పరీక్షకు ముందు విద్యార్థి ఎలా ప్రిపేర్ అవుతాడో.. ప్రస్తుతం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పరిస్థితీ అలాగే ఉంది. ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిన కేసుకు సంబంధించి జుకర్‌బర్గ్ ఈ నెల 10, 11 తేదీలలో అమెరికా సెనేట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల నుంచి క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయన్న అంచనాల నేపథ్యంలో విచారణను ఎలా ఫేస్ చేయాలా అని జుకర్‌బర్గ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
నిపుణులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలా అన్న సమాలోచనలు, ఒత్తిడి నుంచి బయటపడటానికి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. అమెరికా ప్రజాప్రతినిధులు చేసే విచారణ అంతా మీడియాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతో జుకర్‌బర్గ్ పరిస్థితి పరీక్షని ఎదుర్కొనే విద్యార్థిలా ఉందని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి, ఒత్తిడిని అధిగమించడానికి జుకర్‌బర్గ్ గత కొద్ది రోజులుగా 500మందికి పైగా నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో తమ తప్పును ఒప్పుకున్న జుకర్‌బర్గ్ ఇప్పటికే క్షమాపణలు కోరడం తెలిసిందే. ఇప్పుడు జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరుకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎదుర్కోనున్న ప్రశ్నలివేనా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడం ద్వారా రష్యా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ స్పందన, వ్యవహారశైలి సరిగా లేదంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారి నుంచి జుకర్‌బర్గ్‌కు ఇరుకున పెట్టే ప్రశ్నలే ఎదురవుతాయనే ప్రచారం జరుగుతోంది. జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే ప్రశ్నావళి కింది విధంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
► రష్యా చేతిలో ఎంతమంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా ఉంది?
► ఫేస్‌బుక్‌పై కఠినమైన నియంత్రణ ఎందుకు విధించకూడదు?
► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్ని రకాల తప్పుడు పోస్ట్‌లు ఫేస్‌బుక్‌లో షేర్ అయ్యాయి?
► ఫేక్ వార్తల్ని అరికడుతున్నామంటూ తీసుకుంటున్న చర్యలు సెన్సార్‌షిప్‌ను అడ్డుకోవడానికి సాకులేనా?
► ఫేస్‌బుక్‌లాంటి అతి పెద్ద సంస్థని ఒక వ్యక్తి ఎలా నియంత్రించగలడు?
మీ సమాచారం దుర్వినియోగమైందా?
న్యూయార్క్: సమాచార దుర్వినియోగం బారినపడిన 8.7 కోట్ల మంది ఖాతాదారులకు ఆ వివరాలను ఫేస్‌బుక్ తెలియజేయనుంది. ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ తప్పుడు ప్రయోజనాల కోసం వాడుకోవడం తెలిసిందే. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఫేస్‌బుక్ ఖాతాదారులు, వారి స్నేహితుల జాబితాలో ఉన్నవారి వివరాలను అనలిటికా సేకరించిందని సంస్థ చెప్పింది. ఎవరెవరి వివరాలను అనలిటికా దుర్వినియోగం చేసిందో, వారి ఫేస్‌బుక్ ఖాతాలో న్యూస్‌ఫీడ్‌కు పైభాగంలోనే ఓ సుదీర్ఘ సందేశాన్ని సంస్థ ఉంచుతామంది. ఇంకా ఏయే యాప్‌లతో గతంలో ఫేస్‌బుక్ వివరాలను పంచుకున్నారో తెలియజేయనుంది. ఆయా యాప్‌ల నుంచి ఫేస్‌బుక్ ఖాతా వివరాలను డిలీట్ చేసే అవకాశాన్ని కల్పించనుంది.
రాజీనామాను తోసిపుచ్చిన జుకర్‌బర్గ్
సమాచార దుర్వినియోగం వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో జుకర్‌బర్గ్ తన సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్వతంత్ర పరిశోధన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్, పాకిస్తాన్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో 2018,19ల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిశోధనల కోసం ఈ స్వతంత్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, జుకర్‌బర్గ్ సెనేట్ కమిటీ ముందు ఏం చెప్పనున్నారనే వివరాలు బయటకొచ్చాయి. ‘అది నా తప్పే. నన్ను క్షమించండి. ఫేస్‌బుక్‌లో ఏం జరిగినా అందుకు బాధ్యత నాదే’ అని జుకర్‌బర్గ్ లిఖిత పూర్వక వాంగ్మూలంలో పేర్కొన్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment