CEO Mark Zuckerberg
-
ట్విట్టర్‌కు కొత్త సవాల్
లండన్: మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్‌కు కొత్త సవాల్ ఎదురైంది. దాదాపు ట్విట్టర్ లాంటి ఫీచర్లతోనే ప్రత్యర్థి మెటా సంస్థ థ్రెడ్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం రాత్రి యాపిల్, గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్‌లో థ్రెడ్స్ ఉంచారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ సహా 100 దేశాల వారికి ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రారంభించిన మొదటి ఏడు గంటల్లోనే సుమారు కోటి మంది థ్రెడ్స్‌లో చేరారని మెటా సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటించడం గమనార్హం. థ్రెడ్స్‌లో లైక్, రిప్లై వంటి వాటికి ప్రత్యేకంగా బటన్లున్నాయి. ఏ పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు, రిప్లైలు వచ్చాయో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒక పోస్ట్ 500 క్యారెక్టర్స్‌కు మించి ఉండరాదు. ఇదే ట్విట్టర్లో అయితే 280 క్యారెక్టర్లే. ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు, అదే పేర్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని మెటా తెలిపింది. లేకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్ట్స్, బ్రౌజింగ్ అండ్ సెర్చ్ హిస్టరీ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని థ్రెడ్స్ సేకరిస్తుందని యాప్‌స్టోర్‌లోని సమాచారం చెబుతోంది. థ్రెడ్స్ రాకపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ స్పందించారు. దాదాపు అన్ని ఫీచర్లు ట్విట్టర్‌ను కాపీ కొట్టినట్లుగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
బోనస్‌పై జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు
ఓ వైపు లేఆఫ్స్ పేరుతో వేలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ మెటా మరోవైపు అందులో పనిచేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.కోట్ల కొద్దీ బోనస్‌లు ప్రకటించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు కంపెనీ సీఈవో మార్క్జుకర్బర్గ్నే నేరుగా నిలదీశారు. మెటా ఇప్పటి వరకు 21,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. తొలి రౌండ్ తొలగింపులను 2022 నవంబర్‌లో ప్రకటించగా, రెండో రౌండ్ లేఆఫ్‌లను గత నెలలోనే ప్రకటించింది. మొదటి రౌండ్లో 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, రెండో రౌండ్లో 10 వేల మందికి పింక్ స్లిప్ ఇచ్చారు. మరోవైపు కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భారీ బోనస్‌లను ఇచ్చింది. కంపెనీలో లేఆఫ్స్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్‌లను అందించడంపై చాలా మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వాళ్ల పని నచ్చింది.. అందుకే బోనస్లిచ్చాం’ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ రెండు రోజుల క్రితం వర్చువల్ క్యూఅండ్ఏ (Q&A) సెషన్లో ఉద్యోగులతో మాట్లాడారు. అదే సెషన్లో కొంతమంది ఉద్యోగులు.. ఓ వైపు వేలకొద్దీ తొలగింపులు జరుగుతున్నప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్‌లు ఇవ్వడం వెనుక కారణాన్ని చెప్పాలని జుకర్‌బర్గ్‌ను అడిగారు. జుకర్‌బర్గ్ దీనికి స్పందిస్తూ వారికి అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని, వారి పనితీరు పట్ల తాము సంతోషంగా ఉన్నందునే బోనస్‌లు ఇచ్చినట్లు బదులిచ్చారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! ‘ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులైన చాలా మంది ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇలాంటి పరిస్థితిలో మెటా సంస్థలో ఉద్యోగులు ఎందుకు ఉండాలి’ మరో ఉద్యోగి ప్రశ్నించారు. మెటా స్థాయిలో సామాజిక అనుభవాలను మరే ఇతర సంస్థ అందించదని, బిలియన్ల కొద్దీ ప్రజలను చేరుకోవాలనుకుంటే, భారీ ప్రభావాన్ని చూపాలనుకుంటే ఇదే గొప్ప సంస్థ అని జుకర్‌బర్గ్ సమాధానమిచ్చారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చిన బోనస్‌లు ఇలా.. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన మెటా ఎస్ఈసీ ఫైలింగ్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చిన బోనస్‌లు గురించి వెల్లడైంది. ఫైలింగ్ ప్రకారం.. సీఎఫ్‌వో సుసాన్లీ 5,75,613 డాలర్ల (రూ. 4.71 కోట్లు) , సీపీఓ క్రిస్టోపర్ కాక్స్ 9,40,214 డాలర్లు (రూ. 7.70 కోట్లు) బోనస్‌గా పొందారు. అలాగే సీవోవో జేవియర్ ఒలివాన్ 7,86,552 డాలర్లు (రూ. 6.44 కోట్లు), సీటీవో ఆండ్రూ బోస్వర్త్ 7,14,588 డాలర్లు (రూ. 5.85 కోట్లు) బోనస్ అందుకున్నారు. ఇక చఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (సీఎస్‌వో) డేవిడ్ వెన్నర్ 712,284 డాలర్లు (రూ. 5.83 కోట్లు), మాజీ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 2,98,385 డాలర్లు (రూ. 2.44 కోట్లు) బోనస్ పొందారు. ఇదీ చదవండి: కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్‌ను తొలగించిన కాగ్నిజెంట్! -
సెనేట్ను ‘ఫేస్’ చేసేందుకు కోచింగ్!
పరీక్షకు ముందు విద్యార్థి ఎలా ప్రిపేర్ అవుతాడో.. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పరిస్థితీ అలాగే ఉంది. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిన కేసుకు సంబంధించి జుకర్‌బర్గ్ ఈ నెల 10, 11 తేదీలలో అమెరికా సెనేట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల నుంచి క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయన్న అంచనాల నేపథ్యంలో విచారణను ఎలా ఫేస్ చేయాలా అని జుకర్‌బర్గ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిపుణులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలా అన్న సమాలోచనలు, ఒత్తిడి నుంచి బయటపడటానికి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. అమెరికా ప్రజాప్రతినిధులు చేసే విచారణ అంతా మీడియాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతో జుకర్‌బర్గ్ పరిస్థితి పరీక్షని ఎదుర్కొనే విద్యార్థిలా ఉందని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి, ఒత్తిడిని అధిగమించడానికి జుకర్‌బర్గ్ గత కొద్ది రోజులుగా 500మందికి పైగా నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంలో తమ తప్పును ఒప్పుకున్న జుకర్‌బర్గ్ ఇప్పటికే క్షమాపణలు కోరడం తెలిసిందే. ఇప్పుడు జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరుకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎదుర్కోనున్న ప్రశ్నలివేనా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడం ద్వారా రష్యా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఫేస్బుక్ స్పందన, వ్యవహారశైలి సరిగా లేదంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారి నుంచి జుకర్‌బర్గ్‌కు ఇరుకున పెట్టే ప్రశ్నలే ఎదురవుతాయనే ప్రచారం జరుగుతోంది. జుకర్‌బర్గ్ ఎదుర్కోబోయే ప్రశ్నావళి కింది విధంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ► రష్యా చేతిలో ఎంతమంది ఫేస్బుక్ వినియోగదారుల డేటా ఉంది? ► ఫేస్‌బుక్‌పై కఠినమైన నియంత్రణ ఎందుకు విధించకూడదు? ► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్ని రకాల తప్పుడు పోస్ట్‌లు ఫేస్బుక్లో షేర్ అయ్యాయి? ► ఫేక్ వార్తల్ని అరికడుతున్నామంటూ తీసుకుంటున్న చర్యలు సెన్సార్షిప్ను అడ్డుకోవడానికి సాకులేనా? ► ఫేస్‌బుక్‌లాంటి అతి పెద్ద సంస్థని ఒక వ్యక్తి ఎలా నియంత్రించగలడు? మీ సమాచారం దుర్వినియోగమైందా? న్యూయార్క్: సమాచార దుర్వినియోగం బారినపడిన 8.7 కోట్ల మంది ఖాతాదారులకు ఆ వివరాలను ఫేస్బుక్ తెలియజేయనుంది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ తప్పుడు ప్రయోజనాల కోసం వాడుకోవడం తెలిసిందే. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఫేస్బుక్ ఖాతాదారులు, వారి స్నేహితుల జాబితాలో ఉన్నవారి వివరాలను అనలిటికా సేకరించిందని సంస్థ చెప్పింది. ఎవరెవరి వివరాలను అనలిటికా దుర్వినియోగం చేసిందో, వారి ఫేస్బుక్ ఖాతాలో న్యూస్‌ఫీడ్‌కు పైభాగంలోనే ఓ సుదీర్ఘ సందేశాన్ని సంస్థ ఉంచుతామంది. ఇంకా ఏయే యాప్‌లతో గతంలో ఫేస్బుక్ వివరాలను పంచుకున్నారో తెలియజేయనుంది. ఆయా యాప్‌ల నుంచి ఫేస్బుక్ ఖాతా వివరాలను డిలీట్ చేసే అవకాశాన్ని కల్పించనుంది. రాజీనామాను తోసిపుచ్చిన జుకర్‌బర్గ్ సమాచార దుర్వినియోగం వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో జుకర్‌బర్గ్ తన సీఈవో పదవికి రాజీనామా చేయనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్వతంత్ర పరిశోధన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారత్, పాకిస్తాన్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో 2018,19ల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిశోధనల కోసం ఈ స్వతంత్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, జుకర్‌బర్గ్ సెనేట్ కమిటీ ముందు ఏం చెప్పనున్నారనే వివరాలు బయటకొచ్చాయి. ‘అది నా తప్పే. నన్ను క్షమించండి. ఫేస్బుక్లో ఏం జరిగినా అందుకు బాధ్యత నాదే’ అని జుకర్‌బర్గ్ లిఖిత పూర్వక వాంగ్మూలంలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
10 ఏళ్ల క్రితం లేని టెక్నాలజీ
పదేళ్లు... ఓ మనిషి జీవిత కాలంలో పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ, అదే పదేళ్ల కాలం టñ క్నాలజీ ప్రపంచంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పదేళ్ల క్రితం ఊహకైనా అందని టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఎన్నో ఇప్పుడు మనిషి దైనందిన జీవితాన్ని శాసిస్తున్నాయి. పదేళ్ల క్రితం లేని.. అలాంటి టెక్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం... వాట్సాప్ జాన్ కౌన్, బ్రియన్ యాక్షన్ మదిలో 2009లో వాట్సాప్ ఆలోచన మొగ్గతొడిగింది. తొలుత ఓ మెసేజింగ్ యాప్‌ను రూపొందించాలని భావించారు. కానీ అదే వాట్సాప్‌లో ఇప్పుడు మెసేజ్‌లు, కాల్స్.. ఒకటేమిటి! వాట్సాప్ మనిషి జీవితంలో భాగమైపోయింది. రోజుకో కొత్త ఫీచర్‌తో అలరిస్తోంది. వాట్సాప్‌ను ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 19 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి 2014లో కొనుగోలు చేశారు. ఆండ్రాయిడ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 2 బిలియన్ల ఫోన్లలో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఓఎస్‌ను గూగుల్ 2007లో రూపొందించింది. మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ 2008 అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఆండ్రాయిడ్‌తో నడిచే ఫోన్ కనిపించడం సర్వసాధారణం. పదేళ్ల క్రితం ఊహకు సైతం అందని ఆండ్రాయిడ్ ఫోన్.. ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ హైటెక్ ప్రొడక్ట్! గూగుల్ క్రోమ్ గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌ను 2008 సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. అప్పుడు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన అధికారిక బ్లాగ్‌లో ‘‘మేం చాలా స్ట్రీమ్లైన్డ్ అండ్ సింపుల్ బ్రౌజర్ విండోను రూపొందించాం’’ అని రాసుకున్నారు. చరిత్రాత్మక గూగుల్ హోంపేజీలాగే గూగుల్ క్రోమ్ కూడా అత్యంత క్లీన్ అండ్ ఫాస్ట్ అని పిచాయ్ పేర్కొనడం విశేషం. ఇప్పుడు గూగుల్ క్రోమ్లేని డివైజ్‌లు తక్కువే అనడం అతిశయోక్తి కాదు. ఉబెర్ ఉబెర్ యాప్ సాఫ్ట్వేర్.. కార్ సర్వీస్ ప్రొవైడర్‌గా 2009లో ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 633 సిటీల్లో ఉబెర్ సేవలు అందిస్తోంది. ఇది విస్తరిస్తూ పీర్ టు పీర్ రైడ్ షేరింగ్, కార్ పూలింగ్, లగ్జరీ రైడ్స్ వంటి ఎన్నో సేవల దిశగా విస్తరిస్తోంది. ఫుడ్ డెలివరీ మొబైల్ యాప్స్‌ను రూపొందిస్తోంది. స్పోటిఫై నేడు మిలియన్ల మంది మ్యూజిక్ ప్రియుల ఫోన్లలో కనిపిస్తున్న యాప్ ఇది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్స్ వంటి హైటెక్ డివైజెస్‌లో అందుబాటులో ఉంది. 2008 అక్టోబర్‌లో స్పోటిఫైను లాంచ్ చేయగా... 2017 జూన్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 140 మిలియన్ల యాక్టివ్ యూజర్స్‌ను కలిగి ఉండటం విశేషం. మ్యూజిక్ లవర్స్ 30 మిలియన్ల పాటలను ఆర్టిస్ట్, ఆల్బమ్, ప్లేలిస్ట్ ఇలా..వివిధ కేటగిరీల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా కనెక్టివిటీ ఫీచర్ ఉన్న స్పాటిఫై యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడమే. ఐ పాడ్ మొదటి ఐపాడ్‌ను టెక్నాలజీ లెజెండ్ స్టీవ్ జాబ్స్ 2010లో లాంచ్ చేశారు. ఇది టాబ్లెట్ కంప్యూటర్. యాపిల్ కంపెనీ ఇప్పటికే అనేక మోడల్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఐ పాడ్ ప్రోను 2017, జూన్ 13న లాంచ్ చేసింది. మల్టీటచ్ స్క్రీన్, వర్చువల్ కీబోర్డ్, వైఫై కనెక్షన్ తదితర ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఇప్పటికే మిలియన్ల మంది చేతిలో ఉంది ఈ ఐపాడ్. -
విమర్శలతో దిగొచ్చిన ఫేస్బుక్
న్యూయార్క్ : నాపలామ్ బాలిక ఫోటోగ్రాఫ్ తొలగింపుపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వెనక్కి తగ్గింది. తనపై వచ్చిన పలు విమర్శలతో ఫేస్బుక్ యూటర్న్ తీసుకుని, తొలగించిన ఆ ఫోటోను తిరిగి పోస్టు చేయడానికి అంగీకరించింది. 1972లో వియత్నాం యుద్ధ సమయంలో నాపలమ్‌పై దాడి జరుగుతున్నప్పుడు ఓ చిన్నారి ఏడుస్తూ నగ్నంగా పరుగెట్టుకుంటూ వెళ్తున్న ఫోటో ఫేస్బుక్లో పోస్టు అయింది. యుద్ధ తీవ్రతను తెలుపుతూ నాపలమ్ దాడికి సంబంధించిన ఈ ఫోటోను పులిట్జర్ బహుమతి గ్రహీత, నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ తన ఫేస్బుక్లో పోస్టుచేశారు. అయితే ఈ ఫోటో తన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్బుక్ తొలగించింది. ఇదే ఫోటోను నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్ కూడా పోస్టుచేశారు. కానీ దాని కూడా ఫేస్బుక్ తొలగించింది. దీంతో సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమై, ఫేస్బుక్ పలు విమర్శలకు గురైంది. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ ఫోటోను తొలగించడంపై పలువురు మండిపడ్డారు. ఫేస్బుక్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు నార్వే అతిపెద్ద న్యూస్ పేపర్ ఎడిటర్ బహిరంగ లేఖ రాశారు. దీంతో తనపై వస్తున్న విమర్శలతో ఫేస్బుక్ దిగొచ్చింది. నగ్నంగా ఉన్న బాలిక ఫోటో తమ నియమ నిబంధనలకు ఉల్లంఘిస్తుందనే నేపథ్యంలోనే తొలగించామని ఫేస్బుక్ తన ప్రకటనలో తెలిపింది. తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది.చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది.తొలగించిన చోటే దానిని తిరిగి పోస్టు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కొంత సమయం కావాలని ఫేస్బుక్ అభ్యర్థించింది. తమ విధానాలను మెరుగుపరుచుకుంటామని, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు తోడ్పడతామని, తమ కమ్యూనిటీ రక్షణకు దోహదం చేస్తామని తెలిపింది. అయితే ఫేస్బుక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ప్రధాని సోల్బెర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. -
జూకర్‌బర్గ్‌కు పెద్ద ఝలక్
న్యూఢిల్లీ: ఫేస్ బుక్ భద్రమే కానీ.. దాని వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్ బర్గ్‌కు మాత్రం హ్యాకర్స్ గట్టి ఝలక్ ఇచ్చారు. లక్షల మంది సోషల్ మీడియా ఖాతాలు తన కనుసన్నల్లో నిలపగల ఆయన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై హ్యాకర్స్ దాడి చేశారు. జూకర్ బర్గ్ కు చెందిన ఏ ఒక్క సోషల్ మీడియా ఖాతాను వారు వదిలిపెట్టలేదు. ఇన్ స్టాగ్రం, లింక్డెన్, పింటరెస్ట్, ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్స్‌ను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా చెడకొట్టారని ఆయనకు సంబంధించిన అధికారులు తెలిపారు. అయితే, ఆయన ఈమెయిల్ అకౌంట్‌పై కూడా దాడి చేశారా అనే విషయం తెలియలేదు. అయితే, పైన పేర్కొన్న ఖాతాలన్నింటికి కూడా జూకర్ తన వ్యక్తిగత ఈమెయిల్ ను లింక్ గా పెట్టుకున్నట్లు సమాచారం. బహుశా దానిపై కూడా హ్యాకర్ల కన్ను పడే ఉంటుందని అంటున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఓ చిన్న యువగ్రూపు ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. జూకర్ బర్గ్ ఆన్ లైన్ వ్యవస్థకు ఎంతటి సెక్యూరిటీ ఉందో పరీక్షించేందుకే వారు ఇలా చేసి ఉంటారని సోషల్ మీడియాలో పలువురు చెప్తున్నారు. హ్యాక్ చేసిన వాళ్లు కొన్ని స్క్రీన్ షాట్లను.. ఆయన వాడిన డాడాడా (డీఏడీఏడీఏ) పాస్ వర్డ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ, కొద్ది సేపటికే అది ట్విట్టర్ ఖాతా నుంచి కనిపించకుండా పోయింది. ఫేస్ బుక్ కూడా ఈ వార్తలని నిజమేనని చెప్పింది. ప్రస్తుతానికి ఆయన ఇన్ స్టాగ్రం ఖాతా తెరుచుకోవడం లేదట. Ouch. Mark Zuckerberg's social media accounts have been hacked pic.twitter.com/KvVmXOIg5s — Ben Hall (@Ben_Hall) 5 June 2016 -
పాప్‌స్టార్ తో హ్యాపీగా జుకర్ బర్గ్
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ దిగ్గజం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అవును.. ఇన్స్టాగ్రామ్ సూపర్ స్టార్ వ్యక్తిగతంగా కలుసుకున్న సంతోషాన్ని ఆయన సోషల్ మీడియాలో ప్రపంచలోని తమ అభిమానులతో పంచుకున్న తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇంతకీ ఫేస్బుక్ సీఈవో కలుసుకున్నసెలబ్రిటీ మరెవ్వరో కాదు...హాలీవుడ్ స్టార్ పాప్ సింగర్ సెలీనా గోమేజ్. ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ సూపర్‌స్టార్ గోమేజ్ ను కలిసి విషయాన్ని జుకర్‌బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 'మా అతిచిన్న రూం లో ఇన్స్టాగ్రామ్ బిగ్గెస్ట్ స్టార్ తో భేటీ అంటూ కమెంట్ చేశారు. దీంతోపాటుగా పాప్ స్టార్ గోమెజ్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ మీనియేచర్ రూంలో నవ్వులు చిందిస్తున్న జుకర్ బర్గ్ , గోమెజ్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా 2012 లో ఏప్రిల్ లాంచ్ అయి నాలుగు వందల మిలియన్ల యూజర్లతో దూసుకుపోతున్నఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలను మరింతగా ఆకట్టుకుంటోంది. తమ జీవిత విశేషాలు, ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫాలోవర్స్ ని నిరంతరం ఇన్స్టాగ్రామ్ కి బానిసలుగా మారుస్తున్న సెలబ్స్ లో సెలెనా గోమెజ్ ప్రముఖులు. అయితే వీరిద్దరి సరదా భేటీ వెనుక కారణాలు ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. -
వాట్స్‌యాప్ యూజర్లు @ 90 కోట్లు
న్యూయార్క్: వాట్స్‌యాప్ యూజర్ల సంఖ్య 90 కోట్లకు చేరింది. గత ఐదు నెలల్లోవాట్స్యాప్ వినియోగదారుల సంఖ్య 10 కోట్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాట్స్‌యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 90 కోట్లుగా ఉందని వాట్స్‌యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, సీఓఓ షెరిల్ శాండ్బర్గ్లు కౌమ్‌కు అభినందనలు తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో వాట్స్‌యాప్‌ను 19 బిలియన్ డాలర్లకు ఫేస్బుక్ కొనుగోలు చేసింది. -
'మాకు పాపే పుడుతుంది.. ఈసారి కలిసొస్తుంది'
న్యూయార్క్ : తనకు పాప పుడుతుందని ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్బర్గ ఆశాభావ్యక్తం చేశారు. తన భార్యతో దిగిన ఓ ఫొటో అప్ లోడ్ చేసి ఈ విషయాన్ని ఫేస్ బుక్ వెబ్సైట్లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. పోస్ట్ చేసిన 9 గంటల్లోపే లక్షమందికి పైగా యూజర్లు లైక్ కొట్టగా, 70 వేల మంది కామెంట్ చేశారు. ఈ పోస్టు 28 వేల సార్లు షేర్లు చేశారని తెలిపారు. తన భార్య ప్రిస్సిల్లా చాన్ కూడా తమ ఇంట్లోకి వచ్చేది పాపే అని అనుకుంటుందన్నారు. ఇక ఇప్పటి నుంచి తమ పిల్లల కోసం, తర్వాతి తరాల కోసం ఏదైనా చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన భార్యను కలవడానికి వెళ్లినప్పడు చాలా ఉద్వేగానికి లోనయినట్లు జూకర్బర్గ్ తన సైట్లో రాసుకొచ్చారు. పిల్లల విషయంలో ఈ దంపతులు గతంలో మూడుసార్లు నిరాశకు గురైన విషయం తెలిసిందే. సమస్యలు వచ్చినప్పుడు తమ మధ్య బంధం మరింత బలపడుతుందని.. ప్రేమ మరింత ఎక్కువవుతుందని ఆయన పోస్టు చేశాడు. ఈసారైనా తమ ఆశలు ఫలించవచ్చని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో తమ జీవితంలో నూతన అధ్యాయం మొదలైనట్లేనని, గతంతో పోలిస్తే ఈ సారి తన భార్య, కడుపులో బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.