్ల మధ్య ఉన్నాయి. బ్రిటన్‌లోనూ దివాలా పిటీషన్ వేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కారణంగా తమ వ్యాపారం దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి అనుకూల ఫలితాలు వచ్చేలా.. లక్షల సంఖ్యలో ఫేస్బుక్ యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందంటూ కేంబ్రిడ్జ్ అనలిటికాపై ఆరోపణలున్నాయి. -
200 యాప్స్ తొలగించిన ఫేస్బుక్
బెంగళూరు : ఇటీవల డేటా చోరి ఉదంతంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. తన ప్లాట్‌ఫామ్స్ పై ఉన్న థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా డేటా దుర్వినియోగమవుతుందని ఫేస్బుక్ సైతం గుర్తించింది. దీంతో కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ను సమీక్షించడం ప్రారంభించింది. ఈ సమీక్షలో భాగంగా తొలి స్టేజీలో 200 యాప్స్‌పై ఫేస్బుక్ వేటు వేసింది. యూజర్లకు చెందిన డేటాను దుర్వినియోగ పరిచారో లేదో తెలుసుకునే క్రమంలో 200 యాప్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఫేస్బుక్ ప్రొడక్ట్ పార్టనర్షిప్స్ వైస్ ప్రెసిడెంట్ ఇమి ఆర్చిబాంగ్ తెలిపారు. ఈ విచారణలో భాగంగా వేలకొద్దీ యాప్స్‌ను పరిశీలిస్తున్నట్టు కూడా చెప్పారు. ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై యాప్స్‌పై విచారణ చేపట్టనున్నట్టు మార్చి నెలలోనే ప్రకటించారు. 2014లో డేటా యాక్సస్ నియంత్రించడానికి కంటే ముందు పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించిన అన్ని యాప్స్‌పై తాము విచారణ చేపట్టనున్నట్టు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఈ విచారణ కోసం తమకు పెద్ద ఎత్తున్న అంతర్గత, బహిరంగ నిపుణులతో కూడిన టీమ్‌లు ఉన్నాయని ఆర్చిబాంగ్ చెప్పారు. వీరు వెంటనే ఈ విచారణ ఫలితాలను వెల్లడించనున్నారని పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమంగా ఫేస్బుక్ యూజర్ల డేటాను పొందిన తర్వాత ఈ సోషల్ మీడియా దిగ్గజం పెద్ద ఎత్తున్న డేటా స్కాం విమర్శలు పాలైంది. ఈ స్కాండల్ అనంతరం ఫేస్బుక్ బిలియన్ల కొద్దీ మార్కెట్ విలువను కోల్పోయింది. తాము తప్పు చేసినట్టు జుకర్‌బర్గ్ సైతం ఒప్పుకుని, ఫేస్బుక్ యూజర్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌ను అత్యంత సురక్షితంగా రూపుదిద్దుతున్నారు. -
పాస్వర్డ్స్ మార్చుకోండి
శాన్ఫ్రాన్సిస్కో: ట్వీటర్‌ను వినియోగిస్తున్న 33 కోట్ల యూజర్లూ తమ ఖాతాల పాస్వర్డ్స్ మార్చుకోవాలని ట్వీటర్ కోరింది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్వీటర్ ఈ ప్రకటన చేసింది. సోషల్ మీడియా ఖాతాల డేటా అమ్ముకుంటున్నారని, చోరీ జరుగుతోందనే ఆరోపణలు గట్టిగా వినవస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ట్వీటర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ గాని, సమాచార దుర్వినియోగం గాని జరిగిందా అనే అంశంపై విచారణ చేసింది. ఇందులో అలాంటివేమీ జరగలేదని వెల్లడైంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా తమ పాస్వర్డ్స్ మార్చుకోవాలని సూచించింది. అయితే ట్వీటర్లో తలెత్తిన సమస్య ఎన్ని పాస్‌వర్డ్స్‌పై ప్రభావం చూపిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదే పాస్వర్డ్ ఇంకా ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో అక్కడా మార్చుకుంటే మంచిదని సూచించింది. -
కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేత
న్యూఢిల్లీ : ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాలు మూతపడినట్లు ఆ సంస్థల యాజమాన్యం వెల్లడించింది. సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని, మీడియా ప్రతికూల ప్రచారం వల్ల ఖాతాదారులు లేకుండా పోయారని పేర్కొంది. సంస్థ మూసివేయడానికి కావాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని మేనేజర్లు పేర్కొన్నారు. సంస్థపై ఆరోపణలు ఉన్నప్పటికి ఉద్యోగులు విలువలతో, న్యాయంగా పని చేశారని యాజమాన్యం పేర్కొంది. డేటా లీక్ వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జి అనాలిటికా తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఆ సమాచారాన్ని వాడినట్టు వెల్లడి కావడం, అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు వెలుగు చూడటంతో వివాదాల్లో చిక్కుకుంది. భారత్‌లో కూడా ఫేస్బుక్ డేటా లీకేజీపై రాజకీయ దుమారం రేగింది. 2014లో బీజేపీ 272 లోక్‌సభ సీట్లు గెలువడానికి డేటా లీకేజీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా బీజేపీ కూడా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేసింది. ఫేస్బుక్ డేటా లీకేజీపై వివరణ ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం కేంబ్రిడ్జ్ అనలిటికా ఆదేశించింది. కానీ సంస్థ మాత్రం సంతృప్తికరమైన వివరణను ఇవ్వలేదు. -
ఫేక్ న్యూస్‌కు చెక్ పెడుతున్నారు
కేంబ్రిడ్జి ఎనలైటికా కేసులో గట్టిగా ఎదురు దెబ్బ తిన్న ఫేస్బుక్ అన్ని వైపుల నుంచి ప్రక్షాళన కార్యక్రమాలు ప్రారంభించింది. భారత్‌లో కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో తప్పుడు రాజకీయ వార్తలు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంది. ఇన్నాళ్లూ ఆంగ్లభాషలో ఉన్న పోస్టులనే పర్యవేక్షించిన ఫేస్బుక్ ఇప్పుడు జాతీయ భాష హిందీతో పాటుగా ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో వచ్చిన పోస్టింగుల్ని పర్యవేక్షించడానికి కొంతమంది కంటెంట్ రివ్యూయర్లను నియమించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేవి, జాతి అంహకారాన్ని ప్రదర్శించేవి, నోటిదురుసుతనంతో రాసేరాతలపై ఈ రివ్యూయర్లు ఒక కన్నేసి ఉంచుతారు. ఎన్నికల ఫీవర్ దేశవ్యాప్తంగా రాజుకోవడంతో మొదట వీళ్లంతా రాజకీయ వార్తల్ని సెన్సార్ చేయనున్నారు. పోస్టులు, వీడియోలు, ఫోటోల్లో ఏ మాత్రం అభ్యంతరకరంగా కనిపించిన అంశాలున్నా వెంటనే వాటిని తొలగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 భాషల్లో కంటెంట్ రివ్యూయర్లు ఉన్నారు. దీనికి సంబంధించి వివిధ దేశాల్లో 11 కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మొత్తం 7,500 మంది సమీక్షకుల్ని ఇప్పటివరకు నియమించింది. ఈ చర్యలతో ఇకపై ఫేస్బుక్ ద్వారా ఓటర్లపై వల వేయడం రాజకీయ పార్టీలకు అంత సులభం కాదు. అంతేకాదు రాజకీయ పార్టీలు ఫేస్బుక్లో వాణిజ్యప్రకటల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారా అన్న డేటా కూడా సేకరించనుంది. ఆప్ వంటి రాజకీయ ఫార్టీలు ఫేస్బుక్ చర్యల్ని స్వాగతిస్తున్నాయి. సోషల్ మీడియాలో నెలకొన్న విద్వేష పూరిత వాతావరణాన్ని కొంతైనా కట్టడి చేయగలిగితే మంచిదేనని కామెంట్లు చేస్తున్నాయి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏ డేటా దొంగలించారో చెప్పండి?
డేటా చోరి విషయంలో అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు, బ్రిటిష్ రాజకీయ విశ్లేషక సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాకు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. గతంలో పంపిన నోటీసులకు ఈ సంస్థలు ఇచ్చిన సమాధానాలు సరియైన విధంగా లేకపోవడంతో, ప్రభుత్వం తిరిగి మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం పంపిన తొలి నోటీసుకు కేంబ్రిడ్జ్ అనలిటికా చెప్పీ చెప్పనట్టు, తప్పించుకునే తీరులో స్పందన తెలియజేసింది. దీంతో మరిన్ని ప్రశ్నలను కేంద్రం సంధించింది. ఈ అదనపు ప్రశ్నలకు వచ్చే నెల 10వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేంద్రం ఆ సంస్థలను ఆదేశించింది. అయితే ఈ సారి పంపిన నోటీసుల్లో భారత్‌కు సంబంధించి ఏ తరహా సమాచారం సేకరించారు? సంబంధిత డేటాను కొట్టేయడానికి వాడిన టూల్స్ ఏంటని ప్రశ్నించింది. అటు ఫేస్ బుక్ స్పందన సైతం లోపాలమయంగానే ఉండడంతో మరిన్ని వివరణలు కోరింది. ఫేస్బుక్ ఈ విషయంపై క్షమాపణ కోరింది. అంతేకాక భారత్‌కు చెందిన 5.62 లక్షల యూజర్ల సమాచారం డేటా చోరి బారిని పడినట్టు పేర్కొంది. భారత్ చట్టాలు, గోప్యత నిబంధనలు ఉల్లంఘిస్తూ.. భారత్‌లో కార్యకలాపాలు సాగించే విదేశీ ఐటీ కంపెనీలకు ఇది స్ట్రాంగ్ మెసేజ్ లాంటిదని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. భవిష్యత్తులో యూజర్ల డేటా దుర్వినియోగం పాలవకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికలను చేపడుతుందో తెలుపాలని కూడా ఫేస్బుక్ ప్రభుత్వం ఆదేశించింది. -
ఓటర్లను ‘ఫేస్బుక్’ చేద్దాం!
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా లీకేజీతో ప్రకంపనలు సృష్టించిన కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేయడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం రూ.2.5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. ఫేస్బుక్ డేటా ఉల్లంఘన కుంభకోణం బహిర్గతం కావడానికి కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌కు సీఏ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సీఏ ప్రతిపాదించినట్లుగా భావిస్తున్న 49 పేజీల పత్రంలో ఈ విషయాలున్నాయి. ప్రస్తుతం ఈ పత్రం సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ డేటాను వినియోగించి ఓటర్లను ప్రభావితం చేద్దామని సీఏ అందులో ప్రతిపాదించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సీఏ సేవలను తాము ఉపయోగించుకోలేదని వివరణ ఇచ్చింది. ‘కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఇలాంటి ప్రతిపాదనలు రోజూ ఎన్నో వస్తాయి. ప్రచారానికి సంబంధించి సీఏతో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదరలేదు’ అని ఆ పార్టీ డేటా అనలిటిక్స్ ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఇటీవల కుంభకోణం నేపథ్యంలో వేటుకు గురైన సీఏ మాజీ సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ ఈ ప్రతిపాదనను 2017 ఆగస్టులో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సంధి కాలంలో ఉన్న సమయంలో ఈ ఆఫర్ ఇస్తున్నామని అందులో పేర్కొంది. -
8.7 కోట్ల ఎఫ్బీ యూజర్ల డేటా చోరీ
లండన్ : 8.7 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ యూజర్ల డేటా చౌర్యానికి గురైందని కేంబ్రిడ్జ్ ఎనలిటికా మాజీ ఉద్యోగి వెల్లడించారు. మంగళవారం బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన సంస్థ మాజీ ఉద్యోగి బ్రిటనీ కైసర్‌పై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. పలు యాప్‌లు, సర్వేల ద్వారా కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎఫ్బీ యూజర్ల డేటాను సంగ్రహించేందని, యూజర్ల నుంచి డేటాను రాబట్టే విధంగా సైకాలజీ, డేటా సైన్స్ బృందాలు కలిసి సర్వేలో ప్రశ్నావళిని రూపొందిస్తాయని ఆమె పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల డేటాను విక్రయిస్తోందనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫేస్‌బుక్‌కు కైసర్ వెల్లడించిన అంశాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫేస్బుక్ వెలుపల సైతం తమ సంస్థ ప్రజల నుంచి సమాచారం సేకరిస్తుందని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత వారం అమెరికన్ కాంగ్రెస్ విచారణలో అంగీకరించిన సంగీతి తెలిసిందే. -
రాహుల్‌తో కేంబ్రిడ్జ్ బాస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ డేటా ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి ఎనలిటికా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి ప్రతిపాదనతో ముందుకొచ్చిందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. ఫేస్బుక్ పోస్ట్‌లు, ట్వీట్లను విశ్లేషించి ఓటర్లను పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసేలా రూ 2.5 కోట్ల డీల్‌ను కాంగ్రెస్ ముందుంచినట్టు ఎన్డీటీవీ వెల్లడించింది. కేంబ్రిడ్జ్ సీఈవో అలెగ్జాండర్ నిక్స్ గత ఏడాది అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారని తెలిపింది. మాజీ కేంద్రమంత్రులు జైరాం రమేష్, చిదంబరంలతోనూ ఆయన భేటీ అయ్యారని పేర్కొంది. కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో సమావేశమవడం నిజమేనని, అయితే ఆ కంపెనీతో పార్టీకి ఎలాంటి ఒప్పందం జరగలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. వాణిజ్య ప్రతిపాదన అందుకున్నంత మాత్రన ఇరువురి మధ్య ఒప్పందం జరిగిందనుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ విభాగ అధిపతి ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పలు సంస్థల నుంచి తరచూ ప్రతిపాదనలు వస్తుంటాయని చెప్పుకొచ్చారు. కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాహుల్ క్షమాపణకు బీజేపీ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ కేంబ్రిడ్జి సేవలను ఉపయోగించుకున్నందున రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంబ్రిడ్జి సేవలను కాంగ్రెస్ వాడుకుందని గతంలోనూ బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ సహా పలు ఇతర భారత రాజకీయ పార్టీలూ కేంబ్రిడ్జి అనలిటికా సేవలను ఉపయోగించుకున్నాయని ట్వీట్ చేయడం ద్వారా ఓ ఎథికల్ హ్యాకర్ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు. -
జుకర్‌బర్గ్‌కు భారీగా పెరిగిన పరిహారాలు
డేటా చోరి ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ పరిహారాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది జుకర్‌బర్గ్ పరిహారాలు 53.5 శాతం పెరిగి 8.9 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ శుక్రవారం పేర్కొంది. దీనిలో ఎక్కువ ఆయన వ్యక్తిగత సెక్యురిటీకి వెచ్చించిన వ్యయాలే ఉన్నాయి. 83 శాతం పరిహారాలు సెక్యురిటీకి సంబంధించిన ఖర్చులని, మిగతా మొత్తం జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా వాడుకున్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఖర్చులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది జుకర్‌బర్గ్ ఎక్కువ సమయం ట్రావెలింగ్‌కే వెచ్చించారని, అమెరికాలోని అన్ని రాష్ట్రాలను ఆయన చుట్టిముట్టేశారని పేర్కొంది. సెక్యురిటీ వ్యయాలు అంతకముందు 4.9 మిలియన్ డాలర్లుంటే, 2017లో 7.3 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఫేస్బుక్ సీఈవో బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఆయన బేస్ శాలరీ 1 డాలర్‌గానే ఉంది. అదేవిధంగా కంపెనీలో ఆయన ఓటింగ్ అధికారాలు కూడా 59.9 శాతం పెరిగాయి. చైర్మన్‌గా, సీఈవోగా, వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన భద్రత విషయంలో పలు ముప్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌కు వ్యక్తిగత సెక్యురిటీకి ఎక్కువగా వెచ్చించినట్టు ఫేస్బుక్ బోర్డ్ పరిహారాల కమిటీ తెలిపింది. గత రెండేళ్ల నుంచి ఫేస్బుక్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాలనే ఆర్జిస్తోంది. కానీ ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ యూజర్ల డేటాను కంపెనీ అక్రమంగా పంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా వచ్చారు. -
జుకర్‌బర్గ్‌పై పేలుతున్న జోకులు
వాషింగ్టన్: ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ఖాతాలున్న 8 కోట్ల 70 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను ప్రభావితం చేయడానికి వాడుకోవడానికి అవకాశమిచ్చారనే ఆరోపణపై ఈ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మంగళవారం అమెరికా కాంగ్రెస్ ముందు తన సాక్ష్యం చెప్పడాన్ని వీక్షించిన అనేక మంది ఆయనపై ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో జోకులు పేల్చారు. ట్రంప్ ప్రచారంతో ముడిపడిన కేంబ్రిడ్జ్అనలిటికా ఉదంతం వెలుగు చూశాక ఆయన మొదటిసారి కాంగ్రెస్ ముందు స్వయంగా వచ్చి తన వాదనలు వినిపించారు. 75 నుంచి 90 ఏళ్లు పైబడిన కురువృద్ధులున్న సెనెట్ కమిటీ ముందు జుకర్ బర్గ్ చెప్పిన విషయాలు ఈ పెద్దలకు ఏం మాత్రం అర్ధంకావని, ఈ సెనెటర్లకు ఫేస్బుక్ అంటే పూర్తిగా తెలిదనే విషయాన్ని నొక్కి చెబుతూ పలువురు ఆయనపై ట్విటర్లో జోకులు సంధించారు. మరి కొందరు నేరుగా జుకర్ బర్గ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వాటిలో ఆసక్తికరమైనవి, వ్యగ్యం, చమత్కారం రంగరించినవి కొన్ని: ఇరా మాడిసన్: నా మనవడు నా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఎందుకు ఆమోదించడం లేదో కారణం చెప్పండి! ఓ సెనెటర్ ప్రశ్న ఫుల్ఫ్రంటల్: మిస్టర్ జుకర్‌బర్గ్, నేను పదేళ్లుగా ఫేస్బుక్ ఉన్నా నా రిక్వెస్ట్‌ను ఏ ఒక్కరూ ఎందుకు స్వీకరించలేదో చెప్పండి. మరో సెనెటర్ ఆవేదన బాబ్ వూల్ఫ్వ్: జుకర్ బర్గ్: ఫేస్‌బుక్‌కు సంబంధించి మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెబుతా. 84 ఏళ్ల సెనెటర్: బ్రహ్మాండం, జుకర్ బర్గ్! నా ఫామ్‌హౌస్‌లో మరిన్ని పందులు పెంచాల్సిన అవసరముంది. కాని, వాటిని ఎక్కడ కొనాలో తెలియడం లేదు. రాబీ సోవ్: దేశంలోని వృద్ధులకు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో వివరించడం కుర్రాళ్లకు కుదిరే పని కాదు. జుకర్ బర్గ్ ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఫేస్బుక్ సీఈవోకి చుక్కలు చూపించారు!
కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా చోరి ఉదంతంపై తొలి రోజు ఎక్కడా తడబాటు, కంగారు లేకుండా.. చాలా కూల్‌గా, కామ్‌గా అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సమాధానాలు చెప్పిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు, రెండో రోజు అమెరికన్ సెనేటర్లు చుక్కలు చూపించారు. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు కఠినతరమైన ప్రశ్నలతో జుకర్‌బర్గ్‌ను గుక్క తిప్పుకోనివ్వలేదు. కంపెనీ డేటా సేకరణ అంశాలపై సెనేటర్లు సమాధానం చెప్పలేని ప్రశ్నలనే సంధించారు. ఒకానొక దశలో జుకర్‌బర్గ్ తీవ్ర అసహనానికి కూడా గురయ్యారు. వినియోగదారుల గోప్యతకు మించి పలు అంశాలపై కూడా ఆయన్ని ప్రశ్నించారు. బుధవారం హౌజ్ ఎనర్జీ, కామర్స్ కమిటీ ముందు హాజరైన జుకర్‌బర్గ్‌కు దాదాపు ఐదు గంటల పాటు చట్టసభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. మొత్తంగా రెండో రోజులు 100 మంది చట్టసభ్యులు 10 గంటల పాటు జుకర్‌బర్గ్‌ను విచారించినట్టు తెలిసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్‌పై అమెరికన్ కాంగ్రెస్ జరిపిన తుది విచారణ ఇంతటితో ముగిసింది. ఈ విచారణలో కూడా జుకర్‌బర్గ్ పదే పదే తాను పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నారు. కానీ ఇలాంటి సమాధానం ఇచ్చే ఛాన్స్ మళ్లీ ఇవ్వకుండా కేవలం ‘యస్’ లేదా ‘నో’ రూపంలో మాత్రమే సమాధానం చెప్పేలా న్యూజెర్సీకి చెందిన డెమొక్రాటిక్ ప్రతినిధి ఫ్రాంక్ పలోన్ ప్రశ్నలు సంధించారు. డేటా సేకరణను తగ్గించడానికి ఏమైనా డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను ఫేస్బుక్ మార్చడానికి సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న పలోన్ అడిగారు. కానీ ఇది చాలా క్లిష్టమైన అంశమని, కేవలం ఒక్క పదంతో సమాధానం చెప్పలేమని జుకర్‌బర్గ్ అన్నారు. దీంతో మీ సమాధానం తమల్ని నిరాశకు గురిచేసిందని పలోన్ అన్నారు. 2011లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఫేస్బుక్ డేటా పాలసీ, థర్డ్ పార్టీ యాప్స్‌తో కలిసి ఉల్లంఘిస్తుందనే అంశంపై పలువురు చట్టసభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అలా చేస్తే, భారీ మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ ప్లాట్‌ఫామ్‌పై అక్రమంగా ఒపియాడ్స్‌ను విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ... యూజర్లను ఫేస్బుక్ బాధపరుస్తుందని ఓ చట్టసభ్యుడు మండిపడ్డారు. ఇప్పటి వరకు జుకర్‌బర్గ్ చెప్పిన క్షమాపణల లెక్కలు తీసిన ఇల్లినాయిస్కు చెందిన ఓ డెమొక్రాట్, తమ స్వీయ నియంత్రణ సంస్థ పనిచేయడం లేదనడానికి ఇదే రుజువు అని చురకలు అంటించారు. యూజర్లు కానీ వారి డేటాను కూడా ఫేస్బుక్ షాడో ప్రొఫైల్స్‌తో సేకరిస్తుందంటూ డెమొక్రాటిక్ సహోద్యోగి, న్యూ మెక్సికో ప్రతినిధి బెన్ లుజాన్ ఆరోపించారు. ఇలా కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ షేర్చేసిన 8.7 కోట్ల మంది డేటా ఉదంతంపై చట్టసభ్యులు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. కానీ సమయం తక్కువగా ఉండటంతో ఒక్కొక్క చట్టసభ్యునికి కేవలం 5 నిమిషాలు సమయం మాత్రమే కేటాయించారు. -
జుకర్‌బర్గ్ కథ ఇంకా మిగిలే ఉంది ..
ఎక్కడా తడబాటు లేదు. కంగారు అసలే లేదు. చాలా కూల్‌గా, కామ్‌గా అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్. అమెరికా కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చి తొలిరోజు విచారణను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చేసిన తప్పుల్ని ఒప్పుకుంటూ, భవిష్యత్‌లో ఇంక తప్పులు జరగవన్న హామీలు ఇస్తూ వినయవిధేయతల్ని ప్రదర్శించారు. ఫేస్‌బుక్‌ని తానే నిర్వహిస్తున్నానని అందులో జరిగే తప్పొప్పులకు తనదే బాధ్యతని స్పష్టం చేశారు. దాదాపు 5 గంటల సేపు సాగిన విచారణలో అమెరికా సెనేటర్లు జుకర్‌బర్గ్‌ను పెద్దగా ఇరుకున పెట్టే ప్రశ్నలు అడగలేదు కానీ కొన్నిఅంశాల్లో కాస్త గట్టిగానే నిలదీశారు. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన గోప్యత విధానాలు సరిగా లేవంటూ సెనేటర్లు అడిగిన ప్రశ్నలకు జుకర్‌బర్గ్ సరైన రీతిలో స్పందించలేకపోయారు. రాత్రి మీరు ఏ హోటల్లో బస చేశారో చెప్పగలరా అని సెనేటర్ డిక్ డర్బిన్ ప్రశ్నించారు. దానికి సమాధానం ఇవ్వడానికి జుకర్‌బర్గ్ తటపటాయించడంతో ఫేస్బుక్లో వ్యక్తిగత సమాచారం గోప్యత అలాంటిదేనంటూ ఆసెనేటర్ రిటార్ట్ ఇచ్చారు. ఇక ఫేస్బుక్ స్వీయనియంత్రణ పాటిస్తుందన్న నమ్మకం తమకు లేదని అత్యధిక సెనేటర్లు అభిప్రాయపడ్డారు. అలాగని ఫేస్‌బుక్‌ని నియంత్రించాలని తాము భావించడం లేదని భవిష్యత్‌లో జుకర్‌బర్గ్ తీసుకునే చర్యలపైనే ఆ విషయం ఆధారపడి ఉంటుందని వారు తేల్చేశారు. ఇక ఈ విచారణలో ఫేస్బుక్ గుత్తాధిపత్యం అనే అంశం కూడా ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్న ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయం ఇన్స్టాగ్రామ్.. అది కూడాఫేస్బుక్ చేతిలోనే ఉంది. 2017 సంవత్సరంలో వచ్చిన డిజిటల్ రెవిన్యూలో 87 శాతం ఈ రెండింటికే వచ్చింది. ఇవన్నీ ప్రస్తావించిన సెనేటర్లు సోషల్ మీడియాలో మీది గుత్తాధిపత్యమే కదా? అని అడిగిన ప్రశ్నకు జుకర్‌బర్గ్ అలాంటిదేమీ లేదంటూ గణాంకాలతో సహా వివరించారు. ఎన్ని రకాల యాప్స్ ద్వారా బంధువులు, స్నేహితులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవచ్చో ఆయన వివరించారు. ఇక ఫేస్బుక్లో రాజకీయంగా, వర్గాల వారీగా విద్వేషపూరిత వ్యాఖ్యల్ని, సమాచారాన్ని తొలగించడం చాలా సంక్లిష్టమైన విషయమని జుకర్‌బర్గ్ అంగీకరించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకొని మరో అయిదు, పదేళ్లలో దానిని సాధిస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుల డేటాకు సంబంధించి ట్రోజాన్ హార్స్ యాప్స్ ద్వారా ఫేస్బుక్ వినియోగదారులకు ఎంత విధ్వంసం జరిగిందో సరిగా అంచనా వెయ్యలేమని జుకర్‌బర్గ్ తేల్చి చెప్పేశారు. మైక్రోఫోన్ల ద్వారా ఫేస్బుక్ వినియోగదారుల సంభాషణలను తాము ఎప్పటికీ వినమని స్పష్టం చేశారు. ఫేస్బుక్లో ఇక ఇవి చేయలేం ఫేస్బుక్లో వినియోగదారుల భద్రతకు సంబంధించి కొన్ని కీలకమైన చర్యలు తీసుకున్నామని జుకర్‌బర్గ్ వివరించారు. అవేంటంటే ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీల ద్వారా ఇతర వ్యక్తుల్ని ఇక మనం సెర్చ్ చేయలేం. వేరే వ్యక్తుల పోస్టులను షేర్ చేయడానికి కొన్ని పరిమితులు విధించారు. గతంలో మాదిరిగా ఏ సమాచారాన్నైనా మనం షేర్ చేయడం ఇకపై అంత సులభం కాదు. యాప్ డెవలపర్స్ ఇక ఫేస్బుక్లో డేటాను వినియోగించలేరు. ఇతర యాప్‌లకు ఎఫ్బీ నుంచి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుతుంది. వినియోగదారుల వ్యక్తిగతం సమాచారం, వారు పెట్టిన పోస్టులను డెవలపర్స్ చూడడానికి ఇక చాలా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరుల చేతికి సమాచారం వెళ్లకుండా దీనిపై ఎన్నో పరిమితులు విధించారు. భారత్ ఎన్నికల సమగ్రతని కాపాడతాం భారత్‌లో ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో తమకు తెలుసునని, ఆ ఎన్నికల సమగ్రతని కాపాడడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పాకిస్థాన్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో జరగబోయే ఎన్నికల్లో డేటా లీకేజీ జరగకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 13.3 కోట్ల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాల్ని ఎలా తారుమారు చేస్తారోనన్న ఆందోళన నెలకొని ఉంది. అయితే కృత్రిమ మేధ సాయంతో ఫేక్ అకౌంట్లను తొలగించడంతో పాటు ఫేస్బుక్ భద్రతను ఎప్పటికప్పుడు పటిష్టం చేయడానికి 20 వేల మంది సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జుకర్‌బర్గ్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సమాచారాన్ని సురక్షితంగా ఉంచడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చారు. ముందే ప్రశ్నలు తెలుసా ? అమెరిక సెనేట్ అడిగిన ప్రశ్నలు జుకర్‌బర్గ్‌కు ముందే తెలుసునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ సందర్భంగా ఏ దశలోనూ ఆత్మరక్షణలో పడకుండా సోషల్ మీడియా అనేది ప్రపంచ దేశాలను కలిపే వారధిలా ఎలా పనిచేస్తోందో జుకర్‌బర్గ్ వివరించిన తీరు చూసిన వారికి అవే అనుమానాలు వస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని వెల్లడించింది. అంతేకాదు విచారణ ఎదుర్కోవడానికి ముందు జుకర్‌బర్గ్ తన లాబీయింగ్‌లో భాగంగా చాలా మంది సెనేటర్లను కలుసుకున్నారు. ఆ సమయంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, డేటా లీకేజీపై వారి ఆందోళన చూసిన జుకర్‌బర్గ్ ప్రశ్నల విషయంలో ఒక అంచనాకు వచ్చి ఉంటారని ఆ కథనం పేర్కొంది. జుకర్‌బర్గ్‌ను విచారించిన సెనేట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీలకు ఫేస్బుక్ నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ రెండు కమిటీల్లో సభ్యులకు 2007వ సంవత్సరం నుంచి 6.4 లక్షల అమెరికా డాలర్లు విరాళం రూపంలో అందాయి. అందుకే జుకర్‌బర్గ్ విచారణ అంత సంక్లిష్టంగా సాగలేదని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. -
విచారణలో ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్: కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) ఉదంతం నేపథ్యంలో అమెరికా సెనెట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీల ముందు తొలిరోజు విచారణకు హాజరైన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను సెనెటర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫేస్ బుక్‌లో ఖాతాదారుల వివరాలు, సమాచార గోప్యతపై 44 మంది సభ్యులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. రాత్రి మీరు ఏ హోటల్లో బస చేశారో చెప్పగలరా? అని సెనెటర్ డిక్ డర్బిన్ అడిగిన ప్రశ్నకు జవాబివ్వడానికి జుకర్‌బర్గ్ తటపటాయించారు. దీం తో వ్యక్తిగత గోప్యత అలాంటిదేనంటూ ఆయ న జుకర్‌బర్గ్‌కు చురకలంటించారు. ఫేస్బుక్ భవిష్యత్‌లోనూ స్వీయ నియంత్రణను పాటిస్తుందన్న నమ్మకం తమకు లేదని మెజారిటీ సెనెటర్లు అభిప్రాయపడ్డారు. కేంబ్రిడ్జి అనలిటికా యూజర్ల వివరాలను డిలీట్ చేసిందని నమ్మడం పెద్ద తప్పిదమేనని జుకర్‌బర్గ్ అంగీకరించారు. వినియోగదారుల సంభాషణలపై తాము నిఘా పెట్టబోమని స్పష్టం చేశారు. కేంబ్రిడ్జి అనలిటికా తనతో పాటు కోట్లాది మంది ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాల్ని దొంగలించి అమ్ముకుందని జుకర్‌బర్గ్ తెలిపారు. లీకేజీపై ఫేస్బుక్ స్పందిస్తూ.. ‘‘మీ స్నేహితుడు ఒకరు ‘దిస్ ఈజ్ మై డిజిటల్ లైఫ్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో మీ సమాచారం ఈ యాప్ ద్వారా సీఏకు చేరింది’’ ఖాతాదారులకు అలర్ట్స్ పంపింది. ఫేస్బుక్లో ఇకపై ఇవి చేయలేం ఫేస్బుక్లో ఫోన్ నెంబర్లు, ఈ–మెయిల్ ఐడీల ద్వారా ఇతర వ్యక్తుల్ని ఇకపై మనం సెర్చ్ చేయలేమని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇతరుల పోస్టులను షేర్ చేయడానికి కొన్ని పరిమితుల్ని విధించామన్నారు. యాప్ డెవలపర్స్ ఇక ఫేస్బుక్లో డేటాను వాడుకోలేరన్నారు. ఎఫ్బీఐతో కలసి పనిచేస్తున్నాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు జరుపుతున్న ఎఫ్బీఐతో ఫేస్బుక్ కలసి పనిచేస్తోందని జుకర్‌బర్గ్ తెలిపారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ తనను వ్యక్తిగతంగా విచారించలేదన్నారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యన్ హ్యాకర్లు మరిన్ని సైబర్‌దాడులు చేస్తారనుకున్నామనీ, ఫేస్‌బుక్‌ను దుర్వినియోగం చేస్తారని ఊహించలేకపోయామని సెనెటర్లకు వివరించారు. ఇకపై కొత్తగా ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని, లొకేషన్‌ను ఇవ్వాల్సిందిగా యూజర్లను కోరతామనీ, దీనివల్ల రష్యాలో ఉండి అమెరికాలో ఉంటున్నామని చెప్పడం కుదరదని పేర్కొన్నారు. భారత్ ఎన్నికల సమగ్రతని కాపాడతాం అమెరికా సహా భారత్, బ్రెజిల్, పాకిస్తాన్, మెక్సికో దేశాల్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల సమగ్రతను కాపాడటానికి కృషి చేస్తామని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. భారత్‌లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా 13.3 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడటంతో పాటు 20,000 మంది సిబ్బందిని మోహరిస్తామన్నారు. ముందే ప్రశ్నలు తెలుసా ? అమెరికా సెనెటర్లు అడిగిన ప్రశ్నలు జుకర్‌బర్గ్‌కు ముందే తెలుసునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ ఎదుర్కోవడానికి ముందు జుకర్‌బర్గ్ లాబీయింగ్‌లో భాగంగా పలువురు సెనెటర్లను కలుసుకున్నారు. ఆ సమయంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, డేటా లీకేజీపై వారి ఆందోళన చూసిన జుకర్‌బర్గ్ ప్రశ్నల విషయంలో ఒక అంచనాకు వచ్చి ఉంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా రు. అయితే సెనెట్ జ్యుడీషియరీ, కామర్స్ కమిటీలు గత పదేళ్లలో ఫేస్బుక్ నుంచి 6.4 లక్షల డాలర్ల విరాళాలు అందుకున్నాయి. భారతీయుల వివరాలు సేకరించలేదు: సీఏ ఫేస్బుక్ ఆధారంగా భారతీయులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించలేదని కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) స్పష్టం చేసింది. సమాచార దుర్వినియోగంపై ఏప్రిల్ 7న కేంద్రం రాసిన లేఖకు సీఏ ఈ మేరకు జవాబిచ్చింది. డేటా లీకేజీ ఉదంతంలో 5.62 లక్షల మంది భారతీయుల వివరాలు దుర్వినియోగమయ్యాయని ఫేస్బుక్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్బుక్, సీఏ సమాధానాల్లో వ్యత్యాసమున్న నేపథ్యంలో మరిన్ని విషయాల్లో ఈ రెండు సంస్థల నుంచి స్పష్టతకోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
మీ ఫేస్బుక్లో వీటిని తొలగించడం మంచిది
సాక్షి, హైదరాబాద్ : మన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల అవకాశం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ అగ్రగామి. గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు చేరుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. మిలియన్ల కొద్ది ఖాతాలు చోరికి గురయ్యాయి అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తప్పును ఒప్పుకున్నారు. అయితే ఇలాంటి డాటా హ్యాకింగ్స్ నుంచి మీ ఖాతాను రక్షించుకోడానికి, ఒకవేళ ఖాతా హ్యాకింగ్‌కి గురి అయిన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముఖ్యమైన ఈ 10 అంశాలను ఫేసుబుక్‌లో ఉంచకపోవడం మేలు. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తొలగించడం ఉత్తమం. అవి, 1. పుట్టిన తేది: ఇది మీకు కేవలం ఒక తేదినే కావచ్చు కానీ హ్యాకర్లు వీటి ద్వారా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరి కావచ్చు. 2. ఫోన్ నంబర్ 3. మీ సన్నిహితులను ఫ్రెండ్స్ లిస్టులో ఉంచకపోవడం, హైడ్‌లో పెట్టడం. 4. మీ కుటుంబ సభ్యుల ఫొటోలు, ముఖ్యంగా పిల్లల ఫొటోలు. 5. మీ పిల్లలు చదువుతున్న పాఠశాల వివరాలు. 6. లోకేషన్ (మీరు ఉన్న ప్రదేశం) 7. మీ లోకేషన్‌ను ట్యాగ్ చేయకపోవడం ఉత్తమం. 8. ఫలనా చోటుకి వెళ్తున్నాం అని పోస్టులు చేయకండి. 9. క్రెడిట్ కార్డ్ వివరాలు. 10. బోర్డింగ్ పాస్‌కు సంబంధించిన వివరాలు -
ఫేస్బుక్ సీఈఓపై జోకులే జోకులు..
డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జవాబులు చెప్పడం చాలా కష్టమైంది. 44 మంది సెనేటర్లు దాదాపు 5 గంటలకు పైగా జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలపై సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. జుకర్‌బర్గ్ ఓ రోబో అని అందుకు ఆయన నేడు సెనేటర్లను ఎదుర్కొన్న తీరే అందుకు నిదర్శనమని పోస్టులు చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో టీ షర్ట్, జీన్స్ ధరించే జుకర్‌బర్గ్ బుధవారం మాత్రం అధికారిక సమావేశాల్లో పాల్గొనే వ్యక్తిగా దర్శనమిచ్చారు. సెనెటర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగగా చాలా వాటికి మౌనం వహించిన జుకర్‌బర్గ్.. చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. పలు పర్యాయాలు క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. జుకర్‌బర్గ్ హావభావాలను గమనించిన మైక్ టోక్స్ అనే నెటిజన్.. ఫేస్బుక్ సీఈఓ రోబో అని చెప్పడానికి నూటికి నూరుపాళ్లు అవకాశం ఉందని ట్వీట్ చేశారు.మనుషులు మామాలుగా నీళ్లు తాగుతారంటూ జుకర్‌బర్గ్ నీళ్లుతాగే విధానాన్ని జుకర్‌బర్గ్ 2020 అనే ఖాతా నుంచి ట్వీట్ చేశారు. రోబో ఓ కంపెనీకి సీఈఓ అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు. రోబోలా కనిపించటమే కాదు రోబోలా పనులు చేస్తున్నారని.. అందుకే ఫేస్బుక్ ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్ అమ్ముకుంటున్నారని విమర్శిస్తూ మరికొందరు ట్వీట్లు చేశారు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో జుకర్‌బర్గ్ సతమతమవుతున్నారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. There is a 100% chance Mark #Zuckerberg is a robot 😂 pic.twitter.com/KkXiInctXh — Mike Tokes (@MikeTokes) 11 April 2018 humans drink water, it`s normal pic.twitter.com/OGu9NiDabA — ZUCKERBERG 2020 💭 (@davidoreilly) 10 April 2018 -
ఓ.. నో... జుకర్‌బర్గ్ ఆన్సర్
వాషింగ్టన్ : ఫేస్బుక్ డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను కాస్త సందిగ్థతలో పడేసే ప్రశ్నలే ఎదురయ్యాయి. వందల కొద్దీ ప్రశ్నలు సంధించిన అమెరికన్ చట్టసభ్యులు, వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్‌కు సంధించారు. గత రాత్రి ఎక్కడ నిద్ర పోయారని జుకర్‌బర్గ్‌ని సెనేటర్ డిక్ డర్బిన్ అడిగారు. ఆన్లైన్ డిజిటల్ ప్రైవసీపై విచారణ జరిపిన డర్బిన్, ఆ ప్లాట్‌ఫామ్‌పై చేరిన యూజర్ల వ్యక్తిగత సమాచార విషయంలో ఫేస్బుక్ పాత్ర ఏమిటో తెలుసుకోవడం కోసం, గత రాత్రి ఎక్కడ ఉన్నారో తెలుపడానికి మీరు సౌకర్యవంతంగానే ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. డర్బిన్ సంధించిన ప్రశ్నలకు కాస్త ఆందోళనకు గురైన జుకర్‌బర్గ్, ఎనిమిది సెకన్ల పాటు మౌనం వహించి, చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. ఈ వారంలో ఎవరికైనా మెసేజ్ చేశారా? ఆ పేర్లను మీరు మాతో పంచుకోగలరా? అంటూ మరో డెమొక్రాట్ ప్రశ్నించారు. మళ్లీ కూడా జుకర్‌బర్గ్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అసలు ఆసక్తి చూపించలేదు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలపై ఆయన సెనేటర్లకు క్షమాపణ చెప్పారు. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. -
కెరీర్లో తొలిసారి.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్ : ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన కెరీర్లో మొదటిసారి అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. ఫేస్బుక్ డేటా చోరిపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెల్లుబుక్కుతున్న ఆగ్రహ జ్వాలలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్‌కు క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్, అమెరికన్ కాంగ్రెస్ ముందు చెప్పడం ఇదే తొలిసారి. అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన జుకర్‌బర్గ్, చట్టసభ్యులు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో నేడు కూడా జుకర్‌బర్గ్ హౌజ్ ఎనర్జీ, కామర్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో ప్రస్తుతం జుకర్‌బర్గ్ అతలాకుతలమవుతున్నారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. ‘ఇది నా తప్పే. క్షమాపణలు చెబుతున్నా. ఫేస్బుక్ నేనే ప్రారంభించా. నేనే నడుపుతున్నా. కాబట్టి జరిగిన దీనికి నేనే బాధ్యత’ అంటూ పశ్చాతాపానికి గురయ్యారు. కేంబ్రిడ్జ్ అనలిటికా కూడా దీనిపై ఓ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్‌ను తాము హ్యాక్ చేయలేదని లేదా చట్టాలనూ ఉల్లంఘించలేదని పేర్కొంది. ఫేస్బుక్ అందించిన టూల్ ద్వారానే అమెరికా ఎన్నికల సందర్భంగా తాము ఈ డేటాను సేకరించామని చెప్పింది. ఫేస్బుక్ గుత్తాధిపత్యంపై చట్టసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన.. తమ కంపెనీ గుత్తాధిపత్యం కలిగి ఉందని భావించవద్దని జుకర్‌బర్గ్ చట్టసభ్యులను కోరారు. అమెరికన్ యూజర్లు తమ స్నేహితులతో సంభాషించడానికి, ఎప్పడికప్పుడు అందుబాటులో ఉండటానికి సగటున ఎనిమిది యాప్స్‌ను వాడుతున్నారని, వాటిలో టెక్ట్సింగ్ యాప్స్ నుంచి ఈ-మెయిల్ వరకు ఉన్నాయన్నారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొంత మంది రష్యాకు చెందిన గ్రూప్‌లు సోషల్ నెట్‌వర్క్‌ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వారిపై తాము పోరాడుతున్నామని చెప్పారు. వారు తమ సిస్టమ్స్‌ను, ఇతర ఇంటర్నెట్ సిస్టమ్స్‌ను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కానీ వారి బారిన పడకుండా ఉండటానికి తాము శతవిధాలా కృషిచేస్తున్నామన్నారు. అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చిన మార్క్ జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలను చట్టసభ్యులు సంధించారు. అమెరికా కాంగ్రెస్ హాజరయ్యే ముందు జుకర్‌బర్గ్ ఉన్న హోటల్ గదిలో ఎలా ఉందని దగ్గర్నుంచి... ఆయన మెసేజ్‌లు చేసిన స్నేహితుల వివరాల వరకూ... అన్ని విషయాలను జుకర్‌బర్గ్‌ను చట్టసభ్యులు అడిగారు. -
జుకర్‌బర్గ్‌కు అలీబాబా ఛాలెంజ్
బీజింగ్ : ఫేస్బుక్ డేటా చోరిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్బుక్ సీఈఓ, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఓ గట్టి సవాల్ విసిరారు. ఈ వివాదంపై స్పందించిన ఆయన, జుకర్‌బర్గ్‌కు చేతనైతే ఫేస్బుక్లో ఉన్న సమస్యను పరిష్కరించాలని సవాల్ చేశారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. చైనాలో అత్యంత ధనికవంతుడు అయిన జాక్ మా, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌కు చైర్మన్. బావో ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్ తన యూజర్ల డేటాను ఎటువంటి అనుమతి లేకుండానే కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కాండల్ ఒక్కసారిగా బయటికి పొక్కడంతో, ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కాండల్‌పై దిగ్గజ సీఈవోలందరూ స్పందిస్తున్నారు. ఫేస్బుక్ తన డేటా దొంగతనం కాకుండా చూసుకునే వీలు లేదని అభిప్రాయపడ్డ జాక్‌మా, సోషల్ మీడియాలోని వివరాలు బయటకు పొక్కకుండా సమస్యను పరిష్కరించి చూపించగలరా? అని జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. ఫేస్బుక్ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విమర్శలను తొలగించే దిశగా తాము ఎటువంటి సహాయం చేయమని చెప్పారు. మార్చిలో కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ బయటపడినప్పటి నుంచి ఫేస్బుక్ షేర్లు భారీగా కిందకి పడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే #deletefacebook అనే క్యాంపెయిన్ కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటర్లు కూడా ఫేస్బుక్ డేటా చోరిపై విచారణ జరుపుతున్నారు. ‘సమస్యను పరిష్కరించే సమయం వచ్చింది. ఈ విషయాన్ని సీఈవో సీరియస్‌గా తీసుకోవాలి. దీంతో సమస్యలను పరిష్కరించవచ్చని భావిస్తున్నా’ అని జాక్‌మా అన్నారు. మరోవైపు ఈ విషయంపై అమెరికన్ కాంగ్రెస్‌కు సమాధానం చెప్పేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సిద్ధమవుతున్నారు. -
సెనేట్ను ‘ఫేస్’ చేసేందుకు కోచింగ్!
పరీక్షకు ముందు విద్యార్థి ఎలా ప్రిపేర్ అవుతాడో.. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పరిస్థితీ అలాగే ఉంది. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిన కేసుకు సంబంధించి జుకర్‌బర్గ్ ఈ నెల 10, 11 తేదీలలో అమెరికా సెనేట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల నుంచి క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయన్న అంచనాల నేపథ్యంలో విచారణను ఎలా ఫేస్ చేయాలా అని జుకర్‌బర్గ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిపుణులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలా అన్న సమాలోచనలు, ఒత్తిడి నుంచి బయటపడటానికి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. అమెరికా ప్రజాప్రతినిధులు చేసే విచారణ అంతా మీడియాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతో జుకర్‌బర్గ్ పరిస్థితి పరీక్షని ఎదుర్కొనే విద్యార్థిలా ఉందని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి, ఒత్తిడిని అధిగమించడానికి జుకర్‌బర్గ్ గత కొద్ది రోజులుగా 500మందికి పైగా నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో తమ తప్పును ఒప్పుకున్న జుకర్‌బర్గ్ ఇప్పటికే క్షమాపణలు కోరడం తెలిసిందే. ఇప్పుడు జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరుకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎదుర్కోనున్న ప్రశ్నలివేనా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడం ద్వారా రష్యా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఫేస్బుక్ స్పందన, వ్యవహారశైలి సరిగా లేదంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారి నుంచి జుకర్‌బర్గ్‌కు ఇరుకున పెట్టే ప్రశ్నలే ఎదురవుతాయనే ప్రచారం జరుగుతోంది. జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే ప్రశ్నావళి కింది విధంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► రష్యా చేతిలో ఎంతమంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా ఉంది? ► ఫేస్‌బుక్‌పై కఠినమైన నియంత్రణ ఎందుకు విధించకూడదు? ► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్ని రకాల తప్పుడు పోస్ట్‌లు ఫేస్బుక్లో షేర్ అయ్యాయి? ► ఫేక్ వార్తల్ని అరికడుతున్నామంటూ తీసుకుంటున్న చర్యలు సెన్సార్షిప్ను అడ్డుకోవడానికి సాకులేనా? ► ఫేస్‌బుక్‌లాంటి అతి పెద్ద సంస్థని ఒక వ్యక్తి ఎలా నియంత్రించగలడు? మీ సమాచారం దుర్వినియోగమైందా? న్యూయార్క్: సమాచార దుర్వినియోగం బారినపడిన 8.7 కోట్ల మంది ఖాతాదారులకు ఆ వివరాలను ఫేస్బుక్ తెలియజేయనుంది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ తప్పుడు ప్రయోజనాల కోసం వాడుకోవడం తెలిసిందే. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఫేస్బుక్ ఖాతాదారులు, వారి స్నేహితుల జాబితాలో ఉన్నవారి వివరాలను అనలిటికా సేకరించిందని సంస్థ చెప్పింది. ఎవరెవరి వివరాలను అనలిటికా దుర్వినియోగం చేసిందో, వారి ఫేస్బుక్ ఖాతాలో న్యూస్‌ఫీడ్‌కు పైభాగంలోనే ఓ సుదీర్ఘ సందేశాన్ని సంస్థ ఉంచుతామంది. ఇంకా ఏయే యాప్‌లతో గతంలో ఫేస్బుక్ వివరాలను పంచుకున్నారో తెలియజేయనుంది. ఆయా యాప్‌ల నుంచి ఫేస్బుక్ ఖాతా వివరాలను డిలీట్ చేసే అవకాశాన్ని కల్పించనుంది. రాజీనామాను తోసిపుచ్చిన జుకర్‌బర్గ్ సమాచార దుర్వినియోగం వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో జుకర్‌బర్గ్ తన సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్వతంత్ర పరిశోధన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్, పాకిస్తాన్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో 2018,19ల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిశోధనల కోసం ఈ స్వతంత్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, జుకర్‌బర్గ్ సెనేట్ కమిటీ ముందు ఏం చెప్పనున్నారనే వివరాలు బయటకొచ్చాయి. ‘అది నా తప్పే. నన్ను క్షమించండి. ఫేస్బుక్లో ఏం జరిగినా అందుకు బాధ్యత నాదే’ అని జుకర్‌బర్గ్ లిఖిత పూర్వక వాంగ్మూలంలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేంబ్రిడ్జ్ స్కాండల్ : ఫేస్బుక్ యూజర్లకు నోటీసులు
న్యూఢిల్లీ : కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌లో మీ ఫేస్బుక్ డేటా చోరికి గురైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. నేటి నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌లో ప్రభావితమైన 8.7 కోట్ల మంది యూజర్లలో ఎవరెవరో ఉన్నారో ఫేస్బుక్ తెలియజేస్తుందట. యూజర్ల న్యూస్ ఫీడ్స్‌లో ఈ విషయాన్ని ఫేస్బుక్ తెలియజేస్తుందని తెలిసింది. ఈ స్కాండల్‌లో ప్రభావితమైన యూజర్లలో ఎక్కువ మంది(7 కోట్ల మంది) అమెరికన్లే ఉన్నట్టు ఫేస్బుక్ ఒప్పుకుంది. మిగతా యూజర్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, యూకే యూజర్లున్నారని కూడా తెలిపింది. అంతేకాకుండా 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా భారత్‌లో ఎన్నికల సమయంలో, కేంబ్రిడ్జ్ అనలిటికాకు చెందిన సంస్థకు షేర్ చేశామని ఫేస్బుక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభావితమైన యూజర్లకు ఫేస్బుక్ నోటీసులు పంపబోతోంది. దీంతో పాటు మిగతా 2.2 బిలియన్ యూజర్లకు కూడా ‘ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్’ పేరుతో మరో నోటీసులు జారీచేయనుంది. దీంతో పాటు ఓ లింక్‌ను కూడా పంపిస్తుంది. ఆ లింక్‌లో కొన్ని యాప్‌ల వివరాలు వాటికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి.. ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అనే వివరాలు ఉంటాయని తెలుస్తోంది. కేంబ్రిడ్జ్ స్కాండల్‌తో చరిత్రలోనే అతిపెద్ద గోప్యత సంక్షోభంలో ఫేస్బుక్ కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు చెందిన ఈ డేటా మైనింగ్ సంస్థతో ఫేస్బుక్ యూజర్ల డేటాను పంచుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫేస్బుక్ డేటాను భారీ మొత్తంలో ఈ సంస్థ వాడుకుంది. దీంతో ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎలా ఫేస్బుక్ డేటాను యూజర్ల అనుమతి లేకుండా షేర్ చేశారని యూజర్లు, టెక్ వర్గాలు మండిపడుతున్నాయి. తాము అతిపెద్ద తప్పు చేశామని కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు, భవిష్యత్తులో యూజర్ల గోప్యత విషయంలో వాగ్దానాలు చేసేందుకు అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా రాబోతున్నారు. ఈ సమయంలో మార్క్ జుకర్‌బర్గ్ కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారని తెలిసింది. -
జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే కఠిన ప్రశ్నలివే!
వాషింగ్టన్ : ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా కాంగ్రెస్ ముందుకు రాబోతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌పై స్పందించేందుకు ఆయన అమెరికా చట్ట సభ్యుల ముందుకు వస్తున్నారు. 2016 అమెరికా ఎన్నికలకు ముందుకు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్నామని ఒప్పుకున్న జుకర్‌బర్గ్, కాంగ్రెస్ సభ్యుల నుంచి కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారు. సెనేట్ జ్యుడిషియరీ, కామర్స్ కమిటీలు జుకర్‌బర్గ్‌ను మంగళవారం ప్రశ్నించనుండగా... హౌజ్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ బుధవారం ఆయన్ని ప్రశ్నించనుంది. భవిష్యత్తు ప్రణాళికలపై జుకర్‌బర్గ్ నుంచి వాగ్దానాలు తీసుకోవడానికి కూడా అమెరికా చట్టసభ్యులకు ఇది ఓ అవకాశంగా మారుతోంది. వినియోగదారుల గోప్యతను, ఎన్నికల సమగ్రతను కాపాడటం కోసం కొత్త నిబంధనలను రూపొందించడానికి కూడా చట్టసభ్యులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. అయితే కాంగ్రెస్ సభ్యులకు నాలుగు విషయాల్లో ఫేస్బుక్ సీఈవో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి ఉందని తెలుస్తోంది. అవేమిటో ఓ సారి చూద్దాం... 2015 నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికాకు యూజర్ల డేటాను షేర్ చేస్తున్నట్టు ఫేస్బుక్ ఒప్పుకుంది. కానీ ఆ సమయంలోనే ఈ సమాచారాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి అమెరికన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటప్పుడు, కంపెనీలకు ఎలాంటి సమాచారం అవసరం పడతాయి? సోషల్ నెట్‌వర్క్‌పై సమాచారం ద్వారా అమెరికన్లు మోసగించబడలేదని చెప్పడానికి భవిష్యత్తులో ఫేస్బుక్ ఏం చేయబోతోంది? అమెరికాలో పొలిటికల్ పొలరైజేషన్(రాజకీయ ధృవీకరణ)ను తగ్గించడానికి ఫేస్బుక్ ఎలా సాయపడనుంది? -
ఫేస్బుక్ నడపడానికి నేనే కరెక్ట్ వ్యక్తిని!
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. గత నెలలో బయటపడిన కేంబ్రిడ్జ్ అనలిటికా-ఫేస్బుక్ స్కాండల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం ఇది నాలుగో సారి. ఈ సందర్భంగా ఫేస్బుక్ సీఈవోగా తానే సరియైన వ్యక్తినని మార్క్ జుకర్‌బర్గ్ ఉద్ఘాటించారు. ఫేస్‌బుక్‌ను లీడ్ చేయడానికి మీరు సరియైన వ్యక్తేనా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. దీన్ని నడపడానికి తానే సరియైన వ్యక్తినని, దీన్ని నడపడానికి ఎవరూ కూడా సరితూగరని పేర్కొన్నారు. తప్పు జరిగినట్టు ఒప్పుకున్న మార్క్ జుకర్‌బర్గ్, దీన్ని లీడ్ చేసే కరెక్ట్ వ్యక్తిని తానేనన్నారు. తప్పుల నుంచే జీవితం గురించి నేర్చుకుంటామని జుకర్‌బర్గ్ తెలిపారు. ముందుకు సాగడానికి ఏం కావాలో తెలుసుకోవాలన్నారు. కాగ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్బుక్ తన యూజర్ల డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాకు చేరవేసిందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. ఈ స్కాండల్‌పై తప్పు జరిగినట్టు మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఒప్పుకున్నారు. దీంతో ఫేస్‌బుక్‌ను నడిపేందుకు మార్క్ జుకర్‌బర్గ్ సరియైన వ్యక్తి కాదంటూ పలువురు వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆయన ఫేస్‌బుక్‌ను నడపడానికి తానే సరియైన వ్యక్తినని పేర్కొన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మోస్ట్ పవర్ఫుల్ సీఈవోలతో పోలిస్తే, జుకర్‌బర్గ్ చాలా చిన్నవారు. ఫేక్‌న్యూస్, ప్రైవసీ విషయంలో గత కొన్నేళ్లుగా ఆయన పలు వివాదాస్పద ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్ బయటపడింది. దీంతో ఫేస్బుక్ షేర్లు కూడా భారీగా కిందకి పడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా పలు రెగ్యులేటర్లు ఫేస్‌బుక్‌పై విచారణ జరుపుతున్నాయి. ఫేస్బుక్ ప్రైవసీ, డేటా పాలసీలపై తమకు ఏప్రిల్ 11న వివరణ ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆదేశించారు కూడా. అయితే బోర్డు నుంచి తప్పుకోవాలని తనకు ఎలాంటి కాల్స్ రాలేదని కూడా జుకర్‌బర్గ్ తెలిపారు. దీని వల్ల కంపెనీ ఎవర్ని తొలగించదని కూడా చెప్పారు. ‘నేను ఇక్కడే ప్రారంభించా. ఇక్కడే నడిపా. జరిగిన దానికే నేనే బాధ్యుడిని. తప్పు నుంచి నేర్చుకున్న పాఠాలతో మున్ముందు మరింత మెరుగ్గా నా బాధ్యతను నిర్వర్తిస్తా. కానీ ఎవరిపైనా నిందను మోపడానికి నేను సిద్ధంగా లేను’ అని జుకర్‌బర్గ్ అన్నారు. -
దాని బారిన భారత ఎఫ్బీ యూజర్లు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్ల డేటాను ఫేస్బుక్, బ్రిటీష్ పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికాతో అక్రమంగా షేర్ చేసిందని వివాదం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటా షేరింగ్‌పై ఫేస్బుక్ కూడా తన తప్పును ఒప్పుకుంది. తాజాగా ఫేస్బుక్ విడుదల చేసిన గణాంకాల్లో భారతీయుల డేటా కూడా బయటపడింది. 5 లక్షల మంది భారతీయుల యూజర్ల డేటాను కూడా కేంబ్రిడ్జ్ అనలటికాతో షేర్ చేసినట్టు ఫేస్బుక్ బుధవారం ప్రకటించింది. అంతేకాక ఫేస్బుక్ షేర్ చేసిన యూజర్ల డేటా సంఖ్య కూడా పెరిగింది. అంతకముందు 5 కోట్ల మంది డేటా మాత్రమే కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ షేర్ చేసిందని అంచనాలు వెలువడితే, ప్రస్తుతం 8.7 కోట్ల మంది యూజర్ల డేటా బట్టబయలు అయినట్టు తెలిసింది. యూజర్ల అనుమతి లేకుండా.. ఫేస్బుక్ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ డేటాను అక్రమంగా పొంది, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, బ్రెగ్జిట్ ప్రచారంలో రాజకీయ నాయకుల లబ్ది కోసం వాడిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో మొత్తం 8.7 కోట్ల మంది యూజర్ల ఫేస్బుక్ డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాతో షేర్ అయినట్టు నమ్ముతున్నామని ఫేస్బుక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ ష్రోఫెర్ అన్నారు. దీనిలో ఎక్కువగా అమెరికన్ల డేటానే ఉన్నట్టు తెలిపారు. అంతేకాక భారత రాజకీయ ప్రచారాల్లో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాతో పలు పార్టీల కోసం ఫేస్బుక్ డేటాను వాడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిస్టోఫర్ వైలీ, విజిల్బ్లోయర్లు కూడా దీనిపై ట్వీట్లు కూడా చేశారు. ఈ ఆరోపణలు కూడా రుజువయ్యాయి. దాదాపు 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా తాము కేంబ్రిడ్జ్ అనలిటికాకు షేర్ చేసినట్టు ఫేస్బుక్ ప్రకటించింది. ఈ సంస్థ పేరెంట్ కంపెనీ, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2003, 2012 కాలాల్లో జరిగిన ఆరు రాష్ట్ర ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో పలు పార్టీల కోసం ఈ డేటాను వాడిందని తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు కేంబ్రిడ్జ్ అనలిటికాకు ప్రధాన క్లయింట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా కంపెనీలు ప్రభావితం చేయాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఒకవేళ అవసరమైతే, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు సమన్లు కూడా జారీచేస్తామన్నారు. -
గంతలు కడతారు జాగ్రత్త!
ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తున్నాయి. ‘నా గురించి డేటా కావాలా మీకు? తీసుకోండి బాబూ! కానీ అందుకు ముదరాగా మీరు ప్రతి ఆరునెలలకు నాకు విసుగు పుట్టించే కొత్త పనులు మాత్రం పురమాయించకండి! ఈ డేటా లీకులూ, గోప్యత పైన, ఫేస్బుక్, వ్యక్తుల భోగట్టా గురించి కేంబ్రిడ్జ్ ఎనలిటికా, నరేంద్ర మోదీ (నామో) యాప్, ఆధార్ వంటి కూపీ వ్యవస్థలు– టెక్నాలజీ ఆధారంగా మనం సమకూర్చుకున్న మన డేటాను కాస్తా ఎలా దొంగిలిస్తున్నామో తెలుసు. అయినా ఈ గందర గోళంలో తలదూర్చి ఈత కొట్టదలచలేదు. ఇప్పటికే యావత్తు ప్రపంచానికి తెలిసిపోయింది– తమ నోరు మెదపలేక అలా పడివున్న భారత ప్రజా బాహు ళ్యం ఆ మూగ వేదనలో కొద్ది కిలోల బియ్యం కోసం తమ గోప్యతను కాస్తా సంతోషంతో ఎలా మారకం చేసుకుంటున్నారో తెలిసిపోయింది. బహుశా ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి–ప్రభుత్వమూ, రెండు– కార్పొరేట్ శక్తి. ఇక్కడ ఈ క్షణాన ‘ఆధార్’ సాధికార శక్తిలో దాగి ఉంది. ఇక నుంచి ఈ శక్తి ‘దాయి’ (ఆయా)గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తులూ పరస్పరం చేతులు కలిపి ఆధార్‌లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత సమాచారం (డేటా) అంతా భద్రంగానే ఉందని మనకు వందలసార్లు భరోసా ఇచ్చారు. అంటే మీ డేటా అంతా భద్రంగానే ఉంది కనుక ఇక నుంచి దాన్ని గురించి నోరెత్తి చర్చించకండి అని శాసిస్తున్నారు. అలాగే ‘ఫేస్బుక్’ సృష్టించిన జుకర్‌బర్గ్ కూడా తాను ‘మంచి బాలుడనే’నని వెయ్యిన్నొక్కసార్లు ప్రకటించాడు. చివరికి ఇతడిని ప్రధాని మోదీ అక్కున చేర్చుకుని హత్తుకున్నాడు. ఇలా మోదీ హత్తుకున్న వాళ్లంతా ఎంతో కొంత హాని కలిగిస్తారని చెడు తలపెడతారని నేను నమ్మలేను.’ – జి. సంపత్ (ది హిందు సామాజిక వ్యవహారాల విశ్లేషక సంపాదకుడి వ్యంగ్య రచన) ‘నేడు ఇండియాలో ముమ్మరిస్తున్న పరిణామాలు దేశంలో ప్రవేశించిన ఆధునిక వలస విధానంగా తోస్తోంది’ – క్రిస్టోఫర్ వీలీ (భారత్‌లో సమాచార కూపీ, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం వంటి అంశాల గురించి ట్విటర్లో బట్టబయలు చేసిన వేగు) క్రిస్టోఫర్ వీలీ తన డాక్యుమెంట్లలో బంధించిన సమాచారాన్నంతా బ్రిటన్ కామన్స్ సభ ‘కల్చర్, మీడియా స్పోర్ట్స్ కమిటీ’ ముందు వెల్లడించాడు. ఈ విషయాలను పరిశీలిస్తే వలస సామ్రాజ్య పాలనావశేషాల నుంచి స్వతంత్ర భారత్ సంపూర్ణ విముక్తిని పొందిన దేశమేనా అని మనకు మనం ప్రశ్నించుకో వలసిన స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది. అదే సమయంలో ‘ఆధునిక వలస విధానం ఇలా ఉంటుందన్న భావన’ కలుగుతోందన్నాడు (దిసీజ్ వాట్ మోడ రన్ కలోనియలిజం లుక్స్లైక్) క్రి స్టొఫర్ వీలీ. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశా బ్దాలు గడిచిపోతున్నది. అయినా భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక నైతిక వ్యవస్థలపై పాత, కొత్త వలస పాలకుల కనుసన్నలలోనే ఆంగ్లో–అమెరికన్ బహుళజాతి గుత్త సంస్థలు జోక్యం చేసుకోవడం సహించరాని పరిణామం. అంటే రక్షణ రంగం సహా దాదాపు కీలక రంగాలన్నీ కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ పాలనా వ్యవస్థల కింద విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల అదుపాజ్ఞలలోకి వెళ్లి ప్రజా బాహుళ్యం మూల్గులను పీల్చేస్తున్నాయని స్పష్టమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం కాస్తా విదేశీ వాస్కోడిగామాల అడ్డాగా మార్చుతున్నారు. సాంకేతికత వెనుక సంక్షోభం భారత ఎన్నికల వ్యవస్థలోకి చొరబడిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా, క్రిస్టోఫర్ వీలీ సమాచారం వికేంద్రీకరణ పేరిట, ఆధునిక టెక్నాలజీ ముసుగులో ప్రవేశిం చిన ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ వగైనా సోషల్ మీడియాను ప్రయోజనకర కార్యకలాపాలకు వినియోగించడం లేదు. దోపిడీ వ్యవస్థల రక్షణ కోసం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే రాజకీయ పక్షాలకు వాటి నాయకత్వాలకు ఎన్నికలలో ఉపయోగపడేటట్టూ చేస్తున్నారు. ఎన్నికలలో ఫలితాలను తమకు సానుకూలంగా మార్చుకు నేందుకు అనుకూల ఏజెన్సీల ద్వారా సోషల్ మీడియాలో ద్వారా ప్రచార ‘ఊదర’ కొట్టుకుని, ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడానికి ఈ సంస్థలు పనిచేయడం– బీజేపీ 2012 నుంచి ప్రవేశపెట్టిన ఫలితమే. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఇందుకు తెర తీసిన పెద్దమనిషి అరవింద్ గుప్తా. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పదిని వందగా చూపే సంఖ్యల తారుమారు విద్యలో డిజిటల్ మీడియా మ్యానిప్యులేటర్‌గా అతడే పనిచేశాడు. సంఖ్యా శాస్త్రాన్ని డిజిటల్ మీడియా ద్వారా ఎలా దుర్వినియోగం చేయవచ్చునో నిపుణులు నాకు చెప్పారు. ఇంతకు ముందు కృత్రిమ విద్య ద్వారా మనం స్నేహితులను జయించడం ఎలాగో కొందరు పుస్తకాలు రాశారు. అలాగే ఎన్నికలలో ఓడవలసిన వాడు కూడా డిజిటల్ టెక్నాలజీ సాయంతో ప్రచారం ద్వారా ఓటింగ్ ఫలితాన్ని ఎలా తారుమారు చేయవచ్చునో 2014 ఫలితాలు నిరూ పించాయి. ఒక నాయకుడు ఎన్నికలు, ఓటింగ్‌లకు ఆరు నెలలకు ముందే తానే ‘వస్తున్నాడు, వచ్చేస్తున్నాడ’ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో విజ యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇందుకు కాంగ్రెస్ పాలన తప్పిదాలు ఆ ఊదరకు దోహదం చేయడం యాదృచ్ఛికం. ఆ తర్వాత శ్రీలంక ఎన్నికల్లో ప్రజా కంటకునిగా మారిన అధ్యక్షుడు రాజపక్సకు సాయంగా బీజేపీ డిజిటల్ టెక్నాలజీ నిపుణుడిని పంపడం, అది తెలిసిన పాత్రికేయులు ‘మీ రాకలో రహస్యమేమిట’ని ప్రశ్నిస్తే ‘‘ఆ విషయం మీకు చెప్పవలసిన పనిలేద’’ని ఆ నిపుణుడు ఎదురు మాట్లాడ్డం గురించి ఆనాడు కొన్ని పత్రికలు ఒక మూలకు తోసేశాయి. దండగమారి చెత్త అమెరికా పత్రికా ప్రపంచంలోనూ, సీఎన్ఎన్ చానల్లోనూ, ‘న్యూయార్క్ టైమ్స్’లోనూ ప్రసిద్ధుడు బి.జె. మెండెల్సన్ సోషల్ మీడియా పేరిట చెలా మణి అవుతున్న కొన్ని శాఖలను ‘దండుగమారి చెత్త’గా (సోషల్ మీడియా ఈజ్ బుల్షిట్) 2012 లోనే వర్ణించాడు. ఆ పేరిటనే రాసిన గ్రంథంలో ఈ ప్రచార సాధనాన్ని మార్కెటింగ్ వ్యూహ రచనా మాధ్యమంగా వర్ణించాడు. 1998 నుంచీ మార్కెటింగ్ ప్లాట్ఫాంగానే ఈ వెబ్ వేదిక వ్యవహరిస్తూ వచ్చిం దని పేర్కొన్నాడు. సోషల్ మీడియా పేరిట చెలామణిలో ఉన్న చాలా వెబ్ సైట్స్ ఇండియాలో ఇటీవల కాలంలో పడిన ‘పాటు’ అంతా ఏమిటి? ఆ విష యాన్ని కూడా క్రిస్టొఫర్ వీలీ బట్టబయలు చేశాడు: ‘ఇండియాలోని ఏడు లక్షల గ్రామాలలో, 600 జిల్లాల్లో ఈ విదేశీ వెబ్ మాధ్యమాలు సమాచారం సేకరించాయి. వీటి సాయంతో రాజకీయ పార్టీల కక్షిదారులెవరో (ఆదరణ పొందగోరినవారు) కూపీ లాగి ఆయా రాజకీయ పార్టీలు సదరు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాయి. తద్వారా అనుకున్న సానుకూల ఫలితాన్ని రాబట్టుకోడానికి ఓటర్లను ప్రభావితం చేస్తాయి. ఇదే ఆధునిక వలస విధాన ప్రక్రియ’’ అన్నాడు వీలీ. ఎస్.సి.ఎల్ ఇండియా అనే కంపెనీ కేంద్ర కార్యాలయం ఘజియాబాద్‌లో ఉంది. అనేక రాష్ట్రాలలో కార్యా లయాలున్నాయి. ఈ కూపీ యంత్రాంగాన్ని బీజేపీ రాజస్తాన్ ఎన్నికల్లో ఉపయోగించింది. ఫేస్బుక్ నిర్మాత ఎఫ్.బి. వాడకందార్ల యంత్రంలో నమో దైన వారి సమాచారాన్ని, నంబర్లను తస్కరించి అమెరికా, బ్రిటన్లకు పంపించే వీలు కల్పించి, జుకర్‌బర్గ్ కాస్తా ‘జోకర్’బర్గ్ అయ్యాడు. మన డేటా అంతా అమెరికన్ కంపెనీలకు చేరిన తర్వాత ‘క్షమించాలి, తప్పు చేశా’నని అతడు లెంపలు వాయించుకున్నా, జరగవలసిన అన్యాయం జరిగిపోయింది. అలాగే ‘ఆధార్’ డేటా అంతా (మన కళ్ల కదలికలతో సహా– ఐరిష్ పరీక్ష) అమెరికా, బ్రిటన్లలో నమోదైపోయింది. ఈ కూపీ వాళ్లకి ఎందుకు? ఇండియాను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమ సామ్రాజ్య ప్రయోజనాలకు, యుద్ధ ప్రయోజనాలకు, చేసే యుద్ధాలకు ‘సై’ అనిపించడానికి ఇది అవసరం. అమెరికాతో నీవు చేతులు కలపకపోతే నిన్నే తన శత్రువుగా ప్రకటించడానికి సామ్రాజ్య పాలకులు సంకోచించరని గుర్తించాలి. ఆ వైపుగానే ఇపుడు ఆంగ్లో–అమెరికన్ ప్రభుత్వాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానాలను మలచడానికి శక్తిమంతంగా ప్రయత్నిస్తు న్నాయి. మన ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాల పునరుద్ధరణకు, శాంతి ప్రతిష్టాపనకు గల అవకాశాల్ని కూడా నిరోధించగల్గుతున్నాయి. ‘కేంబ్రిడ్జి ఎనలిటికా’ ఇండియాలో తిష్ట వేయడానికి కారణం ఈ విన్యాసంలో భాగమే. రాజకీయ పార్టీలు కులాలను విభజించి ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందవచ్చునో దశాబ్దాలుగా వ్యూహాలు సాగిస్తూనే ఉన్నాయి. కుల వ్యవస్థ మూలాలనీ, కుల, మత వైమనస్యాలనూ చెక్కు చెదరకుండా కాపాడగోరే రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా ఉండటం కూడా ఆ సంస్థ ధ్యేయమే. తద్వారా భారత సామాజిక, రాజకీయ వ్యవస్థను సెక్యులర్ రాజ్యాంగానికి దూరంగా ఉంచడం కూడా. అందుకే ప్రధానమంత్రి ‘యాప్’ సహితం సోషల్ మీడి యాలో వినియోగదార్ల అనుమతి లేకుండా వారి డేటాను వాడుకుంటోందన్న ఆరోపణకు గురి కావలసి వచ్చింది. ‘నమో (మోదీ) యాప్’ ద్వారా భారత వినియోగదార్ల ‘డేటా’ను కాస్తా దొంగిలించడం జరిగిందని ఫ్రెంచి హేకర్ వెల్లడించాడు. మోదీ యాప్ డేటా ‘అమెరికన్ కంపెనీలలోని ఆయన స్నేహి తులకు’ చేరిందని కూడా ఆ ఫ్రెంచి హాకర్ వెల్లడించాడని వార్త. మున్ముందు వీర విహారం 2014 ఎన్నికలతో ముమ్మరంగా ప్రారంభమైన ఈ ‘డిజిటల్ మాయాజాలం’ 2019 సాధారణ ఎన్నికల నాటికి మరింతగా జడలు విప్పుకుని రాజకీయుల ‘నర్తనశాల’ను చూపించవచ్చు. ఎందుకంటే ‘ఫేస్బుక్’ వ్యవస్థాపక అధ్య క్షుడు సీన్పార్కర్ ‘సమాజంతో మీకున్న సంబంధ బాంధవ్యాలను ఫేస్బుక్ తారుమారు చేస్తుందన్నది అక్షరసత్యం’ అన్నాడంటే వచ్చేవి చెడ్డ రోజులా, మంచి రోజులా అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే ఫేస్బుక్ అనేది డేటా దొంగతనానికి పెట్టింది పేరనీ, ఆ మాటకొస్తే ఘరానా సోషల్ నెట్వర్క్ అనీ, దొంగ బుద్ధులకు నిలయమనీ, అందుకనే అది అమెరికన్లకు శిరోధార్యమైం దనీ అమెరికా నిపుణులే వాపోతున్నారని మరువరాదు. బానిసల, నీగ్రోల విమోచన ప్రదాత, అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి: ‘‘ప్రజలలోనే నా ప్రగాఢ విశ్వాసమంతా. ఎలాంటి జాతీయ విపత్తు కైనా, సంక్షోభాన్నయినా ఎదుర్కోడానికి ప్రజలనే విశ్వసించాలి. అసలు విషయం ఏమిటంటే, ముందుగా వారికి అబద్ధాలను, అసత్యాలను తెల్పకుండా నికా ర్సయిన నిజాలను వారి ముందుంచాలి. పాలకులపై విశ్వాసానికి అదే మూల స్తంభం’’! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భారత్‌లోనూ ఎస్సీఎల్ కదలికలు...!
అయిదు ఖండాలు...32 దేశాలు..వందకు పైగా ఎన్నికల ప్రచారాలు.. ఇదీ డేటా లీక్ వివాదంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జి అనాలిటికా (సీఏ)కు మాతృసంస్థగా ఉన్న స్ట్రేటజిక్ కమ్యు నికేషన్ లాబరేటరీస్ (ఎస్సీఎల్) గ్రూపు ట్రాక్‌రికార్డ్. ఎన్నికలకు సంబంధించి వివిధ దేశాల్లో తాము నిర్వహించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ సంస్థే ప్రకటించుకున్న విషయమిది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార వ్యూహాలకు ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని వారికి తెలియకుండా ఉపయోగించినట్టు, బ్రెగ్జిట్ సందర్భంగా బ్రిటన్‌లో నిర్వహించిన పాత్రపై ఇప్పటివరకు సీఏపైనే ఫోకసంతా కేంద్రీకృతమైంది. అయితే 2013 నుంచి ఎస్సీఎల్ కంపెనీ డాక్యుమెంట్లు విశ్లేషించాక ఓ ఆన్లైన్ ఇంగ్లిష్ వెబ్‌పత్రిక భారత్‌తో సహా వివిధ దేశాల్లో ఎన్నికల సంబంధిత వ్యవహారాల్లో ఈ సంస్థ ప్రమేయాన్ని వెల్లడించింది. ఐరోపా, ఉత్తర,దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల వ్యాప్తంగా 32 దేశాల్లో ఎస్సీఎల్ పనిచేసినట్టు తెలిపింది. ఆయా దేశాల్లో క్లయింట్లుగా ఉన్న రాజకీయనాయకులు, పార్టీల అవసరాలను బట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సర్వీస్‌ను ఈ సంస్థ అందజేసింది. భారత్‌లో.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే భారత్‌లో 300 మంది పర్మినెంట్ సిబ్బంది, 1,400 కన్సల్టెంట్ స్టాఫ్‌ను ఎస్సీఎల్ నియమించినట్టు ఆ సంస్థ డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. తమది అత్యంత అధునాతన రాజకీయ పరిశోధన, డేటా కేంద్రంగా అభివర్ణిస్తూ ఎన్నికలకు పూర్వమే ప్రధాన రాజకీయపార్టీల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది.ఈ ప్రతిపాదిత ‘ఆపరేషన్ సెంటర్’లో సీనియర్ లాయర్లు, మీడియా పర్యవేక్షక వృత్తినిపుణులు, పరిశోధనాధారిత సమాచారాన్నిచ్చే నిపుణులు, పార్టీ కార్యకర్తలకు సలహాలు, సూచనలిచ్చే బృందాలు,సిబ్బందితో సేవలు అందించనున్నట్టు తెలిపింది. తమ క్లయింట్లు మేనేజ్ చేసుకునే విధంగా యాప్ తయారుచేసి ఇస్తామని, దాని ద్వారా ఆయా సర్వీసులు పొందవచ్చునని సూచించింది. దీని ద్వారా ప్రచారవ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేసి సంబంధిత పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగేలా దోహదపడేలా ఏర్పాట్లు చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎస్సీఎల్ లేదా సీఏ సంస్థల సేవలను దేశంలోని ఏ రాజకీయపార్టీ అయినా ప్రత్యక్షంగా ఉపయోగించుకుందా లేదా అన్నది ఇంకా స్పష్టంకాలేదు. ఇలాంటి సెంటర్లనే బ్రిటన్, థాయ్‌లాండ్, కెన్యా, ఇండోనేషియాలలో నెలకొల్పినట్టు ఎస్సీఎల్ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. దేశంలో ఎస్సీఎల్ అడుగు జాడలు... భారత్‌లో ఒకే ఒక ప్రాజెక్టు గురించి తన వెబ్సైట్లో సీఏ సంస్థ వెల్లడించింది. అయితే మనదేశంలో హైదరాబాద్ మొదలుకుని బెంగళూరు, కోల్‌కతా, పట్నా, పుణె, ఇండోర్, అహ్మదాబాద్, కటక్, ఘజియాబాద్, గువహటి నగరాల్లో ఎస్సీఎల్ కార్యాలయాలున్నట్టు వెల్లడైంది. 2003 నుంచి ఈ గ్రూపు కనీసం 8 ‘అసైన్మెంట్ల’పె పనిచేసినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎస్సీఎల్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనేక సర్వేలు నిర్వహించినట్లు ఆ సంస్థ డాక్యుమెంట్‌ను బట్టి తెలుస్తోంది. 2012లో ఉత్తరప్రదేశ్‌లో ఓ జాతీయపార్టీ కోసం కులాలవారీగా జనాభా వివరాల సేకరణ 2011లో యూపీ వ్యాప్తంగా కుటుంబాల (హోస్హోల్డ్స్) వారీగా 20 కోట్ల మంది ఓటర్ల కులాలను బట్టి ఓటర్ల గుర్తింపు 2010 బిహార్ ఎన్నికల సందర్భంగా జేడీ(యూ) పార్టీ కోసం ఎన్నికల పరిశోధన, వ్యూహాల రూపకల్పన 2009 లోక్‌సభ ఎన్నికలపుడు పలువురు అభ్యర్థుల ప్రచార నిర్వహణ 2007లో యూపీలో ఓ జాతీయపార్టీ కోసం పూర్తిస్థాయి రాజకీయ సర్వే నిర్వహణ 2007లో కేరళ, బెంగాల్, అసోం, బిహార్, జార్ఘండ్, యూపీలలో ఎన్నికల ప్రచారానికి పరిశోధన 2003 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఊగిసలాటలో ఉన్న ఓటర్లను గుర్తించేందుకు ఓ జాతీయ పార్టీ కోసం అధ్యయనం, ఓపీనియన్ పోల్ నిర్వహణ 2003 రాజస్థాన్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీ సంస్థాగత బలం, ఆ రాష్ట్రంలో ఓటు వేసేవారి ప్రవృత్తి, అలవాట్లు, రాజకీయంగా చురుకుగా ఉన్న వ్యక్తుల ప్రవృత్తి పై అధ్యయనం అయితే ఎస్సీఎల్కు గతంలో భాగస్వామిగా ఉన్న అవ్నీష్రాయ్ మాత్రం ఈ ప్రాజెక్టులు తానే చేపట్టినట్టు, ఈ పరిశోధనపై ఎస్సీఎల్ ఆమోదముద్ర వేసిందని చెబుతున్నారు. ఇవీ సేవలూ... భారత్‌లో రిసెర్చి, డేటా హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయపార్టీలకు వివిధరకాల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎస్సీఎల్ 2014 ఎన్నికల సందర్భంగా పేర్కొంది. రాజకీయపార్టీల మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించి ఓటింగ్ సందర్భంగా ప్రభావితం చేసేందుకు వీలుగా రాజకీయపార్టీలకు మద్దతుగా పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడం, ఓటర్ల సమీకరణ, న్యాయపరమైన మద్దతు, ఎన్నికల ప్రణాళిక, నిర్వహణ, మీడియా పర్యవేక్షణ, పార్టీ కమ్యూనికేషన్ల వ్యవస్థ పటిష్టం చేయడం... రాజకీయ పరిశోధన సర్వీసులు కులాలపై పరిశోధన, ఓటర్ల ప్రవృత్తిపరంగా పోలింగ్, పార్టీ ఆడిట్ నిర్వహణ,ప్రభుత్వ కార్యక్రమాలు, సమస్యల విశ్లేషణ, అభ్యర్థుల ఎంపికపై పరిశోధన, చారిత్రకాంశాల విశ్లేషణ, ఎన్నికల్లో విజయంపై ముందస్తు అంచనాలు, జోస్యం వంటివి... –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బీజేపీ తరఫునే సీఏ పనిచేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన ‘స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ లాబరేటరీస్ (ఎస్సీఎల్–గ్రూప్)’కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ), అంతకుముందు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎన్నికల్లో కూడా తన సేవలను అందించిందన్న విషయంపై చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. 2010లో బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున మొదటి సారి భారత ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ఆ తర్వాత ఏయే ఎన్నికల్లో ఏయే పార్టీల తరఫున పనిచేసిందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో సీఏ సంస్థ ఓ రాజకీయ పార్టీ తరఫున పనిచేసిందని, అందులో 300 మంది శాశ్వత సిబ్బంది, 1400 మందిని తాత్కాలిక ఉద్యోగులతో తన సేవలను అందించిందని ‘క్వార్ట్స్జ్’ డాట్ కామ్ తాజాగా సేకరించిన డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. భారత్‌లోని అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, కటక్, గజియాబాద్, గువహటి, ఇండోర్, కోల్‌కతా, పట్నా, పుణె అనే నగరాలను కేంద్రంగా సీఏ తన సేవలను అందించింది. భారత్ ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా పనిచేసిందని, బహూశ తమ క్లైంట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చని ఈ కంపెనీ మాజీ ఉద్యోగి ఈనెల 27వ తేదీన బ్రిటీష్ పార్లమెంటరీ కమిటీ ముందు అంగీకరించడం, కాంగ్రెస్ పార్టీ క్లైంట్ కాదని కంపెనీ వర్గాలు ప్రకటించడం తెల్సిందే. వీటిలో ఎవరి మాట నిజమైందో తెలియదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఏ నిజంగా పనిచేసినట్లయితే కంపెనీ పరువు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తాము సేవలందించిన స్థానాల్లో 92 శాతం తన క్లైంట్ అభ్యర్థులు విజయం సాధించారని కంపెనీ తెలిపింది. ఈ లెక్కన ఆ కంపెనీ బీజేపీ పార్టీ తరఫునే సేవలు అందించి ఉండాలి. స్పష్టత కోసం సీఏ, ఎస్సీఎల్ యాజమాన్యం నుంచి సమాధానాన్ని కోరింది. అయితే వారి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. వాస్తవానికి సీఏ 2013లో ఆవిర్భవించినప్పటికీ దాని మాతృసంస్థ ఎస్సీఎల్ 2003లో ఏర్పాటైన నాటి నుంచి భారత్‌లో ఎన్నికలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2003లో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ప్రధాన రాష్ట్ర పార్టీ సంస్థాగత బలం, ఓటర్ల ప్రవృత్తి, రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలపై అదే సంవత్సరం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ తరఫున ఓటర్ల నాడి, ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మళ్లే ఓటర్లను గుర్తించడం లాంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. 2007లో జిహాది గ్రూపుల నియామకాలను ఎలాంటి ప్రచారం ద్వారా ఎదుర్కోవాలి అన్న అంశంపై కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, జార్ఖండ్, యూపీ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. 2010 బీహార్ ఎన్నికల్లో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసినట్లు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఈ సేవల కోసం సీఏ సంస్థ ఓటర్ల ఫేస్బుక్ ఖాతాలను వాడుకుందనే విషయం వెలుగులోకి రావడంతో ఈ అంశంపై గొడవ జరుగుతున్న విషయం తెల్సిందే. -
ఫేస్‌బుక్‌కు కేంద్రం నోటీసులు
లండన్: ఫేస్బుక్ ఖాతాల సమాచార దుర్వినియోగ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన క్రిస్టొఫర్ వైలీ తాజాగా కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) భారత్‌లో సాగించిన కార్యకలాపాలను కూడా బట్టబయలు చేశారు. తనకు తెలిసినంత వరకు సీఏ 2003 నుంచి భారత్‌లో వివిధ పార్టీలకు సేవలు అందిస్తోందనీ, ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ పార్టీ వాడుకుందని వైలీ యూకే పార్లమెంటరీ కమిటీకి మంగళవారం చెప్పారు. సీఏ మాజీ ఉద్యోగి అయిన వైలీ బుధవారం ట్వీటర్ వేదికగా మరికొన్ని విషయాలను బయటపెట్టారు. 2010లో బిహార్ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ సీఏ సేవలను వినియోగించుకుందన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కులాల వారీగా సంస్థ కుటుంబాల వివరాలను సేకరించిందని తెలిపారు. ‘సీఏ భారత్‌లోనూ పనిచేస్తోంది. అక్కడి ఘజియాబాద్‌లో సంస్థ భారత విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. హైదరాబాద్ సహా 9 నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఆధునిక వలసవాదం అంటే ఇదే’అని వైలీ ట్వీటర్లో తెలిపారు. భారత్‌లో 600 జిల్లాల్లోని 7 లక్షల గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలు తమ వద్ద ఉన్నాయనీ, ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందని సీఏ చెప్పుకుంటున్నట్లు వైలీ ట్వీట్ ద్వారా వెల్లడైంది. ఎన్నికల్లో ఎక్కడ ఎవర్ని అభ్యర్థిగా నిలబెట్టాలి, ఏ కులం వారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయాలి, ఎలాంటి ఉపన్యాసాలు/హామీలు ఇవ్వాలి తదితర నిర్ణయాలను తీసుకోడానికి అవసరమైన సమాచారాన్ని క్లయింట్ పార్టీలకు సీఏ అందించిందని వైలీ చెప్పారు. 2003లో రాజస్తాన్‌లో ప్రాంతీయ ప్రధాన పార్టీ, అదే ఏడాది మధ్యప్రదేశ్‌లో ఓ జాతీ య పార్టీ, 2007, 2012ల్లో ఉత్తరప్రదేశ్‌లో ఓ జాతీయ పార్టీ సహా 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ సీఏ సేవలను వివిధ పార్టీలు ఉపయోగించుకున్నట్లు వైలీ ట్వీట్లు స్పష్టం చేశాయి. సీఏ అందించిన కులాల విశ్లేషణ వివరాలను జేడీయూ వినియోగించుకుందన్నది వాస్తవం కాదనీ, అలాంటి ఎన్నికల రాజకీయాలకు పాల్పడే పార్టీ తమది కాదని జేడీయూ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌కు కేంద్రం నోటీసులు న్యూఢిల్లీ: ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సీఏ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వినియోగదారుల డేటా లీక్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందించాల్సిందిగా ఫేస్‌బుక్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే యూజర్ల సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలని కోరింది. ఏప్రిల్ 7వ తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని కేంద్రం ఫేస్‌బుక్‌కు గడువు విధించింది. కాగా, వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన భద్రతా సాధనాల్లో (ప్రైవసీ సెట్టింగ్స్) సమగ్ర మార్పులు చేపట్టనున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది. తద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతను పూర్తిగా వారి చేతుల్లోనే ఉంచేలా నూతన భద్రతా సాధనాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది. -
కాంగ్రెస్‌తో జట్టు కట్టలేదు : కేంబ్రిడ్జ్ ఎనలిటికా
లండన్ : ఫేస్బుక్ డేటాను సంగ్రహిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ కంపెనీ కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారత్‌లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిందనే ప్రచారాన్ని తోసిపుచ్చింది. భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగాయని, కాంగ్రెస్ పార్టీకి సేవలందించిందని కంపెనీ మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్ వైలీ చేసిన ఆరోపణలను ఖండించింది. భారత్‌లో కేంబ్రిడ్జ్ అనలిటికా విస్తృతంగా కార్యకలాపాలు సాగించిందని, అక్కడ సంస్థకు కార్యాలయం ఉందని, సిబ్బంది ఉందని వైలీ బ్రిటన్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ కేంబ్రిడ్జ్కు క్లైంట్ అని తనకు సమాచారం ఉందన్నారు. కాగా, పార్ట్‌టైమ్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన వైలీ 2014, జులైలోనే సంస్థ నుంచి వైదొలిగారని, అప్పటినుంచి కంపెనీ కార్యకలాపలు, పద్ధతుల గురించి వైలీకి తెలియదని కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆయన చెప్పినవన్నీ కేవలం ఊహాగానాలేనని కేంబ్రిడ్జ్ అనలిటికా పేర్కొంది. -
కాంగ్రెస్‌పై బాంబు పేల్చిన కేంబ్రిడ్జ్ అనాలిటికా
ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. ఎన్నికల్లో చీటింగ్‌కు పాల్పడిన కేంబ్రిడ్స్ అనాలిటికా సంస్థతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయా? అంటే ఔననే అంటున్నారు ఆ సంస్థ మాజీ ఉద్యోగి క్రిష్టోఫర్ విలీ. భారత్‌లో తాము విస్తారంగా పనిచేశామని, కాంగ్రెస్‌పార్టీ కూడా తమ క్లయింట్‌గా ఉన్నదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. భారత్‌లో తమకు కార్యాలయం కూడా ఉందని, అన్ని రకాల ప్రాజెక్టులు చేపట్టామని ఆయన వెల్లడించారు. ఆయన మంగళవారం బ్రిటన్ చట్టసభ ఎంపీల కమిటీ విచారణకు హాజరై పలు వివరాలు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ అనాలిటికా సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఆ సమాచారాన్ని వాడినట్టు వెల్లడి కావడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు వెలుగుచూడటం బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించి విజిల్ బ్లోయర్‌గా వ్యవహరించిన క్రిష్టోఫర్ విలీ తాజాగా బ్రిటన్ ఎంపీల కమిటీ ముందు హాజరై.. పలు వివరాలు వెల్లడించారు. -
ఫేస్బుక్ ప్రతినిధిపై మంత్రి ప్రశ్నల వర్షం...
సింగపూర్ : కేంబ్రిడ్జ్ అనలిటికా అంశంపై ఫేస్బుక్ వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. భారత ప్రభుత్వం కూడా వివరణ కొరుతూ ఫేస్బుక్ సంస్థకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. పలు దేశాల అంతర్గత చర్చల్లో కూడా ఫేస్బుక్ డేటా లీకేజీ చర్చనీయాంశంగా మారింది. కానీ సింగపూర్ మాత్రం ఫేస్‌బుక్‌కు నేరుగా తమ అభిప్రాయాలను తెలిపింది. పార్లమెంటులో ఏర్పాటు చేసిన సమావేశంలో సింగపూర్ మంత్రి ఫేస్బుక్ ప్రతినిధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సింగపూర్ పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ వారం రోజుల పాటు సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, తప్పుడు సమాచార వ్యాప్తి గురించి పరిశీలించి, నివేదిక రూపొందించింది. ఈ కమిటీలో ఫేస్బుక్ పసిఫిక్ ఆసియా ఉపాధ్యక్షుడు(పబ్లిక్ పాలసీ) సైమన్ మిల్లర్‌తో పాటు గూగుల్, ట్వీట్టర్ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ నివేదిక గత గురువారం రోజు(మార్చి 22) పార్లమెంటేరియన్ సదస్సులో చర్చకు వచ్చింది. ఫేస్బుక్, గూగుల్, ట్వీట్టర్పై కమిటీ అధ్యయనం చేసినప్పటికీ, ఫేస్బుక్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సింగపూర్ న్యాయశాఖ మంత్రి కె. షణ్ముగం, ఫేస్బుక్ ప్రతినిధి మిల్లర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేంబ్రిడ్జ్ అనలిటికా ద్వారా 5 కోట్ల మంది వివరాలు చోరికి గురయినప్పటికీ ఫేస్బుక్ గుర్తించలేకపోయిందని షణ్ముగం ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు అకౌంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. మూడు గంటల పాటు కొనసాగిన సమావేశంలో దాదాపు గంట పాటు షణ్ముగం, మిల్లర్ మధ్య వాగ్వాదం నడిచింది. ఫేస్‌బుక్‌పై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. మిల్లర్ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నిస్తుంటే ‘యస్ ఆర్ నో’ ఏదో ఒకటే చెప్పాలన్నారు . గూగుల్, ట్వీట్టర్ ప్రతినిధులు తమ సైట్లలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఫేస్బుక్ ప్రతినిధిపై మంత్రి ఏకధాటిగా ప్రశ్నలు
-
మోదీ మంత్రం... రాహుల్ తంత్రం
సాక్షి, న్యూఢిల్లీ : సరికొత్త భారతాన్ని ఆవిష్కరిస్తాన న్న ప్రతిజ్ఞతతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నమో యాప్’ ద్వారా యూజర్ల సమాచారం అమెరికాలోని ఓ కంపెనీకి వెళుతోందన్న గుట్టురట్టవడంతో ఈ యాప్‌కు ‘ముందున్న హెచ్చరిక’ మాటనే మార్చి వేశారు. ‘మీ వ్యక్తిగత సమాచారం. మీ కాంటాక్టు వివరాలు, నెంబర్లు గోప్యంగా ఉంటాయి. మీరు, మేము సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడానికి మినహా మరో అవసరానికి వీటిని ఉపయోగించం. ముఖ్యంగా మీ సమాచారాన్ని మీ అనుమతి లేకుండా ఏ రూపంలో కూడా మూడవ పార్టీకి తెలియజేయం’ అంటూ నమో యాప్‌లో ఆదివారం వరకు కనిపించిన ఈ హెచ్చరిక సోమవారానికి మారిపోయింది. పాత వ్యాఖ్యల చోటా‘మీకు మరింత మంచి అనుభవాన్ని ఇవ్వడం కోసం పేరు, ఈ మెయిల్, మొబైల్ నెంబర్, మొబైల్ సమాచారం, లొకేషన్, నెట్వర్క్ క్యారియర్‌కు సంబంధించిన సమాచారాన్ని మూడో పార్టీ ప్రాసెస్ చేయవచ్చు’ అంటూ కొత్త వ్యాఖ్య వచ్చి చేరింది. నమో యాప్ యూజర్ల సమాచారం ఎప్పటికప్పుడు ‘క్లెవర్ ట్యాప్ కంపెనీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటైన ‘విజ్‌రాకెట్ ఐఎన్‌సీ’ అనే వెబ్ అనాలసిస్ ఫ్లాట్‌ఫారమ్‌కు చేరుతోందంటూ ప్రముఖ ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియెట్ ఆల్డర్సన్ (నకిలీ పేరు) శనివారం బయటపెట్టి భారత రాజకీయాల్లో బాంబు పేల్చారు. ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి కేంబ్రిడ్జి అనలిటికా కంపెనీ కొన్ని పార్టీల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో దేశంలో కూడా రాజకీయ దుమారం రేగిన విషయం తెల్సిందే. సరిగ్గా ఇదే సమయంలో నమో యాప్ సమాచారం మూడో పార్టీకి వెళుతోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘బిగ్‌బాస్’గా సంబోధిస్తూ వ్యంగోక్తులు విసరడం, అందుకు ప్రతిగా మోదీ తరఫున కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఛోటా భీమ్’ అంటూ రాహుల్ గాంధీపై వ్యంగోక్తులు విసిరిన విషయం తెల్సిందే. శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీపై బాంబు పేల్చిన హ్యాకర్ ఆల్డర్సన్ సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధికార యాప్ ‘ఐఎన్‌సీ యాప్’పై కూడా బాంబు పేల్చారు. ఈ యాప్ యూజర్ల సమాచారం కూడా సింగపూర్‌లోని మూడోపార్టీకి వెళుతోందని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ‘నాపేరు రాహుల్ గాంధీ. భారత్‌లోని అతి పురాతన రాజకీయ పార్టీకి నేను అధ్యక్షుడిని. మా పార్టీ యాప్‌కు మీరు సైనప్ కాగానే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని మా స్నేహితులకు అందజేస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఐఎన్‌సీ యాప్ పనిచేయడం లేదు. ‘మీ యాప్ కూడా మూడోపార్టీకి సమాచారం చేరవేస్తోంది’ అంటూ వస్తున్న ప్రతి విమర్శలకు ‘మా యాప్ పనిచేయడం లేదు’ అంటూ రాహుల్ గాంధీ సమాధానం ఇస్తున్నారు. ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, అటు రాహుల్ గాంధీకి తెలియకుండానే యూజర్ల సమాచారం మూడో పార్టీకి వెళుతుండవచ్చు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు చిత్తశుద్ధితో వాస్తవాన్ని అంగీకరించి పొరపాటును సరిదిద్దడం సాధారణ రాజకీయ నాయకుడి నైతిక బాధ్యత అయినప్పుడు అంతకన్నా పైస్థాయిలో ఉన్నవారికి ఎంత నైతిక బాధ్యత ఉండాలో విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. -
భారత్‌పై సీఏ కుట్ర!
ఫేస్బుక్ డేటా లీకేజీ ఘటనతో తెరపైకి వచ్చిన పేరు కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ). ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ఎన్నికల ఫలితాలను తమ సర్వేలు, వ్యూహాలతో తారుమారు చేసిన రికార్డు ఈ సంస్థకుంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, కెన్యా సహా పలు ఆఫ్రికా దేశాల ఎన్నికల్లో, బ్రెగ్జిట్ రెఫరెండంలోనూ వేలుపెట్టిన సీఏ 2014లో భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలనూ మార్చేందుకు ప్రయత్నించింది. ఆనాడు అసలేం జరిగింది? ఎందుకు వీరి ప్రయత్నం బెడిసికొట్టింది? ఆనాటి బృందంలో సభ్యుడైన ఎలక్షన్ కన్సల్టెంట్ అవ్నీ శ్ కుమార్ ‘ద ప్రింట్’ సంస్థకు వెల్లడించిన వివరాలు.. భారత ఎస్సీఎల్ కంపెనీ ఏర్పాటు కేంబ్రిడ్జ్ అనలిటికా మాతృ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఎస్సీఎల్) భారత్‌లో కాలుమోపేందుకు ఎస్సీఎల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించింది. ఇందులో అలెగ్జాండర్ జేమ్స్, అష్బర్నర్ నిక్స్, అలెగ్జాండర్ ఓక్స్ (ముగ్గురూ బ్రిటీషర్లు) అమ్రీశ్ త్యాగి, అవ్నీశ్ కుమార్ రాయ్ (ఇద్దరు భారతీయులు) డైరెక్టర్లుగా ఉన్నారు. జేమ్స్, నిక్స్ ఇద్దరూ ఎస్సీఎల్ (యూకే) వ్యవస్థాపకులు. అమ్రీశ్ త్యాగి జేడీయూ నేత కేసీ త్యాగి కుమారుడు, ప్రస్తుతం సీఏతో కలిసి పనిచేస్తున్న ఓవ్లినో బిజినెస్ ఇంటెలిజెన్స్ (ఓబీఐ) యజమాని. రాయ్ 1984నుంచీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఓటర్ల మనసును చదివి.. 2009లో యూపీలోని గౌతమబుద్ధ నగర్ పార్లమెంటు స్థానం ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎంపీ అభ్యర్థి మహేశ్ శర్మ (ప్రస్తుత కేంద్ర మంత్రి)కు రాయ్ సహకరించినా 16వేల ఓట్లతో శర్మ ఓడిపోయారు. ఫలితాన్ని సమీక్షించుకుంటున్న నేపథ్యంలో ఎస్సీఎల్–యూకే హెడ్ డాన్ మురేసన్తో రాయ్‌కు పరిచయమైంది. రాయ్ కోరిక మేరకు ముగ్గురు బిహేవియరల్ డైనమిక్స్ ఇన్స్టిట్యూట్ నిపుణులతో భారత్ వచ్చిన మురేసన్.. తనదైన శైలిలో సర్వే నిర్వహించి శర్మ ఓటమికి కారణాలు వెల్లడించారు. దీనికి ముచ్చటపడిన రాయ్.. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేలు నిర్వహించేందుకు మురేసన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు రాయ్ సహకరించారు. ఈ అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు. డేటాను అమ్ముకుంటేనే! రాయ్ విజ్ఞప్తి మేరకు లండన్ నుంచి ఎస్సీఎల్ నిపుణుల బృందం (అలెగ్జాండర్ నిక్స్ సహా) భారత్‌కు వచ్చింది. అప్పటికే రాయ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని జనాభా వివరాలను సేకరించి (కుల, మత, లింగ తదితర) వారి రాజకీయ అభిప్రాయాలను క్రోడీకరించే పనిలో ఉన్నారు. డేటాను మరింత శాస్త్రీయంగా రూపొందించి 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అమ్ముకోవాలని ఎస్సీఎల్ బృందం సూచించింది. ఇందుకోసం నిక్స్, మురేసన్, త్యాగి, రాయ్‌లు వివిధ పార్టీల నేతలను కలిశారు. పార్టీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ మొదట్లోనే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ చూద్దాం అన్నట్లు వ్యవహరించింది. నైతికత కాదు.. డబ్బే ముఖ్యం: నిక్స్ అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో జతకలిస్తే ఎక్కువ డబ్బులొస్తాయని నిక్స్ వీరందరినీ ఒప్పించారు. కాంగ్రెస్ నేతలను ఒప్పించేందుకు మరింత పకడ్బందీగా శాంపిల్ డేటా సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే ఓటర్లను అడగాల్సిన ప్రశ్నలు.. ప్రజానాడిని తెలుసుకునే బదులు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంలాగా కనిపించటంతో రాయ్ అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉండే ఓ గుజరాతీ ఎన్నారై ఒకరు రాయ్ బృందాన్ని కలిసి.. కాంగ్రెస్ ఓడిపోయేందుకు డీల్ కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి కాంట్రాక్ట్ తీసుకుందామనుకుని వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనైతికమని రాయ్ చెప్పినా నిక్స్ వినలేదు. భారత్‌కు వచ్చింది డబ్బులు సంపాదించుకునేందుకేనని నిక్స్ చెప్పాడు. సర్వే వివరాలన్నీ భారత సర్వర్లలో దాచిపెట్టాలని రాయ్ చెప్పినా వినకుండా కావాలని నిక్స్ యూఎస్ సర్వర్లలో భద్రపరచటంతో రాయ్ అసంతృప్తితో టీమ్ నుంచి బయటకొచ్చారు. జనాభా లెక్కల ప్రకారం వివరాల విశ్లేషణలో రాయ్ పాత్ర కీలకం కావటంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటినుంచి రాయ్ సొంతంగా పనిచేస్తుండగా సీఏ టీం త్యాగితో పనిచేస్తోంది. ఈ మధ్యలోనే కెన్యా ఎన్నికల పనికోసం నైరోబీ వెళ్లిన మురేసన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేవలం డబ్బుకోసమే పనిచేసే నిక్స్ కావాలనే మురేసన్ను చంపించాడని సీఏ యూకే ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
భారీగా సంపద కోల్పోయిన జుకర్‌బర్గ్
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భారీగా తన సంపదను కోల్పోయారు. గత రెండు నెలల వ్యవధిలో 10.3 బిలియన్ డాలర్లను ఆయన కోల్పోయినట్టు తాజా రిపోర్టు రివీల్ చేసింది. అంతేకాక బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో జుకర్‌బర్గ్ 3 స్థానాలు కిందకి పడిపోయి, 7వ స్థానంలోకి వచ్చేశారు. మరోవైపు ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటాను ఇది అమ్మేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఐదు కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాల సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పనిచేసే కేంబ్రిడ్జ్ అనలిటికాకు చిక్కినప్పటికీ ఆ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఫేస్బుక్ స్టాక్స్ కూడా 14 శాతం కిందకి పడిపోయాయి. వారం వ్యవధిలోనే 13 శాతం మేర కిందకి దిగజారి 160 డాలర్లకు చేరుకున్నాయి. ఈ వారంలోనే ఫేస్బుక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 75 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. కొన్ని రోజుల క్రితమే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాంపై నోరువిప్పిన జుకర్‌బర్గ్ తాము తప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. మీ డేటాను రక్షించే బాధ్యత తమదని, ఒకవేళ తాము అలా చేయలేకపోతే, మీకు సేవ చేసే అర్హత కలిగి ఉండమని తెలిపారు. ఇప్పుడు జరిగింది మరోసారి జరగదని హామీ ఇచ్చారు. -
డేటాపై ఈసి కీలక నిర్ణయం
సామాజిక మాధ్యమాల్లోని వినియోగదారుల సమాచారాన్ని ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోంది. ఫేస్బుక్ యూజర్ల డేటా లీకేజీ అంశం భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఉల్లంఘనలు జరగకుండా ఏయే చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంగళవారం ( ఈ నెల 27న) ఈసీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు సమావేశమవుతారు. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలతో కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించినట్టు, మనదేశంలోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), తదితర పార్టీలతో ఆ సంస్థ భారత భాగస్వామి కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సీఏ డేటా ఉల్లంఘనల నేపథ్యంలో ఫేస్‌బుక్‌తో ఈసీ కొనసాగిస్తున్న సంబంధాలను సైతం సమీక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీరావత్ పేర్కొన్నట్లు ఓ ఇంగ్లిష్ పత్రిక వెల్లడించింది. యువజన ఓటర్ల నమోదు ప్రోత్సాహానికి ఫేస్బుక్ సంస్థతో ఈసీ కలిసి పనిచేయడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ 2017 జూలైలో సామాజికమాధ్యమం వేదికగా భారతీయ వినియోగదారులకు 13 భాషల్లో ఈసీ విజ్ఞప్తులు పంపించింది. గతంలోనూ ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు మూడుపర్యాయాలు ఫేస్‌బుక్‌తో ఈసీ కలిసి పనిచేసింది. ఈ నేపథ్యంలో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రిటన్ బ్రెగ్జిట్ రిఫెరండం, ఇతర దేశాల్లోని ఎన్నికలను ప్రభావితం చేసిన విధంగా ఇక్కడి లోక్‌సభ ఎన్నికల్లో జరగకుండా ఉండేందుకు పరిరక్షణచర్యలు చేపట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఈసీ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చోటుచేసుకునే ఆయా పరిణామాలను తప్పుడు పద్ధతుల్లో పక్కదోవ పట్టించే ప్రయత్నాలు, శక్తులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు ఈసీ అధికార ఒకరు వెల్లడించారు. ఈ చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమాలు ఉపయోగించి ఓటర్లను అవాంచిత ప్రభావానికి గురిచేయకుండా, వీటి ప్రభావం ఓటింగ్ ప్రతికూలంగా పడకుండా ఉండేలా చూడాల్సి ఉందని చెప్పారు. ఎన్నికలు ప్రభావితమయ్యే ఏ అంశంపై అయినా ఈసీ దృష్టిపెడుతుందన్నారు. వచ్చే వారం జరగనున్న సమావేశంలో మాత్రం ప్రధానంగా డేటా దుర్వినియోగానికి సంబంధించిన సమస్యల తీవ్రతను విశ్లేషించి, వాటిని అరికట్టేందుకు ఏయే చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రచారాన్ని సీఏ సంస్థ నిర్వహించిందన్న బీజేపీ ఆరోపణలపై సైతం ఈసీ సోషల్ మీడియా సెల్ నివేదిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రకటన, ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ త్రోసిపుచ్చినా, గురువారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ వీటినే మళ్లీ సంధించారు. సీఏతో అంటకాగుతున్నది మీరంటే మీరంటూ బీజేపీ,కాంగ్రెస్ పరస్పర ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అతిక్రమించే అంశాల పర్యవేక్షణకు మీడియా విధానాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది ఆగస్టులో సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. ఆన్లైన్లో ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు కొన్ని ప్రజాసంబంధాల సంస్థలు చురుకుగా పనిచేస్తున్నట్టు ఈసీ దృష్టికి వచ్చిందని చెప్పారు. రోజురోజుకు మొబైల్–ఇంటర్నెట్ టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ప్రభావం కేఊడా పెరుగుతోందన్నారు. అందువల్ల సామాజికమాధ్యమాల్లోని ఆయా విషయాలు, అంశాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈసీ ఆ దిశలో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కేంబ్రిడ్జ్ అనలిటికాకు ప్రభుత్వం నోటీసులు
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేంబ్రిడ్జ్ అనలిటికాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఫేస్బుక్ డేటాబేస్‌ను కొల్లగొట్టి ఏఏ సంస్థలు భారతీయుల డేటాను వాడుకున్నాయో తెలుపాలంటూ ఆదేశించింది. మొత్తం ఆరు ప్రశ్నలను సంధిస్తూ.. మార్చి 31 వరకు వీటిపై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ నోటీసులు జారీచేసింది. ఒకవేళ వీటిపై స్పందించపోతే, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పైన పేర్కొన్న దొంగతనానికి పాల్పడి భారతీయుల డేటాను ఏమైనా అసైన్‌మెంట్‌కు వాడారా? పైన పేర్కొన్న దానిలో ఎవరెవరున్నారు? అసలు డేటాను వారు ఎలా పొందారు? వ్యక్తుల అనుమతి తీసుకున్నారా? అలా సేకరించిన డేటాను ఎలా వాడారు? అటువంటి డేటా ఆధారంగా ఏదైనా ప్రొఫైలింగ్ చేయబడిందా? వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్టు చేయొద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అతేకాక మీ లొకేషన్‌ను కూడా వెల్లడించవద్దని సీఈఆర్టీ అడ్వయిజరీ జారీచేసింది. ఈ సూచనలు...ఫేస్బుక్ అనేది పబ్లిక్ నెట్‌వర్క్‌లో భాగం. తేలికగా ఈ సమాచారాన్ని యాక్సస్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, అన్ని సోషల్ మీడియా యూజర్లు తమ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఈ సైట్లలో లేదా యాప్స్‌లో షేర్ చేసుకోకూడదు. అధికారిక డేటాను లేదా వ్యక్తిగత సీక్రెట్లను పంచుకోకూడదు. ఓటు ప్రిఫరెన్స్‌లను, పిన్, పాస్‌వర్డ్‌లను, క్రెడిట్ కార్డు వివరాలను, బ్యాంకింగ్ వివరాలను, పాస్‌పోర్టు వివరాలను, ఆధార్ కార్డు వివరాలను ఈ సైట్లలో పొందపరచుకూడదు. అనధికారిక వర్గాల నుంచి వచ్చిన మెసేజ్‌లను, ఇమేజ్‌లను ఓపెన్ చేయకూడదు. థర్డ్ పార్టీ యాప్స్‌కు సమాచారం ఇచ్చే ముందుకు జాగ్రత్త వహించాలి. ఎంతో పకడ్భందీతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దానిలో సింబల్స్, క్యాపిటల్ లెటర్లు, లోయర్-కేసు లెటర్లు ఉండాలి. -
ఫేస్బుక్ మీ డేటాను అమ్మేస్తోంది..
న్యూయార్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రోజురోజుకి తీవ్ర ఇరకాటంలో కూరుకుపోతోంది. ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రజలు డేటాను అమ్మేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్, కేంబ్రిడ్జ్ అనలిటికా మాజీ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ బన్నొన్ ఆరోపిస్తున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్ న్యూస్‌పేపర్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అయితే ఫేస్బుక్ నుంచి తీసుకున్న డేటా మైనింగ్ పొలిటికల్ డేటా అనాలిటిక్స్‌లో వాడుతున్నారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. ‘ఫేస్బుక్ మీ వివరాలన్నింటిన్నీ ఉచితంగా తీసుకుంటోంది. భారీ మొత్తంలో మార్జిన్ల కోసం వాటిని విక్రయిస్తోంది. ఈ కారణంతోనే కంపెనీలు ఎక్కువ విలువతో ట్రేడవుతున్నాయి’ అని బన్నొన్ చెప్పారు. తర్వాత ఆ కంపెనీలు ఆల్గారిథమ్స్ రాసి, ప్రజల జీవితాన్ని నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా.. కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్బుక్ డేటాను కొనుగోలు చేసిన స్కీమ్ ఉన్నట్టు తనకు గుర్తులేదన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ డేటా విక్రయించబడుతుందని మాత్రం బన్నొన్ నొక్కి చెప్పారు. ఈ స్కాండల్‌పై స్పందించిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, తాము తప్పులు చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ అనలిటికాపై అమెరికాలో విచారణ కొనసాగుతోంది. -
‘ఆ పార్టీ అబద్ధాల ఫ్యాక్టరీ’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బీజేపీపై ట్వీట్ దాడుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా పాలక పార్టీని అవాస్తవాలను మలిచే అబద్ధాల ఫ్యాక్టరీగా అభివర్ణించారు. ఫేస్బుక్ డేటా ఉల్లంఘనల వివాదం, భారత రాజకీయాల్లో కేంబ్రిడ్జి అనలిటికా పాత్రకు సంబంధించి రాహుల్ బీజేపీని టార్గెట్ చేశారు. 2012లో కాంగ్రెస్‌కు ద్రోహం చేసేందుకు కేంబ్రిడ్జ్ అనలిటికాకు చెల్లింపులు ఎలా జరిగాయనే కథనం సిద్ధమవుతుండగా..కాంగ్రెస్ కేంబ్రిడ్జ్‌తో కలిసి పనిచేసిందని అవాస్తవాలను ప్రచారం చేసేలా బీజేపీ కేబినెట్ మంత్రిని పురమాయించిందని రాహుల్ ట్వీట్ చేశారు. డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ అనలిటికా సేవలను ఉపయోగించుకున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆ కంపెనీ సేవలను వాడుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీయే ఆ కంపెనీల సేవలను వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకుందని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది. -
‘డేటా బేస్డ్’ వ్యూహాలే!
వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాల తయారీకి ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) సంస్థ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో.. భారత్ లో ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహాలు ఏ విధంగా రూపొందిస్తారు? ఇందుకు ప్రజల నుంచి సమాచారాన్ని ఎలా సేకరిస్తారు? దీన్ని సమీక్షించి ప్రచారరూపాలుగా మళ్లీ ప్రజల్లోకి పార్టీలు ఎలా తీసుకెళ్తున్నాయనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలవ్యూహాలపై చర్చ మొదలైంది. డేటాదే కీలక పాత్ర సామాజిక మాధ్యమాలతోపాటు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సమస్యలు, ఓటర్ల మొగ్గును బట్టి కొన్ని సంస్థలు పార్టీల కోసం ప్రచార వ్యూహాలు రూపొందిస్తాయి. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించే వివరాలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది కీలకం. ప్రధానంగా పార్టీలు, సంస్థలు భారత జనాభా లెక్కల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ డేటా విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసే వార్డు స్థాయిలో వివిధ పార్టీలకు పడిన ఓట్ల వివరాలు ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. వీటి ఆధారంగా ఓటర్ల మనోభావాలు, ఎన్నికల అంశాలు వెల్లడవుతాయి. బీజేపీకి సొంత టీమ్ పార్టీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి, ఓటర్ల డేటాను విశ్లేషించేందుకు బీజేపీ సొంతంగా తన బృందాన్ని వినియోగిస్తోంది. ఈ జాతీయ సమాచార, సాంకేతిక విభాగానికి అమిత్ మాలవీయ నేతృత్వం వహిస్తున్నారు. అంకెల రూపంలోని ఓటర్ల సమాచారంతో పోలింగ్‌బూత్ స్థాయిలో తమ బృందం పనిచేస్తుందని, దీనిపై విశ్లేషణ కుదిరాక పార్టీ రాజకీయ వ్యూహం ఖరారు చేస్తుందని మాలవీయ చెప్పారు. గత ఎన్నికల్లో ఇలాంటి విశ్లేషణతో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా 543 నియోజకవర్గాల్లోని 11.36 లక్షల పోలింగ్ బూత్‌లలో 81 కోట్ల ఓటర్లు లక్ష్యంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కి కూడా..: కాంగ్రెస్‌కూ జాతీయస్థాయిలో ఎన్నికల ప్రక్రియ, డేటా పర్యవేక్షణ, విశ్లేషణకూ ఓ టీం ఉంది. పొలిటికల్ ఎకానమిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో డేటా విశ్లేషణ విభాగాన్ని నియమించారు. ఎన్నికల సమాచారంతో పాటు పార్టీ కార్యకర్తలు సేకరించిన వివరాలు, పబ్లిక్ డేటాను తమ బృందం విశ్లేషిస్తుందని ప్రవీణ్ పేర్కొన్నారు. బహిరంగ సమాచారమూ ముఖ్యమే 2019 ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాలుపంచుకోనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, జనాభా లెక్కలు, జాతీయ శాంపిల్ సర్వే సంస్థ సేకరించి, విడుదల చేసిన సమాచారానికి అనుగుణంగానే విశ్లేషణ చేపడుతున్నట్లు ఆస్ట్రమ్ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ సింగ్లా చెప్పారు. ఒక్కో ఓటరు ఆలోచనా ధోరణి, అభిప్రాయాలతో ఉండడంతో పాటు భాషా, కులం, సామాజిక, ఆర్థిక స్థాయిల్లో అంతరాలు వంటి అంశాలతో భారత్‌లో పరిస్థితి సంక్షిష్టంగా మారిందని.. తమ బృందం సేకరించిన డేటా ఆధారంగా పంచాయతీ నుంచి సాధారణ ఎన్నికల వరకు సరళిని అంచనా వేస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో మోదీ విజయానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నికల్లో గెలవడమెలా?
'కేంబ్రిడ్జ్ అనలిటికా' అనే సంస్థ ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని వినియోగించుకుని ఎన్నికలను 'ప్రభావితం చేసింద'న్న బలమైన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదం కేవలం అమెరికా, యూకేలకు మాత్రమే కాక, భారత్‌లోనూ ప్రకంపనాలు చెలరేగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాపై తీవ్ర దుమారమే చెలరేగుతోంది. ఈ వివాద నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నికల్లో ఎలా గెలువవచ్చో కూడా తెరపైకి వచ్చింది. భారత్‌లో జరిగిన పలు ఎన్నికల్లో కేంబ్రిడ్జ్, ఎస్సీఎల్కు చెందిన దేశీయ పార్టనర్ ఓవ్లీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) డేటా ఎనాలిటిక్స్ ప్రభావితం చేశాయని తెలిసింది. 2010 ప్రారంభం నుంచి మొబైల్స్‌ను వాడుకుని కొత్త కొత్త పొలిటికల్ టూల్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఓబీఐ అధినేత అమ్రిష్ త్యాగి చెప్పారు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌తో ఎలా ఎన్నికల్లో గెలువ వచ్చు అని కొంతమంది రాజకీయ నాయకులు అడిగారని తనకు గుర్తు ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్‌తో ఎన్నికల్లో గెలవడం త్యాగి కంపెనీ ఆర్ట్‌కు సంబంధించి కచ్చితమైన వివరణ అని అన్నారు. మొబైల్ ఫోన్ ప్రజల అభిప్రాయాలను ఎలా రూపుదిద్దగలదో వివరించారు. ఇది ప్రజలను సోషల్ మీడియాతో లింక్ చేయడంతోనే సాధ్యమని త్యాగి చెప్పారు. సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమైనదని, ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాల్సినవసరం ఉందన్నారు. దీనిలో వ్యక్తిగత బ్రాండు చాలా కీలమన్నారు. స్పీచులు, ఇతర పోస్టర్ల ద్వారా కంటే కూడా మొబైల్ ఫోన్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని చాలా వేగంగా మార్చవచ్చని తెలిపారు. 2015లో బిహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ సంఘటనను కూడా త్యాగి గుర్తు చేసుకున్నారు. నితీష్ కుమార్‌కు చెందిన ఓ ఫోటోను విడుదల చేశామని, అది సెకన్లలో వైరల్ అయిందని తెలిపారు. ‘బిహార్ ఎన్నికల్లో మా క్లైంట్ అఖండ విజయం సాధించారు. మేం టార్గెట్ చేసిన సీట్లలో 90 శాతం సీట్లను గెలుచుకున్నాం’ అని కేంబ్రిడ్జి అనలిటికా ప్రకటించుకుంది కూడా. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని ‘ప్రిడిక్టివ్ అనలటిక్స్, బిహేవియరల్ సైన్స్’తో విశ్లేషించి కేంబ్రిడ్జ్ అనలిటికా ఖాతాదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే, ఫేస్బుక్ ఖాతాదారుల్లో ఏ ఓటరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు చూపుతున్నారు? ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఎవరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు? అన్న అంశాలను పసిగట్టి వారిని లక్ష్యంగా చేసుకొని సీఏ లాంటి సంస్థలు తమ క్లైంట్కు సానుకూలంగా ఓటరు మలుచుకుంటాయి. 2016లో త్యాగి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించేందుకు సాయపడినట్టు తెలిసింది. -
బిహార్ ఎన్నికల్లో ‘సీఏ’ సేవలు నిజం
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల వివరాలను వారి అనుమతి లేకుండా సేకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) భారత ఎన్నికల్లో కూడా ఆ వివరాలను ఉపయోగించుకుందా? అసలు భారత్ ఎన్నికల్లో తన సేవలను అందించిందా? సేవలు ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విమర్శల్లో నిజం ఎంత ? 2010లో బిహార్‌కు జరిగిన ఎన్నికల్లో తన సేవలను అందించినట్లు కేంబ్రిడ్జి అనలిటికా స్వయంగా తన వెబ్సైట్లోనే వెల్లడించింది. లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ సంస్థ వాస్తవానికి అప్పటికి పుట్ట లేదు. కాకపోతే తన మాతృ సంస్థ ‘ది స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబరేటరీస్ గ్రూప్’ ద్వారా ఈ ఎన్నికల సేవలో పాల్గొంది. 2013లో కేంబ్రిడ్జి అనలిటికా ఏర్పాటయింది. ‘బిహార్ ఎన్నికల్లో మా క్లైంట్ అఖండ విజయం సాధించారు. మేం టార్గెట్ చేసిన సీట్లలో 90 శాతం సీట్లను గెలుచుకున్నాం’ అని కేంబ్రిడ్జి అనలిటికా ప్రకటించుకుంది. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతా దళ్ (యూ) ఐదింట నాలుగొంతుల సీట్లను సాధించడం ద్వారా అఖండ విజయం సాధించింది. అమష్ త్యాగికి చెందిన ఓవ్లీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థను స్థానిక భాగస్వామిగా పెట్టుకొని నాడు ‘ది స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లాబరేటరీస్ గ్రూప్’ బీహార్ ఎన్నికల్లో తన సేవలను అందించింది. అందుకు కారణం అమష్ త్యాగి, జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి కుమారుడు అవడమే. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని ‘ప్రిడిక్టివ్ అనలటిక్స్, బిహేవియరల్ సైన్స్’తో విశ్లేషించి సీఏ సంస్థ ఖాతాదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే, ఫేస్బుక్ ఖాతాదారుల్లో ఏ ఓటరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు చూపుతున్నారు? ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఎవరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు? అన్న అంశాలను పసిగట్టి వారిని లక్ష్యంగా చేసుకొని సీఏ లాంటి సంస్థలు తమ క్లైంట్కు సానుకూలంగా ఓటరు మలుచుకుంటాయి. ఇదే సూత్రం ఆధారంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పక్షాన పనిచేసి ఆయన్ని గెలిపించామని సీఏ తన వెబ్సైట్లో గర్వంగా ప్రకటించుకుంది. ఆ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొన్నానని, కేవలం భారతీయుల లక్ష్యంగానే తాను పనిచేశానని అమష్ త్యాగి మీడియాకు తెలిపారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సీఐ తన సేవలను అందించేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీతోని గత కొంతకాలంగా చర్చలు జరుపుతూ వచ్చిందని తెల్సిందే. అయితే ఏ పార్టీతోని కూడా ఇంతవరకు ఒప్పందం కుదరలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 13.5 కోట్ల మంది కొత్త ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాంటి వారిని తాము తేలిగ్గా ప్రభావితులను చేయగలమని సీఏ సంస్థ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.