వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాల తయారీకి ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా (సీఏ) సంస్థ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో.. భారత్ లో ఎన్నికల సందర్భంగా ప్రచార వ్యూహాలు ఏ విధంగా రూపొందిస్తారు? ఇందుకు ప్రజల నుంచి సమాచారాన్ని ఎలా సేకరిస్తారు? దీన్ని సమీక్షించి ప్రచారరూపాలుగా మళ్లీ ప్రజల్లోకి పార్టీలు ఎలా తీసుకెళ్తున్నాయనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలవ్యూహాలపై చర్చ మొదలైంది.
డేటాదే కీలక పాత్ర
సామాజిక మాధ్యమాలతోపాటు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సమస్యలు, ఓటర్ల మొగ్గును బట్టి కొన్ని సంస్థలు పార్టీల కోసం ప్రచార వ్యూహాలు రూపొందిస్తాయి. భారత్‌లోనూ సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన నేపథ్యంలో ప్రజల నుంచి సేకరించే వివరాలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది కీలకం. ప్రధానంగా పార్టీలు, సంస్థలు భారత జనాభా లెక్కల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ డేటా విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసే వార్డు స్థాయిలో వివిధ పార్టీలకు పడిన ఓట్ల వివరాలు ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. వీటి ఆధారంగా ఓటర్ల మనోభావాలు, ఎన్నికల అంశాలు వెల్లడవుతాయి.
బీజేపీకి సొంత టీమ్
పార్టీ ఎన్నికల వ్యూహానికి సంబంధించి, ఓటర్ల డేటాను విశ్లేషించేందుకు బీజేపీ సొంతంగా తన బృందాన్ని వినియోగిస్తోంది. ఈ జాతీయ సమాచార, సాంకేతిక విభాగానికి అమిత్ మాలవీయ నేతృత్వం వహిస్తున్నారు. అంకెల రూపంలోని ఓటర్ల సమాచారంతో పోలింగ్‌బూత్ స్థాయిలో తమ బృందం పనిచేస్తుందని, దీనిపై విశ్లేషణ కుదిరాక పార్టీ రాజకీయ వ్యూహం ఖరారు చేస్తుందని మాలవీయ చెప్పారు. గత ఎన్నికల్లో ఇలాంటి విశ్లేషణతో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా 543 నియోజకవర్గాల్లోని 11.36 లక్షల పోలింగ్ బూత్‌లలో 81 కోట్ల ఓటర్లు లక్ష్యంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కి కూడా..: కాంగ్రెస్‌కూ జాతీయస్థాయిలో ఎన్నికల ప్రక్రియ, డేటా పర్యవేక్షణ, విశ్లేషణకూ ఓ టీం ఉంది. పొలిటికల్ ఎకానమిస్ట్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో డేటా విశ్లేషణ విభాగాన్ని నియమించారు. ఎన్నికల సమాచారంతో పాటు పార్టీ కార్యకర్తలు సేకరించిన వివరాలు, పబ్లిక్ డేటాను తమ బృందం విశ్లేషిస్తుందని ప్రవీణ్ పేర్కొన్నారు.
బహిరంగ సమాచారమూ ముఖ్యమే
2019 ఎన్నికల్లో 90 కోట్లకు పైగా ఓటర్లు పాలుపంచుకోనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్, జనాభా లెక్కలు, జాతీయ శాంపిల్ సర్వే సంస్థ సేకరించి, విడుదల చేసిన సమాచారానికి అనుగుణంగానే విశ్లేషణ చేపడుతున్నట్లు ఆస్ట్రమ్ సంస్థ వ్యవస్థాపకుడు అశ్వినీ సింగ్లా చెప్పారు. ఒక్కో ఓటరు ఆలోచనా ధోరణి, అభిప్రాయాలతో ఉండడంతో పాటు భాషా, కులం, సామాజిక, ఆర్థిక స్థాయిల్లో అంతరాలు వంటి అంశాలతో భారత్‌లో పరిస్థితి సంక్షిష్టంగా మారిందని.. తమ బృందం సేకరించిన డేటా ఆధారంగా పంచాయతీ నుంచి సాధారణ ఎన్నికల వరకు సరళిని అంచనా వేస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో మోదీ విజయానికి కృషి చేసినట్టు పేర్కొన్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment