సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల గోప్యతను పరిరక్షించడంలో పదే పదే విఫలమవుతున్న ఫేస్‌బుక్ కంపెనీకి 500 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికాలోని ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ విధించింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ ఐటీ కంపెనీకి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. 3–2 మెజారిటీతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానాకు ముగ్గురు రిపబ్లికన్ కమిషనర్లు మొగ్గుచూపగా, ఇద్దరు డెమోక్రటిక్ కమిషనర్లు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంతో జరిమానా విధిస్తూ చేసిన తీర్మానాన్ని ఎఫ్‌టీసీ సమీక్షకు పంపించింది.
పౌర డివిజన్‌కు చెందిన న్యాయవిభాగం ఈ తీర్మానాన్ని సమీక్షించి తుది తీర్పును వెలువరిస్తుంది. అయితే ఈ విచారణకు ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సంబంధిత వర్గాలు. 500 కోట్ల డాలర్ల జరిమానా అన్నది భారీ మొత్తం అయినప్పటికీ గతేడాది 3,600 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధించిన కంపెనీకి అంత పెద్దదేమీ కాదని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంత భారీ జరిమానా విధించినప్పటికీ దాని ప్రభావం షేర్లపై ఏమాత్రం కనిపించలేదు. 1.8 శాతం షేర్లు ఊపందుకున్నాయి.
ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం ‘కేంబ్రిడ్జి అనలిటికా’ సంస్థ వద్ద వెలుగు చూడడంతో ఎఫ్‌టీసీ ఏడాది క్రితమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం కోసం ఈ అనలిటికా అనే సంస్థ పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment