buyback
-
బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్ఈ)లకు మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్బీఎఫ్సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బైబ్యాక్ ఇలా..గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్‌వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..వీటికి మినహాయింపుదీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్‌లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్‌ను ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్‌లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి. -
బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్..!
బజాజ్ ఆటో షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. కంపెనీ అత్యున్నత అధికారులు, వీరి తరఫు బంధువులు సంస్థ సెక్యూరిటీలు, ఈక్విటీ షేర్లలో లావాదేవీలు నిర్వహించే విండోను ఈ నెల 1 నుంచి 26వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 6,989 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్టం రూ. 7,060 వరకూ ఎగసింది. -
22 వేలకోట్ల రూపాయలతో టీసీఎస్ బైబ్యాక్!
అత్యంత విలువైన భారత బ్రాండ్ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 22వేలకోట్ల రూపాయల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది. దాంతో తీవ్ర మార్కెట్ అనిశ్చితి మధ్య సోమవారం మార్కెట్లో టీసీఎస్ షేర్ విలువ స్వల్పంగా పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. గడిచిన ఆరేళ్లలో కంపెనీ ఐదోసారి బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీ తన నికర విలువలో 25శాతం వరకు షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. దాని ప్రకారం జూన్ 30 చివరి నాటికి టీసీఎస్ రూ.22,620 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగలదు. ఇది 2017 నుంచి కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్లకంటే ఎక్కువ. ఫిబ్రవరి 2017, 2018, 2020లో వరుసగా రూ.16000కోట్లు, 2022లో రూ.18వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. అయితే ఈ విధానం కంపెనీని ఆర్థికంగా ఎన్నోవిధాలుగా ప్రభావితం చేస్తుంది. జూన్ 30నాటికి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రూ.15,622 కోట్లు క్యాష్ రూపంలో అందుబాటులో ఉందని తెలుస్తుంది. -
గెయిల్ బైబ్యాక్ బాట
న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్ ధర ఎన్ఎస్ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం! గతంలోనూ..: గెయిల్ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్‌లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్ కింద రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్ఎస్ఈలో గెయిల్ షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది. -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. ఈ నెల 12న(బుధవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఇదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి అక్టోబర్– డిసెంబర్(క్యూ3) పనితీరును ప్రకటించనుంది. 2021 సెప్టెంబర్ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 51,950 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో.. ఇంతక్రితం టీసీఎస్ 2020 డిసెంబర్ 18న రూ. 16,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. షేరుకి రూ. 3000 ధరలో 5.33 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. అంతక్రితం 2018లోనూ షేరుకి రూ. 2,100 ధరలో 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 16,000 కోట్లను వెచ్చించింది. గతంలో అంటే 2017లో సైతం ఇదే స్థాయిలో బైబ్యాక్‌ను పూర్తి చేయడం గమనార్హం! ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో తదితరాలు మిగులు నిధులను వాటాదారులకు షేర్ల బైబ్యాక్‌ల ద్వారా పంచుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 9,200 కోట్లు వెచ్చించి 5.58 కోట్ల సొంత షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 1,538–1,750 మధ్య ధరలో బైబ్యాక్ చేసింది. గత జనవరిలో విప్రో 9,500 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుని పూర్తి చేసింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 3,855 వద్ద ముగిసింది. చేజిక్కిన పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్పీ) రెండో దశ ప్రాజెక్టును టీసీఎస్ చేజిక్కించుకుంది. తొలి దశ ప్రాజెక్టును చేపట్టి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న కంపెనీ పౌరులకు పాస్ట్‌పోర్ట్ సేవలను అందించడంలో భారీగా ముందడుగు వేసింది. ఈ బాటలో తాజాగా రెం డో దశ ప్రాజెక్టును సైతం అందుకున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. రెండో దశలో ఇప్పటికే ప్రా రంభమైన కీలక అతిపెద్ద ఈగవర్నెన్స్ ప్రోగ్రామ్‌కు కంపెనీ మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంగా సులభతర సర్వీసులకుగాను ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. త్వరలో ఈపాస్పోర్ట్.. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈపాస్పోర్ట్కు అవసరమైన టెక్నాలజీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారి తేజ్ భట్ల వెల్లడించారు. అయితే పాస్‌పోర్ట్‌కు అనుమతి, ప్రింటింగ్, జారీ తదితర అధికారిక సేవలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ రంగ బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న తేజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈపాస్పోర్ట్ పూర్తిస్థాయి పేపర్ఫ్రీ డాక్యుమెంట్కాదని.. స్టాంపింగ్ తదితరాలు కొనసాగుతాయని తెలియజేశారు. వీలైనంత వరకూ ఆటోమేషన్ చేయడం ద్వారా అవకాశమున్నచోట పేపర్(డాక్యుమెంట్) అవసరాలను తగ్గిస్తుందన్నారు. కొద్ది నెలల్లో ఈపాస్ట్పోర్ట్కు వీలున్నట్లు అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో 8.6 కోట్ల పాస్‌పోర్ట్‌ల జారీలో సేవలు అందించినట్లు పేర్కొంది. కాగా.. తాజా పీఎస్పీ ప్రాజెక్టు డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. -
ఇన్ఫోసిస్ బైబ్యాక్ షురూ
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి రెడీ అయ్యింది. ఈ నెల 25 నుంచి బైబ్యాక్‌ను ప్రారంభించనున్నట్లు తాజాగా వెల్లడించింది. షేరుకి రూ. 1,750 ధర మించకుండా చేపట్టనున్న షేర్ల కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఇందుకు ఈ ఏడాది ఏప్రిల్ 14నే ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి వాటాదారులు సైతం ఈ నెల 19న జరిగిన 40వ వార్షిక సమావేశంలో అనుమతించారు. వెరసి ప్రణాళికలకు అనుగుణంగా ఈ వారాంతం నుంచి బైబ్యాక్‌కు శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ తెలిపింది. 1.23 శాతం వాటా: ఈ శుక్రవారం(25) నుంచి ప్రారంభించనున్న ఈక్విటీ బైబ్యాక్‌ను ఆరు నెలలపాటు కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. 2021 డిసెంబర్ 24న ముగించనుంది. బైబ్యాక్‌లో భాగంగా 5,25,71,248 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది మార్చికల్లా నమోదైన ఈక్విటీలో 1.23% వాటాకు సమానం. కనీసం 50 శాతం... ఈక్విటీ షేర్ల కొనుగోలుకి కేటాయించిన మొత్తంలో కనీసం 50 శాతాన్ని అంటే రూ. 4,600 కోట్లను ఇందుకు వినియోగించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. బైబ్యాక్‌కు గరిష్ట ధర, కనీస పరిమాణం ఆధారంగా కనీసం 2,62,85,714 షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్‌లో భాగంగా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి ఓపెన్ మార్కెట్ కొనుగోళ్లను చేపట్టనుంది. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు బైబ్యాక్‌ను వర్తింపచేయబోమని ఇన్ఫీ స్పష్టం చేసింది. 2020లోనే.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల కేటాయింపులను పెంచే ప్రణాళికలను ఇన్ఫోసిస్ ఆవిష్కరించింది. వీటిలో భాగంగా ఐదేళ్ల కాలంలో 85 శాతం ఫ్రీ క్యాష్ ఫ్లోను డివిడెండ్లు, బైబ్యాక్‌లకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021 ఏప్రిల్‌లో కంపెనీ బోర్డు రూ. 15,600 కోట్లను చెల్లించేందుకు ప్రతిపాదించింది. ఫలితంగా రూ. 6,400 కోట్లను తుది డివిడెండుగా ఇన్ఫోసిస్ చెల్లించింది. మరో రూ. 9,200 కోట్లను ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు వినియోగించనుంది. ఇంతక్రితం 2019 ఆగస్ట్‌లోనూ ఇన్ఫోసిస్ బైబ్యాక్‌ను చేపట్టి 11.05 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లను కేటాయించింది. కంపెనీ తొలిసారిగా 2017 డిసెంబర్లో రూ. 13,000 కోట్లతో బైబ్యాక్‌ను చేపట్టింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 0.6 శాతం బలహీనపడి రూ. 1,503 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీ షేర్ల బైబ్యాక్ @ రూ. 2,276 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ రూ. 2,276 కోట్ల విలువ చేసే షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సంస్థ బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 115 చొప్పున మొత్తం 19.78 కోట్ల దాకా షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. దీనికోసం నవంబర్ 13 రికార్డు తేదీగా ఎన్టీపీసీ నిర్ణయించింది. మరోవైపు, సీఎండీ గుర్దీప్ సింగ్ పదవీకాలాన్ని 2025 జూలై 31 దాకా పొడిగించే ప్రతిపాదనకు ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపింది. 2021 ఫిబ్రవరి 4 నుంచి పొడిగించిన పదవీకాలం అమల్లోకి వస్తుంది. 2016 ఫిబ్రవరి 4న ఆయన ఎన్టీపీసీ చైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఎన్టీపీసీలో ఇంజనీర్ ట్రెయినీగా కెరియర్ ప్రారంభించిన గుర్దీప్ సింగ్ ఆ తర్వాత పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. క్యూ2లో నికర లాభం 8 శాతం డౌన్ .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ నికర లాభం (కన్సాలిడేటెడ్) సుమారు 8 శాతం క్షీణించి రూ. 3,495 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో లాభం రూ. 3,788 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం రూ. 26,569 కోట్ల నుంచి రూ. 28,678 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో విద్యుదుత్పత్తి స్థూలంగా 61.64 బిలియన్ యూనిట్ల (బీయూ) నుంచి 67.67 బీయూకి పెరిగింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థాపిత సామర్థ్యం 57,106 మెగావాట్ల నుంచి 62,910 మెగావాట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సగటున విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.86గా ఉన్నట్లు ఎన్టీపీసీ తెలిపింది. సోమవారం బీఎస్ఈలో ఎన్టీపీసీ షేరు సుమారు రెండు శాతం పెరిగి రూ. 89.25 వద్ద క్లోజయ్యింది. -
వేదాంత డీలిస్టింగ్ విఫలం
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్యల కారణంతో వేదాంత లిమిటెడ్ డీలిస్టింగ్ ప్రక్రియ సాధ్యపడలేదు. కన్ఫర్మ్ కాని ఆర్డర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, షేర్లను దఖలు చేసే ప్రక్రియలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వంటి అంశాలు దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్ ప్రక్రియను మరొక్క రోజు పొడిగించే అంశం సహా పలు ప్రత్యామ్నాయాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం అక్టోబర్ 9 సాయంత్రం నాటికి షేర్‌హోల్డర్ల దగ్గర 169.73 కోట్ల షేర్లు ఉండగా, ప్రమోటర్లకు వాటాదారులు 137.74 కోట్ల షేర్లను ఆఫర్ చేశారు. వాస్తవానికి 134.12 కోట్ల షేర్ల లభిస్తే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ కంపెనీలో 90 శాతాన్ని దాటి డీలిస్టింగ్‌కు మార్గం సుగమమయ్యేది. కానీ కస్టోడియన్ల నుంచి ఆమోదముద్ర లభించకపోవడంతో కొన్ని బిడ్లు ప్రాసెస్ కాలేదు. దీంతో ఆఫర్ చేసిన షేర్ల సంఖ్య 125.47 కోట్లకు తగ్గింది. డీలిస్ట్ చేయడానికి ఇంతకు మించిన స్థాయిలో షేర్లను కొనుగోలు చేయాల్సి ఉండటంతో డీస్టింగ్లో దాఖలైన షేర్లను వాపసు చేసే అవకాశం ఉందని వేదాంత తెలిపింది. డేటా ప్రకారం డీలిస్టింగ్‌కు సంబంధించి చాలా మటుకు షేర్లను రూ. 320 రేటు చొప్పున షేర్హోల్డర్లు ఆఫర్ చేశారు. శుక్రవారం నాటి ముగింపు ధర రూ. 120తో పోలిస్తే ఇది భారీ ప్రీమియం కావడం గమనార్హం. -
హీరోమోటో కొత్త బై బ్యాక్ స్కీం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వినియోగదారుల కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. స్కూటర్ కొనుగోలుదారుల కోసంబైస్యూరెన్స్ పేరుతో ఇప్పటికే పుణే మార్కెట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని కంపెనీ తాజాగా ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, కొత్త హీరో స్కూటర్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌కు ఒక గ్యారంటీడ్ బై బ్యాక్ సర్టిఫికెట్ ఇస్తుంది. టూవీలర్ బ్రాండ్ క్రెడర్ ద్వారా ఈ సర్టిఫికెట్‌ను అందిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఆరునెలల్లో వ్యవధిలో ఈ బై బ్యాక్‌ను ఆఫర్ చేస్తుంది. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటి సారని హీరో మోటో కార్ప్ హెడ్ (అమ్మకాలు మరియు సేల్స్ తర్వాత) సంజయ్ భన్ చెప్పారు. దీని ద్వారా హీరో మోటో కార్ప్ వినియోగదారులకు రీ సేల్‌పై భరోసా లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రణాళిక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలోనే దేశంలో టాప్ 10 మార్కెట్లలో కూడా కలిస్తామన్నారు. -
ఇన్ఫీ అంచనాలు మిస్..!
న్యూఢిల్లీ: రికార్డు లాభాలతో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల (క్యూ3) సీజన్‌కు శుభారంభాన్నివ్వగా.. రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం ఆదాయం 20 శాతం ఎగిసినప్పటికీ ... నికర లాభం 30 శాతం క్షీణించింది. మరోవైపు, రూ.8,260 కోట్లతో రెండోసారి షేర్ల బైబ్యాక్ ప్రణాళికతో పాటు షేరుకి రూ. 4 చొప్పున ప్రత్యేక డివిడెండ్ చెల్లించ నున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే రెండంకెల స్థాయిలో 10.1 శాతం మేర క్యూ3లో వృద్ధి సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలిల్ పరేఖ్ తెలిపారు. ‘చాలా మటుకు విభాగాలన్నీ మెరుగ్గా రాణిస్తున్నాయి. భారీ డీల్స్ దక్కించుకున్నాం. మరిన్ని కుదుర్చుకోనున్నాం. ఇవన్నీ మరింత ధీమానిస్తున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఫలితాలు వివరంగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వివరంగా చూస్తే.. నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 3,610 కోట్లకు పరిమితమైంది. 2017–18 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 5,129 కోట్లు. అటు ఆదాయం 20.3 శాతం పెరిగి రూ. 17,794 కోట్ల నుంచి రూ. 21,400 కోట్లకు చేరింది. మార్కెట్ వర్గాలు నికర లాభం రూ. 4,115 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. కీలకమైన డిజిటల్ వ్యాపార విభాగం 33.1 శాతం వృద్ధి సాధించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే.. నికర లాభం 12 శాతం క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది రూ. 4,110 కోట్లు. ఆదాయం 3.8 శాతం పెరిగింది. త్రైమాసికాల వారీగా చూస్తే.. రూపాయి మారకంలో ఆదాయం 3.8 శాతం పెరగ్గా, డాలర్ మారకంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది. 2018–19కి సంబంధించిన గైడెన్స్‌ను కరెన్సీ విలువ స్థిరంగా ఉండే ప్రాతిపదికన 8.5–9 శాతానికి పెంచింది. ఇది 6–8 శాతంగా ఉండొచ్చ ని గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ అంచనా వేసింది. ఇక తాజాగా ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ మాత్రం యథాతథంగా 22–24శాతంగా ఉంచింది. క్యూ3 లో ఆపరేటింగ్ మార్జిన్ సుమారు 110 బేసిస్ పాయింట్లు క్షీణించి 22.6 శాతంగా నమోదైంది. డిసెంబర్ క్వార్టర్లో 1.57 బిలియన్ డాలర్ల డీల్స్ దక్కించుకుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో 4.7 బిలియన్ డాలర్ల డీల్స్ సాధించినట్లవుతుంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫీ 2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు దక్కించుకుంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్–షాను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా మరోసారి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రెండో దఫా పదవీకాలం 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి దాకా ఉంటుంది. కొత్త సీఎఫ్‌వోగా నీలాంజన్ రాయ్ మార్చి 1 నుంచి బాధ్యతలు చేపడతారు. సీఈవో సలిల్ పరేఖ్‌కు రూ. 3.25 కోట్ల విలువ చేసే షేర్లు కేటాయించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. వివాదాస్పదమైన పనయాతో పాటు మరో రెండు అనుబంధ సంస్థలైన స్కావా, కాలిడస్ కొనుగోలుకు ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో వీటి విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఈ ఏడాది మార్చికల్లా వీటి విక్రయం పూర్తి కాకపోవచ్చన్న అంచనాతో.. వాటికి సంబంధించిన తరుగుదల మొదలైనవి కూడా క్యూ3 ఫలితాల్లో చేర్చినట్లు పేర్కొంది. డివిడెండ్‌కు రూ. 2,107 కోట్లు.. షేరు ఒక్కింటికి రూ.4 ప్రత్యేక డివిడెండ్ చెల్లింపుల కోసం ఇన్ఫీ సుమారు రూ.2,107 కోట్లు వెచ్చించనుంది. దీనికి రికార్డు తేదీ జనవరి 25 కాగా, చెల్లింపు తేదీ జనవరి 28. గతేడాది జూన్‌లో చెల్లించిన రూ. 2,633 కోట్ల డివిడెండ్‌తో పాటు తాజా స్పెషల్ డివిడెండ్, బైబ్యాక్ ఆఫర్ కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిర్దేశించుకున్నట్లుగా మొత్తం రూ.13,000 కోట్ల మేర షేర్హోల్డర్లకు చెల్లించినట్లవుతుందని ఇన్ఫీ తెలిపింది. 2019 జనవరి 9 నాటికి ఇన్ఫీలో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్‌నకు 12.82% వాటాలు ఉన్నాయి. బైబ్యాక్ రేటు@ రూ. 800.. ఇన్ఫోసిస్ మరోసారి షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. దేశీ ఎక్సే్ఛంజీల్లో ఓపెన్ మార్కెట్ మార్గంలో కొనుగోలు జరిపే షేర్లకు సంబంధించి ఒక్కో షేరుకు గరిష్టంగా రూ. 800 ధర నిర్ణయించింది. రూ.8,260 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికింద 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది 2018 డిసెంబర్ 31 నాటికి కంపెనీ పెయిడప్ క్యాపిటల్‌లో సుమారు 2.36 శాతంగా ఉంటుంది. అమెరికన్ డిపాజిటరీ షేర్లను (ఏడీఎస్) కూడా షేర్హోల్డర్లు.. ఈక్విటీ షేర్ల కింద మార్చుకుని, దేశీ ఎక్సే్చంజీల్లో బైబ్యాక్ ఆఫర్లో పాల్గొనవచ్చని ఇన్ఫీ తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఇన్ఫోసిస్ 2017 డిసెంబర్లో తొలిసారి బైబ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకోసం రూ.13,000 కోట్లు వెచ్చించింది. మూడు దశాబ్దాల కంపెనీ చరిత్రలో తొలిసారిగా ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌లో వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, క్రిష్ గోపాలకృష్ణన్ భార్య సుధా గోపాలకృష్ణన్ మొదలైన వారితో పాటు ఎల్ఐసీ కూడా షేర్లను విక్రయించింది. -
ప్రభుత్వ సంస్థల్లో షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లు బైబ్యాక్ చేసేందుకు దాదాపు పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్ఈ) కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ, ఎన్ఎల్సీ, భెల్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్బీసీసీ, ఎస్‌జేవీఎన్, కేఐవోసీఎల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇటీవలే ఆయా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ లిస్టును రూపొందించింది. అయితే, ఆయా సంస్థల వ్యాపార ప్రణాళికలను బట్టి చూస్తే.. అన్ని సంస్థలు 2018–19లోనే షేర్ల బైబ్యాక్ చేయలేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2016 మే 27 నాటి పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాలకి ప్రకారం కనీసం రూ. 2,000 కోట్ల నికర విలువ, రూ. 1,000 కోట్ల పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సీపీఎస్ఈలు తప్పనిసరిగా షేర్ల బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా షేర్లు బైబ్యాక్ చేయాలంటూ ఈ సీపీఎస్ఈలకు కేంద్రం సూచించింది. కంపెనీ సంపదలో కొంత భాగాన్ని షేర్హోల్డర్లకు బదలాయించేందుకు, షేర్లు ధరలకూ ఊతం ఇచ్చేందుకు సంస్థలు.. షేర్ల బైబ్యాక్ చేపడుతుంటాయి. ఇలా కొన్న షేర్లను రద్దు చేయడం లేదా ట్రెజరీ స్టాక్ కింద వర్గీకరించడం చేస్తాయి. చలామణీలో ఉన్న షేర్లు తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన మరింత పెరిగి ఆయా సంస్థల వ్యాపారం ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. -
బై బ్యాక్‌కు ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్ సిగ్నల్
ముంబై:దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ రూ.13 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనుంది. ఈ మేరకు శనివారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫోసిస్ బై బ్యాక్ ఆఫర్ ద్వారా రూ.13వేల కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనుంది. ఇన్ఫోసిస్ ఆ ఆఫర్ ను ఈక్విటీ ధర రూ. 1150 గా నిర్ణయించింది. తద్వారా ఇన్ఫోసిస్ 24.5శాతం ప్రీమియం ధరలో , 11.3 కోట్ల షేర్లను లేదా 4.92శాతం ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ముఖ్యంగా సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా తరువాత ఇన్ఫోసిస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. షేరు రూ.1,150 వద్ద టెండర్ మార్గం ద్వారా 11,30,43,478 కోట్ల షేర్లు కొనుగోలు చేస్తామని ఇన్ఫోసిస్ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది .దీనికోసం బోర్డు ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. కాగా 36 ఏండ్ల చరిత్ర కలిగిన సంస్థ తొలిసారిగా బైబ్యాక్ చేయనున్నది. సంస్థ వద్ద అధికంగా నిధులు ఉండటంతో డివిడెండ్ లేదా బైబ్యాక్ చేయాలని కంపెనీ వ్యవస్థాపకులు, మాజీ ఎగ్జిక్యూటివ్ అధికారులు తీవ్ర ఒత్తిడిన నేపథ్యంలో చివరకు బోర్డు ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 24.5 శాతం అధికం. -
జస్ట్ డయల్‌కి బై బ్యాక్ జోష్
ముంబై: స్థానిక సర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపిస్తోంది. తదుపరం వారంలో బై బ్యాక్ ప్రతిపాదన నేపథ్యంలో జస్ట్ డయల్ కౌంటర్ బుధవారం దూసుకుపోతోంది. షేర్లను బై బ్యాక్ చేయనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. జూలై2 4న నిర్వహించనున్న సమావేశంలో డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు జస్ట్ డయల్ మార్కెట్ రెగ్యులేటరీకి తెలిపింది. దీంతో మార్కెట్ ఆరంభంలోనే జస్ట్ డయల్ షేరు 5.66శాతం జంప్ చేసి ప్రస్తుం 8శాతానికిపైగా లాభపడి రూ. 385 వద్ద ట్రేడ్అవుతోంది. కాగా గత రెండు వారాల్లో 2.22 లక్షల షేర్ల సగటు రోజువారీ వాటాతో పోలిస్తే బిఎస్ఇలో 2.85 లక్షల షేర్లను కౌంటర్లో ఇప్పటివరకు వర్తకం చేశారు. 2016 డిసెంబర్ 27 వ తేదీన ఈ కంపెనీ షేర్లు రూ. 619.45 వద్ద 52 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చి 20, 2017 నాటి రూ. 610.60 పోలిస్తే గత నాలుగు నెలల్లో కంపెనీ షేర్ ధర 42 శాతం క్షీణించి 354.45 రూపాయలకు చేరుకుంది.మరోవైపు ఈ నెలలోనే కంపెనీ క్యూ1 ఫలితాలను కూడా ప్రకటించనుంది. -
మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బుధవారం ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. టెండర్ ఆఫర్ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇటీవలే రూ. 16,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను పూర్తిచేసింది. ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లు రూ. 13,000 కోట్లు, 3.4 బిలియన్ డాలర్ల చొప్పున బైబ్యాక్ లేదా డివిడెండ్ల రూపంలో చెల్లించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డు కూడా రూ. 3,500 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. విప్రో కూడా ఇదే బాటలో ఉంది. -
టీసీఎస్ బై బ్యాక్ ఆఫర్ మే18-31వరకు
ముంబై: దేశీయ అతిపెద్ద టెక్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇటీవల ప్రకటించిన బై బ్యాక్‌ను ప్రారంభించనుంది. గత నెల వాటాదారుల ఆమోదం పొందిన వాటా పునర్ కొనుగోలు కార్యక్రమం మే 18 న మొదలుపెట్టనుంది. ఈ ఆఫర్ మే 31ముగియనుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. పరిశ్రమలో అతి పెద్ద బైబ్యాక్‌గా చెబుతున్న టీసీఎస్ రూ. 16 వేల కోట్ల ఆఫర్ ను వాటా దారులకు అందించనుంది. . 2012లో రూ. 10,400 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ బైబ్యాక్ చేసింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం కాగా, ఇప్పుడీ మొత్తాన్ని టీసీఎస్ అధిగమిస్తుండడం విశేషం. మరోవైపు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తప కాపిటల్ అలొకేషన్ లో భాగంగా ఈ ఆర్థిక సంవ్సతరంలో రూ.13వేల కోట్ల రూపాయల బై బ్యాక్‌ను ప్రకటించింది.ఈ ఏడాది ప్రారంభంలో, కాగ్నిజాంట్ 3.4 బిలియన్ల డాలర్ల వాటాల పునర్ కొనుగోలును ప్రకటించింది, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ .3,500 కోట్ల విలువైన 3.50 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఏప్రిల్‌లో షేర్‌హోల్డర్ల నుంచి బైబ్యాక్‌కు అనుమతులు పొందగా మే 18 నుంచి ప్రారంభించి, మే 31వరకు కొనసాగించనున్నట్లు టీసీఎస్ సమాచారం ఇచ్చింది. అర్హత గలిగిన షేర్ హోల్డర్లకు లెటర్ ఆఫ్ ఆఫర్‌ను మే 16 నుంచి లేఖల ద్వారా పంపనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే బోర్డ్ డైరెక్టర్ విజయ కేల్కర్ పదవీ కాలం మే 14న ముగిసిందని మరో ప్రకటనలో తెలిపింది. టిసిఎస్ సంస్థ పదవీ విరమణ వయస్సు విధానానికి అనుగుణంగా ఈ పరిణామామని ప్రత్యేక ఫైలింగ్‌లో తెలిపింది. ఫిబ్రవరిలో టిసిఎస్ బోర్డు రూ .16,000 కోట్ల మినహాయింపు కోసం 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఆమోదించింది. కాగా ఫిబ్రవరిలో టిసిఎస్ బోర్డు రూ .16,000 కోట్ల మేర 5.61 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఆమోదించింది. ప్రస్తుతం ముంబై ఆధారిత కంపెనీ టీసీఎస్ వద్ద రూ. 43,619 కోట్ల నగదు నిల్వలుండగా.. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇది 10 శాతంగా ఉంది. -
ఇన్ఫోసిస్ బైబ్యాక్ దిశగా తొలి అడుగు!
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు వీలుగా తొలి అడుగు పడింది. ఇందుకు వీలుగా నూతన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)లో నిబంధనల మార్పు ప్రతిపాదనకు వాటాదారులు పోస్టల్ బ్యాలట్ విధానంలో ఆమోదం తెలిపినట్టు ఇన్ఫోసిస్ కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే, కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్ యూబీ ప్రవీణ్‌రావు పారితో షికం పెంపునకు కూడా వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. నూతన ఏఓఏ ప్రకారం ఇన్ఫోసిస్ సొంత కంపెనీ ఈక్విటీ షేర్లను లేదా సెక్యూరిటీలను బైబ్యాక్ విధానంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది. ఇన్ఫోసిస్ వద్ద రూ.35,697 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రూ.12,000 కోట్ల మేర విలు వైన షేర్ల బైబ్యాక్ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
టీసీఎస్ తర్వాత హెచ్‌సీఎల్ టెక్ కూడా..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ తర్వాత మరో దేశీయ అగ్రగామి హెచ్‌సీఎల్ టెక్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది. షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్ధమైంది. షేర్ బైబ్యాక్ ప్రకటించాలని కంపెనీ యోచిస్తోందని, ఈ విషయాన్ని బోర్డు ముందుకు తీసుకురాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. రెండు రోజుల క్రితమే టీసీఎస్ రూ.16వేల కోట్ల మెగా షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనున్నట్టు ప్రకటించి, ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం తాము కూడా ఇన్వెస్టర్ల వాల్యు పెంచేందుకు చూస్తున్నామని, షేర్ బైబ్యాకుకు పిలుపునివ్వబోతున్నామని ఓ అధికారి చెప్పారు. ఒక్కసారి ఈ విషయంపై తాము ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక, బోర్డు ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. బోర్డు ముందుకు వెళ్లిన తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ హోల్డర్స్ దీన్ని ఆమోదించాల్సి ఉంది. డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు ఉన్నాయి. అంతేకాక ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. టీసీఎస్ తరహాలో మెగా బైబ్యాక్ ఆఫర్ చేయకపోయినా.. బైబ్యాక్ మాత్రం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. -
సరైన సమయంలో బై బ్యాక్- ఇన్ఫీ
ముంబై: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు తాము వ్యతిరేకం కాదని దేశీయ అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. షేర్ల బై బ్యాక్, కేపిటల్ అలాకేషన్, తదితర అంశాలపై బోర్డు నిర్ణయిస్తుందన్నారు. ముఖ్యంగా బై బ్యాక్ నిర్ణయం "తగిన సమయం"లో తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో 2017 ఆర్థిక సంవత్సరం 2016 కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. కాగా కాగ్నిజెంట్ ఇటీవల ఒక 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే పథకం ప్రకటించడగా, ఈ నెల 20న జరగనున్న బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయించనున్నట్టు టీసీఎస్ కూడా ప్రకటించింది. అటు ఇన్ఫోసిస్ షేర్ల బై బ్యాక్ పై సంస్థ ఇద్దరు మాజీ సీఎఫ్‌వోలు ఇటీవల బాగా వత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. షేర్ ధరపై మేనేజ్మెంట్ నిర్ణయానికి ఫౌండర్ గ్రూప్ సుముఖంగా లేదని తెలుస్తోంది. సంస్థాగత మద్దతుపై జేపీ మోర్గాన్ సలహాలనుకూడా తీసుకోనుందని సమాచారం. -
షేర్ల బైబ్యాక్‌కు డాక్టర్ రెడ్డీస్ ఓకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపింది. ఓపెన్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.3,500లకు మించకుండా 44.84 లక్షల షేర్లను కొనుగోలు చేసేందుకు... అంటే దాదాపు రూ.1,569 కోట్ల వరకు వెచ్చించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 2.6 శాతానికి సమానం. కనీసం 22.42 లక్షల షేర్లను రెడ్డీస్ కొనుగోలు చేయనుంది. ఇక బైబ్యాక్ ధర గడిచిన రెండు వారాల్లో వీక్లీ హై, లో క్లోజింగ్ ప్రైస్ సగటుతో పోలిస్తే... 18.6 శాతం ఎక్కువని కంపెనీ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్‌కు వెళ్లనున్నట్టు గత వారం కంపెనీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కంపెనీ ప్రకటన నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర ఒక దశలో 4.52 శాతానికి పైగా ఎగసింది. చివరకు షేరు 3.52 శాతం లాభపడి రూ.2,961 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో షేరు ధర 3.67 శాతం పెరిగి రూ.2,960.70 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.50,517.78 కోట్లకు చేరుకుంది. కాగా, కంపెనీకి చెందిన మూడు ప్లాంట్లలో ఉల్లంఘనలు జరిగాయంటూ యూఎస్ఎఫ్డీఏ హెచ్చరిక లేఖలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమగ్ర సంస్కరణలు, దిద్దుబాటు కార్య ప్రణాళికను (సీఏపీఏ) పూర్తి చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీవోవో అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ఈ విషయమై యూఎస్ఎఫ్డీఏ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.