కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్‌ఈ)లకు మూలధన పునర్‌వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్‌ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్‌ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్‌ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
బైబ్యాక్ ఇలా..
గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్‌ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్‌వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్‌ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్‌ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..
వీటికి మినహాయింపు
దీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్‌ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్‌ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్‌లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్‌ను ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్‌లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment