న్యూఢిల్లీ: దాదాపు 18 నెలల ప్రాథమిక విచారణ అనంతరం సుమారు 5.62 లక్షల మంది భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా వాడుకోవడంపై కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ), గ్లోబల్ సైన్స్ రీసెర్చ్(జీఎస్‌ఆర్) సంస్థలపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఐపీసీ, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్‌ల కింద బ్రిటన్‌కు చెందిన ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేశామని సీబీఐ వెల్లడించింది. ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు అక్రమంగా వినియోగించాయన్న వార్తలపై 2018 జులైలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరపి, సీబీఐ కేసు నమోదు చేసింది.
పరిశోధన అవసరాల కోసం కొన్ని వర్గాల వినియోగదారుల సమాచారం ఇవ్వాలని కోరుతూ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ తరఫున అలెక్జాండర్ కోగన్ ఫేస్‌బుక్‌ను అభ్యర్థించారు. ఆ ఆనుమతితో ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించి, ఫేస్‌బుక్ అనుమతించిన 335 మంది వినియోగదారులతో పాటు అక్రమంగా, వారి స్నేహితుల జాబితాలోని వ్యక్తుల సమాచారం కూడా సేకరించారు. ఆ సమాచారాన్ని ‘కేంబ్రిడ్స్ అనలిటికా’కు అమ్మేశారు. భారత్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రొఫైలింగ్ చేసిందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. అమెరికాలోని వినియోగదారుల సమాచారం మాత్రమే జీఎస్‌ఆర్ నుంచి తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి కేంబ్రిడ్జ్ ఎనలిటికా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment