ఓ వైపు లేఆఫ్స్ పేరుతో వేలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ మెటా మరోవైపు అందులో పనిచేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.కోట్ల కొద్దీ బోనస్‌లు ప్రకటించింది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు కంపెనీ సీఈవో మార్క్‌జుకర్‌బర్గ్‌నే నేరుగా నిలదీశారు.
మెటా ఇప్పటి వరకు 21,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. తొలి రౌండ్ తొలగింపులను 2022 నవంబర్‌లో ప్రకటించగా, రెండో రౌండ్ లేఆఫ్‌లను గత నెలలోనే ప్రకటించింది. మొదటి రౌండ్‌లో 11 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా, రెండో రౌండ్‌లో 10 వేల మందికి పింక్ స్లిప్ ఇచ్చారు.
మరోవైపు కొంతమంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భారీ బోనస్‌లను ఇచ్చింది. కంపెనీలో లేఆఫ్స్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్‌లను అందించడంపై చాలా మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘వాళ్ల పని నచ్చింది.. అందుకే బోనస్‌లిచ్చాం’
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ రెండు రోజుల క్రితం వర్చువల్ క్యూఅండ్‌ఏ (Q&A) సెషన్‌లో ఉద్యోగులతో మాట్లాడారు. అదే సెషన్‌లో కొంతమంది ఉద్యోగులు.. ఓ వైపు వేలకొద్దీ తొలగింపులు జరుగుతున్నప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్‌లు ఇవ్వడం వెనుక కారణాన్ని చెప్పాలని జుకర్‌బర్గ్‌ను అడిగారు. జుకర్‌బర్గ్ దీనికి స్పందిస్తూ వారికి అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని, వారి పనితీరు పట్ల తాము సంతోషంగా ఉన్నందునే బోనస్‌లు ఇచ్చినట్లు బదులిచ్చారు.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
‘ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేస్తున్న ప్రతిభావంతులైన చాలా మంది ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇలాంటి పరిస్థితిలో మెటా సంస్థలో ఉద్యోగులు ఎందుకు ఉండాలి’ మరో ఉద్యోగి ప్రశ్నించారు. మెటా స్థాయిలో సామాజిక అనుభవాలను మరే ఇతర సంస్థ అందించదని, బిలియన్ల కొద్దీ ప్రజలను చేరుకోవాలనుకుంటే, భారీ ప్రభావాన్ని చూపాలనుకుంటే ఇదే గొప్ప సంస్థ అని జుకర్‌బర్గ్ సమాధానమిచ్చారు.
టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చిన బోనస్‌లు ఇలా..
ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన మెటా ఎస్‌ఈసీ ఫైలింగ్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చిన బోనస్‌లు గురించి వెల్లడైంది. ఫైలింగ్ ప్రకారం.. సీఎఫ్‌వో సుసాన్లీ 5,75,613 డాలర్ల (రూ. 4.71 కోట్లు) , సీపీఓ క్రిస్టోపర్ కాక్స్ 9,40,214 డాలర్లు (రూ. 7.70 కోట్లు) బోనస్‌గా పొందారు.
అలాగే సీవోవో జేవియర్ ఒలివాన్ 7,86,552 డాలర్లు (రూ. 6.44 కోట్లు), సీటీవో ఆండ్రూ బోస్‌వర్త్ 7,14,588 డాలర్లు (రూ. 5.85 కోట్లు) బోనస్ అందుకున్నారు. ఇక చఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (సీఎస్‌వో) డేవిడ్ వెన్నర్ 712,284 డాలర్లు (రూ. 5.83 కోట్లు), మాజీ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 2,98,385 డాలర్లు (రూ. 2.44 కోట్లు) బోనస్ పొందారు.
ఇదీ చదవండి: కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్‌ను తొలగించిన కాగ్నిజెంట్!
Comments
Please login to add a commentAdd a comment