వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్‌డేట్‌కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్‌లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వాట్సాప్ తన ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్‌డేట్ ప్రకారం వాట్సాప్‌ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.
ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
మెటా స్పందన
డేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్‌డేట్‌ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment