విమర్శలతో దిగొచ్చిన ఫేస్బుక్
విమర్శలతో దిగొచ్చిన ఫేస్బుక్
Published Sat, Sep 10 2016 8:56 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
న్యూయార్క్ : నాపలామ్ బాలిక ఫోటోగ్రాఫ్ తొలగింపుపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వెనక్కి తగ్గింది. తనపై వచ్చిన పలు విమర్శలతో ఫేస్బుక్ యూటర్న్ తీసుకుని, తొలగించిన ఆ ఫోటోను తిరిగి పోస్టు చేయడానికి అంగీకరించింది. 1972లో వియత్నాం యుద్ధ సమయంలో నాపలమ్పై దాడి జరుగుతున్నప్పుడు ఓ చిన్నారి ఏడుస్తూ నగ్నంగా పరుగెట్టుకుంటూ వెళ్తున్న ఫోటో ఫేస్బుక్లో పోస్టు అయింది. యుద్ధ తీవ్రతను తెలుపుతూ నాపలమ్ దాడికి సంబంధించిన ఈ ఫోటోను పులిట్జర్ బహుమతి గ్రహీత, నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ తన ఫేస్బుక్లో పోస్టుచేశారు. అయితే ఈ ఫోటో తన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్బుక్ తొలగించింది. ఇదే ఫోటోను నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్ కూడా పోస్టుచేశారు. కానీ దాని కూడా ఫేస్బుక్ తొలగించింది. దీంతో సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమై, ఫేస్బుక్ పలు విమర్శలకు గురైంది. చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ ఫోటోను తొలగించడంపై పలువురు మండిపడ్డారు. ఫేస్బుక్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు నార్వే అతిపెద్ద న్యూస్ పేపర్ ఎడిటర్ బహిరంగ లేఖ రాశారు.
దీంతో తనపై వస్తున్న విమర్శలతో ఫేస్బుక్ దిగొచ్చింది. నగ్నంగా ఉన్న బాలిక ఫోటో తమ నియమ నిబంధనలకు ఉల్లంఘిస్తుందనే నేపథ్యంలోనే తొలగించామని ఫేస్బుక్ తన ప్రకటనలో తెలిపింది. తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది.చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది.తొలగించిన చోటే దానిని తిరిగి పోస్టు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కొంత సమయం కావాలని ఫేస్బుక్ అభ్యర్థించింది. తమ విధానాలను మెరుగుపరుచుకుంటామని, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు తోడ్పడతామని, తమ కమ్యూనిటీ రక్షణకు దోహదం చేస్తామని తెలిపింది. అయితే ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు ప్రధాని సోల్‌బెర్గ్ సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement